close

తాజా వార్తలు

Updated : 01/02/2020 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్కెట్‌పై బడ్జెట్‌ బాంబ్‌..!

కుదేలైన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బడ్జెట్ 2020కు పూర్తి ప్రతికూలంగా స్పందించాయి. సెన్సెక్స్ 987 పాయింట్లు నష్టపోయి 39,735 వద్ద, నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 11,661 వద్ద ముగిశాయి. ఉదయం ఊగిసలాట ధోరణితో మొదలైన మార్కెట్లు ఆర్థిక మంత్రి ప్రసంగం సాగే కొద్ది నష్టాల్లోకి జారుకొంది. బడ్జెట్ ముగిశాక భారీగా పతనమైంది. ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు సంబంధించి భారీ ప్రకటనలు ఉంటాయని భావించినా.. అటువంటివి ఏమీ లేకపోవడంతో మార్కెట్‌ కొంత నిరాశ చెందింది. ఫలితంగా సెన్సెక్స్‌ చరిత్రలోనే అతిపెద్ద  పతనాల్లో ఒకదానిని నమోదు చేసింది. టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే, ఇన్ఫోసిస్‌ వంటి షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ రియాల్టీ రంగం 8శాతం కుంగింది. నిఫ్టీ బ్యాంక్‌, ప్రైవేట్‌ బ్యాంక్‌, మెటల్‌, ఫైనాన్స్‌ సర్వీస్‌, ఆటో , పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌ సూచీలే 3శాతంకు పైగా నష్టపోయాయి. 

మార్కెట్‌ పతనానికి కారణాలు ఇవే..

ఎల్‌టీసీజీ, ఎస్‌టీటీ ప్రస్తావన లేకపోవడం

ఈ బడ్జెట్‌లో దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును , సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌కు సంబంధించిన ఎటువంటి ప్రకటనలు లేకపోవడంతో మార్కెట్‌ నిరాశ చెందింది. బడ్జెట్‌కు దాదాపు నెలరోజుల ముందు నుంచి ఎల్‌టీసీజీ తగ్గింపు ఖాయమనే ప్రచారం జరగడం.. దీనికితోడు ప్రభుత్వం కూడా పెట్టుబడులను ఆకర్షించే చర్యలు చేపడతామని చెప్పడంతో దీనిపై ఆశలు పెట్టుకొన్నారు. ఎల్‌టీసీజీ తొలగిస్తే మార్కెట్లలో సెంటిమెంట్‌ను పెంచేదని విశ్లేషకులు భావిస్తున్నారు.  

దాదాపు 14ఏళ్ల తర్వాత ఎల్‌టీసీజీని 2018-19లో తిరిగి ప్రవేశపెట్టారు. రూ.లక్ష దాటిన షేర్లపై10శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక  పరిస్థితుల నేపథ్యంలో దేశీయ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి గల అవకాశాలు, నమోదిత కంపెనీలపై ఎల్‌టీసీజీ పన్నును తొలగించే ప్రతిపాదనను పన్ను సలహాదార్లు సూచించినట్లు ప్రభుత్వ అధికారులు అంటున్నారు. అదే సమయంలో ‘దీర్ఘకాలం’కు ఉన్న నిర్వచనాన్ని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచే అవకాశం ఉందని ఈ చర్చలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న వ్యక్తులు తెలిపారు. ప్రస్తుతం ఎల్‌టీసీజీపై 10 శాతం పన్ను ఉంది. చాలా వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు(ఎఫ్‌పీఐ), ఇతర మదుపర్లు ప్రధాని హామీ నేపథ్యంలో ఎల్‌టీసీజీని తొలగిస్తారన్న అంచనాలతో ఉన్నారు. పలువురు ఎఫ్‌పీఐలు ప్రభుత్వానికి ఎల్‌టీసీజీని తొలగించాలంటూ విజ్ఞప్తి కూడా చేశారని పన్ను విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌టీసీజీ, ఇతర పన్ను అంశాల కారణంగా పెట్టుబడుల ప్రణాళికలకు దూరంగా ఉన్నట్లు పలువురు విదేశీ మదుపర్లు చెబుతున్నారు.

