close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 26/01/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజ్యాంగం లేకముందు ఏముంది?

ఈరోజు గణతంత్ర దినోత్సవం కదా... చిన్నూ చక్కగా ముస్తాబై జెండా వందనం చేయడానికి స్కూలుకి వెళ్లాడు. అందరికీ హ్యాపీ రిపబ్లిక్‌ డే అంటూ శుభాకాంక్షలు చెప్పాడు... టీచర్లు, పెద్దవాళ్లు చెప్పిన బోలెడన్ని సంగతులు వినాన్నాడు. ఇంతకీ ఈ రోజు ఎందుకు చేసుకుంటున్నాం? అసలు రాజ్యాంగం అంటే ఏంటి? అది కచ్చితంగా ఉండాలి? లేని దేశాలు ఉన్నాయా? అందలో ఏమేం  వివరాలుంటాయి? ఇలా చిన్నూ చిట్టి బుర్రల్లో ఎన్నెన్నో ప్రశ్నలు... ఎవర్ని అడగాలబ్బా? అని ఆలోచిస్తుంటే అప్పుడు మామయ్య వచ్చాడు... ఇంకేముంది?! తన డౌట్లన్నీ తీర్చేసుకుంటున్నాడు... అవేంటో చదివేద్దాం!

చిన్నూ: మామయ్యా! పొద్దున మా టీచర్‌ చెప్పారు మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కాబట్టే ఈ దినోత్సవాన్ని చేసుకుంటున్నామని. అసలు రాజ్యాంగం అంటే ఏమిటో చెప్పవూ?

మామయ్య: చెప్తా కానీ ముందు ఇలా వచ్చి కూర్ఛో రాజ్యాంగం అంటే మరేం లేదు చిన్నూ! ఒక దేశం లేదా ఒక రాష్ట్రం పరిపాలనా నిర్వహణకు పాటించాల్సిన నియమ నిబంధనల సంపుటి. ఇందులో రాజ్య వ్యవస్థలో ఏయే ప్రభుత్వ విభాగాలు ఉంటాయన్న విషయం, ఇంకా... ప్రభుత్వానికి ఉండే అధికారాలేమిటి, ఆ అధికారాలు ఎలా అమలవుతాయి, పౌరులకు అంటే మనకు ఉండే హక్కులు ఏమిటో కూడా రాజ్యాంగంలో ఉంటుంది. ఇదో న్యాయ సంబంధమైన పత్రం. చట్టాలన్నింటికీ ఇదే మూలాధారం. అంతేకాదూ... దేశం సాధించాల్సిన లక్ష్యాలూ ఇందులోనే ఉంటాయి. అప్పుడే పరిపాలన సరిగ్గా నడుస్తుందన్నమాట.

చిన్నూ: ఓహో! నాకో అనుమానం అసలు రాజ్యాంగం ఎందుకు?

మామయ్య: భలేవాడివే. ఇప్పుడు మన హక్కులను కాపాడ్డానికి ప్రభుత్వం ఉంటుందిగా. మరి అది ఎలా నడుచుకోవాలో ఎవరు చెబుతారు? అందుకే రాజ్యాంగం అవసరం. జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆస్తి మొదలైనవి ప్రజలకు ఉండాల్సిన ముఖ్యమైన హక్కులు. వీటిని ప్రభుత్వం ఎలా కాపాడాలో చెప్పే నియమ నిబంధనలన్నీ రాజ్యాంగంలో రాసి ఉంటాయి.

చిన్నూ: అవునా? మరి దేశానికి రాజ్యాంగం లేకపోతే పరిస్థితి ఏమిటి?

మామయ్య: రాజ్యాంగం లేకపోతే అంతా గందరగోళ పరిస్థితే. దేశ పరిపాలన బాగుండాలంటే రాజ్యాంగం ఉండి తీరాల్సిందే చిన్నూ.

చిన్నూ: ఇంతకీ మన దేశంలో రాజ్యాంగం ఎప్పటి నుంచి ఉంది?

మామయ్య: అదా... 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అలా ఆ రోజు నుంచి మనది గణతంత్ర రాజ్యం (రిపబ్లిక్‌) అయ్యింది. అసలు గణతంత్రం అంటే ఏంటంటే... ప్రభుత్వం, పరిపాలన ఎలా ఉండాలో ప్రజలే నిర్ణయించుకోవడం.

