close

తాజా వార్తలు

Published : 17/01/2020 00:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అవసరాలకే.. అత్యాశకు కాదు!

మన పర్యావరణం - మన బాధ్యత
4 మార్కుల ప్రశ్నలు

ప్రయోగాలు - క్షేత్ర పరిశీలనలు

1. మీ పరిసరాల్లో కనీసం నాలుగు ఆహారపు గొలుసులను గుర్తించి వాటిలోని ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులను సూచించండి.
ప్రశ్నించడం - పరికల్పన చేయడం
2. ఆహారపు వల నుంచి మాంసాహారులను తొలగిస్తే ఏం జరుగుతుంది?
జ: ఆవాసంలో ప్రతి జీవికి నిర్దిష్టమైన ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ ఒక్క జీవిని తొలగించినా దాని ప్రభావం ఇతర జీవులు, పర్యావరణంపై పడుతుంది.
ఉదా: ఆహారపు వల నుంచి మాంస భక్షకాలను తొలగిస్తే శాకాహారుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వాటి జనాభా అదుపు తప్పుతుంది.

* ఒక అడవిలో సింహం, పులులను తొలగిస్తే అవి ఆహారంగా తీసుకునే జింకలు, జిరాఫీలు లాంటి శాకాహారుల సంఖ్య పెరుగుతుంది. ఈ స్థితి ఇలాగే కొనసాగితే శాకాహారుల సంఖ్య బాగా పెరిగి వాటి మధ్య ఆహారం, ఆవాసం కోసం పోటీ పెరిగి, అందులో కొన్నింటికి ఆహారం లభించక మరణించవచ్చు. దీనివల్ల ప్రకృతిలో జీవుల మధ్య సమతౌల్యత సాధ్యమవుతుంది. 

నిజ జీవిత వినియోగం - జీవవైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండటం
3. క్రిమిసంహారకాల వాడకాన్ని ఆపివేసి నేల కాలుష్యాన్ని నివారించేలా ఏవైనా మూడు కార్యక్రమాలను సూచించండి.
జ: క్రిమిసంహారకాల వాడకాన్ని ఆపేయడానికి కింది కార్యక్రమాలు తోడ్పడతాయి.
* వనియంత్రణ పద్ధతులు: కీటకాలను అదుపులో ఉంచడానికి వాటిని తినే పరభక్షకాలను ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు పరాన్నజీవులను ప్రవేశపెట్టి వ్యాధి కారక కీటకాలను నియంత్రించవచ్చు.
జీవరసాయనాలను వాడటం: హానికర రసాయనిక మందుల స్థానంలో మొక్కల నుంచి లభించే నింబిన్‌ (వేప) లాంటి పదార్థాలను పిచికారీ చేసి కీటకాలను అదుపులో ఉంచవచ్చు.
ఉదా: పంచగవ్య, పొగాకు, వెల్లుల్లి
లింగాకర్షక బుట్టలు: మగ కీటకాలను ఆకర్షించడానికి పంట పొలాల్లో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి కీటకాలను బంధించవచ్చు. వీటిలో ఫిరమోన్‌ రసాయనాలు వాడి మగ కీటకాలను బంధిస్తారు.


విషయావగాహన

2 మార్కుల ప్రశ్నలు

1. నిచ్‌ అంటే ఏమిటి? ఇది ఆవాసం కంటే ఏ విధంగా భిన్నమైంది?
జ: ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఆ జంతువు ఆహార జాలకపు ఆవాసం లేదా నిచ్‌ అంటారు.
ఉదా: ఆకుల నుంచి రసాలను పీల్చే ఎఫిడ్లు అనే కీటకాలకు ఒక స్థానం ఉంటే, ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసే లేదా కొరికే దవడలున్న గొంగళిపురుగులకు మరొక స్థానం ఉంటుంది.

2. ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు వెళ్లేకొద్దీ జీవుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది?
జ: ఆహారపు గొలుసులో స్థాయి పెరిగే కొద్దీ శక్తిప్రసరణ తగ్గుతుంది. తగినంత శక్తి కోసం వినియోగదారులు అధికసంఖ్యలో వాటి కింది జీవులను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆహార కొరత ఏర్పడి అగ్రశ్రేణి మాంసాహారుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు వెళ్లేకొద్దీ జీవుల సంఖ్య తక్కువగా ఉంటుంది.
3. జైవిక వ్యవస్థాపనం - జైవిక వృద్ధీకరణాలను నిర్వచించండి.
జ: ఆహారపు గొలుసులోకి కాలుష్యాలు చేరడాన్ని జైవిక వ్యవస్థాపనం అంటారు. ఆహారపు గొలుసులోని కాలుష్యాలు ఒక పోషక స్థాయి నుంచి దానిపైన ఉన్న పోషక స్థాయికి చేరి సాంద్రీకృతమవడాన్ని జైవిక వృద్ధీకరణ అంటారు.
4. పోషక స్థాయి అంటే ఏమిటి? ఇది జీవావరణ పిరమిడ్‌లో దేన్ని తెలియజేస్తుంది.
జ: ఆహారపు గొలుసు వివిధ జీవుల ఆహార సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆహారపు గొలుసులోని ఒక్కో అంతస్తును పోషక స్థాయి అంటారు. ఆహారపు గొలుసులో శక్తి ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి అందించబడుతుంది.
పోషక స్థాయి ఆహారపు గొలుసులోని జీవుల సంబంధాలను, వాటి స్థానాన్ని తెలియజేస్తుంది. ఇది జీవి ఆహార విధానాన్ని, శక్తి ప్రసరణ మార్గాన్ని, గొలుసు విస్తృతిని తెలుపుతుంది.

1 మార్కు ప్రశ్నలు
1. జీవ ద్రవ్యరాశి అంటే ఏమిటి?
జ: శక్తిగా మర్చడానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవ ద్రవ్యరాశి అంటారు.
2. మురికిగా, పోషక పదార్థాలు కలిగిన నీటికి ఉన్న జైవిక ఆక్సిజన్‌ డిమాండ్‌ ఎక్కువా? తక్కువా? తద్వారా కలిగే ప్రభావం ఏమిటి?
జ: ఎక్కువ. దీనివల్ల జీవులకు ఆక్సిజన్‌ కొరత ఏర్పడి, అవి మరణించే ప్రమాదం ఉంది.


సహజ వనరులు
4 మార్కుల ప్రశ్నలు
సమాచార సేకరణ నైపుణ్యాలు - ప్రాజెక్టు పనులు

1. icrisat అంటే ఏమిటి? అది నిర్వహించే కార్యక్రమాలపై మీ ఉపాధ్యాయుడితో చర్చించి నివేదిక రాయండి.
జ: ఇంటర్నేషనల్‌ క్రాప్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సెమి ఎరిడ్‌ ట్రాపిక్స్‌ను సంక్షిప్తంగా ఇక్రిశాట్‌ అంటారు. ఇది హైదరాబాద్‌ సమీపాన పటాన్‌చెరు ప్రాంతంలో ఉంది. దీనిలో ఉష్ణ మండల ప్రాంతపు పంటలపై పరిశోధనలు చేస్తారు. దీనితోపాటు వరి, చెరకు, పత్తి వంగడాలను అభివృద్ధి పరచడం; ఆధునిక సేద్య పద్ధతులను రూపొందించడం, విద్యావంతులు - గ్రామస్తులను మమేకం చేసి నీటి నిల్వ - నేల సంరక్షణకు సాంకేతిక పద్ధతులను పరిచయం చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

విషయావగాహన

2. సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి? ఇది వనరుల యాజమాన్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జ: అభివృద్ధి, సంరక్షణ రెండింటికీ ప్రాధాన్యం ఇస్తూ భావితరాలకు అవసరమయ్యే సహజవనరులను అందుబాటులో ఉండే విధంగా పర్యావరణాన్ని ఉపయోగించుకున్నట్లయితే దాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. మనిషి ఎంత ఎదిగినా ప్రకృతిలో ఒక భాగం మాత్రమే. చెట్లను నరికి ఏసీలు వాడటం అభివృద్ధి అనిపించుకోదు. అభివృద్ధిలో పర్యావరణాన్ని పరిరక్షించాలి. అడవుల నరికివేత, ఇంధనాల వినియోగం పర్యావరణ అభివృద్ధికి హాని చేస్తాయి. ప్రకృతి ప్రసాదించిన వనరులను విచక్షణాయుతంగా, పొదుపుగా, పునఃచక్రీయంగా, సమతాస్థితిని కాపాడేవిధంగా వాడుకోవాలి. ప్రకృతి మానవుడి అవసరాలను తీర్చడానికే గానీ అత్యాశకు కాదని గుర్తుంచుకోవాలి.
3. పర్యావరణ పరిరక్షణకు అవసరమయ్యే 4ళి సూత్రాన్ని వివరించండి.
జ: పర్యావరణ పరిరక్షణకు నాలుగు నియమాలు పాటించాలి.
తగ్గించడం Reduce వనరులను సాధ్యమైనంత తక్కువగా వినియోగించడం.
ఉదా: పాడయిన నల్లాలు, పంపులను సరిచేయడం.  స్నానానికి షవర్ల వాడకం తగ్గించడం. అవసరం లేని సమయంలో ఫ్యాన్‌లు, విద్యుత్‌ దీపాలను ఆపివేయడం.
తిరిగివాడటం Reuse కొన్నింటిని పారేయకుండా తిరిగి ఉపయోగించుకోవడం.
ఉదా: కాగితాన్ని తిరిగి ఉపయోగించడం వల్ల మొక్కలను కాపాడుతూ కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

