close

తాజా వార్తలు

మీ ఇల్లు బంగారంగానూ!

రోజు మారింది... రోజులు కూడా మారాయి... మనం మారాలి. ఇంటిని మార్చాలి... ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని అందుకోవాలి, ఇంటిల్లిపాదికీ అందించాలి. దీనికోసం కాలానుగుణంగా వచ్చే పరిణామాలను గమనించాలి, మార్పులను అందిపుచ్చుకోవాలి. ఈ రోజు మీకో అవకాశం. కొత్త సంవత్సరాన్ని ఇలా మొదలుపెట్టేద్దామా?

జీవితం ఎప్పుడూ కొత్త అవకాశాలిస్తుంది. సులువైన భాషలో దాన్ని ‘ఈరోజు’ అంటారు’’.


20:80... ఇది పొదుపు మంత్రం

20 శాతం పొదుపు.. 80 శాతం ఖర్చు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే ఏ ఆర్థిక కష్టాలూ మిమ్మల్ని భయపెట్టలేవు. వచ్చిన ఆదాయంలో 80 శాతంతోనే కుటుంబ అవసరాలను తీర్చుకోవాలి. 20 శాతం సొమ్ముని తప్పనిసరిగా దాచిపెట్టాలి. కొత్త వస్తువుల కొనుగోళ్లు, పండగలు, శుభకార్యాలు, విహారయాత్రల వంటివాటికి రెండు మూడు నెలల ముందుగానే ఈ 80 శాతం నగదు నుంచే కొద్దికొద్దిగా మిగుల్చుకోవాలి. అత్యవసర నిధి కూడా చాలా ముఖ్యం. మూడు నెలల జీతం లేదా వరుసగా కొంత నగదును పద్ధతిగా పొదుపు చేసుకోవాలి. ప్రమాదాలు జరిగినప్పుడు, ఉద్యోగం మారాల్సిన సమయంలో ఈ అత్యవసర నిధే మిమ్మల్ని కాపాడుతుంది. ఏదైనా ఒక నెలలో అదనపు ఖర్చు ఉంటే, ముందునెల నుంచే ఇంటి ఖర్చుల నుంచి కొంత నగదును పక్కన పెట్టగలగాలి. ఉపయోగించే ప్రతి రూపాయినీ ఎందుకు, ఎలా ఖర్చు పెడుతున్నామో గుర్తిస్తే ఖర్చుపై నియంత్రణ ఉంటుంది. ముందుగా పొదుపు, ఆ తరువాతే ఖర్చు అనే నియమం ప్రతి మహిళా తప్పనిసరిగా పాటించాలి.


ఆటలు + ఆరోగ్యం + వికాసం = బాల్యం

సాంకేతికతతో వచ్చే అతి జ్ఞానం పిల్లలకు అవసరం లేదు. చంద్రయాన్‌ ప్రయోగం గురించి తెలిసిన పిల్లలకు పెద్దవాళ్లతో ఎలా ప్రవర్తించాలనేది తెలియకపోతే ఆ జ్ఞానానికి అర్థం లేదు. ఒకప్పటితో పోలిస్తే తల్లిదండ్రుల లక్ష్యాలను పిల్లలపై రుద్దడం తగ్గిపోయింది. ఆసక్తి ఉన్న రంగాల్లోనే ఎదిగే స్వేచ్ఛ ఈ తరం పిల్లలకు వచ్చింది. ఈ స్వేచ్ఛ కొత్తరకం సమస్యలకు దారితీయకుండా చూడాలి. ఏదైనా అడగ్గానే కొనిచ్చే అలవాటును మానుకోవాలి. వీటితో పాటు కేరింగ్‌, షేరింగ్‌, గివింగ్‌ వంటి లక్షణాలే పిల్లల మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయి. ఈ రోజుల్లో పిల్లలను సాంకేతికతకు దూరంగా ఉంచలేం. సాంకేతికత, శారీరకశ్రమ, చదువు... ఈ మూడే పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ మూడింటినీ సమన్వయం చేసుకునేలా పిల్లలను తీర్చిదిద్దాలని ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకోండి.


