close
Array ( ) 1

తాజా వార్తలు

ఊరి బయట నుంచి ఉత్తర అమెరికా దాకా..

ఒకప్పుడు ఇచ్చేది పుచ్చుకోవడానికి అడుగున ఉన్న చేతులవి.. మరిప్పుడ[ు? అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాల నుంచి ఆర్డర్లు సాధించుకుంటున్నాయి.. రంగురంగుల బ్యాగులు వాళ్ల జీవితాలనూ రంగులమయం చేశాయి. ఒకప్పుడు కన్నీటివానలు కురిసిన ఆ కళ్లలో నేడు కోటికాంతులు కనిపిస్తున్నాయి..

దో పే...ద్ద షాపింగ్‌మాల్‌లో ఉన్నట్లు అందమైన హ్యాండుబ్యాగులు, రకరకాల దుప్పట్లు, నవార్లు... ఇలా చెప్పుకుంటూపోతే ఆ ఊర్లో తయారయ్యే వస్తువుల చిట్టా చాంతాడంత. అన్నీ పర్యావరణ హితమే. విదేశీ వస్తువులను తలపించే ఈ ఉత్పత్తులు దేశమంతా కొనుగోలవుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ మార్కెట్లలోనూ సందడి చేస్తున్నాయి. పేరుమోసిన డిజైనర్‌ సంస్థలూ ఇక్కడ ఆర్డర్‌ ఇచ్చి ప్రత్యేక సంచులు తయారు చేయించుకుంటాయి. ఇంతకీ ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారో తెలుసా... ఒకప్పుడు ధర్మం చేయండని వీధుల్లో బిక్షాటన చేసిన మహిళలు. గుంటూరు జిల్లా బాపట్లలోని బేతనీకాలనీ వారి స్వగ్రామం. ఈ మహిళల తల్లిదండ్రులు కుష్ఠువ్యాధిగ్రస్థులు. ఒకప్పుడు నిత్యావసరాలు, మందుల ఖర్చుల కోసం పెద్దవాళ్లతో కలిసి బిక్షాటనకు వెళ్లేవారు. పనిచేయాలని ఉన్నా... ఎవరూ ఉపాధి కల్పించడానికి ముందుకు రాకపోయేవారు. వీరిని ఛీత్కరించినవారూ ఉన్నారు.

స్వయం ఉపాధి వైపు...
1960ల్లో సాల్మీషనార్మీ సంస్థ బాపట్ల ప్రాంతంలో కుష్ఠు వ్యాధి సోకిన వారికి ఉచితంగా వైద్యసేవలు అందించేది. దీంతో అనేక ప్రాంతాల నుంచి చాలామంది కుష్ఠువ్యాధిగ్రస్థులు ఇక్కడికి వచ్చేవారు. ఇలా దాదాపుగా 1,200 మంది ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఉపాధి దొరకకపోవడంతో బిక్షాటన చేపట్టారు. వీరి కష్టాలు గమనించిన ప్రభుత్వం 1985లో ప్రత్యేకంగా 350 ఇళ్లను నిర్మించింది. ఇప్పుడదే బేతనీకాలనీగా మారింది. కుష్ఠువ్యాధి బాధితుల పిల్లలూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వీరి దీనస్థితిని చూసి బేతనీకాలనీ లెప్రసీ అసోషియేషన్‌ చేయూతనందించింది. ఇక్కడి మహిళలకు చేతివృత్తులపై శిక్షణ కల్పించింది. వీరిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. ప్రస్తుతం 20 మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్నారు. సంవత్సరానికి రూ.కోటి వరకూ మార్కెట్‌ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘నేను 12 ఏళ్లుగా ఇక్కడే చేస్తున్నా. ఇదే మా కుటుంబానికి ఆధారం. మా ఇంట్లో పెద్దవాళ్లందరూ కుష్ఠువ్యాధిగ్రస్థులే. మా ఆయన పెయింటర్‌. ఏ రోజు పనుంటుందో చెప్పలేని పరిస్థితి. ముగ్గురు పిల్లల్నీ నేనే చదివిస్తున్నా’ అని చెబుతోంది అక్కడి ఉద్యోగి ఎస్‌కే.రోజా. హస్తకళా నైపుణ్యంతో కాస్త ఆదాయం సంపాదించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులెన్నెదురైనా పిల్లలను ఉన్నతంగా చదివిస్తూ... ఇంట్లోని  వారికి ఆసరాగా నిలుస్తున్నారు.

- రామరాజు హరీశ్‌, గుంటూరు

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.