పునఃచక్రీయం Recycle ఒక్కో దాన్ని ఒక్కో రకంగా పునఃచక్రీయం చేయాల్సి ఉంటుంది. పాత ఇనుమును కరిగించి తిరిగి కొత్త ఇనుము వస్తువులను తయారుచేస్తారు. అదేవిధంగా ప్లాస్టిక్‌ను వేరుచేసి కరిగించి పునఃచక్రీయం చేస్తారు. ఇది ప్రమాదకర సంక్లిష్టత గల చర్య.
తిరిగి ఏర్పాటుచేయడం Restore మనం వాడుకున్న వనరులను తిరిగి నెలకొల్పడాన్ని తిరిగి ఏర్పాటుచేయడం అంటారు.
ఉదా: రోడ్ల నిర్మాణం; భవనాలు, కర్మాగారాల నిర్మాణానికి అడవులను నరికినప్పుడు ప్రత్యామ్నాయంగా మరొక చోట చెట్లను పెంచడం.

1 మార్కు ప్రశ్నలు
1. ఇంకుడు చెరువు అంటే ఏమిటి?
జ: నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో అడ్డుకట్ట కట్టి ఏర్పాటు చేసే నీటి నిల్వలను ఇంకుడు చెరువులు percolation tanks అంటారు.
2. జీవ ఇంధనాలు అంటే ఏమిటి?
జ: శక్తిని ఇచ్చే జీవద్రవ్యరాశిని జీవ ఇంధనాలు అంటారు.
   ఉదా: బయోడీజిల్‌

3. ఖిగీదివి అంటే ఏమిటి?
జ: ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌. 1980లో ఇది ప్రపంచ సంరక్షణ విధానాన్ని ప్రతిపాదించింది.
2 మార్కుల ప్రశ్నలు
విషయావగాహన

1. ఇంట్లో చెత్తను పారేసే ముందు వ్యర్థాలను ఎందుకు వేరు చేయాలి?
జ: ఇంట్లో చెత్తను పారేసే ముందు వాటిని తడి - పొడి చెత్తలుగా వేరు చేయాలి. తడి చెత్త భూమిలో కుళ్లిపోతుంది. కాబట్టి వీటిని ఎరువులుగా వాడవచ్చు. పొడి చెత్తను విభజించి వాటిని పునఃచక్రీయం చేయవచ్చు. చెత్తను పారేసే ముందు వేరు చేయకపోతే వాటి వినియోగం సాధ్యం కాదు.
2. భూగర్భ జలాలను ఎందుకు పెంచుకోవాల్సిన అవసరం ఏమిటి?
జ: వ్యవసాయ నీటివనరులో భూగర్భ జలాల వాటా 43% ఉంది. ఈ భూగర్భ జలాన్ని సంరక్షించక పోతే వ్యవసాయ రంగంలో నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాగునీటి కోసం భూగర్భ జలాలపై ఆధారపడుతున్నాం కాబట్టి వాటిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రశ్నించడం - పరికల్పన చేయడం
3. సహజవనరుల అధిక వినియోగం వల్ల దుష్పరిణామాలు ఉన్నాయా?
జ: బొగ్గు, పెట్రోల్‌, సహజ వాయువులను సహజవనరులు అంటారు. వీటిని అధికంగా వినియోగించడం వల్ల త్వరగా అంతరించిపోతాయి. ఫలితంగా వీటి ఆధారంగా పనిచేసే పరిశ్రమలు, వాహనాలు, రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. వస్తు ఉత్పత్తి తగ్గి ప్రజల జీవన విధానం దెబ్బతింటుంది.
సమాచార సేకరణ నైపుణ్యాలు - ప్రాజెక్టు పనులు
4. పెట్రోలియం ఉత్పత్తులను పొదుపుగా వాడుకోవడానికి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?
జ: చిన్న చిన్న అవసరాలకు పెట్రోల్‌ వాహనాలు వాడకూడదు.
* పబ్లిక్‌ ప్రయాణ వాహనాలకు, అధిక మైలేజ్‌ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.