చిన్నూ: మరి మామయ్యా! మనకు రాజ్యాంగం లేకముందు ఏముంది?

మామయ్య: మనకు స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్‌వాళ్ల పాలనలో ఉండేవాళ్లమని నీకు తెలుసుకదా. 1858 నుంచి మనదేశంలో బ్రిటిష్‌వాళ్ల పరి పాలన మొదలైంది. అంతకు ముందేమో ఈస్టిండియా కంపెనీ పరిపాలనలో ఉండేవాళ్లం. బ్రిటిష్‌ వాళ్లు అధికారం చేపట్టి ఎన్నో చట్టాలు చేశారు. అలా వాళ్ల చట్టాల ఆధారంగానే ప్రభుత్వం కొనసాగింది తప్ప 1950కి ముందు మనకు ప్రత్యేకంగా రాజ్యాంగం ఏమీ లేదు. బ్రిటిష్‌ పరిపాలనకు ముందు కూడా 1773 నాటి నిబంధనల ప్రకారం ఈస్టిండియా కంపెనీ పరిపాలన కొనసాగించేది.

చిన్నూ: ఓహో! అన్నట్టూ అన్ని దేశాలకు రాజ్యాంగం ఉంటుందా? లేని దేశాలు ఉన్నాయా?

మామయ్య: మన దగ్గరకులానే ప్రభుత్వం ఎలా ఉండాలో చెప్పడానికి అన్ని దేశాలకూ రాజ్యాంగాలు ఉన్నాయి. అయితే సంపూర్ణమైన రాజరికాలు కొనసాగుతున్న చోట్ల రాజ్యాంగాలు లేవు. సౌదీ అరేబియా, వాటికన్‌, ఓమన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బ్రూనై దేశాల్లో రాజరికాలు ఉన్నాయి. అందుకే అక్కడ రాజ్యాంగాలు లేవు. అలాంటి చోట్ల రాజు చెప్పిందే శాసనమన్నమాట.

చిన్నూ: మామయ్యా! ఇంగ్లండ్‌కు రాజ్యాంగం లేదంటారు. నిజమేనా?

మామయ్య: అవును. బ్రిటన్‌లో రాజ్యాంగం లేదన్నది ఒక రకంగా నిజమే. అంటే మన దేశంలోలాగా లిఖిత రూపంలో రాజ్యాంగం లేదు. అయితే అక్కడ రాజ్యాంగబద్ధ పాలనే ఉంది. ఇలాంటి రాజ్యాంగాలను అలిఖిత రాజ్యాంగాలు అంటారు. బ్రిటన్‌తోపాటు కెనడా, న్యూజిలాండ్‌, ఇజ్రాయిల్‌ వంటి దేశాల్లోనూ లిఖిత రాజ్యాంగాలు లేవు. అయితే న్యూజిలాండ్‌లో పరిపాలనకు, ఆ దేశమంటే ఏమిటి, పౌరులు అంటే ఏమిటి అని నిర్వచించడానికి కొన్ని నిబంధనలున్నాయి. వీటి ఆధారంగానే అక్కడ పరిపాలన సాగుతోంది. ఇజ్రాయిల్‌లో లిఖిత రాజ్యాంగం లేకపోయినా 1950 జూన్‌ 30న ఆమోదించిన హరారీ ప్రకటన ప్రకారం పరిపాలన సాగుతోంది. లిఖిత రాజ్యాంగాలు లేని దేశాలు తమ ఆనవాయితీల ఆధారంగా నడుస్తాయి.

చిన్నూ: ఏ దేశం మొదట రాజ్యాంగం తయారు చేసుకుంది?

మామయ్య: నీ చిట్టిబుర్రలో బోలెడు సందేహాలే ఉన్నాయే?! మొట్టమొదట రాజ్యాంగం తయారు చేసుకున్నది అమెరికా. 1788 జూన్‌ 21 నుంచి అమెరికాకు రాజ్యాంగం ఉంది. బ్రిటిష్‌ పాలన నుంచి 1787లో విముక్తమైన తర్వాత అమెరికా రాజ్యాంగం రూపొందించుకుంది.

చిన్నూ: అసలు రాజ్యాంగంలో ఏముంటుంది?

