close

తాజా వార్తలు

Published : 08/01/2020 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిర్భయకు అభయ!

ఈ ఉరి.. కోట్ల గళాల ఊపిరి

ఈ ఉరి..?
ఓ ఆడపిల్ల ఆవేదనకు ప్రతీకారం...!
ఓ కన్నతల్లి కన్నీటికి పరిష్కారం...!
ఈ ఉరి..?
అరవైకోట్ల ఆడపడుచులకు కొండంత ‘నిర్భయం’!
మద మృగాళ్లకు నిలువెల్లా భయం!
ఈ ఉరి..?
అమ్మాయిల ఆత్మస్థైర్యానికి ఆయుధం.. ఒళ్లు మరిచిన మగాళ్లను కుళ్లబొడిచే సాధనం!
ఈ ఉరి..?
మహిళల మాన, ప్రాణాలకు భద్రత వలయం... కళ్లు మూసుకుపోయిన కీచక వారసులకు మరణశాసనం....!
ఈ ఉరి..?
బాధిత అబలల సింహనాదం.. దానవ మూకల సంహారం!

‘వో లోగోంకో నహీ ఛోడో’... ఆ దుర్మార్గులను వదలొద్దు
ఏడేళ్ల క్రితం అర్ధరాత్రి నిస్సహాయ స్థితిలో, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ యువతి మాటలివి...
అవి ఆ పోలీసు అధికారిని వెంటాడాయి... ఆమె గుండెల్లో ఎంతోకాలం మార్మోగుతూనే ఉన్నాయి... ఓ వైపు జరిగిన దారుణం గుండెలు పిండేస్తుంటే... మరోవైపు అకృత్యానికి గురైన నిర్భయ ధైర్యం ఆశ్చర్యం గొలుపుతుంటే పట్టుదలగా ముందడుగు వేశారామె. నిందితులను పట్టుకుని కోర్టులో నిలబెట్టారు. ఆ అధికారి అప్పటి దిల్లీ డీసీపీ ఛాయాశర్మ. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లెన్నో... ఇప్పుడా మృగాళ్లు ఉరికంబం ఎక్కబోతున్నారు. ఆమె మాత్రం అత్యంత దారుణ స్ధితిలో కూడా నిర్భయలో కనిపించిన స్థైర్యమే తనకు స్ఫూర్తి, బలం అయిందని చెబుతారు.

ఏడేళ్ల క్రితం డిసెంబరు 16వ తేదీ, అర్ధరాత్రి రెండు గంటలకు ఛాయాశర్మకు ఓ ఫోన్‌ వచ్చింది. దిల్లీ నగరశివారుల్లో ఇద్దరు పడి ఉన్నారని. అక్కడకు చేరుకున్న ఆమెకు నిస్సహాయ స్థితిలో, తీవ్రగాయాలతో ఇద్దరు  వ్యక్తులు కనిపించారు. ఒంటిపై చిన్న వస్త్రం కూడా లేకుండా ఉన్నారు. వారిని తక్షణం ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు ఛాయాశర్మ. ఈ కేసు తన కెరీర్‌లో మర్చిపోలేని సంఘటన అని చెబుతారామె ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ... ఎన్నో కేసులను ఛేదించిన తనకు ఇది పెద్ద సవాలుగా మారిందన్నారు. ‘వాళ్లెవరో తెలీదు. వాళ్లవద్ద ఎటువంటి గుర్తింపు కార్డులూ లేవు. కళ్లు తెరిచి చెబితేనే వివరాలు తెలుస్తాయి. సామూహిక అత్యాచారానికి గురై, ఒళ్లంతా గాయాలతో ప్రాణాపాయస్థితిలో ఉండి కూడా ఆ అమ్మాయి ప్రదర్శించిన ధైర్యం మాటల్లో చెప్పలేనిది. ఆమె నిజంగా నిర్భయే. ఎందుకంటే అటువంటి సమయంలో ఎవరైనా ఏడుస్తారు లేదా సానుభూతి కోరుకుంటారు. అయితే నిర్భయ మాత్రం అంత బాధలోనూ ధైర్యాన్ని ప్రదర్శించింది. తనకు తెలిసిన వివరాలన్నింటినీ పూసగుచ్చినట్లు చెప్పింది. పోలీసులకు తనవంతు సాయం చేసింది. వైద్యపరీక్షలకు సహకారం అందించింది. ఈ కేసును ఛేదించడానికి ఆమె చేయూతే సగం కారణమైంది. చనిపోతానని తెలిసి కూడా  ధైర్యంగా మాట్లాడింది. చివరిగా ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసిన నేను, ఆమె నుంచి స్ఫూర్తి పొందా. ఆ దుర్మార్గులను వదలొద్దు అంటూ ఆమె కోరిన చివరి కోరికను నెరవేరుస్తానని నా మనసులో నేను ప్రమాణం చేసుకున్నా. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా... నిందితులను పట్టుకొని కటకటాల వెనక్కి పంపడమే కాదు.. వారికి శిక్షపడేవరకు పోరాడతాను అని మనసులో అనుకున్నా..’ అంటారామె. ఛాయాశర్మ వారంలోపే నిర్భయ కేసు నిందితులను జైలుకు పంపగలిగారు. మొత్తం ఆరుగురు నిందితులపై 18 రోజుల్లోపు ఛార్జిషీటును దాఖలు చేయించారు.

ఇలా చేశారు...
నిర్భయను చూసినప్పుడు ఇదో ఆధారాలు లేని బ్లైండ్‌ కేసుగా అనిపించింది అంటారు ఛాయాశర్మ. ఈ కేసును ఎలా ఛేదించాలో అర్థం కాలేదామెకు. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ప్రత్యేక టీంతో కేసు విచారణ చేసిన ఈమెకు ఆరుగురిలో ఒకడు మాత్రం దొరకలేదు. అతడికోసం చాలా శ్రమపడ్డారు. ఎట్టకేలకు మృగాళ్లందరినీ పట్టుకున్నారు. ‘ఇటువంటి అకృత్యాలు జరగడానికి కారణం కేవలం పేదరికం, నిరక్షరాస్యతతోపాటు సరైన కుటుంబంలో పెరగకపోవడమే’ అని విశ్లేషిస్తారు ఛాయాశర్మ. ఈ కేసులో ఒక మహిళ ఏమీ సాధించలేదు అనుకున్నారందరూ. ఈ సవాలు ప్రతి మహిళకూ ఎదురవుతుందని చెబుతారీమె. తరువాత క్రమేపీ నా విచారణపై నమ్మకం వచ్చింది అందరికీ. ఎవరైనా ఓ అమ్మాయి వచ్చి తనపై అత్యాచారం జరిగింది అని చెబుతుందంటే... ఆ విషయాన్ని నమ్మాలి. ఎందుకంటే ఏ అమ్మాయీ ఈ విషయంలో అబద్ధం చెప్పదు. పోలీసు స్టేషన్లలో ఈ పరిస్థితి మారాలి. అలాగే తల్లిదండ్రులెవరైనా వచ్చి తమ కూతురు కనబడటం లేదంటే, వెంటనే ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అలాకాకుండా ఫిర్యాదు చేయడానికి వచ్చినవారిని అవమానించకూడదని ఛాయాశర్మ చెబుతారు.


కూతురి ఆత్మకు శాంతి కలుగుతుందిప్పుడు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ప్రతి మహిళకీ చట్టంపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఇన్నాళ్లూ కాళ్లరిగేలా తిరిగా. ఇప్పటికి సమాధానం దొరికింది. నిందితులకు సరైన శిక్షపడింది. చాలా సంతోషంగా ఉన్నా. ఇప్పటికైనా నిర్భయకు న్యాయం జరిగింది. నా కూతురులాంటివాళ్లు బాధితులు చాలా మంది మన దేశంలో ఉన్నారు. వారందరికీ న్యాయం జరగాలంటే నిందితులకు సరైన శిక్ష పడాల్సిందే. అప్పుడే నిర్భయ ఆత్మ మరింత సంతోషిస్తుంది. భవిష్యత్తులో ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడాలంటేనే భయపడాలి. అలా మన చట్టంలో మార్పులు రావాలి. నిర్భయ కేసులో ఆలస్యం జరిగినా, న్యాయమైన తీర్పు వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్భయ కోసం ఎందరో పోరాడారు. ఈ కేసులో చేయూతనందించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. అంతేకాదు... నిర్భయలాంటివారు మరెందరో బాధితులున్నారు. వారందరికీ న్యాయం జరగడానికి కలిసి పోరాడదాం.

- నిందితులకు ఉరిశిక్ష ఖరారైన నేపథÅ]్యంలో ‘వసుంధర’తో నిర్భయ తల్లి ఆశాదేవి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.