close
Array ( ) 1

తాజా వార్తలు

అందరిముందు అల్లరి చేస్తోంది!

మా పాపకు ఎనిమిదేళ్లు. బాగా చదువుతుంది. సమస్య ఏమిటంటే ఇంటికి చుట్టాలొస్తే లేదా మేం బయట వేడుకలు, విహార యాత్రలకు వెళ్లినప్పుడు విపరీతంగా అల్లరి చేస్తుంది. డ్యాన్స్‌ చేస్తూ, పరుగెత్తుతూ, పెద్దగా మాట్లాడుతుంది. ఇంట్లో మాత్రం మౌనంగా ఉంటుంది. ఈ అల్లరిని తగ్గించాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

మీ అమ్మాయి హైపర్‌ యాక్టివ్‌ అని అనుకుంటున్నారు కానీ కాదు. వాళ్లు అన్నిచోట్లా, అన్నివేళలా చురుగ్గా ఉంటారు. మీ పాపకు ప్రవర్తనాపరమైన లోపం ఉన్నట్లు అనిపిస్తోంది. ఇంట్లో బాగానే ఉన్నా... బయటకు వెళ్లినప్పుడో, బంధువులు వచ్చినప్పుడో అల్లరి చేస్తోందంటే అందరి దృష్టి తన మీద ఉండాలని కోరుకుంటోందని అర్థం. అందరూ తనని మెచ్చుకోవాలనే ఆత్రుతలో రకరకాల విన్యాసాలు చేస్తోంది. తన మాటలు, చేతలు, నృత్యం... ద్వారా అందరి దృష్టి తనవైపు మళ్లించుకోవాలని చూస్తోంది. దీన్ని అటెన్షన్‌ సీకింగ్‌ బిహేవియర్‌ అంటారు. మీ అమ్మాయిని తిట్టినా, కొట్టినా మరింత మొండిగా ప్రవర్తిస్తుంది తప్ప మారదని తెలుసుకోండి. నిదానంగా అర్థమయ్యేలా చెబితేనే అర్థం చేసుకుంటుంది. డ్యాన్స్‌ చేస్తుందని రాశారు కదా! ‘నువ్వు డ్యాన్స్‌ మాస్టర్‌ దగ్గర నేర్చుకుంటే ఇంకా బాగా చేయగలవు. అప్పుడు స్కూల్లో, ఇతర కార్యక్రమాల్లో ప్రదర్శనలూ ఇస్తే బహుమతి వస్తుంది. అందరూ నిన్ను మెచ్చుకుంటారు.’ అని చెప్పి చూడండి. అల్లరిగా కాకుండా సక్రమంగా చేస్తే అందరి మెప్పు దొరుకుతుందని వివరించాలి. సమయం, సందర్భం... అనేవి చాలా ముఖ్యమని చెప్పాలి. ‘నువ్వింత చలాకీగా, చురుగ్గా ఉన్నావు కదా వీటితోపాటు చదువూ, సృజనాత్మకతపై దృష్టి పెట్టు...’ అని తరచూ చెప్పేందుకు ప్రయత్నించండి. మీ అమ్మాయికి ఇష్టమైనవాటిని జాబితా రాసుకుని వాటిల్లో శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేయండి. తనకిష్టమైన వాటిని సక్రమంగా, సంపూర్ణంగా నేర్చుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే పాపలో మార్పు కనిపిస్తుంది. మరో పద్ధతీ అనుసరించండి. తను గట్టిగా మాట్లాడుతున్నా, అరుస్తున్నా పట్టించుకోకండి. ‘నువ్వు నీ స్నేహితులతో ఉండు. మేం వేరేచోటకు వెళతాం...’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోండి. తప్పుచేసినట్లు అర్థంచేసుకుంటుంది. తనలా చేస్తే చుట్టుపక్కల ఎవరూ ఉండరూ... ఎవరూ మెచ్చుకోరని ఆమె నెమ్మదిగా తెలుసుకుంటుంది. క్రమంగా మానేస్తుంది. ఆ మార్పు మొదలయ్యాక సమస్య చెప్పేందుకు ప్రయత్నిస్తే అర్థం చేసుకుంటుంది.

- మీ సందేహాలను vasukid@eenadu.net కు పంపించగలరు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.