
తాజా వార్తలు
కార్డుల నియంత్రణ వినియోగదారుల చేతుల్లోనే...
బ్యాంకు కార్డులపై ఆర్బీఐ కీలక నిర్ణయం
దిల్లీ: బ్యాంకు కార్డుల ద్వారా జరిగే చెల్లింపులు, లావాదేవీలు మరింత సురక్షితంగా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. తమ క్రెడిట్, డెబిట్ కార్డులు పనిచేయాల్సిందీ లేనిదీ ఖాతాదారే నిర్ణయించుకునే సౌలభ్యం వారికి కలుగచేయాలని దేశంలోని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అన్ని సాధారణ, ఆన్లైన్, జాతీయ, అంతర్జాతీయ కార్డులకూ వర్తిస్తుంది. దేశంలో కార్డుల ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య ఏటా అనేక రెట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కార్డు ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య పరిమితిని కూడా ఇకపై వినియోగదారు నిర్ణయించవచ్చు. మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఐవీఆర్ విధానాల ద్వారా ఈ మార్పు చేసుకునే అవకాశంఉంది. అంతేకాకుండా బ్యాంకు శాఖలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. కార్డు వివరాలలో, స్థితిలో ఏవైనా మార్పులు సంభవించినప్పుడు ఆ సమాచారాన్ని బ్యాంకులు సంబంధిత వినియోగదారులకు తప్పనిసరిగా తెలపాలని కూడా రిజర్వ్ బ్యాంకు నిర్దేశించింది.
ఇక మీద జారీ కానున్న బ్యాంకు కార్డులు భారతదేశ పరిధిలో, అదికూడా ప్రత్యక్షంగా వాడినప్పుడు (అంటే ఏటీఎంలు, దుకాణాలు వంటి చోట్ల) మాత్రమే పనిచేస్తాయి. తమ కార్డు ప్రత్యక్షంగా మాత్రమే పనిచేయాలా లేదా పరోక్ష చెల్లింపులకు కూడా వినియోగించవచ్చా అనే అంశాన్ని వారి భద్రతావసరాలను బట్టి వినియోగదారే స్వయంగా నిర్ణయించుకోవలసి ఉంటుంది. అందుకు తగినట్లుగా మార్పులను చేయవలసి ఉంటుంది. అంటే కొత్త బ్యాంకు కార్డులు వినియోగదారు ఆఫ్షన్ ఎంచుకుంటే తప్ప ఆన్లైన్ చెల్లింపులు వంటి ఏ ఇతర పరోక్ష వినియోగ విధానాలలో పనిచేయవన్నమాట. అయితే పై నిబంధనలు ప్రీ పెయిడ్ గిఫ్ట్ కార్డులు, ప్రజా రవాణా కార్డులకు వర్తించవు.