మీరూ వ్యాపారవేత్త కావచ్చు!

వసరం కోసం ఉద్యోగాలు చేసే మహిళలు.. పనిలో సంతృప్తి గురించి ఆలోచించరు. యాంత్రికంగా పనిచేస్తూ ఒత్తిడికి గురవుతారు. దీనికి బదులుగా అలవాట్లు, అభిరుచులనే వ్యాపార మార్గాలుగా ఎంచుకొని విజయం సాధించవచ్చు. పెద్ద కుటుంబాలు తగ్గిపోతున్న తరుణంలో మహిళలకు ఇంటిపనులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం వంటివి సవాళ్లుగా మారుతున్నాయి. పిల్లలకు ఏదైనా జబ్బుచేస్తే ఒక్కరోజు కార్యాలయానికి సెలవు పెట్టడానికి ఎన్నో అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. ఇలా కాకుండా సొంతంగా చిన్నపాటి వ్యాపారం పెట్టుకుంటే... ఆఫీసుల్లో ఉండే ఒత్తిడి, రోజువారీ లక్ష్యాలు వంటివి ఉండవు. మనకోసమే మన పని అనే ఆలోచన మనసులో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా ఇష్టంగానే స్వీకరిస్తాం. వందశాతం ఆత్మసంతృప్తి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలనూ చక్కబెట్టుకోవచ్చు. మీరు నేర్చుకునే కళ మీ సొంతమైతే అది మీకు నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుంది. నలుగురికి ఉపాధి కల్పించే శక్తినిస్తుంది. లాభాలు తక్కువ ఉన్నా భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యాపారాన్ని ఎంచుకుంటే రాణిస్తారు. ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలు, అవకాశాలు, వనరులను వినియోగించుకోవడంలోనే మన విజయసూత్రం దాగి ఉంది.


ఆత్మ విశ్వాసంతో...

ముందు మహిళల్లో ఎటువంటి వేధింపులు ఎదురైనా తమనితాము కాపాడుకోగలమనే ఆత్మవిశ్వాసం ఉండాలి. సెల్‌ఫోన్‌ని ఎప్పుడూ సినిమాలు, పాటలు, వినోదానికే వినియోగించుకోకుండా లోకజ్ఞానం తెలుసుకోవడానికి ఉపయోగించాలి. ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి.. ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ఆలోచించాలి. ఆటలతో ఆర్యోగం, ఆత్మవిశ్వాసం రెండూ అలవడతాయి. ఇవి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడి కుంగిపోకుండా.. వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాయి. కుంగ్‌ఫూ, కరాటేలూ నేర్చుకుంటే మనలో ధైర్యాన్ని నింపుతాయి. నేరం జరగకుండా... జరిగినా ఎదుర్కొనే బలాన్నిస్తాయి. ఆపత్కాలంలో పోలీసులను సంప్రదించేలా 100, 112, 108 వంటి హెల్ప్‌లైన్ల మీద అవగాహన ఉండాలి. తెలంగాణలో షీ టీంలు, ఆంధ్రప్రదేశ్‌లో మహిళా మిత్రా, సైబర్‌ మిత్రా వంటివాటిని ఎలా సంప్రదించాలో తెలిసుండాలి.  


ఇద్దరూ గెలవండి!

కూరలో ఉప్పుండనిదే... దానికి రుచి ఉండదు. అనుబంధంలో ప్రేమ లేనిదే దానికి నిండుదనం ఎక్కడిది? భాగస్వామితోనో, స్నేహితులతోనో, సహచరులతోనో... కూర వండలేదనో, చెప్పింది వినలేదనో ఇలా విడిపోవడానికి వంద కారణాలుంటాయి. కలిసుండటానికి ఒక్క కారణం చాలు. బంధం బలంగా ఉండాలంటే ఎదుటివ్యక్తి కోణంలో ఆలోచించగలగాలి. అతడు ఎంత కష్టపడుతున్నాడు... మాట జారడానికి కారణాలేంటీ ఇలా మీకు మీరే విశ్లేషించుకోవాలి. చాలా మంది చనువు ఉంది కదానీ... ఇతరుల వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించాలని చూస్తారు. ఇలా చేస్తే ఎవరైనా దూరమై పోతారు. కొంతమంది స్నేహితుల్లో ఒకరు సినిమాకు పోదామంటారు... ఇంకొకరు పార్కుకు పోదామంటారు. రెండింటిలో ఏ ఒక్కటి జరగకపోయినా ఎవరో ఒకరి అభిమతం ఓడినట్టే. ఇద్దరూ గెలవాలంటే ఒకదాని తరువాత మరొకదానికి వెళ్లాలనే ధోరణిలో వ్యవహరించాలి. నా మాటే నెగ్గాలనే పంతం పనికిరాదు.


క్యాలండర్‌ ఉందా?

ఏడాదిలో మీరేం చేయాలనుకుంటున్నారో ఆ పనులను ఓ పట్టికలా తయారుచేసుకుని మీ పై అధికారులకు అనధికారికంగా అందించాలి.  పనిచేసే మహిళలకు క్యాలండర్‌ ఓ ఆయుధం. చాలామంది ఇది చాలా బిజీగా ఉండే వ్యక్తులకే అని అనుకుంటారు. ఇలా అనుకోవడం సరికాదు. ప్రతి ఒక్క ఉద్యోగి దీన్ని అమలు చేయాలి. పిల్లల పరీక్షలు, సెలవులు, పండగలు, పుట్టినరోజులు, పెళ్లిరోజులు... ఇలా ప్రతిదీ ఆ క్యాలండర్‌లో నమోదు చేసుకోవాలి. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన క్యాలండర్‌ను కూడా తయారుచేసుకోవాలి. వార్షికాంతంలో ఇచ్చే సమీక్షలు, పై అధికారులకు సమర్పించే ప్రజంటేషన్స్‌... ఇలా ప్రతిదీ క్యాలెండర్‌లో పెట్టుకోవాలి. ప్రతి నెలా వీటిని చెక్‌ చేసుకుంటూ ఉండాలి. నెట్‌వర్క్‌ను పెంచుకోవాలి. సమావేశాలకు హాజరవుతూ ఉండాలి. అప్పుడే మన రంగంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సమావేశాల్లో మనం చేసిన పనిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దాని గురించి గట్టిగా మాట్లాడాలి. చేసిన పనిని చక్కగా చెప్పడానికి ప్రయత్నించాలి. దీన్ని పర్సనల్‌ బ్రాండింగ్‌ అంటారు. 


...షట్‌డౌన్‌  చేయండి!

‘నాకు అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలున్నాయి’ అని గొప్పగా భావించడం మానేసి అవి మనకు ఎంత   మేరకు ఉపయోగపడుతున్నాయనేది గుర్తించాలి. మాధ్యమాల్లో మన ఆసక్తులు, అభిరుచులను పెడుతూ గుర్తింపును పొందాలనుకోవడంలో తప్పులేదు. కానీ ‘ఇలాంటివి నేనే అప్‌లోడ్‌ చేశానా?’ అనే ఆలోచన భవిష్యత్తులో రాకూడదు. ఉపయోగపడే యాప్స్‌, ఆన్‌లైన్‌ ఛానెళ్లు ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవడం తెలియాలి. టెక్నాలజీ పరంగా ఆన్‌లైన్‌లో ఎంత తక్కువగా గడిపితే అంత మంచిది. సైబర్‌మిత్ర, షీటీమ్స్‌ వంటి సెక్యూరిటీ యాప్స్‌ను కచ్చితంగా ఫోన్లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అవి మీకు తోడుగా ఉంటాయి. రాత్రి ఎనిమిది తరువాత స్మార్ట్‌ఫోనును వాడొద్దని ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకోండి. తల్లులు ఫోను వాడితే పిల్లలూ అడుగుతారు. రాత్రివేళ ఎక్కువ సమయం ఫోనులో గడిపే పిల్లలు శారీరక, మానసిక దుష్ప్రభావాల బారిన పడే అవకాశం ఉంది. వీటితోపాటు రోజూ స్క్రీన్‌ టైమింగ్‌ను సరిచూసుకోండి.


