close

తాజా వార్తలు

Updated : 06/01/2020 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘సూపర్‌’ విజేత వివేకానంద

జూనియర్స్‌ విజేత ట్రినిటి జట్టు

ఉత్కంఠభరితంగా తుది పోరు

సీనియర్స్‌ గెలుపును తేల్చిన సూపర్‌ ఓవర్‌

బాలికల విజేత కేడీసీఏ జట్టు  

కరీంనగర్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ‘ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019’ ఫైనల్‌ పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. సీనియర్స్‌ విభాగంలో సూపర్‌ ఓవర్‌లో కరీంనగర్‌ వివేకానంద కళాశాల జట్టు విజయం సాధించింది. అంతకుముందు ట్రినిటి సీఈసీ కళాశాల ప్రిన్సిపల్‌ ఆనంద్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. జిల్లా స్పాన్సర్‌గా ట్రినిటి విద్య సంస్థలు వ్యవహరించాయి. చల్మెడ వైద్యులు క్రీడాకారులకు వైద్యం అందించారు. 

రసవత్తరంగా సాగిన మ్యాచ్‌ 

క్రికెట్‌ సీనియర్స్‌ విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో కరీంనగర్‌ వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల జట్టు విజయకేతనం ఎగరవేసింది. చివరి వరకు పోరాడిన జేఎన్‌టీయూ, మంథని జట్టు త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్నా...అందరి అభిమానాన్ని సొంతం చేసుకొంది. హోరాహోరీగా సాగిన పోరులో చివరి బంతికి జేఎన్‌టీయూ జట్టు స్కోరుని సమం చేయడంతో సూపర్‌ఓవర్‌కు దారి తీసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జేఎన్‌టీయూ జట్టు తొలి బంతి నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా సిక్స్, బౌండరీ కొట్టడంతో మైదానం కేరింతలతో మార్మోగింది. తరువాత బంతికి మరో రెండు పరుగులు చేయగా మొత్తం 15 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. సవాల్‌ను స్వీకరించి బ్యాటింగ్‌ దిగిన వివేకానంద బ్యాట్స్‌మెన్లు మెరుపు షాట్లు ఆడి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యంలోకి నెట్టేశారు. తొలి బంతికే సిక్స్‌.. ఆ తరువాత నాలుగు పరుగులు చేశారు. చివరి బంతికి బౌండరీ కొడితే కనీసం డ్రాగా ముగుస్తుంది అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా బంతిని సిక్స్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. క్షణక్షణం రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల జట్టు విజేతగా నిలిచినప్పటికీ.. ఆఖరిక్షణం వరకు మేటి ప్రతిభ చూపిన జేఎన్‌టీయూ క్రీడాకారులు సైతం అందరి ప్రశంసలు అందుకొని పరోక్ష విజేతలుగా నిలవడం కొసమెరుపు.  

విజేతలు వీరే..

చివరి రోజు క్రికెట్‌ సీనియర్స్‌ విభాగంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మంథనికి చెందిన జేఎన్‌టీయూ జట్టుపై కరీంనగర్‌కు చెందిన వివేకానంద డిగ్రీ, పీజీ జట్టు విజయం సాధించింది. నరాల తెగే ఉత్కంఠతో సాగిన ఈ పోరు సూపర్‌ఓవర్‌కు దారితీసింది. మెరుపుషాట్లతో వివేకానంద జట్టు ‘సూపర్‌’ విజేతగా నిలిచింది. జూనియర్స్‌ విభాగంలో...హుజురాబాద్‌కు చెందిన కాకతీయ జట్టుపై సాలెహ్‌నగర్‌కు చెందిన ట్రినిటి జట్టు విజయం సాధించింది. అలాగే బాలికల విభాగంలో కరీంనగర్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేడీసీఏ) జట్టు, జడ్పీ ఉన్నత పాఠశాల దొంతాపూర్‌ జట్లు తలపడ్డాయి. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీలో కేడీసీఏ జట్టు ఆధిపత్యం ప్రదర్శించి విజయకేతనం ఎగురవేసింది. వరంగల్‌లో రీజనల్‌ పోటీలు..ఉత్కంఠభరితంగా సాగిన జిల్లా స్థాయి పోటీలో విజేతలుగా నిలిచిన జట్లు రీజనల్‌ స్థాయికి అర్హత సాధించాయి. 7న సీనియర్స్, 8న జూనియర్స్, బాలికల జట్లు వరంగల్‌లో తలపడనున్నాయి. 



జిల్లాకు గుర్తింపు తేవాలి:  జిల్లా ప్రత్యేకాధికారి రాజర్షి షా 

అన్ని విభాగాల్లోనూ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి.. విజేతలుగా నిలిచి కరీంనగర్‌కు గుర్తింపు తీసుకురావాలని జిల్లా ప్రత్యేకాధికారి రాజర్షి షా ఆకాంక్షించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..అబ్బాయిలతో పాటు ఈసారి అమ్మాయిలూ వివిధ విభాగాల్లో పాల్గొనడం, నువ్వానేనా అన్నట్లు పోటీపడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఏటా ఇలాంటి స్పోర్ట్స్‌ లీగ్‌ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులకు నిరంతర సాధన, ఫిట్‌నెస్‌ తప్పనిసరన్నారు. అధికార యంత్రాంగం నుంచి క్రీడలకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ట్రినిటి విద్యాసంస్థల ఛైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ‘ఈనాడు’ ఇలాంటి స్పోర్ట్స్‌ లీగ్‌లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గెలుపును ఆస్వాదించాలని, ఓటమిని స్వీకరించి విజయం కోసం కృషి చేయాలని సూచించారు. క్రికెట్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి ఎన్‌.మురళీధర్‌రావు మాట్లాడుతూ విజేతలకు అభినందనలు తెలిపారు. వరంగల్‌లో జరగనున్న రీజనల్‌ స్థాయి పోటీల్లో గెలిచి జిల్లా సత్తా చాటాలన్నారు. సుధాకర్‌ పైప్స్‌ ఏరియా మేనేజర్‌ ఎస్‌కే.రఫి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అందించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.