మామయ్య: ఇందాక చెప్పా కదా. రాజ్యాంగంలో దేశ పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండాలి? కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి. కేంద్రం ఏ రకమైన చట్టాలు చేయొచ్ఛు రాష్ట్రాలు ఎలాంటి చట్టాలు చేస్తాయి వంటి ఎన్నో అంశాలు ఉంటాయి.

చిన్నూ: ఓహో చాలానే ఉంటాయే. వేర్వేరు దేశాలకు వేర్వేరు రాజ్యాంగాలున్నాయి కదా. వాటిల్లో ప్రపంచంలో అతి పెద్ద, అతి చిన్న రాజ్యాంగాలున్న దేశాలు ఏవి?

మామయ్య: ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం ఏదో తెలుసా? భారత రాజ్యాంగమే. అంటే మనదే. దీంట్లో 444 అధికరణాలు, 22 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. ఇందులో మొత్తం పదాల సంఖ్య 1,46,385. అతి చిన్న రాజ్యాంగం ఉన్న దేశం మొనాకో. మొనాకో రాజ్యాంగంలో ఉన్న మొత్తం పదాలు 3,800 మాత్రమే.

చిన్నూ: భలే భలే. అవునూ రాజ్యాంగాన్ని మార్చొచ్చా?

మామయ్య: ఈ విషయమూ రాజ్యాంగంలో ఉంది. మన రాజ్యాంగంలోని 368వ అధికరణం దీన్ని సవరించడానికి అనుమతిస్తుంది. అయితే ఈ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాజ్యాంగంలో కొత్త అంశాలు చేర్చొచ్ఛు అనవసరం అనుకున్న వాటిని తొలిగించవచ్ఛు ఇప్పటి వరకు 123 సార్లు రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రతిపాదిస్తే అందులో 103 మాత్రమే రాజ్యాంగ సవరణ చట్టాలు అయ్యాయి. అంటే వీటిని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి సంతకాలు అయ్యాయి.

చిన్నూ: అంటే మన రాజ్యాంగానికి సవరణలే చేశారా? మార్చలేదా?

మామయ్య: మన రాజ్యాంగాన్ని ఇంతవరకు చాలాసార్లు సవరించాం తప్ప మొత్తం మార్చి కొత్త రాజ్యాంగం రూపొందించలేదు.

చిన్నూ: కావాలంటే కొత్త రాజ్యాంగం రాసుకోవచ్చా?

మామయ్య: రాసుకోవచ్చు చిన్నూ! కానీ ప్రత్యేకమైన అవసరాలుంటేనే. ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత రాజ్య వ్యవస్థే మారిపోవడంతో ఇటలీ 1947 డిసెంబర్‌ 22న కొత్త రాజ్యాంగం తీసుకొచ్చింది. అలాగే జర్మనీ 1949మే 8న కొత్త రాజ్యాంగాన్ని అమలు చేసింది. ఇంకా మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌, నేపాల్‌లో రాజ్యాంగాలను చాలాసార్లు మార్చారు. మన దేశంలో అలా ఎప్పుడూ జరగలేదు.

చిన్నూ: ఇంతకీ మన రాజ్యాంగ అధినేత ఎవరు?

మామయ్య: నీకు భలే సందేహమే వచ్చింది కానీ రాజ్యాంగాధినేత ఎవరూ లేరు. రాష్ట్రపతిని రాజ్యాధినేత అంటాం. అలాగే ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ అధినేత. గవర్నరును రాష్ట్రాధినేత అంటాం. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రభుత్వాధినేత. మన రాజ్యాంగం ప్రకారం రాజ్యాధినేతకు గానీ, ప్రభుత్వాధినేతకు గానీ సార్వభౌమాధికారం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మన రాజ్యాంగం ప్రకారం ప్రజలకే సార్వభౌమాధికారం ఉంది.

చిన్నూ: చివరగా ఒక్కడౌటు. మన రాజ్యాంగాన్ని ఏ భాషలో రాశారు? అసలు ప్రతి ఎక్కడ ఉంటుంది?

మామయ్య: దీన్ని ఇంగ్లీషులో రాశారు. తర్వాత దానికి అధికారిక హిందీ ప్రతి తయారు చేశారు. మన రాజ్యాంగ అసలు ప్రతిని దిల్లీలోని పార్లమెంటు భవనంలో హీలియం నింపిన పెట్టెలో భద్రపరుస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.