close
Array ( ) 1

తాజా వార్తలు

డిజిటల్‌ ఉపవాసానికి సిద్ధమా?

సెక్యూరిటీ

కుటుంబంలో మీ సందడి ఎక్కడ.. ఇంట్లోనా.. ఫోన్‌లోనా..
మీ సంతోషాల జోష్‌ ఎక్కడ..చుట్టూ ఉన్నవారితోనా.. సోషల్‌ మీడియాలోనా..
మీ హాయ్‌లు.. హైఫైలు ఎక్కడ.. ముఖాముఖీగానా? ఎమోజీలతోనా..
ఆలోచించాల్సిన టైమ్‌ ఇదే..
రోజూ కాస్త సమయమైనా ఫోన్‌ని పక్కన పెట్టండి.
‘డిజిటల్‌ డిటాక్స్‌’కి ఇదే సరైన సమయం..
ఆలస్యం చేయొద్దు. ఇవిగోండి చిట్కాలు.. ఫాలో అయితే మీరు ‘డిజిటల్‌ వెల్‌ బీయింగ్‌’ అయినట్టే!!

క్షణం తీరిక దొరికినా చేతిలోకొచ్చేది స్మార్ట్‌ఫోన్‌. వాట్సాప్‌.. ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టా.. ఇలా చెబుతూ వెళ్తే వాలిపోయే డిజిటల్‌ వేదికలు ఎన్నో. ఎప్పుడూ అప్‌డేట్స్‌తో అల్లరి చేస్తూనే ఉంటారు. ఓ పది నిమిషాలైనా ఫోన్‌ లేకుండా గడపడాన్ని ఊహించలేకపోతున్నారు. బానిసలైపోతున్నారు. అది గమనించిన మొబైల్‌ తయారీ సంస్థలు కూడా ‘డిజిటల్‌ వెల్‌ బీయింగ్‌’ పేరుతో వాడకాన్ని తగ్గించమనే చెబుతున్నాయి. అందుకు తగిన సర్వీసుల్నీ ప్రవేశపెడుతున్నాయి. మరోవైపు లైఫ్‌ కోచ్‌లు కూడా డిజిటల్‌ డిటాక్స్‌కి ఉన్న ప్రాధాన్యతని వివరిస్తున్నారు. అందుకు తగిన చిట్కాల్ని వివరిస్తున్నారు. మరైతే, రోజులో కొన్ని గంటల పాటైనా స్మార్ట్‌ఫోన్‌కి దూరంగా ఉండాలనుకుంటే.. వీటిని ప్రయత్నించండి.


ఇవేమో చిట్కాలు
డిజిటల్‌ ‘ఫాస్ట్‌’

పలు మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి, ఇంకా అనేక కారణాలతో డిజిటల్‌ డిటాక్స్‌ అయ్యేందుకు ‘ఫాస్టింగ్‌’ చేయాల్సిన అవసరం ఉంది. వారంలో ఓ రోజు ఎలాగైతే అన్నం ముట్టకుండా ఉపవాసం ఉంటున్నామో.. అదే మాదిరి రోజులో కొన్ని గంటలు.. వారంలో ఒక రోజు.. ఫోన్‌ని ముట్టకుండా.. సోషల్‌ లైఫ్‌లో అడుగు పెట్టకుండా ఉండాలి. ఫోన్‌కు బదులు మీకు నచ్చే పుస్తకాన్ని అందుకోండి. ఇంట్లో వాళ్లతో ముచ్చట్లు పెట్టండి. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా.. నిబద్ధతతో చేస్తే అలవాటుగా మార్చుకోవచ్చు. ఇంకా చాలా చేయొచ్చు..
* రోజుకి కొన్ని గంటల పాటు నోటిఫికేషన్స్‌ని టర్న్‌ ఆఫ్‌ చేయండి.
* ఫోన్‌ని పదే పదే కనిపించే చోట కాకుండా వేరే ఎక్కడైనా ఉంచండి. దీంతో మీరు ఇంట్లో తిరుగుతున్నప్పుడు మీ దృష్టి ఫోన్‌పైకి వెళ్లదు.
* ఫోన్‌ని పక్కలోకి రానివ్వొద్దు. వీలుంటే పడకగది బయటే ఉంచండి. మొదట్లో కష్టంగా అనిపించినా.. నిమిషాలతో మొదలైన ప్రయత్నం కచ్చితంగా సోషల్‌ స్క్రోలింగ్‌ని దూరం చేస్తుంది. అప్పుడు నిద్రలేమి అనే సమస్య రాదు.
* కొన్ని గంటల పాటు ఫోన్‌ని స్విచ్‌ ఆఫ్‌ చేయడం మంచిదే.
* తినేటప్పుడు, హాలులో సినిమాలు చూస్తున్నప్పుడు ఏరోప్లేన్‌ మోడ్‌లో పెట్టండి.
* విహారయాత్రలు, హాలిడేస్‌లో అవసరం లేనప్పుడు టర్న్‌ ఆఫ్‌ చేస్తే సరి.

