close

తాజా వార్తలు

Updated : 16/01/2020 15:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పుడు నాలో స్వార్థం పుట్టింది: మహేశ్‌

వెంకీ పెద్ద హీరో అవుతాడని నాన్న అప్పుడే చెప్పాడు

నా 20 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి రియాక్షన్‌ రాలేదు

హైదరాబాద్‌: పెద్దోడు వెంకటేశ్‌.. చిన్నోడు మహేశ్‌బాబు.. మరోసారి కలిశారు. ఈసారి సినిమా కోసం కాదులేండీ.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రచారం కోసం. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం అందుకుంది. బాక్సాఫీసు వద్ద కూడా లాభాల బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేశ్‌, సూపర్‌స్టార్‌ మహేశ్‌లను, అనిల్‌ ఇంటర్వ్యూ చేశారు. ఎంతో సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ ముచ్చట్లు చూద్దాం.. 

వెంకీ: ‘సరిలేరు నీకెవ్వరు’.. అబ్బబ్బబ్బా ఏం మాస్‌, ఏం మహేశ్‌. ఆ ఎనర్జీ ఏంటి అనిల్‌. నేను సినిమా చూశా.. అద్భుతంగా ఉంది. అన్నీ ఎమోషన్స్‌ ఉన్నాయి. సంక్రాంతికి ఫుల్‌ మీల్స్‌ పెట్టారు. దానికి తోడు మహేశ్‌ రెచ్చిపోయాడు. మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకూ ఒకేలా ఉన్నాడు. ఏంటి మహేశ్‌ విశేషం.

మహేశ్‌: దీనికి కారణం మీరే సర్‌ (వెంకటేష్‌: నేనా..!). మీ టైమింగ్‌ అంటే నాకు విపరీతమైన ఇష్టం. ‘ప్రేమంటే ఇదేరా..’, ‘నువ్వునాకు నచ్చావ్‌’లో మీ కామెడీ మరో స్థాయిలో ఉంటుంది. మీరు ‘ఎఫ్‌ 2’ చేసే సమయంలో అనిల్‌ నాకు 40 నిమిషాల నరేషన్‌ ఇచ్చాడు. విపరీతంగా నచ్చింది. ‘మరో ప్రాజెక్టు ఉంది. ఏడాది తర్వాత చేద్దాం’ అని చెప్పాను. ఆయన కూడా ‘ఎఫ్‌ 2’ తర్వాత మరో చిత్రం చేస్తానన్నారు. కానీ ‘ఎఫ్‌ 2’ చూసిన తర్వాత మరో వెంకీ కనిపించాడు. మీ నటన చూసి.. నేనే సర్‌ప్రైజ్‌ అయ్యా. నాలో స్వార్థం పుట్టింది. ఈ టైమ్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. అనిల్‌కు వెంటనే కాల్‌ చేశా. స్క్రిప్టు పనులు మొదలెట్టి.. రెండు నెలల్లో పూర్తి చేశాడు (నవ్వుతూ).

వెంకీ: ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్ని ఎంజాయ్‌ చేశా. రష్మిక వచ్చి మహేశ్‌పై పడుతున్నప్పుడు ‘ఇదిగో అమ్మాయ్‌.. అమ్మాయ్‌..’ అని చేసిన సీన్‌ సూపర్‌. రైలులోని సన్నివేశాలు కూడా ఫన్నీగా ఉన్నాయి. కర్నూలు ఫైట్లు అదిరిపోయాయి.

అనిల్‌: అవును సర్‌.. మహేశ్‌ ఆ సీన్‌ చాలా సహజంగా చేశారు. ఈ సినిమాకు అన్నీ అలా కుదిరాయి. మీకు అర్థమౌతోందా, అబ్బబ్బబ్బా.. వంటి పదాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. కర్నూలులో చేసిన యాక్షన్‌ సీన్లు అభిమానుల్ని ఆకట్టుకున్నాయి.

మహేశ్‌: రామలక్ష్మణ మాస్టర్లు కథ విని మరీ, ఫైట్లు డిజైన్ చేశారు.

అనిల్‌: మీరు సినిమా చూశారు కదా. మీకిష్టమైన సీన్‌ ఏది?

వెంకీ: మహేశ్‌ ఓ బాధ్యత తీసుకుని కర్నూలు రావడం.. ఓ మగాడు కాపాడటానికి వచ్చాడు అన్న క్యారెక్టరైజేషన్‌ బాగా నచ్చింది.

అనిల్‌: ‘మైండ్‌బ్లాక్‌..’ పాట చూసిన తర్వాత మీ స్పందన ఏంటి సర్‌?

వెంకీ: అనిల్‌ నువ్వు లుంగీతో డ్యాన్స్‌ వేయించావు. మహిళలంతా అవుట్‌. మహేశ్ కాళ్లు కనిపిస్తే.. ఫ్యాన్స్‌లో ఉత్సాహం రాదా. మహిళలు మహేశ్‌ను అలా చూడాలి అనుకున్నారు. అన్నీ బాగా కుదిరాయ్‌ (నవ్వుతూ).

మహేశ్‌: నాకు మాత్రం కొత్త అనుభవం. ‘మైండ్‌బ్లాక్‌..’ పూర్తి మాస్‌ సాంగ్. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు, అంతేకాదు హావభావాలు కూడా నేర్పించారు. సెట్‌లో అందరూ పాట అదిరిపోయింది.. అన్నారు. కానీ ప్రేక్షకుల స్పందన చూసి సర్‌ప్రైజ్‌ అయ్యా. నా 20 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ నా డ్యాన్స్‌కు ఇలాంటి రియాక్షన్‌ రాలేదు. ఓ మాస్‌ సాంగ్‌ ఇలా ఉంటుందా..? అనుకున్నా.

వెంకీ: విజయశాంతిని కూడా అభినందించాలి. చాలా ఏళ్ల తర్వాత సినిమాలో నటించారు.

మహేశ్‌: ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాం. విజయశాంతి గారికి మేం ధన్యవాదాలు చెప్పాలి. ఆమె తప్పా.. మరొకరు ఈ పాత్ర చేయలేరు.

వెంకీ: రైలు సన్నివేశంలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. మీరు ఆ సీక్వెన్స్‌ బాగా ఎంజాయ్‌ చేసుంటారు కదా?

మహేశ్‌: ఎంజాయ్‌ చేశాను.. కానీ మొదటి మూడు రోజులు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే.. ఆర్మీ నేపథ్యం తర్వాత చేసిన షూట్‌ ఇది. కొత్త టైమింగ్‌గా అనిపించింది. మూడు షార్ట్స్‌ తర్వాత నాతోపాటు అందరూ సెట్‌ అయిపోయారు.

అనిల్‌: షూటింగ్‌ జరుగుతున్నప్పుడు మీ గురించి (వెంకీతో అంటూ) చర్చించుకునేవాళ్లం. షూటింగ్‌లో జరిగిన ఫన్నీ మూమెంట్స్‌ చెబుతూ ఉండేవాడిని.. సరే ఇప్పుడు నేను మిమ్మల్ని, మహేశ్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నాకు సరదాగా అడగాలి అనిపిస్తోంది. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’లో కలిసి నటించారు. మీకు ఆ సమయంలోని అందమైన అనుభూతి ఏంటి?

మహేశ్‌: వెంకీ చెప్పేలోపు నేను చెబుతా.. ఇద్దరం తొలిసారి కలిశాం, నటిస్తున్నాం అనుకున్నాం. హోటల్‌లో కూర్చుని చర్చించుకున్నాం. ‘సరే.. రేపు కలుద్దాం..’ అంటూ వెంకీ ఓ హగ్‌ ఇచ్చారు. ఆ ఫీలింగ్‌ నాకు చాలా నచ్చింది. దాన్ని మాటల్లో చెప్పలేను.

