close
Array ( ) 1

తాజా వార్తలు

అలా మొదలైంది..మయాంకం

మన దేశంలో క్రికెట్‌ ఆడే కుర్రాళ్లు కోట్లమంది. అందులో లక్షలమంది క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకుంటారు. వాళ్లందరి లక్ష్యం అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటమే. కానీ ఈ అవకాశం దక్కేది కొందరికే. అపారమైన ప్రతిభ ఉండి కూడా జాతీయ జట్టు దాకా వెళ్లలేక మధ్యలో కెరీర్‌ ఆపేసే కుర్రాళ్లు ఎంతమందో! మయాంక్‌ అగర్వాల్‌ కూడా అందులో ఒకడు కావాల్సింది! యుక్త వయసులో మెరుపులు మెరిపించి ఆ తర్వాత మాయమైన ఎంతోమంది ప్రతిభావంతుల్లాగే అతడి ప్రయాణమూ సాగింది. తనకిక అంతర్జాతీయ యోగం లేదని ఒక దశలో అతనే ఓ నిర్ణయానికి వచ్చేసిన పరిస్థితి. అలాంటివాడు ఇప్పుడు టీమ్‌ఇండియా కీలక ఆటగాడయ్యాడు. పరుగుల వరద పారిస్తూ సాగిపోతున్నాడు. మరి అతడి కెరీర్‌ ఉన్నట్లుండి ఎలా మలుపు తిరిగింది? మయాంక్‌ ఎలా మారాడు? ఇప్పుడున్న స్థితికి ఎలా వచ్చాడు?

‘‘ద పవర్‌ ఆఫ్‌ యువర్‌ సబ్‌కాన్షియస్‌ మైండ్‌ పుస్తకం వల్ల నా ఆలోచన విధానం మారింది. విపాసన ద్వారా జీవితాన్ని మెరుగ్గా అర్థం చేసుకోగలిగా. జీవితమనేది ప్రయాణమని, ఒక్కొక్కరికీ ఒక్కో మార్గం ఉంటుందని తెలిసింది. రాత్రికి రాత్రే అంతా మారిపోలేదు. నా దారిలో నేను సాగా. ఫలితాలు ఇప్పుడు పొందుతున్నా’’

- మయాంక్‌

దిహేడేళ్ల వయసులో భారత అండర్‌-19 జట్టులో చోటు.. కుర్రాళ్ల ప్రపంచకప్‌ (2010)లో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్ఢు. ఎటు చూసినా ప్రశంసలు.. ఇంకేముంది టీమ్‌ఇండియా తలుపు తట్టడమే తరువాయి అన్న అంచనాలు! కానీ ఇలా ఎంతమంది కుర్రాళ్లు ఇలా మెరిసి అలా మాయం అయిపోలేదు? మయాంక్‌ అగర్వాల్‌ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. టీమ్‌ఇండియాలో చోటుకు దగ్గరగా వచ్చి ఆగిపోయిన అతను.. ఒక దశలో అంతర్జాతీయ కెరీర్‌ మీద పూర్తిగా ఆశలు వదులుకున్నాడు. కానీ మళ్లీ ఆలోచన మార్చుకుని అనుకున్నది సాధించాడు. టెస్టు ఓపెనర్‌గా గత కొన్ని నెలల్లో ఈ కర్ణాటక కుర్రాడి మెరుపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

అంతా అయిపోయిందనుకుని..

ఓపెనర్‌గా టెస్టుల్లో శతకాల మీద శతకాలు బాదేస్తున్న మయాంక్‌కు ఉన్న ప్రతిభ ప్రకారం అతను ఇంకా ముందుగానే టీమ్‌ఇండియాలోకి రావాల్సింది. తొమ్మిదేళ్ల క్రితమే అండర్‌-19 ప్రపంచకప్‌లో ప్రదర్శనతో అతని పేరు మార్మోగింది. 20 ఏళ్ల వయసుకే ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరపున ఓపెనర్‌గా క్రిస్‌గేల్‌, కోహ్లి, డివిలియర్స్‌, దిల్షాన్‌ లాంటి ఆటగాళ్లతో ఆడే అవకాశాన్నీ పొందాడు. మంచి స్ట్రోక్‌ప్లేతో, భారీ షాట్లతో అలరించేవాడు. త్వరగానే భారత జట్టుకు ఎంపికవుతాడనే అంచనాలను నెలకొల్పాడు. కానీ ఆ స్ట్రోక్‌ప్లేనే అతని పాలిట శాపంగా మారింది. 20, 30 పరుగులు చేశాక వికెట్‌ పారేసుకొనే బలహీనతకు కారణమైంది. సెకన్లలోనే అత్యంత వేగాన్ని అందుకునే విలాసవంతమైన కారులాగా అతని పరిస్థితి తయారైంది. వేగం ఉంటుంది కానీ ఆ కారు మైలేజీ ఇవ్వదు. మయాంక్‌ కూడా భారీస్కోర్లు చేయలేక వెనకబడ్డాడు. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్‌లోనూ విఫలమయ్యాడు. రాణించలేకపోతున్నానే కుంగుబాటుకు గురయ్యాడు. చూస్తుండగానే 26 ఏళ్లు వచ్చేశాయి. క్రికెట్లో ప్రదర్శన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఆ దశలో చాలా మంది ఇక మనవల్ల కాదు వదిలేద్దాం అనుకుంటారు. కానీ మయాంక్‌ అలా ఆలోచించి ఉంటే ఇలా అతని గురించి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చేదే కాదు.

అలా మారాడు...

క్రికెట్‌ ఆడలేనేమో అని ఓ దశలో భయపడ్డ మయాంక్‌ ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడం వెనక అతని పట్టుదల, కృషి, వెనకడగు వేయని తత్వం ఉన్నాయి. మరోవైపు తన తండ్రి నేర్పిన ధ్యానం కూడా ఉపయోగపడింది. విపాసన అనే ధ్యాన ప్రక్రియతో మానసికంగా బలంగా తయారయ్యాడు. దాంతో పాటు ‘‘ద పవర్‌ ఆఫ్‌ యువర్‌ సబ్‌కాన్షియస్‌ మైండ్‌’’ అనే పుస్తకం కూడా అతణ్ని బాగా ప్రభావితం చేసింది. ముందు మనస్థత్వాన్ని మార్చుకున్న అతను ఆ తర్వాత ఆటను మెరుగుపర్చడంపై దృష్టి సారించాడు. క్రీజులో కుదురుకోవడంపై ధ్యాస పెట్టాడు. గంటల పాటు బ్యాటింగ్‌ చేస్తూ శ్రమించాడు. పొద్దున లేవడం.. మైదానానికి వెళ్లడం.. ఎంతసేపైనా బ్యాటింగ్‌ సాధన చేయడం ఇదే అతని దినచర్య. మిగతా విషయాల గురించి ఆలోచించడం మానేసి కేవలం ఆటపైనే దృష్టిపెట్టాడు. ఫలితం గురించి సంబంధం లేకుండా ఎంతసేపైనా క్రీజులో నిలబడడం అలవాటు చేసుకున్నాడు. సింగిల్స్‌ తీయడంపై కసరత్తు చేశాడు. తన సామర్థ్యాలను వెలికితీశాడు. సరికొత్తగా మైదానంలో అడుగుపెట్టాడు. రెండేళ్ల క్రితం కర్ణాటక రంజీ జట్టులో అతనుంటాడో లేదో అనే పరిస్థితి. కానీ 2017 నవంబర్‌లో మహారాష్ట్రతో జరిగిన రంజీ మ్యాచ్‌ అతని జీవితాన్నే మార్చేసింది. ఆ మ్యాచ్‌లో 304 పరుగులు చేసిన అతను ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. నిలకడగా రాణించడం అలవాటుగా మార్చుకొని టన్నుల కొద్దీ పరుగులు చేశాడు.

‘‘టెస్టు క్రికెట్‌ను మయాంక్‌ ఆస్వాదిస్తున్నాడు. ఆఫ్‌సైడ్‌ బంతుల విషయంలో విఫలం కాకుండా గొప్ప సమతూకం పాటిస్తున్నాడు. అతని ఫ్రంట్‌, బ్యాక్‌ఫుట్‌ కదలిక గొప్పగా ఉంది’’

- సునీల్‌ గావస్కర్‌


‘‘రెండేళ్ల ముందు వరకు కూడా మయాంక్‌కు కర్ణాటక రంజీ జట్టులో చోటు దక్కుతుందో లేదో అనే అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు టీమ్‌ఇండియాలో అతను కీలకంగా మారాడు. 2017 నవంబర్‌ నుంచి అతని ఆటలో గొప్ప మార్పులొచ్చాయి. ప్రతి మ్యాచ్‌కూ మెరుగవుతూ సాగుతున్నాడు’’

- వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఆడేస్తున్నాడిలా...

దేశవాళీలో తన ప్రదర్శనతో జట్టులోకి తీసుకోక తప్పని పరిస్థితి కల్పించాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో పృథ్వీ షా గాయం.. మయాంక్‌ పాలిట వరంగా మారింది. జట్టులోకి వచ్చిన అతను తొలి ఇన్నింగ్స్‌లోనే పటిష్ఠమైన ఆస్ట్రేలియా బౌలర్లను వారి సొంతగడ్డపైనే సమర్థంగా ఎదుర్కొని 76 పరుగులు చేశాడు. భారత్‌లో ఆడిన తొలి టెస్టులోనే (దక్షిణాఫ్రికాతో) ద్విశతకాన్ని నమోదు చేశాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో మరో డబుల్‌ సెంచరీ బాది అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (12) రెండు ద్విశతకాలు చేసిన ఆటగాడిగా దిగ్గజం బ్రాడ్‌మన్‌ (13)ను వెనక్కునెట్టి రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో భారత మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లి (5) ఉన్నాడు. మయాంక్‌ బంతిని ఎప్పుడూ తన శరీరానికి దగ్గరగా ఆడతాడు. అలాగే పేసర్ల బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా ఆడి బంతి ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకునే అవకాశమూ ఇవ్వడు. ఫీల్డర్ల మధ్య ఖాళీలను చక్కగా వినియోగించుకుంటూ పరుగులు రాబడతాడు. టెస్టుల్లో చాలా మంది బ్యాట్స్‌మన్లు సిక్సర్లు కొట్టడానికి వెనకాడతారు. అనవసరంగా వికెట్‌ పారేసుకుంటామేమోననే భయంతో ఆచితూచి ఆడతారు. కానీ మయాంక్‌ అలా కాదు. కచ్చితత్వమైన షాట్లతో బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తున్నాడు. ఇక కెరీర్‌ ముగిసిపోయింది అనే దశ నుంచి జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన మయాంక్‌ ప్రస్థానం కేవలం క్రికెటర్లకే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం, లక్ష్యం చేరే దిశగా విరామమెరుగని కృషి ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని అతను చాటాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.