close

తాజా వార్తలు

Published : 15/01/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1.  తెదేపా ఉపఎన్నికలకు వెళ్లాలి: అవంతి

అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే వైకాపా ప్రభుత్వ విధానమని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఈ అంశంలో సీఎం తీసుకున్న నిర్ణయాన్ని వైకాపా ఎమ్మెల్యేలంతా ఆమోదించారని ఆయన చెప్పారు. శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. విశాఖ రాజధానిపై 21 మంది తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఉప ఎన్నికల్లో తెదేపా గెలిస్తే చంద్రబాబు వాదన సరైందేనని ఒప్పుకుంటామన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. శబరిమలలో మకరజ్యోతి దర్శనం

కేరళలోని శబరిమలలో బుధవారం సంక్రాంతి పర్వదినాన మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మకరజ్యోతిని దర్శించుకున్న లక్షలాది భక్తులు తన్మయంతో పునీతులయ్యారు. తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబల మేడులో మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా లక్షలాది భక్తుల స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. త్వరలో జమ్ము కశ్మీర్‌కు కేంద్రమంత్రుల బృందం

జమ్ము కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షలను దశలవారిగా సవరిస్తూ వస్తున్న కేంద్రం తాజాగా బుధవారంనాడు పాక్షికంగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అక్కడి పరిస్థితులను తెలుసుకొనేందుకు త్వరలో కేంద్ర మంత్రుల బృందం జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రష్యా మంత్రివర్గం రాజీనామా

రష్యా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో రష్యా మంత్రిమండలి రాజీనామా చేసింది. ఈ మేరకు రష్యాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రష్యా ప్రధాని మెడ్వెడెవ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనలు దేశ అధికార సమతుల్యతలో పలు మార్పులను చేస్తాయని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వంలోని మంత్రిమండలి రాజీనామా చేసింది అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రెండో వన్డేకు పంత్‌ ఔట్‌!

ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్‌లో జరగనున్న రెండో వన్డే నుంచి వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు విశ్రాంతి ఇచ్చారు. తల అదరడం (కంకషన్‌)తో బాధపడుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఆయన టీమిండియాతో రాజ్‌కోట్‌ వెళ్లకుండా ముంబయిలో బీసీసీఐ పర్యవేక్షణలోనే ఉన్నాడు. వాంఖడేలో జరిగిన తొలివన్డేలో 44వ ఓవర్లో ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ వేసిన బంతి బ్యాటు తగిలి పంత్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. రెండో ఇన్నింగ్స్‌లో అతడు మైదానంలోకి రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కోడిపందేల్లో విషాదం!

 సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించిన కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది. కోడికత్తి తగిలి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పండగ సందర్భంగా గ్రామానికి సమీపంలోని పామాయిల్‌ తోటల్లో కోడిపందేలు నిర్వహించారు. కోళ్ల కాళ్లకు కత్తులు కడుతుండగా సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో ఓ కోడిపుంజు ఒక్కసారిగా కాళ్లు విదిలించడంతో పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు తొడభాగంలో కత్తి గుచ్చుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 24 యాసిడ్‌ సీసాలు కొన్న దీపిక

యాసిడ్‌ అమ్మే వ్యక్తి.. కొనుగోలు చేసే వ్యక్తి గుర్తింపుకార్డు చూడాలి, చిరునామా తీసుకోవాలి.. ఆపై ఫలానా వ్యక్తి యాసిడ్‌ కొన్నాడనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. కానీ ఇవేవీ జరగడం లేదంటున్నారు కథానాయిక దీపికా పదుకొణె. యాసిడ్‌ దాడుల్ని అరికట్టేందుకు ఆమె తాజాగా మరో సరికొత్త ప్రయోగం చేశారు. దుకాణ యజమానులు విచ్చలవిడిగా యాసిడ్‌ అమ్ముతున్నారని, దీనికి ఓ పద్ధతి-ప్రక్రియ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో యాసిడ్‌ కొనడం చాలా సులభమని, తన బృందం ద్వారా 24 యాసిడ్‌ సీసాలను కొన్నట్లు తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రెండుమూడేళ్లలో సిరిసిల్లకు రైలుమార్గం: కేటీఆర్‌

దేశంలో అత్యున్నత మున్సిపాలిటీగా సిరిసిల్లను తీర్చిదిద్దే బాధ్యత తనదేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణానికి సంబంధించి మున్సిపల్‌  ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. సిరిసిల్లలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. చెప్పినవే కాకుండా చెప్పని పనులు కూడా చేశామని చెప్పారు. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం తెరాసకే ఉందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘తెలంగాణకు కేసీఆర్‌ తీరని ద్రోహం చేస్తున్నారు’

నదుల అనుసంధానం పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు కొట్టేసేందుకు తెలంగాణకు సీఎం కేసీఆర్‌ తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ భేటీలో చర్చకు వచ్చిన అంశాల విషయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్న తెలంగాణకు తక్కువ నీటి కేటాయింపులు ఏమిటని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగం మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రైవేటు సంస్థలకు పార్లమెంట్‌ క్యాంటీన్‌ బాధ్యతలు? 

దేశ రాజధాని దిల్లీలోని పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఇకపై పూర్తి స్థాయిలో శాకాహారం మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ ఇప్పటివరకు పార్లమెంట్‌ క్యాంటీన్‌ క్యాటరింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తోంది. గత కొద్ది నెలలుగా ఆహార పదార్థాల్లో నాణ్యతాలోపాల దృష్ట్యా ఐఆర్‌సీటీసీని తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీని స్థానంలో ప్రముఖ ప్రైవేటు బ్రాండ్స్‌ అయిన హల్దీరామ్స్‌, బికనేర్‌వాలాకు క్యాటరింగ్‌ బాధ్యతలు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.