close
Array ( ) 1

తాజా వార్తలు

ధర ధరకీ ఎందుకీ తేడా?

ఎక్స్‌షోరూం - ఆన్‌రోడ్‌

పత్రికలో ప్రకటన చూసి ధర తక్కువని మురిసిపోతాం...
తీరా డీలరు దగ్గరికెళ్లాక రేటు విని నోరెళ్లబెడతాం...
అప్పుడుగానీ తెలియదు మనకు ఎక్స్‌ షోరూంకి.. ఆన్‌రోడ్‌కి ఉన్న తేడా...
అది నమ్మాలా? వద్దా? అని చాలామందికి సంశయం.. మోసపోతున్నామేమో అనే సందేహం...
ఇంతకీ ఏది వాస్తవం? ఎందుకీ తేడాలు? ఈ అంకెల వెనుక ఉన్న మర్మమేంటి?
ఇవన్నీ తెలుసుకుంటూనే బండి మన చేతికందేలోపు తగ్గించుకోదగ్గ పన్నులు, ఛార్జీలేంటో తెలుసుకుందాం.

క్స్‌ షోరూం ధర, ఆన్‌రోడ్‌ ప్రైస్‌.. ఆటోమొబైల్‌ రంగంపై అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పదాలివి. కానీ కొత్తవాళ్లకైతే బొత్తిగా తెలియదు. రెండు ధరల మధ్య ఆ తేడా ఎందుకో అర్థం కాదు. తేలిగ్గా చెప్పాలంటే.. వాహన తయారీకి అయ్యే ఖర్చునే ఎక్స్‌ షోరూం ధర అనొచ్ఛు ఆపై ప్రభుత్వానికి కట్టే పన్నులు, డీలరు తీసుకునే లాభం, ఇతరాలన్నీ కలిపి వాహనం రోడ్డుపైకి వచ్చేసరికి అయ్యే మొత్తం రేటుని ఆన్‌రోడ్డు ధర అంటారు. ఈ రెండింటి మధ్య తేడా కనీసం పదిశాతమైనా ఉంటుంది. డీలరుతో జాగ్రత్తగా బేరమాడితే మధ్యలో ఉండే పన్నులు, ఛార్జీలపైౖ కనీసం మూడుశాతం వరకు ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతారు. అవి ఎలాగంటే.●

రిజిస్ట్రేషన్‌ ఛార్జీ

బైకు, కారు.. ఏ వాహనం కొన్నా అది పూర్తిగా మన సొంతమయ్యేది రిజిస్ట్రేషన్‌ తర్వాతే. స్థానిక ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం (ఆర్‌టీఓ)లో బండిని రిజిస్ట్రేషన్‌ చేయిస్తే అక్కడ వాహనానికి రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ కేటాయిస్తారు. రాష్ట్ర కోడ్‌, ఏరియా కోడ్‌, సిరీస్‌, నాలుగంకెల డిజిటల్‌ నెంబర్‌.. ఇలా ఉంటుందది. ఈ ఛార్జీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. దీనికోసం డీలరు నెంబర్‌ ప్లేట్‌, స్మార్ట్‌కార్డుల ఛార్జీలూ తీసుకుంటాడు.

తగ్గేదిలా: రిజిస్ట్రేషన్‌ ఛార్జీ పూర్తిగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను. కానీ సర్వీసు ఛార్జీలు, ఏజెంట్‌ ఫీజు అని డీలరు మన దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేస్తాడు. బేరమాడితే వీటిలో కొద్దిమొత్తం తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా మాఫీ చేయించుకోవచ్ఛు.

నిర్వహణ ప్యాకేజీ

భవిష్యత్తులో ఎదురయ్యే కొన్నిరకాల సమస్యలకు ఉచితంగా సర్వీసు చేస్తామంటూ డీలర్లు ప్రీపెయిడ్‌ సర్వీస్‌ ప్యాకేజీలు అందిస్తుంటారు. ఇందులో రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, పాలిషింగ్‌, టైర్ల రీప్లేస్‌మెంట్‌.. ఉంటాయి. కొంతమొత్తం వసూలు చేస్తారు.

సలహా: అత్యధికం మనకు అవసరం లేనివే. పైగా అన్ని అధీకృత సర్వీసింగ్‌ సెంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉండవు. అదీ గమనించాలి. ●

జీవితకాల రోడ్డు పన్ను

మన వాహనాన్ని రోడ్డు మీద నడపడానికి ప్రభుత్వానికి కట్టాల్సిన జీవితకాల పన్ను రోడ్‌ టాక్స్‌. ఇది 10-15 ఏళ్లకు వర్తిస్తుంది. ఎక్స్‌షోరూం ధరకి 3శాతం ఉంటుంది. మోడల్‌, ఇంధన రకాన్ని బట్టి ఇరవైశాతం వరకూ పన్ను వేస్తారు.

రసీదులు: ప్రభుత్వం విధించే టాక్స్‌ కన్నా డీలరు అధికంగా చూపిస్తాడు. ఏజెంట్లు, అధికారులకు నజరానాలు ఇవ్వాల్సి ఉంటుందంటాడు. మన రాష్ట్రంలో రోడ్‌ టాక్స్‌ ఎంత ఉందో స్పష్టంగా తెలుసుకోవాలి. తప్పకుండా రసీదులు తీసుకోవాలి.●

అదనపు యాక్సెసరీలు

వాహనం కొనేటప్పుడు ఫ్లోర్‌మ్యాట్‌లు, మడ్‌ మ్యాట్‌లు, సీటు కవర్లు, కారు దిండ్లు, దేవతల ప్రతిమలు, ఇతర విడిభాగాలు తీసుకోవడానికి అదనంగా ధర చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి కొనుగోలుదారుకిచ్చే ధర జాబితాలో మనకు తెలియకుండానే యాక్సెసరీల పేరిట కొంత రుసుము వసూలు చేస్తారు.

మీ ఇష్టం: డీలర్లు చెప్పిన అన్ని విడిభాగాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వద్దనుకుంటే మానేయవచ్ఛు అదీ కాకుండా షోరూంలో తీసుకునే వస్తువులతో పోలిస్తే బయట మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరుకుతాయి.●

బీమా

ప్రమాదాల్లో, వాహనం చోరీకి గురైనప్పుడు, ప్రకృతి విపత్తులవేళ ఆదుకునేది బీమా. ఇది తప్పనిసరి. ఇందులో థర్డ్‌ పార్టీ, కాంప్రహెన్సివ్‌, జీరో డిప్రిషియేషన్‌.. అంటూ రకరకాల పాలసీలు అందుబాటులో ఉంటాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక బీమా పథకాలుంటాయి.

జాగ్రత్త: వాహనానికి థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి. మిగతావి మనకు నచ్చినవి ఎంచుకోవచ్ఛు బండి కొంటున్నప్పుడు డీలర్లు దీర్ఘకాలిక బీమా ఇస్తాం అన్నా అందులో థర్డ్‌ పార్టీ ఒక్కటే ఐదేళ్ల కాలానికి ఇచ్చి, మిగతాది స్వల్పకాలానికి పరిమితం చేస్తారు. ఇది జాగ్రత్తగా గమనించాలి. డీలరు దగ్గర కాకుండా బయట తీసుకుంటే ప్రీమియం తగ్గే అవకాశం ఉంది. ఎక్కువ డిస్కౌంట్లు పొందవచ్ఛు.

హ్యాండ్లింగ్‌/లాజిస్టిక్‌ ఛార్జీలు

వాహనం తయారైన దగ్గర్నుంచి గోదాములకు, అక్కడి నుంచి షోరూంకి చేర్చడానికి, నిల్వకు తీసుకునే ఛార్జీలు ఇవి. దీనికి కొంత ఛార్జీ వసూలు చేస్తుంటారు.

పరిశీలించాలి: ఎక్స్‌షోరూం ధరలో డీలర్ల లాభాలు కలిసి ఉండటంతో హ్యాండ్లింగ్‌ ఛార్జీలు చట్టవిరుద్ధమనీ, మాఫీ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ రుసుములు వేశారేమో ఓసారి చెక్‌ చేసుకోండి.

- బెజవాడ వెంకటేశ్వర్లు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.