close

తాజా వార్తలు

Published : 09/03/2021 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టొమాటో ‘పంట’ పండిస్తోంది!

వ్యవసాయం అంటే చిన్నతనం నుంచి మక్కువ ఆమెకు. అయితే పెళ్లి, పిల్లల బాధ్యతలతో సమయం గడిచిపోయింది. బిడ్డలంతా జీవితంలో స్థిరపడ్డాక అరవై ఏళ్ల వయసులో వ్యవసాయం చేయడానికి నడుము కట్టింది. ఉన్న కొద్ది డబ్బుతో పొలం కొని సేంద్రియ పద్ధతిలో టొమాటోలను సాగు చేస్తూ లాభాలు గడిస్తోంది. ఆమే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కనక్‌ లత. తోటి రైతులకూ ఆదర్శంగా నిలుస్తోన్న ఆమె స్ఫూర్తి కథనమిది.

విఠల్‌పూర్‌కు చెందిన కనక్‌లత భర్త వాసుదేవ్‌ పాండే కో ఆపరేటివ్‌ బ్యాంకులో పనిచేసేవారు. 2017లో పదవీ విరమణ పొందడంతో దంపతులిద్దరూ కొన్నాళ్లపాటు అమెరికాలోని కొడుకు వద్దకు వెళ్లారు. పుట్టిన ఊరిపై మమకారంతో రెండేళ్లకే అక్కడి నుంచి వచ్చి సొంతూళ్లో స్థిరపడ్డారు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక కనక్‌ వ్యవసాయం చేయాలనుకుంది. అలా తన వద్ద ఉన్న నగదుతో ఒకటిన్నర ఎకరం భూమిని కొనుగోలు చేసి సేద్యానికి సిద్ధమైంది.
రుణం తీసుకుని..
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు చిన్నప్పటి నుంచి సేద్యం చేయాలనే ఆసక్తి ఉండటంతో ఆ దిశగా అడుగులేసింది. ‘మొదట్లో గోధుమ, టొమాటోలు పండించాం. అయితే మొదటి పంటలోనే నష్టాలు మమల్ని వెక్కిరించాయి. ఇక్కడ కూరగాయలు పండించే బదులుగా పొలాన్ని ఎండబెట్టుకోవడం నయమన్నారు స్థానిక  రైతన్నలు. వచ్చిన నష్టంతో చేతిలో ఉన్న నగదు కూడా అయిపోయింది. దాంతో ఒత్తిడికి గురయ్యాం. ఎలాగైనా ఇదే భూమిలో పంట పండించి అందరికీ చూపించాలనే పట్టుదల వచ్చింది. ఏదైనా  కొత్తరకం వంగడాన్ని ఈసారి ప్రయత్నించాలనుకున్నాం. ఆ దిశగా నాబార్డు ఆధ్వర్యంలో పనిచేసే ఓ సేంద్రియ వ్యవసాయ విభాగంలో శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణాన్ని పొంది రెండోసారి సేద్యానికి టొమాటోను మాత్రమే ఎంచుకున్నాం. మార్కెట్‌లో పేరున్న ‘దుర్గ్‌’, ‘ఆర్యామన్‌’ రకాల టొమాటో విత్తనాలు నాటాం. పులుపు తక్కువ, రసం ఎక్కువగా ఉండే ఈ టొమాటోల దిగుబడి కూడా చాలా బాగుంది. అంతేకాదు, తొక్క దళసరిగా ఉండి, ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటాయి. ఈ రెండేళ్లలో పంట దిగుబడితోపాటు విక్రయాల్లోనూ లాభాలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత లండన్‌, ఎమన్‌ దేశాలకూ వీటిని ఎగుమతి చేస్తున్నా’ అని చెబుతోందామె.

రోజుకు ఏడు టన్నులు
కనక్‌లత పొలంలో రోజూ దాదాపు 50 డబ్బాల టొమాటోల దిగుబడి ఉంటుంది. ఒక్కొక్కదానిలో 25 కేజీల టొమాటోలు పడతాయి. అలా ఏడు టన్నులను పండిస్తోంది. ఖర్చులన్నీ పోగా నెలకు రెండున్నర లక్షల రూపాయల లాభం పొందుతోంది. దీంతో ఇరుగుపొరుగు రైతులు సేద్యంలో ఆమె సూచనలను పాటిస్తూ, అతి తక్కువ నీటిని ఉపయోగించి సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నారు. తోటి రైతులకు వ్యవసాయమెలా చేయాలో పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిన ఈమె, ఇప్పుడు క్యాప్సికం, స్ట్రాబెర్రీ, డ్రాగన్‌ఫ్రూట్స్‌ను పండించడానికి శిక్షణ తీసుకుంటోంది. నూతన సాంకేతికతను వినియోగించి కనక్‌లత చేస్తున్న వ్యవసాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించడమే కాదు, ప్రశంసలనూ కురిపిస్తున్నారు. రాజ్‌భవన్‌కు పంపిస్తున్న తమ టొమాటోల రుచి గవర్నరుకూ ఎంతో నచ్చాయంటూ సంతోషంగా చెబుతోంది కనక్‌.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని