close

తాజా వార్తలు

Published : 31/01/2020 10:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంకుర సౌభాగ్యం కోసం...

దేశంలో నిరుద్యోగిత నాలుగున్నర దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరి ఉరుముతున్న తరుణంలో, రేపు వెలుగు చూడనున్న కేంద్ర బడ్జెట్‌పై ఆశావహ అంచనాలు వినిపిస్తున్నాయి. అంకురాలకు, సూక్ష్మ పరిశ్రమలకు తగినన్ని ప్రోత్సాహకాలు, రాయితీలతో ఊతమిస్తే ఉపాధి కల్పన చురుకందుకుని దేశార్థికమూ తేరుకుంటుందన్న సూచనలు జోరెత్తుతున్నాయి. కొన్నాళ్లుగా ప్రైవేటు పెట్టుబడుల్లో తగ్గుదల, ఎగుమతుల్లో క్షీణతలతో పాటు వస్తు సేవలపై ప్రజల ఖర్చు కుంగి- వేరే మాటల్లో గిరాకీ సన్నగిల్లి, ఆందోళనకర మాంద్యానికి ఆజ్యం పోయడం చూస్తున్నాం. ఈ పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో వ్యక్తిగత పన్ను రేట్లను తెగ్గోస్తే పౌరుల చేతిలో సొమ్ములు ఆడతాయని, పొదుపు చేయగల మొత్తం పెరిగితే అంతిమంగా ఆర్థిక రంగం నవోత్తేజం సంతరించుకుంటుందన్నది నిపుణుల సూచనల సారాంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల రూపేణా రూ.13.5 లక్షల కోట్ల మేర రాబడిని కేంద్రం లక్షించినా, వాస్తవంలో రెండు లక్షల కోట్ల రూపాయల దాకా తరుగుదల తప్పదని ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ప్రత్యక్ష పన్నుల ఆదాయ పద్దు రూ.11.5 లక్షల కోట్లకైనా ఈసారి చేరువ కాలేకపోవచ్చునన్న సూచనల దృష్ట్యా- రేపటి బడ్జెట్లో విత్తమంత్రి ఏ మార్గం అనుసరించనున్నారోనన్న ఉత్కంఠ సహజంగానే రేకెత్తుతోంది. ప్రభుత్వం తలచుకోవాలేగాని- పన్నుపోటునుంచి ఉపశమనం ఒక్కటే అనేముంది... అంకుర సంస్థ (స్టార్టప్‌)లకు శిరోవేదన కలిగిస్తున్న ఇతరత్రా సమస్యలపై దృష్టి సారించాల్సిన అజెండాసైతం పోగుపడి ఉంది. 2016 ఏప్రిల్‌ ఒకటో తేదీ తరవాత ఏర్పాటైన ఏ అంకుర సంస్థకైనా మూడేళ్లపాటు నూరుశాతం పన్ను రాయితీ కల్పిస్తున్నారు. చిరు మొలకలు నిలదొక్కుకుని లాభాల బాట పట్టేంతవరకు మరికొంత గడువిస్తే వాటినెత్తిన పాలుపోసినవారవుతారు. తయారీ రంగ పరిశ్రమల్ని అనుగ్రహించినట్లే ఉదార ప్రోత్సాహకాల్ని అంకురాలకూ వర్తింపజేస్తే, నిరుద్యోగితపై అది రామబాణమవుతుంది!

సృజన శక్తుల మెదళ్లనే నవకల్పనల నారుమళ్లుగా తీర్చిదిద్ది భిన్న రంగాల్లో వ్యవస్థాపకతను ఉరకలెత్తించే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం నాలుగేళ్లక్రితం రూపొందించిందే అంకుర పరిశ్రమల (స్టార్టప్స్‌) విధానం. ఉద్యోగాలు కోరుకునేవారిని కాదు, ఉపాధి అవకాశాలు సృష్టించేవారిని అవతరింపజేయడమే తమ ధ్యేయమన్నది నాడు ‘నీతి ఆయోగ్‌’ నోట సైతం మార్మోగిన నినాదం! సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా ఎదిగిన భారత్‌ చిరకాలం సంపన్న దేశాలకు నిపుణుల సరఫరా కేంద్రంగానే మిగిలిపోయింది. దేశీయంగా కన్ను తెరిచిన తొలి దశ అంకురాల్లో 65 శాతం వరకు ఇక్కడి పన్నులు, సుంకాల ఆరళ్లు భరించలేక సింగపూర్‌ వంటి దేశాలకు తరలిపోయాయని అప్పట్లో కేంద్రమే అంగీకరించింది. ‘స్టార్టప్‌ ఇండియా’ను ఘనంగా పట్టాలకు ఎక్కించిన తరవాతా- 22 వేర్వేరు చట్టాల కింద నిబంధనలు పాటించాల్సి వస్తున్నదన్న ఔత్సాహికుల ఆక్రోశం, పూడ్చాల్సిన కంతలెన్నో ఉన్నాయని స్పష్టీకరించింది. మోదీ ప్రభుత్వం నియోగించిన తరుణ్‌ ఖన్నా కమిటీయే- అమెరికాతో పోలిస్తే ఇక్కడి ఔత్సాహికులు స్టార్టప్‌ నిధులకోసం అధికంగా శ్రమించాల్సి వస్తోందని తప్పుపట్టింది. సంక్లిష్ట పన్నుల వ్యవస్థ, మౌలిక సదుపాయాల కొరత, బ్యురాక్రసీ ప్రతినాయక పాత్ర తదితరాల్నీ అది వేలెత్తి చూపింది. ఇప్పటికీ పలు అధ్యయనాలు అంకుర సంస్థల్లో పురుషాధిక్య ధోరణుల్ని ప్రశ్నిస్తున్నాయి. పన్నుల మదింపు తరవాత గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్‌, ఓలా, స్నాప్‌డీల్‌, గ్రోఫర్స్‌ ప్రభృత ప్రముఖ స్టార్టప్‌ సంస్థలు నష్టాల్లో ఉన్నట్లు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. సవ్య ప్రస్థానం సాగితే 2025నాటికి ప్రత్యక్షంగా నాలుగున్నర లక్షలవరకు, పరోక్షంగా మూడు లక్షల దాకా ఉపాధి అవకాశాలు ఏర్పరచగల అంకురాల్ని నేర్పుగా సాకేలా రేపటి బడ్జెట్‌ ఏం చేయగలదో చూడాలి.

సాంకేతిక కళాశాలల స్థాయిలో అంకుర యోచనల్ని ప్రోత్సహించాలని తనవంతుగా తెలంగాణ ఐటీశాఖ నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదించింది. అది మొదలు ప్రవర్ధమానమవుతున్న చొరవ దేశీయంగా అత్యధిక స్టార్టప్‌లు కలిగిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక, మహారాష్ట్రల తరవాత మూడో స్థానాన తెలంగాణను నిలబెట్టింది. 2020నాటికి వంద అంకురాభివృద్ధి కేంద్రాలను, అయిదువేల స్టార్టప్‌లను నెలకొల్పుతామన్న ఆంధ్రప్రదేశ్‌- దిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ల దరిమిలా ఏడో స్థానానికి పరిమితమైంది. నగరాలవారీగా అహ్మదాబాద్‌, జైపూర్‌, కోల్‌కతా, కొచ్చి అంకుర కేంద్రాలుగా నిలుస్తున్నాయి. వ్యవసాయంతోపాటు ఎన్నో గ్రామీణ వృత్తులు, వ్యాపారాలకు డిజిటల్‌ సేవలందిస్తూ అంకుర సంస్థలు పునాదిని విస్తరించుకోవడం స్వాగతించదగ్గ పరిణామం. పలు స్టార్టప్‌లు ప్రాంతీయ భాషల్లో డిజిటల్‌ సమాచారం అందజేతలో నిమగ్నమయ్యాయి. మున్ముందు కృత్రిమ మేధకు అంకురాలు సమధికంగా విస్తరిస్తాయని రతన్‌ టాటా వంటివారు భవిష్యద్దర్శనం చేస్తున్నారు. సాంకేతిక నవీకరణలో బాసటగా నిలిచి అంకుర సంస్థల్ని స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, యూకేలు రాటుతేలుస్తుండగా- స్టార్టప్‌ల పురోగతిలో అత్యంత కీలకమనదగ్గ మౌలిక వసతుల పరికల్పనలో ఫిన్లాండ్‌, ఐర్లాండ్‌, డెన్మార్క్‌ వంటివి పోటీపడుతున్నాయి. భారతీయ పరిశోధన సామర్థ్యాన్ని గూగుల్‌, జనరల్‌ ఎలెక్ట్రిక్‌, ఐబీఎమ్‌లాంటి దిగ్గజ సంస్థలు ఏనాడో ప్రస్తుతించాయి. ఆ సహజ బలిమికి వ్యవస్థాగత తోడ్పాటు, విధానపరమైన సంస్కరణలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణాయక సహకారం జతపడితే- సృజనాత్మక వాణిజ్య యోచనల దన్నుతో అంకుర సౌభాగ్యం ఇక్కడా సాకారమవుతుంది. సూక్ష్మ సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచి అద్భుత విజయ గాథల్ని ఆవిష్కరిస్తున్న జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ల బాణీని అందిపుచ్చుకొనేలా నవ్యభారతానికి కేంద్ర బడ్జెట్‌ పథనిర్దేశం చేయాలి!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.