డీడీటీపై ప్రభుత్వం మెలిక.. బెంబేలెత్తిన భారీ మదుపరులు

డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్ను కంపెనీలు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆర్థిక మంత్రి ఒక మెలికపెట్టారు. డివిడెండ్‌ను అందుకునే వారి వద్ద.. వారు ఏ రేటు పరిధిలోకి వస్తారో చూసి ఆ మేరకు పన్ను వసూలు చేస్తామని చెప్పారు. అంటే పెట్టుబడులు పెట్టేవారి వద్ద నుంచి వసూలు చేస్తామని అర్థం. ఇది పెట్టుబడులను నిరుత్సాహపర్చేలా ప్రభావం చూపిస్తుందని నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఒక వేళ డివిడెండ్‌ గ్రహీతలు 30పన్ను శ్లాబ్‌లోకి వస్తే భారీ మొత్తంలో చేతి చమురు వదిలించుకోవాల్సిందే... అదే కంపెనీల వద్దే డీడీటీ చెల్లిస్తే రూ.10లక్షల వరకు 15శాతం మాత్రమే పన్ను చెల్లించాలి. కానీ, తమ వద్దకు వస్తే 30శాతం పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఉద్దీపనలు లేకపోవడం..

ఈ బడ్జెట్‌లో ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేలా ఎటువంటి ఉద్దీపనలు లేవు. ముఖ్యంగా ఇన్‌ ఫ్రా, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు తీవ్ర నిరాశ చెందాయి. గ్రామీణ, వ్యవసాయ రంగాలకు అనుకున్న మొత్తం కంటే తక్కువ కేటాయింపులు చేశారు. ఆదాయ వచ్చే మార్గాలను ప్రస్తావించని ప్రభుత్వం ఖర్చులు మాత్రం భారీగా చూపడంతో ద్రవ్యలోటు ప్రభావం ఖర్చులపై ఉంటుందని మార్కెట్లు భావించాయి. 

వ్యక్తిగత పన్నుల్లో గందరగోళం.. 

ప్రభుత్వం పన్ను విధానంలో గందరగోళం సృష్టించింది.  మినహాయింపులు, డిడక్షన్లకు దరఖాస్తు చేసుకొంటే పాత విధానంలో చెల్లించాలని.. లేకపోతే కొత్త విధానంలో ఎటువంటి క్లెయింలు లేకుండా చెల్లించాలని ప్రకటించింది. కొత్త విధానం సులువుగా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలో 100 డిడక్షన్లలో 70 తొలగించామని పేర్కొంది.  కొత్త విధానంలో ఏడు శ్లాబులను ప్రకటించింది... దీంతో ఏ విధానంలో అయితే తక్కువ  పన్ను పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

0-రూ.2.5లక్షలకు పన్నులేదు, రూ.2.5లక్షలు-రూ.5లక్షలకు 5శాతం, రూ.5లక్షలు - రూ.7.5లక్షలకు 10శాతం, రూ.7.5లక్షలు-రూ.10 లక్షలకు 15శాతం, రూ.10లక్షలు-రూ.12.5లక్షలకు 20శాతం,  రూ.12.5లక్షలు-రూ.15లక్షలకు 25శాతం, రూ.15లక్షలు నుంచి 30శాతం చెల్లించాలని పేర్కొంది. దీంతో బీమా రంగానికి చెందిన  పలు షేర్లు కుంగాయి. ఇవన్నీ పన్ను మినహాయింపులు ఇచ్చే పథకాలను విక్రయిస్తుంటాయి. దీనికి తోడు ఆదాయపన్ను చట్టంలో దాదాపు 70డిడక్షన్లను తొలగించడం కూడా మదుపరులను భయపెట్టింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.