ఆరోగ్యానికి ఐలవ్యూ చెప్పండి!

వ్‌ యూ... ఈ మాట ప్రతి మహిళ తనతో తాను ప్రతిరోజూ అనుకోవాలి. అవును ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రేమించుకోగలిగితే ఆమెలో అనుకూలభావాలు పెరుగుతాయి. అప్పుడే తన కుటుంబాన్నీ ఆరోగ్యంగా ఉంచుకోగలదు. ఇదంతా జరగాలంటే... తన ఆరోగ్యం పట్ల అవగాహనతో అడుగులు వేయాలి. వయసుని బట్టి కొన్ని రకాల వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అందరినీ పట్టించుకుని తనని తాను నిర్లక్ష్యం చేసుకోకూడదు. చక్కని ఆహారం తీసుకుంటూ హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి, ఒత్తిడి వంటివాటికి దూరంగా ఉండాలి. వారంలో నాలుగు రోజులు కనీసం అరగంట సేపు నడక, పరుగు లేదా జిమ్‌కు వెళ్లాలి. లేదంటే ప్రసవ సమయం, ప్రసవానంతరం, 40 ఏళ్లు దాటిన తరువాత శారీరక సామర్థ్యం తగ్గుతుంది. అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలెదురవుతాయి. ఇప్పటి బిజీ జీవితాల్లో మానసిక ఒత్తిడికి గురవడం సహజం. ఈ దశలో కొత్తప్రాంతాలను పర్యటించి ఒంటరితనం, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి. మీరు చేరాలనుకునే లక్ష్యాలు, సంతోషంగా జీవించాలనే ఆశయానికి మీ శారీరక సామర్థ్యం తోడయ్యేలా జాగ్రత్తపడితే చాలు... ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.


పదండి పాతరోజులకి!

రోగ్యంగా ఉండాలంటే పాతకాలంలోకి వెళ్లాల్సిందే. మీరు చదివింది కరెక్టే... పాతకాలం నాటి ధాన్యాలు, పొట్టు తీయని పప్పులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. శరీరానికి శక్తినిచ్చేవి మాంసకృత్తులు. వీటి కోసం పప్పులని ఎంచుకోవచ్చు. అలసందలు, రాజ్మా, సెనగలు వంటివాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. స్థానికంగా దొరికే గానుగనూనె... పల్లీ, నువ్వుల నూనెలను వాడుకుంటే మంచిది. నూనె, చక్కెర, బెల్లం.... ఏదైనా సరే పరిమితంగా ఉపయోగిస్తేనే మేలు. మన ఆహారంలో ఎక్కువ శాతం తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఇవి మనకు ఆరోగ్యాన్ని అందించే మూలస్తంభాలు. పండ్లను నేరుగా తింటే పోషకాలన్నీ అందుతాయి. పొరుగింటి బ్రకోలి కోసం పరుగెత్తనవసరం లేదు. సులభంగా దొరికే బచ్చలి, కొత్తిమీర, గంగవెల్లి, గోంగూర, కరివేపాకును విరివిగా వాడుకోండి. ఇంటి పెరుగు చాలా శ్రేయస్కరం. మసాలాలు తాజాగా, ఇంట్లోనే తయారుచేసి వాడుకుంటే మేలు. మరో ముఖ్య విషయం... వాట్సాప్‌, ఫేస్‌బుక్‌... లాంటి సామాజిక మాధ్యమాల్లో  ఆహారం గురించి వచ్చే అన్ని రకాల వార్తలను గుడ్డిగా నమ్మొద్దు. మీకేదైనా సమస్య  ఉంటే పోషకాహార నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.