close

తాజా వార్తలు

Published : 20/01/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చీకటితో తలపడి వెలుగై నిలబడి

‘ఆ...ఆడపిల్లకు ఇవన్నీ ఎందుకు?’ అనే మాటల్ని ధైర్యంగా ఎదుర్కొంది.‘మన బతుకెంత... మనమెంత?’ అనే ఎత్తిపొడుపులకు ఓపికతో సమాధానమిచ్చింది. ‘కళ్లులేనప్పుడు.. మూలన పడి ఉండొచ్చు కదా!’ అనే హేళన చూపులకు తన విజయాలతో ఛాలెంజ్‌ విసిరింది. పేదరికంతో తలపడింది. అంధత్వంతో పోరాడింది. సమాజంతో జూడో చేసి గెలిచింది... అల్లు రమ.


‘‘ఇంట్లో ఆర్థిక సమస్యలు, అమ్మానాన్నలు నిరక్షరాస్యులు కావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దీన్ని అధిగమించడానికి ముందు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకున్నా. సాధించా. తల్లిదండ్రులు వెన్నుతట్టడంతోనే క్రీడల్లో రాణించా. నాకు నందినీ, రేష్మ కుమార్తెలు. భర్త ప్రోత్సాహంతో, జూడో శిక్షకులు మణికుమార్‌ మార్గదర్శకంలో పారా ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నా. పతకం సాధించితీరతా.

- అల్లు రమ

 

మనకున్న లోపాలను మరిచిపోవాలంటే... మనం ఏదో ఒక పనిలో మునిగిపోవాలి. అలా జూడోలో మునిగిపోయి, అందులో ఆరితేరి... ఇప్పుడు పారా ఒలింపిక్స్‌కు ఎంపికైంది రమ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పెద్దకొంగరాం గ్రామానికి చెందిన రమకు పుట్టుకతోనే అంధత్వం శాపంగా మారింది. దాన్ని అధిగమించడానికి ఆమె బాల్యం నుంచే పోరాటం మొదలెట్టింది. అమ్మానాన్నలు రమకు మిగతా పిల్లల్లాగే సమాన అవకాశాలు అందించారు. తెల్లవారుజామున 4గంటలకు లేపి చదివించేవారు. 5 గంటల నుంచి వ్యాయామ శిక్షణ ఇప్పించేవారు. వేసవి సెలవుల్లో పల్లెకు దూరంగా ఉన్న పశువుల కొట్టానికి సైకిల్‌పై తీసుకెళ్లి వెయిట్‌లిఫ్టింగ్‌లో సాధన చేయించేవారు. ఇలా అథ్లెటిక్స్‌, పవర్‌లిఫ్టింగ్‌, జూడోలో ప్రతిభ చూపారు. జాతీయ స్థాయి జూడో పోటీల్లో కాంస్య పతకం సాధించారు. పారా ఒలింపిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. 


చదువులోనూ రాణించి..!

విశాఖపట్నం అంధుల బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో పదోతరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ఉండగానే బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో ఆఫీసు సబార్డినేట్‌గా నియామకమైంది. తర్వాత పదోన్నతి పొంది జూనియర్‌ అసిస్టెంట్‌ అయ్యింది. గణపతిని ఆదర్శ వివాహం చేసుకొని...కుటుంబానికి అండగా నిలుస్తోంది.

- రుప్ప రమణమూర్తి, న్యూస్‌టుడే, శ్రీకాకుళం

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన