close

తాజా వార్తలు

Updated : 08/01/2020 17:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆగిన గుండెలు.. ఆరని మంటలు

22వ రోజూ కొనసాగిన రాజధాని పోరు

మనోవేదనతో ఇద్దరు కర్షకుల మృతి

గురుదక్షిణగానే రాజధాని తరలింపు: యనమల

పిన్నెల్లిపై దాడి ప్రైవేటు వ్యక్తుల పనే: రైతులు

అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 22వ రోజూ కొనసాగింది. రైతుల ఆందోళనకు పలువురు మద్దతు తెలిపారు. రాజధాని తరలిపోతుందేమోనన్న బెంగతో తాజాగా ఇద్దరు కర్షకులు ప్రాణాలు విడిచారు. ఆందోళనలో భాగంగా మహిళతో సహా ఇద్దరు రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో ఆందోళనల నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. మరోవైపు వైకాపా ప్రభుత్వ తీరుపై రాజకీయ విమర్శలు కొనసాగాయి.

ఆగని మరణాలు..

మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతు అద్దేపల్లి కృపానందం ఈ తెల్లవారుజామున మృతి చెందారు. గత మూడ్రోజులుగా రాజధాని ఆందోళనల్లో పాల్గొన్న ఆయన గండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం కృపానందం తన అర ఎకరం భూమిని ల్యాండ్‌పూలింగ్‌ కింద ప్రభుత్వానికి అప్పగించారు. ఆయన అంత్యక్రియల్లో తెదేపా జాతీయ కార్యదర్శి లోకేశ్  పాల్గొని పాడె మోశారు. ఐనవోలులో పాలకాయల మాధవ అనే రైతు గుండెపోటుతో చనిపోయారు. రాజధాని కోసం తన అర ఎకరం భూమిని ప్రభుత్వానికి ఆయన ఇచ్చారు. ప్రస్తుతం రాజధాని అమరావతి తరలిపోతుందనే వార్తల నేపథ్యంలో అనారోగ్యానికి గురై ఆ ఆవేదనతోనే మాధవ చనిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

రాజధాని తరలింపు గురుదక్షిణ: యనమల

సీఎం జగన్‌కు రాజ్యాంగం కన్నా శారదా పీఠమే మిన్న అని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైకాపాకు ఏపీ పునర్విభజన చట్టం కంటే శారదా పీఠాధిపతి స్వరూపానంద శాసనమే ఎక్కువని ఆయన ఎద్దేవా చేశారు. ఈ రోజు స్వరూపానందతో, 13న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్‌ భేటీ వెనుక ఉద్దేశమేంటని నిలదీశారు. స్వరూపానంద స్వామికి గురుదక్షిణగానే రాజధాని విశాఖకు తరలింపు నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిపై వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతి, కేంద్రానికి పంపిన వినతులు అర్ధరహితమైనవని విమర్శించారు. రాష్ట్రానికి వీలైనంత నష్టం చేయడం, పొరుగు రాష్ట్రాలకు చేతనైనంత మేలు చేయడమే సీఎం జగన్‌ తన విధానంగా పెట్టుకున్నారని యనమల ఎద్దేవా చేశారు.

రైతులపై కేసులు అక్రమం: లోకేశ్‌

మీడియాపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు జిల్లా కారాగారంలో ఉన్న అమరావతి రైతులను తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్‌, జేఏసీ నేతలు పరామర్శించారు. గత ఐదేళ్లలో ఎప్పుడైనా రాజధాని రైతులు ఆందోళనలు చేశారా? ఈ పరిస్థితి ఇప్పుడే ఎందుకొచ్చిందని లోకేశ్‌ ప్రశ్నించారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదన్నారు. రాజధాని రైతులకు జేఏసీ తరఫున న్యాయ సాయం అందిస్తామని లోకేశ్‌ తెలిపారు. పిన్నెల్లిపై దాడి ఘటనను సాకుగా చూపించి రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. రైతులను పరామర్శించిన వారిలో ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, గల్లా  జయదేవ్‌, శ్రావణ్ కుమార్‌,  సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

జననేత అంటే అర్థం అదా?: జీవీ ఆంజనేయులు

రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రమయ్యాయని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. అమరావతి కోసం రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే ఆ ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ విధించటం ఎందుకని ప్రశ్నించారు. సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్‌ అమరావతి నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే రూ.60లక్షలు ఖర్చు అయితే.. మరి విశాఖపట్నం నుంచి ఎంత ఖర్చవుతుంది? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దొంగచాటుగా సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని నిలదీశారు.  జననేత అంటే జనాల్ని జైల్లో పెట్టడమా అని దుయ్యబట్టారు. పోలీసుల తీరుతో రాజధాని ప్రాంతం కశ్మీర్‌ లోయలా మారిందని వ్యాఖ్యానించారు.

అది ప్రైవేటు వ్యక్తుల పని: రైతులు

చినకాకాని వద్ద మంగళవారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి ముమ్మాటికీ ప్రైవేటు వ్యక్తుల పనేనని వెలగపూడి రైతులు ఆరోపించారు. వైకాపా నేతలే దాడి చేయించి రైతులపై ఆ నెపం మోపుతున్నారని మండిపడ్డారు. పోలీసులు వద్దని వారించినా పిన్నెల్లి నిరసన జరిగే ప్రదేశానికి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తులే దాడికి పాల్పడ్డారంటూ కొన్ని ఫొటోలు విడుదల చేశారు. ఇంకెంతమంది చనిపోతే ప్రభుత్వం స్పందిస్తుందని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళల ఆవేదనను పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై కేసులు పెట్టి వేధించేందుకే పిన్నెల్లిపై దాడి చేశారనే నాటకం ఆడుతున్నారని విమర్శించారు.

పోలీసుల అదుపులో 10మంది

ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేశారు. మంగళగిరి మండలం చినకాకాని వద్ద 10మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉదయం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. నిన్న జరిగిన ఘటనల వివరాలను సీఎంకు వివరించినట్లు తెలుస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.