close

తాజా వార్తలు

Published : 11/04/2021 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మ లేకుంటే మేం లేం!

షేక్‌ నఫీజ్‌కు పుట్టుకతోనే కష్టాలు మొదలయ్యాయి. నడక రాకముందే నాలుగు చక్రాల కుర్చీ అవసరం వచ్చింది. కండరాల క్షీణత వ్యాధి వల్ల శరీరం చచ్చుబడిపోయి కొన్నాళ్లకు మంచానికే పరిమితమయ్యింది. అలాగని ఆమె కుంగిపోలేదు. పట్టుదలతో కుంచెతో అద్భుతమైన చిత్రాలకు ప్రాణంపోస్తోంది. ఆమె మాటల్లో ఆ వివరాలు...

అమ్మ షెహనాజ్‌ బేగమ్‌ గృహిణి. నాన్న షేక్‌ అబ్దుల్‌ సుభాన్‌ రైల్వేలో చిరుద్యోగి. చెల్లి నసీమా. నాకు పుట్టుకతోనే కండరాల క్షీణత వ్యాధి వచ్చింది. దాంతో ప్రతి పనికీ ఇతరులపై ఆధారపడాలి. పదోతరగతివరకు కుర్చీలో కూర్చోగలిగేదాన్ని. నాన్నే స్కూలుకి తీసుకెళ్లి తీసుకొచ్చేవారు. ఇంటర్‌లో చేరదామనుకునే లోపు ఒకరోజు ఉన్నట్టుండి కిందపడిపోయాను. డాక్టరుకు చూపిస్తే ‘ఎముకలు విరిగిపోయాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. ఆ తర్వాత నుంచి కుర్చీలో కూర్చోవడం కూడా కష్టంగానే ఉండేది. అరగంట కూర్చుంటే మళ్లీ నాలుగు గంటలపాటు విశ్రాంతి అవసరమయ్యేది. అలా మంచానికే పరిమితమయ్యాను. అన్నం తినిపించడం దగ్గర్నుంచి అన్ని పనులూ చూసుకుంటుంది. నన్ను చూసి అమ్మానాన్నలు ఏడవని రోజులేదు. ఒక్కోసారి చనిపోదామనిపించేది. కానీ, ధైర్యం తెచ్చుకున్నాను. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. నాలోనూ ఉంది. దాన్ని వెలుగులోకి తెచ్చి నన్ను నేను కొత్తగా మార్చుకోవాలనిపించింది. నాకున్న ఒకే ఒక ఆసక్తి చిత్రకళ. అందరూ నన్ను ప్రోత్సహించారు. యూట్యూబ్‌ వీడియోలను చూసి చిత్రకళలోని మెలకువలు నేర్చుకున్నాను. ఇప్పటివరకు 300లకుపైనే చిత్రాలు గీశాను.

ఒకరోజు స్వచ్ఛంద సేవకులు, జర్నలిస్ట్‌ ఖాజా అఫ్రీది మా ఇంటికొచ్చారు. నా చిత్రాలను చూసి ఆశ్చర్యపోయారు. నా కళను ప్రపంచానికి పరిచయం చేయాలని 2018 ఆగస్టులో హార్ట్‌ ఏబుల్డ్‌ పేరిట ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. నేను గీసిన బొమ్మలను చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మెచ్చుకున్నారు. పేదకళాకారులకు ఇచ్చే పెన్షన్‌ రూ.10 వేలును నాకు వచ్చేలా ఏర్పాటు చేశారు. అన్నీ కష్టాలే కాదు నాక్కూడా మంచిరోజులొచ్చాయి అని అనుకుని సంతోషపడ్డాను. అయితే నా సంతోషం ఎక్కువరోజులు నిలవలేదు. నా ఎగ్జిబిషన్‌ జరిగిన నెలకి నాన్న గుండెపోటుతో చనిపోయారు. అప్పటివరకూ కాస్త జబ్బుతో బాధపడుతున్న చెల్లికి కూడా నాలానే శరీరం చచ్చుబడిపోయింది. తనూ మంచానికే పరిమితమైంది. ఆసరాగా ఉండే భర్తలేక, కూతుళ్లు ఇద్దరూ మంచానికే పరిమితమయ్యేసరికి మా అమ్మ బాధ వర్ణనాతీతం. నిజంగా అమ్మ లేకుంటే మేం లేం. ఇప్పటికీ మమ్మల్ని చంటిపిల్లల్లా సాకుతూనే ఉంది. మా ఇద్దరి జబ్బు తగ్గాలంటే చాలా ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

నా ప్రతిభ ప్రధాని దృష్టికి వెళ్తే సాయం అందుతుందన్న ఉద్దేశంతో మళ్లీ అఫ్రిదే కిందటి నెలలో దిల్లీలో నా చిత్రాల ప్రదర్శన ఏర్పాటుచేశారు. చూసిన వారందరూ మెచ్చుకున్నారు. హైదరాబాద్‌ కూడా సరిగా చూడని నేను విమాన ప్రయాణం చేసి దిల్లీ దాకా రాగలిగానంటే.. నా కుంచె ఆసరాతోనే. దాంతోనే నాకు సాంత్వన.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని