close

తాజా వార్తలు

Published : 22/01/2021 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పదవీ విరమణ ప్రణాళిక ఉందా?

పదవీ విరమణ చేసిన తర్వాత పెద్దగా ఆర్థిక  ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం గడపటానికి వీలు కల్పించే రిటైర్‌మెంట్‌  బెనిఫిట్‌ పథకాన్ని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. పదవీ విరమణ ప్రణాళిక ఉన్న వారు, ముందు నుంచే కొంత జాగ్రత్త పడాలని భావించే వారు ఈ పథకాన్ని  పరిశీలించవచ్చు.

ఎస్‌బీఐ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ ఫండ్‌ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ వచ్చే నెల 3. వివిధ విభాగాలకు చెందిన ఆస్తుల్లో (ఈక్విటీ, రుణ పత్రాలు, గోల్డ్‌ ఈటీఎఫ్‌, రీట్‌/ ఇన్విట్‌, విదేశీ ఈక్విటీ... తదితరాలు) పెట్టుబడులు పెట్టటం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఈ పథకం ప్రయత్నిస్తుంది. కానీ ఆ లక్ష్యాలను చేరుకుంటామనే గ్యారెంటీ ఏదీ లేదనేది గుర్తుంచుకోవాలి.
ఈ పథకానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి....
* ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌. కనీస పెట్టుబడి రూ.5,000. ఎస్‌ఐపీ (క్రమానుగత పెట్టుబడి విధానం)లోనూ పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్‌ఎఫ్‌ఓ ముగిసిన తర్వాత ఈ ఫండ్‌ యూనిట్ల క్రయవిక్రయాలు మొదలవుతాయి.
* ఇది రిటైర్‌మెంట్‌ ఫండ్‌ కాబట్టి, పెట్టుబడి పెట్టిన నాటి నుంచి 5 ఏళ్ల వరకూ..., లేదా రిటైర్‌మెంట్‌ వయసు వచ్చే వరకూ పెట్టుబడిని ఉపసంహరించటానికి వీల్లేదు.
* మదుపరులకు ఉన్న నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి ఈ ఫండ్‌లో నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. అగ్రెసివ్‌, అగ్రెసివ్‌ హైబ్రీడ్‌, కన్సర్వేటివ్‌ హైబ్రీడ్‌, కన్సర్వేటివ్‌... పద్ధతుల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
* ఇంకా... ఆటో ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌, మై ఛాయిస్‌ ప్లాన్‌, ‘సిప్‌’ ఇన్సూర్‌, ఎస్‌డబ్లూపీ (సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌) ... వంటి ఆప్షన్లు ఉన్నాయి.
* ఎస్‌బీఐ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ ఫండ్‌కు గౌరవ్‌ మెహతా (ఈక్విటీ), దినేష్‌ ఆహుజా (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌), మొహిత్‌ జైన్‌ (విదేశీ సెక్యూరిటీలు) ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.
బ్యాంకులు... ప్రభుత్వ రంగ సంస్థల్లో..
‘ట్రస్ట్‌ ఎంఎఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ ఫండ్‌’ అనే ఒక కొత్త ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ట్రస్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ఈ నెల 27న ముగుస్తుంది. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు, మున్సిపాల్టీలు జారీ చేసే రుణ పత్రాలు, మనీ మార్కెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టటం ద్వారా మదుపరులకు మంచి లాభాలు తెచ్చిపెట్టటానికి ఈ పథకం ప్రయత్నిస్తుంది. ఇది ‘డెట్‌ స్కీమ్‌’ తరగతికి చెందిన పథకం. ఎన్‌ఎఫ్‌ఓ లో కనీస పెట్టుబడి రూ.1,000.
గత రెండేళ్ల కాలంలో దేశీయ రుణ మార్కెట్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు చోటుచేసుకున్న ఫలితంగా బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ ఫండ్లు మంచి ప్రతిఫలాన్ని అందించాయి. కానీ ఇదే విధంగా అధిక ప్రతిఫలాన్ని ఈ తరగతికి చెందిన ఫండ్లు మున్ముందు కూడా అందిస్తాయని చెప్పలేం.  స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పత్రాల్లో ఈ పథకం ద్వారా పారదర్శకంగా, క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టి నిర్దేశిత పెట్టుబడి లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నట్లు ట్రస్ట్‌ ఏఎంసీ సీఈఓ సందీప్‌ బగ్లా వివరించారు.  

మదుపులో సమతౌల్యంగా..
నష్టభయం తక్కువగా ఉండే బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ విభాగంలో కొత్తగా పీజీఐఎం ఇండియా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఎన్‌ఎఫ్‌ఓలో ఈ నెల 29 వరకూ మదుపు చేయొచ్చు. కనీస పెట్టుబడి రూ.5,000. ఈక్విటీతో పాటు స్థిరమైన ఆదాయాన్నిచ్చే రుణ పత్రాల్లో పెట్టుబడి పెట్టే విధానాన్ని అనుసరించటం వల్ల ఈ పథకం పెట్టుబడుల విలువ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అనిరుద్ధ నహా (ఈక్విటీ), కుమరేష్‌ రామకృష్ణన్‌ (రుణ విభాగం), ఆనంద పద్మనాభన్‌ (విదేశీ పెట్టుబడులు) దీనికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ‘డైనమిక్‌ అస్సెట్‌ కేటాయింపు’ పద్ధతిని ఈ ఫండ్‌ అనుసరిస్తుంది.  ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు ఈక్విటీ పెట్టుబడుల వాటా పెంచుకోవటం, ఈక్విటీ మార్కెట్లలో నష్టభయం అధికంగా ఉన్నప్పుడు రుణ పెట్టుబడులు అధికం చేయటం.... ఈ విధానం వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన ప్రతిఫలాన్ని ఆశించే అవకాశం ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి ‘గ్రూపు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ బీమా’ కింద బీమా సదుపాయం లభిస్తుంది. దీనికి చెల్లించాల్సిన ప్రీమియాన్ని ఫండ్‌ సంస్థ భరిస్తుంది.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని