close
Array ( ) 1

తాజా వార్తలు

ఆనంద నిలయంలో అలౌకిక దర్శనం

ఈనెల 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఆ నగుమోము చూడాలని భక్తులు తహతహలాడతారు... ఆ నిలువెత్తు మూర్తిని దర్శించాలని నిలువెల్లా కళ్లు చేసుకుంటారు... ఆయన కైంకర్యాల్లో ఒక్కసారైనా పాల్గొనాలని తపిస్తారు... అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, జగమేలే ఆ స్వామి అనంత శక్తి స్వరూపుడు. ఆనంద నిలయంలో కొలువై ఉన్న ఆ అమృతమూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం. సర్వాలంకారాలతో శోభిల్లినా, నిజరూపంలో వెలుగులు విరజిమ్మినా ఆ నిత్యకల్యాణ చక్రవర్తి ఆపాదమస్తకం ఎన్నో ప్రత్యేకతల నిలయం!

ఆనంద నిలయంగా పిలిచే తిరుమల గర్భాలయంలో బ్రహ్మ స్థానమనే దివ్య స్థలంలో వేంకటేశ్వరస్వామి అర్చారూపంలో కొలువుదీరి ఉన్నారు. ఎనిమిది అడుగుల పైగా పొడవున్న స్వామిరూపం స్వయం వ్యక్తమని భావిస్తారు. ఈ సాలగ్రామమూర్తి నిలుచుని ఉన్నందున ‘స్థానకమూర్తి’ అని పేరు. స్థిరంగా ఉన్నందున ధ్రువమూర్తి అని, ధ్రువబేరం అంటారు. దేవేరులు లేకుండా ఒక్కరే కొలువుదీరి ఉన్నందున ‘స్థానక విరహమూర్తి’ అనీ పిలుస్తారు. పద్మపీఠంపై నిలుచుని సూర్యకటారి అనే నందక ఖడ్గం, వివిధ దివ్యాభరణాలు, కిరీటం, తిరునామం, వక్షస్థలంలో వ్యూహ లక్ష్మితో శంఖు, చక్ర, వరద, కటి హస్తాలతో అద్భుతంగా దర్శనమిస్తారు.

వరద హస్తం:

స్వామివారు కుడి హస్తంలో వరద ముద్రతో ఉంటారు. అంటే తన కుడి అరచేతిని తెరిచి కిందికి చూపిస్తుంటారు. ఆయన పాదాలను ఆశ్రయించడం పరమోన్నత భక్తికి నిదర్శనమని చెప్పేందుకు ఇది సూచికగా చెబుతారు.

సూర్య కటారి...

శ్రీమహావిష్ణువు పంచాయుధాల్లో ఖడ్గం ఒకటి. దీనికి నందకం, సూర్య కటారి అని పేర్లు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేందుకు శ్రీమహావిష్ణువుకు సహకరించే ఈ ఆయుధాన్ని కలియుగంలో భక్తులకు కష్టాలను కలిగించేవారిని పరిమార్చడానికి స్వామివారు ధరించినట్లు నమ్ముతారు. వేంకటేశ్వరునిపై కీర్తనలు రాసేందుకు, ప్రపంచంలో పాపలతలను ఖండించేందుకు నందక ఖడ్గం అంశతో పద కవితా పితామహుడైన అన్నమయ్య ఆవిర్భవించినట్లు కథనం. మానవుల్లోని అజ్ఞానం, అవిద్య, అలక్ష్యం తొలగించుకోవాలని ఈ ఖడ్గం ద్వారా స్వామివారు ఇచ్చే సందేశం.

పరమోన్నత చరణాలు...

ఇలలోని భక్తులను ఉద్ధరించేందుకు మోపిన పాదాలే శ్రీ చరణాలు. శ్రీమహాలక్ష్మి తన చేతులతో సున్నితంగా ఒత్తిన ఈ పాదాలను ‘బ్రహ్మకడిగిన పాదము, బ్రహ్మము తానెనీ పాదము...’ అని వర్ణించాడు అన్నమయ్య.

బంగారు కవచంతో ఉండే స్వామి పాదాలు పుష్పాలు, తులసి దళాలతో నిండి ఉంటాయి. సుప్రభాత సేవ సమయంలో కవచం ధరించిన స్వామి పాదాలు చూడొచ్ఛు శుక్రవార అభిషేక సమయంలో, ఆ తర్వాత నిజపాద దర్శనంలో మాత్రమే దివ్య చరణాలను భక్తులు దర్శించుకునే వీలుంది. స్వామి పాదాలను దర్శించడం, ఆశ్రయించడం, సేవించడం అంటే భక్తుడు తనలోని అహంకారాన్ని భగవంతుడికి అర్పించడమని అర్థం. స్వామి పాదాలు కడిగి తీర్థాన్ని బ్రహ్మ స్వీకరించడం అంటే నాకు సృష్టికర్తననే అహంకారం లేదు అని చాటి చెప్పడమే!

తిరునామాల వాడు...

వేంకటేశ్వరస్వామి నుదుటిపై ధరించే నామాలకు ఊర్థ్వపుండ్రాలు అని పేరు. తిరునామాలు అని పిలిచే వీటిని వారానికి ఒకరోజు ప్రతి శుక్రవారం అభిషేకానంతరం సమర్పిస్తారు. 16 తులాల పచ్చకర్పూరం, ఒకటిన్నర తులాల కస్తూరిని ఉపయోగించి వీటిని తీర్చిదిద్దుతారు. బ్రహ్మోత్సవాల ముందు, బ్రహ్మోత్సవాల సమయంలో , బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే శుక్రవారాల్లో రెట్టింపు పచ్చకర్పూరం, కస్తూరి ఉపయోగిస్తారు. అందువల్ల ఈ నామానికి రెట్టింపునామం అనిపేరు. తిరిగి గురువారం నాడు ఈ నామాన్ని తగ్గించి నేత్ర దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు.

శంఖువు...చక్రం:

వేంకటేశ్వరస్వామి వారు పైరెండు చేతుల్లో శంఖుచక్రాలు ధరించి ఉంటారు. మొదట్లో వక్షస్థల లక్ష్మీదేవితో స్వామి అత్యంత శాంతమూర్తిగా కొలువుదీరి ఉండేవారట. తర్వాత కాలంలో రామానుజులవారు వీటిని ఏర్పాటు చేసినట్లు చెబుతారు.

హృదయంలో దేవేరి:

శ్రీనివాస ప్రభువు వక్షస్థలంపై శ్రీమహాలక్ష్మీదేవి కొలువుదీరి ఉంది. అభిషేక సమయంలో మాత్రమే అమ్మను స్పష్టంగా చూడొచ్ఛు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమమైన శుక్రవారాభిషేకాన్ని ఆమె హృదయంలో ఉన్నందువల్ల మొత్తం మూర్తికి నిర్వహిస్తారు. రోజూ మూడుసార్లు స్వామివారి సహస్రనామ, అష్టోత్తర శతనామార్చనానంతరం అమ్మవారిని ‘వరాహ పురాణం’లో పేర్కొన్న 24 నామాలతో పూజిస్తారు. దీన్ని చతుర్వింశతి నామ పూజగా పిలుస్తారు. ఇందులో స్వామివారిని అర్చించిన అనంతరం స్వామివారి పాదాల వద్దనున్న తులసీ దళాలతో అమ్మవారిని పూజిస్తారు. తన దేవేరికి హృదయంలో స్థానం ఇవ్వడం ద్వారా ఇల్లాలి స్థానం కూడా లోకానికి స్వామి చాటిచెప్పారు.

ఆదిశేషుడూ ఆయనలోనే:

స్వామివారు రెండు భుజాలకు కింది వైపు, మోచేతులకు పైభాగంలో నాగాభరణాలను ధరించి దర్శనమిస్తాడు. ఈ ఆభరణాలు ఆదిశేషుడికి ప్రతీక. తనకు అనుచరుడైనా తన శరీరంలో భాగం చేసుకోవడం ద్వారా స్వామి తాను దయాళువని చాటారు. బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనం శేషుడే కావడం విశేషం.

కటి హస్తం ఏం చెబుతుంది?

చతుర్భుజుడైన స్వామివారు ఎడమ హస్తాన్ని నడుము కింది భాగంలో కటిపై పెట్టుకుని దర్శనమిస్తారు. ఇక్కడే జీర్ణ, జననేంద్రియ వ్యవస్థలు ఉంటాయి. ఇవి మనిషి మనుగడకు అవసరమైన భాగాలే అయినా, దేనిపై అతిగా వ్యామోహం పెంచుకోవద్దని సూచిస్తున్నట్లు ఉంటుంది.

స్వామి వస్త్రం:

ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత వేంకటేశ్వర స్వామికి 24 మూరల పొడవు, నాలుగు మూరల వెడల్పున్న ధోవతిని అలంకరిస్తారు. దీంతోపాటు 12 మూరల పొడవు, రెండు మూరల వెడల్పున్న పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగా ధరింపజేస్తారు. గురువారం నాడు వీటిని తొలగించి ధోవతిని అలంకరించి, ఉత్తరీయాన్ని జంధ్యంలా వేస్తారు.

