
తాజా వార్తలు
నువ్వు ఒంటరి కాదు!
గడప దాటిన ఆడపిల్ల...రోజూ గండాలెన్నో దాటుకుని తిరిగి రావాల్సి వస్తోంది. కామాంధుల కళ్లను గప్పి... ఏ రోజుకారోజు ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ దారుణాలను అడ్డుకోవడానికి అమ్మాయిలకు తమకు ఉన్న రక్షణ వ్యవస్థల గురించి అవగాహన, అప్రమత్తత కూడా అవసరం. ఇవిగో ఆ వివరాలు...
దగ్గరున్నాయా?
ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు మన రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా...ఆత్మస్థైర్యం కోల్పోకూడదు. ఆత్మరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ఆపత్కాలంలో చేతిలో ఉన్న హ్యాండ్‌బ్యాగ్, తాళాలు, చున్నీ, పెన్ను, చెంపపిన్నులు...వంటివాటితో దాడి చేయడానికి ప్రయత్నించొచ్చు. పెప్పర్ స్ప్రేని దుండగుల కళ్లల్లో పడేలా చేయండి. స్టన్గన్నీ వాడొచ్చు. తక్షణ రక్షణకు దుండగులపై ఉపయోగిస్తే వోల్టేజ్‌తో షాక్ ఇస్తుంది.ఇవన్నీ ఆపత్కాలంలో మీకు రక్షణగా ఉంటాయి.
100
‘ఆపదలు చెప్పిరావు... అప్రమత్తతే దానికి రక్ష’... అసౌకర్యం, అభద్రత ఏ సందర్భంలో ఎదురైనా పోలీసులను సాయం కోరడానికి ఏమాత్రం వెనకాడొద్దు. టోల్‌ఫ్రీ నంబర్ 100కి డయల్ చేయండి. వారు మీ లొకేషన్ని ట్రేస్ చేసి సమీప పోలీస్‌స్టేషన్ సాయంతో మిమ్మల్ని త్వరగా చేరుకుంటారు.
హ్యాక్ఐ
తెలంగాణ మహిళలు...హ్యాక్ఐ యాప్‌ని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకుని మీ వివరాలు నమోదు చేయండి. మీరెప్పుడు ఆపదలో ఉన్నా ఇందులోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు...మీ రక్షణ బాధ్యతను పోలీసులు తీసుకుంటారు. ఇక, మీరు ఒంటరిగా వెళ్తోంటే జీపీఎస్ సాయంతో ట్రాక్ చేస్తారు.
దిశ
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మహిళలు..ఈ యాప్‌ని ఫోన్లో వేసుకుని...అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు. మీరు క్షేమంగా ఉన్నట్లే. అలానే అభయం యాప్ వైజాగ్, తిరుపతి నగరాల్లో మహిళల క్షేమం కోసం ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలను ట్రాక్ చేస్తుంది. భద్రంగా ఇంటికి వెళ్లేలా చూస్తుంది.
షీషటిల్
రాత్రిపూట, ఒంటరిగా చేసే ప్రయాణాల్లోనే మహిళలకు రక్షణ కరవయ్యేది. ఇలాంటి ఇబ్బందిని అధిగమించడానికే హైదరాబాద్‌లో షీషటిల్ సర్వీస్‌లను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అలానే వీలైనంతవరకూ ప్రజారవాణా వ్యవస్థను ఎంచుకోండి. ఒకవేళ ఆటోలు వంటివి ఎక్కాల్సి వచ్చినా...జనం ఉంటేనే వినియోగించండి.