
తాజా వార్తలు
లావవుతానేమోనని అన్నం తిననంటోంది!
మా పాపకు పదమూడేళ్లు. ఎత్తు అయిదడుగుల మూడు అంగుళాలు, బరువు 50 కిలోలు. ఎప్పుడూ నీరసంగా ఉంటోంది. అన్నం సరిగా తినదు. ఎక్కువగా తింటే లావు అవుతానేమోనని భయపడుతోంది. తన వయసుకు తగిన బరువే ఉందా? అన్నం కాకుండా ఇతర ఆహార పదార్థాలు ఏం పెట్టొచ్చు?
- వైశాలి, హైదరాబాద్
టీనేజ్ అమ్మాయిల్లో చాలామంది బాడీ ఇమేజ్ గురించే ఆలోచిస్తూ ఆహారం తీసుకోవడం తగ్గించేస్తారు. సాధారణంగా ఈ వయసులో అమ్మాయిలు మొదట బరువూ, ఆ తర్వాత ఎత్తు పెరుగుతారు. ఈ క్రమంలో కాస్త బొద్దుగా కనిపించవచ్చు. కంగారు పడొద్దు. ఎత్తూ, వయసుకు తగిన బరువు ఉన్నారో లేదో తెలిపే స్టాండర్ట్ టేబుల్స్‌ను వారికి చూపించాలి లేదా పోషకాహార నిపుణులతో మాట్లాడించాలి. ఈ విషయాల పట్ల వారికి అవగాహన కల్పించడం ఈ వయసు నుంచే చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులను అనుకరిస్తూ ఆరోగ్యం, పోషకాహారం గురించి పట్టించుకోరు. టీనేజ్ ప్రారంభం నుంచే ఎముకలు దృఢంగా మారతాయి. అలాగే ఈ కాలంలోనే రుతుచక్రం మొదలవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఇనుము, బికాంప్లెక్స్ విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే శరీరంలో మార్పులు వేగంగా జరిగేది కూడా ఈ టైమ్‌లోనే.. ఇవన్నీ టీనేజీ ప్రారంభంలో జరిగే ప్రక్రియలు. వీటన్నింటిని పాప అర్థం చేసుకునేలా చెప్పండి. తను ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు. అయితే పాలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు.. ఇలా పోషకాలున్న సమతుల ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అది ఆమె భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. ఆమెకు ఒకసారి హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో పరీక్ష చేయించండి. అలాగే ఆహారంలో నిమ్మరసం, కమలాలు, శనగలు, ఆమ్లెట్, రాగిజావ, నువ్వులు లాంటివి ఇస్తూ ద్రవపదార్థాలను పెంచండి. ప్రొటీన్లు, విటమిన్లు ఉండే పదార్థాలను పెట్టండి. మీ పాప తన వయసు, ఎత్తుకు తగిన బరువే ఉంది.