పద్మ పీఠంపై పరబ్రహ్మ తేజం:

స్వామిని విష్ణు అవతారంగా చెబుతున్నా ఆయన రూపురేఖా విలాసాలను విశ్లేషించి త్రిమూర్తి స్వరూపుడుగా, శక్తి స్వరూపంగా కూడా చెబుతారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆసనం పద్మం. అది వేంకటేశ్వరుడి పాదపీఠం కూడా. దీనివల్ల ఆయనను బ్రహ్మస్వరూపుడిగా కొందరు భావించారు. ఇరు భుజాల కింద, మోచేతులపై ఉన్న నాగాభరణాల కారణంగా శివావతారంగా కొందరు నమ్మారు. శుక్రవారాభిషేకాలు అందుకుంటున్నందున శక్తి స్వరూపంగానూ వర్ణించారు.

పద కవితా పితామహుడు అన్నమయ్య కీర్తిస్తూ ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు..’ అంటూ ఎవరు ఎలా తలుస్తారో స్వామి వారికి అలాగే కనిపిస్తారని వర్ణించారు.

కోరి కొలిచారు... చేరి నిలిచారు!

వేంకటేశ్వరుడు భక్తవత్సలుడు... భక్తులపై ఆయన చూపినట్లు ఎవరూ ప్రేమను, వాత్యల్యాన్ని చూపరని చెబుతారు. ఇప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే అనేక సేవల పేర్లు భక్తులవే ఉంటాయి. చివరకు ఆయన ఉండే ఆనంద నిలయం ముందుండే మెట్టు కూడా భక్తుడి పేరుమీదే ఉంటుంది. నిశ్చలమైన, నిష్కల్మషమైన భక్తి... సంపూర్ణ శరణాగతి మాత్రమే ఆయనను చేరుకునే మార్గాలని చాటి చెప్పారు ఈ మహా భక్తులంతా...

* సుప్రభాత సమయాన పదకవితా పితామహుడు అన్నమయ్య వంశీకులు ‘మేలుకో శ్రీరంగరాయ’ అని మేలుకొలుపు పాడతారు. దీంతో స్వామివారి దివ్యకార్యాచరణ మొదలవుతుంది.

* కేరళప్రాంత మహారాజు, వైష్ణవ భక్తుడు కులశేఖరుడు. పన్నెండు మంది ఆళ్వారుల్లో ఒకడు. తిరుమల సన్నిధిలో రాతిగడపగా ఉండాలని స్వామిని కోరుకున్నాడు. ఆయన అనుగ్రహంతో కులశేఖర పడిగా ప్రసిద్ధి పొందాడు.

* కోనేటిరాయుడి సేవకు పూలతోటను పెంచాడు అనంతయ్య అనే భక్తుడు. తర్వాత ఆయనే అనంతాళ్వారుగా ప్రసిద్ధుడయ్యారు. శ్రీనివాసుడు స్వయంగా వచ్చి ఆయన సేవలు స్వీకరించాడు. అందుకు గుర్తుగా నేటికీ ఉత్సవాల సమయంలో మలయప్పను శ్రీవారి ఆలయానికి నైరుతి మూలలో ఉన్న అనంతాళ్వారు తోటకు తీసుకెళతారు. కురవరతి నంబి అనే కుమ్మరిదాసు స్వామికి పరమ భక్తుడు. వేంకటేశ్వరుని సేవకు పూలు లేకపోతే బంకమట్టితో పూలు చేసి భక్తితో సమర్పించాడు.

* తిరుమల నంబి అనే భక్తుడు ఎన్నో మైళ్లు ప్రయాణించి ఆకాశగంగ నీళ్లు తెచ్చి స్వామికి అభిషేకం చేసేవాడు. నిలువెత్తు మాలలు అలంకరించేవాడు అదే తోమాల సేవ. తిరుమల నంబి వంశీకులు నేటికీ తోమాల సేవలో తరిస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన మహమ్మదీయ భక్తుడొకరు స్వామికి 108 బంగారు పద్మాలను కానుకగా సమర్పించారు. అదే అష్టదళ పాదపద్మారాధనగా కొనసాగుతోంది.

* స్వామి సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన సాధ్వీమణి తరిగొండ వెంగమాంబ. స్వామికి పవళింపు సేవలో ఆమె ఇచ్చిన ముత్యాల హారతి నేటికీ ఆ పేరు మీదే కొనసాగుతోంది.

-ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖరరావు, చైతన్య


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.