close

తాజా వార్తలు

Published : 03/01/2020 07:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీమా సొమ్ము కోసం కక్కుర్తి

  భారీగా బంగారం చోరీ  జరిగినట్లు నాటకం
  24 గంటల్లో ఛేదించిన జమ్మికుంట పోలీసులు
  700 గ్రాముల బంగారం, ఆరు కిలోల వెండి స్వాధీనం

జమ్మికుంట గ్రామీణం: వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడేందుకు బీమా సొమ్ము కోసం చోరీ నాటకం ఆడిన నగల వ్యాపారులు పోలీసులకు దొరికిపోయారు. బీమా సొమ్ము కోసం బ్యాంకును మోసం చేయాలని చూడటమే కాకుండా.. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి వారి నాటకానికి తెరదించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి గురువారం జమ్మికుంట ఠాణాలో వెల్లడించారు.
జమ్మికుంటకు చెందిన కాసుల కిరణ్‌, మహేశ్‌, భాస్కర్‌ ముగ్గురు అన్నదమ్ములు. వీరు గాంధీచౌక్‌ సమీపంలో విజయలక్ష్మి నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాపార నిమిత్తం వివిధ బ్యాంకుల్లో భారీగా రుణాలు తీసుకున్నారు. సదరు రుణాలను ఎగ్గొట్టాలని భావించి పక్కా పథకం రచించారు. ఇటీవల వారు కొనుగోలు చేసే బంగారం, వెండి ఆభరణాలపై బీమా చేయించారు. భారీగా బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే బీమా సొమ్ము ఎక్కువ మొత్తంలో వస్తుందని భావించారు. ప్రణాళిక అమలులో భాగంగా మంగళవారం కిరణ్‌, మహేశ్‌ పని నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లారు. భాస్కర్‌ తన తల్లి, భార్యతో కలిసి వరంగల్‌కు వెళ్లారు. అదేరోజు రాత్రి భాస్కర్‌ తిరిగొచ్చి ఇంటి తాళం పగులకొట్టి వస్తువులను చిందరవందరగా పడేసి దొంగతనం జరిగినట్లు చిత్రీకరించి.. బంగారు, వెండి ఆభరణాలను ఇతర ప్రదేశాలలో భద్రపరిచాడు. తరవాత ఏమీ తెలియనట్లు భాస్కర్‌ తమ ఇంట్లో భారీ దొంగతనం జరిగినట్లు ఇరుగుపొరుగు వారితో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అర్ధరాత్రి సమయంలో ఘటన స్థలానికి చేరుకొన్న ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ సృజన్‌రెడ్డిలు దొంగతనం జరిగిన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డాగ్‌స్వ్కాడ్‌, క్లూస్‌టీం సభ్యులు సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరించారు.
భారీ చోరీ జరిగిందని హడావుడి సృష్టించడంతో పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. 24 గంటల్లో కేసును ఛేదించాలనే పట్టుదలతో అదనపు డీసీపీ చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో 31 మంది పోలీస్‌ అధికారులు బృందాలుగా ఏర్పడి దొంగతనం జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనం జరిగిన పరిసరాల్లో ఉన్న సీసీకెమెరాల ఆధారంగా అనుమానితులతోపాటు మహేశ్‌, భాస్కర్‌లను విడివిడిగా విచారించడంతో బీమా డబ్బుల కోసమే దొంగతనం నాటకం ఆడినట్లు వారు చెప్పారని సీపీ తెలిపారు. వారి నుంచి 700 గ్రాముల బంగారంతోపాటు 6 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు డీసీపీ చంద్రమోహన్‌, క్రైం బ్రాంచ్‌ ఏసీపీ కొండ్లె శ్రీనివాస్‌, హుజూరాబాద్‌ ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు, సీఐలు సృజన్‌రెడ్డి, కిరణ్‌, రాములు, ఎస్‌ఐలు సత్యనారాయణ, ప్రవీణ్‌రాజు, కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.