అనిల్‌: వెంకీ సర్‌.. నేను మీ ఇద్దరితో కలిసి పనిచేశా. మీకు 30 ఏళ్ల అనుభవం ఉంది, ఎంతో స్టార్‌డమ్‌ వచ్చింది. ఇప్పటికీ ఓ సాధారణ నటుడిలా ప్రవర్తిస్తుంటారు. అదే ఫీలింగ్‌ నాకు మహేశ్‌తో పనిచేస్తున్నప్పుడు కలిగింది. ఇన్నేళ్లు అవుతున్నా మీ ఇద్దరికీ అలా ఉండటం ఎలా సాధ్యమైంది.

మహేశ్‌: అది కుటుంబం నుంచి వస్తుంది.

వెంకీ: అవును. కృష్ణగారు చాలా సింపుల్‌గా ఉంటారు. సాయంత్రం షూటింగ్‌ పూర్తయిన తర్వాత అందరితో కూర్చుని మాట్లాడుతుంటారు. మార్పు అనేది కుటుంబం నుంచి వస్తుంది.

అనిల్‌: వెంకీ మీ కామెడీ టైమింగ్‌ వేరు. ముఖకవళికల్లో చూపిస్తారు. మహేశ్‌ డైలాగ్‌ను మెలికతిప్పుతారు. ఓ సీన్‌కు ఇలానే చేయాలని ఎలా ఫిక్స్‌ అవుతారు?

మహేశ్‌: నేను చుట్టపక్కల వారిని చాలా గమనిస్తుంటా. తెలియకుండా అందర్నీ చాలా ఇమిటేట్‌ చేస్తుంటా. డైలాగ్‌ మాడ్యులేషన్‌ నా బలం.

వెంకీ: అవును.. ‘ఇదిగో అమ్మాయ్‌ అమ్మాయ్..’ అన్న డైలాగ్‌ కూడా అంతే. దాన్ని చూసినప్పుడు.. ‘అమ్మా.. మనకు ఇది రాదు’ అనుకున్నా. మరి నేను అలా ఎలా చేస్తానో నాకు తెలియదు. ఫ్లోలో వచ్చేస్తుంటాయి.

అనిల్‌: మహేశ్‌.. మీకు నచ్చిన వెంకీ డైలాగ్‌ చెప్పండి?

మహేశ్‌: ఎనీ టైమ్‌.. సింగిల్‌ హ్యాండ్‌ గణేష్‌ (వెంకీ క్లాప్స్‌ కొడుతూ నవ్వులు)

వెంకీ: ‘నా దగ్గర బేరాలుండవ్‌..’ (మహేశ్‌, అనిల్‌ నవ్వులు)

అనిల్‌: వెంకీ మొదటి సినిమా ‘కలియుగ పాండవులు’, దీనికి దర్శకుడు రాఘవేంద్రరావు. మహేశ్‌ తొలి సినిమా ‘రాజకుమారుడు’, దీనికి దర్శకుడు రాఘవేంద్రరావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ప్రయాణం ఎలా ఉంది?

మహేశ్‌: ‘కలియుగ పాండవులు’ ప్రివ్యూను నేను నాన్నగారితో కలిసి చూశా. అప్పుడు చిన్న కుర్రాడిని. సినిమా పూర్తయిన తర్వాత బయటికి రాగానే.. అక్కడ రామానాయుడు గారు ఉన్నారు. ‘సినిమా చాలా బాగుంది. మీ అబ్బాయి పెద్ద హీరో అవుతాడు’ అని నాన్న షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు.

వెంకీ: అవును కృష్ణగారు చాలా నిజాయితీగా ఉంటారు. ఆ సమయంలో ఓసారి నేను విమానంలో కృష్ణ గారిని కలిశా. ‘సినిమా చూశానయ్యా.. భలే చేశావు’ అని ప్రోత్సహించారు.

వెంకీ, మహేశ్‌, అనిల్‌ చెప్పిన మరిన్ని ముచ్చట్ల కోసం ఈ వీడియో చూడండి.Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.