ఛాలెంజ్‌ చేయండి

సోషల్‌ మీడియా సాక్షిగా ఫిట్‌నెస్‌, ఫ్యాషన్‌, పర్యావరణం.. ఇలా పలు అంశాలపై స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఛాలెంజ్‌లు విసురుతుంటాం. ఇకపై డిటిజిల్‌ డిటాక్స్‌పైనా ఛాలెంజ్‌లు విసరండి. డిజిటల్‌ వెల్‌ బీయింగ్‌గా మీరు మారడంతో పాటు మరికొంత మందిని మార్చే ప్రయత్నం చేయండి. హ్యాష్‌ ట్యాగ్‌తో రోజులో గంట పాటు ఫోన్‌ని దూరం పెట్టమని ‘వన్‌ అవర్‌ డిస్‌కనెక్ట్‌’ అని ఛాలెంజ్‌ చేయండి. ప్రారంభంలో మిమ్మల్ని తిట్టుకున్నా తర్వాత వారికీ తెలుస్తుంది. ఫోన్‌ని మితిమీరి వాడడంతో ఏం కోల్పోతున్నారో. హ్యాష్‌టాగ్‌తోనే కాదు. ఆఫీస్‌లో మీ పక్క సీట్లో కలిసి పని చేసే సహోద్యోగితో సవాల్‌ చేయండి. వారంలో ఓ రోజంతా ఫోన్‌ వైపు గానీ.. యాప్‌ల వంకగానీ చూడనని. ఏళ్ల తరబడి అలవాటైన అరచేతిలో ప్రపంచాన్ని అనుకున్నంత త్వరగా దూరంగా పెట్టడం అంటే కొంచెం కష్టమే. కానీ, ఒక్కసారి అమలు పరిచే ప్రయత్నం చేస్తే పలు అంశాలల్లో మీ పురోగతి మీకే తెలుస్తుంది. మదికి కచ్చితంగా ప్రశాంతత చేకూరుతుంది. అంతేకాదు.. సోషల్‌ మీడియా ద్వారా కోరుకునే ఫేక్‌ ఐడెంటిటీ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఎందుకంటే సోషల్‌ లైఫ్‌లో చూసేదంతా నిజం కాదు. పోస్టింగ్‌ల వెనకుండే ముఖాలు వేరు. వారి బతుకులు వేరు. లైక్‌లు, కామెంట్‌ల కోసం ముసుగేసుకుని డీపీల్లో బతికేస్తుంటారు. అలాంటి డూప్లికేట్‌లకు దూరంగా ఉండడం అంటే.. నెగెటివ్‌ ప్రపంచాన్ని పక్కకు పెట్టడమే!

- రాము తోట, ఐటీ నిపుణుడు


 

ఇవేమో యాప్‌లు
అదే పనిగా తెరవద్దు

అలర్ట్‌లు ఏం రావు.. ఫోన్‌ మోగదు. అయినా పదే పదే చూడడం. అన్‌లాక్‌ చేయడం.. కొన్ని వందల సార్లు ఇలా అన్‌లాక్‌ చేస్తూనే ఉంటారు. వాటిని ఎప్పుడైనా కరెక్టుగా లెక్కపెట్టారా? లేదు కదా? అందుకే ఈ యాప్‌. పేరు ‘అన్‌లాక్‌ క్లాక్‌’.. ఇదొక లైవ్‌ వాల్‌ పేపర్‌ లాంటిది. ఫోన్‌ అన్‌లాక్‌ చేసిన ప్రతిసారీ లెక్కిస్తుంది. అలా రోజులో ఎన్ని సార్లు మీ చేయి ఫోన్‌ వైపు వెళ్లిందో చెబుతుంది. కౌంట్‌ కాస్త ఎక్కువ ఉంటే పరిమితులు పెట్టుకోండి.

నోటిఫికేషన్స్‌కి నో!

ఈ రోజు ఎలాగైనా రెండు ఛాప్టర్లు చదివేయాలని మొదలెడతాం.. మరుక్షణమే వాట్సప్‌ మెసేజ్‌.. ఏంటా? అని చూస్తారు. ఈలోపే ఫేస్‌బుక్‌ నుంచి ఇంకోంటి.. అది చెక్‌ చేస్తుండగానే ఇన్‌స్టా అలర్ట్‌.. తెలియకుండానే అరగంట అయిపోతుంది. ఇలా రోజులో గంటలు గంటలు ఫోన్‌కి అతుక్కుపోతాం. అందుకే ఫోన్‌కి ఎప్పుడంటే అప్పుడు నోటిఫికేషన్స్‌ రాకుండా చేస్తే. ఎంపిక చేసుకున్న టైమ్‌కే అన్నింటిని చూడగలిగితే.. అందుకే ఈ యాప్‌. పేరు పోస్ట్‌ బాక్స్‌.. దీంతో మీరొక సమయం సెట్‌ చేసుకొని, నోటిఫికేషన్‌లని ఆ సమయానికే తెరపైకి వచ్చేట్టుగా చేయొచ్చు.

కొన్ని చాలనుకుంటే!

ఫోన్‌ తెరిస్తే ఎన్నో యాప్స్‌, గేమ్స్‌.. నచ్చిన యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయడం వాడేయడం. మెచ్చిన గేమ్‌ డౌన్‌లోడ్‌ చేయడం ఆడేయడం.. రోజులో ఎన్నో గంటలు వీటికే సరిపోతుంది. మరి వీటిపై నియంత్రణ అంటే.. సింపుల్‌గా ‘డెసర్ట్‌ ఐలాండ్‌’ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేయడమే.. దీని ద్వారా కేవలం మీకవసరమున్న యాప్స్‌ మాత్రం ఎనేబుల్‌ చేసుకోవచ్చు. మిగిలిన యాప్స్‌ని లాక్‌ చేసుకోవచ్చు. ఒక విధంగా డిజిటల్‌ ప్రపంచానికి కాసేపు దూరంగా ఉండేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

కలిసికట్టుగా క్లోజ్‌

హ్యాంగ్‌ అవుట్స్‌ అంటూ నలుగురు దోస్త్‌లు కలిసినా.. హాయిగా ఊసులు చెప్పుకోలేరు. ఎవరో ఒకరి ఫోన్‌కి ఏదో నోటిఫికేషన్‌.. తెరచి చూడడం.. మాటలు మధ్యలో ఆగిపోతాయ్‌. అందుకే  ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో కలిసినప్పుడు ఎవ్వరి ఫోన్‌ పలక్కుండా కలిసికట్టుగా వీటిని పక్కన పెట్టొచ్చు. ఓ గ్రూపుగా ఇది సాధ్యమే. ‘వీ ఫ్లిప్‌’ ఇన్‌స్టాల్‌ చేసుకోండి చాలు. ఒకేచోట అందరూ కలిశాక గ్రూప్‌గా జాయిన్‌ అవ్వాలి. తర్వాత తెరపై ఉన్న ‘ఫ్లిప్‌’ని కిందికి లాగితే చాలు. మీ సెషన్‌ మొదలవుతుంది.  మీరు ఎంపిక చేసుకున్న సమయం వరకు ఎవరి ఫోనూ మోగదు. ఒకవేళ ఎవరైనా వారి ఫోన్‌ని అన్‌లాక్‌ చేస్తే సెషన్‌ మధ్యలోనే ముగిసిపోతుంది. ఎవరు అన్‌లాక్‌ చేశారనేది కూడా మీకు తెలుస్తుంది.

కాగితం ఫోన్‌ అందుకోండి

ఫోన్‌ చేతిలో ఉంటే చాలు. పక్కనేం జరుగుతుందో కూడా పట్టించుకోరు. దేనిపైనా ఏకాగ్రత చూపలేరు. అలాంటి యువత తాకేతెరల నుంచి కాసేపైనా బ్రేక్‌ తీసుకుందాం అనుకుంటే? ఇదిగోండి ఈ ‘పేపర్‌ ఫోన్‌’ని చేతిలోకి తీసుకోండి. అదెలాగంటే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో పేపర్‌ ఫోన్‌ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. కావాల్సిన వాటిని పేపర్‌పై ప్రింట్‌ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఈ నెల క్యాలెండర్‌ని ప్రింట్‌ తీసుకుని పేపర్‌ ఫోన్‌లోనే ప్లానింగ్‌ చేయొచ్చు. ఇదే మాదిరిగా ఫోన్‌లో చేసే పనులన్నీ పేపర్‌పై చేయొచ్చు అన్నమాట. ఏ4 పరిమాణంలో ప్రింట్‌ తీసుకున్నాక దాన్ని ఫోన్‌ మాదిరిగా మడతపెట్టొచ్చు.


* సగటున ప్రతి భారతీయుడు ఏడాదిలో 1800 గంటలు ఫోన్‌తో గడుపుతున్నాడు.
* ప్రతి ముగ్గురిలో ఒకరు ఐదు నిమిషాలైనా ఫోన్‌ని చెక్‌ చేయకుండా ఉండలేకపోతున్నారు.
* ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఫోన్‌ వాడకానికి దూరంగా ఉండాలనుకుంటున్నారు. దీంతో మానసిక ఒత్తిళ్లు చాలా వరకూ తగ్గుతాయని నమ్ముతున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.