close
Array ( ) 1

తాజా వార్తలు

వేల సంకరణాల్లో.. ఒక్కదానికే!

8 మార్కుల ప్రశ్నలు

1. మొక్కల ప్రజననంలోని వివిధ దశల గురించి వివరించండి.

జ: వైవిధ్యశీలత సేకరణ (Collection of Variability): ఏ ప్రజనన కార్యక్రమంలోనైనా జన్యు వైవిధ్యశీలత అనేది మూలాధారం. సాధారణంగా సస్య మొక్కలకు ముందు నుంచి ఉన్న వన్య సంబంధీకుల నుంచి జన్యు వైవిధ్యశీలత లభిస్తుంది. వివిధ వన్య రకాలను, జాతులను వాటి ద్వారా సాగుచేసే సంబంధీకులను సేకరించడం, భద్రపరచడం అనేది వృక్ష జనాభాలో ప్రకృతిపరంగా లభించే జన్యువులను చక్కటి రీతిలో గుర్తించి ఉపయోగించుకునేందుకు ముందుగా అవసరమయ్యే కార్యక్రమం. ఈ మొత్తం సేకరణలో (మొక్కలు/విత్తనాలు) ఒక నమూనా సస్యంలోని వివిధ రకాల యుగ్మ వికల్పాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దాన్ని బీజ పదార్థ సేకరణ అంటారు.

విశ్లేషణ, జనకుల ఎంపిక: బీజ పదార్థాన్ని సరైన రీతిలో విశ్లేషించడం ద్వారా ఉపయోగకరమైన లక్షణాలు గల మొక్కలను గుర్తించవచ్ఛు ఇలా ఎంపిక చేసిన మొక్కను వృద్ధి చేసి సంకరణ ప్రక్రియలో ఉపయోగిస్తారు. అవసరమైన, సాధ్యమైన చోట శుద్ధవంశ క్రమాలను సృష్టిస్తారు.

ఎంపిక చేసిన జనకుల మధ్య సంకర సంకరణం: వాంఛనీయ లక్షణాలు ఉన్న రెండు వేర్వేరు మొక్కలను సాధారణంగా సంకరణం చేయాలి.

ఉదా: ఎక్కువ ప్రొటీన్‌ నాణ్యత గల ఒక జనకాన్ని, వ్యాధి నిరోధకత కలిగిన మరొక జనకంతో సంకరణం చేసే అవసరం ఉంది. ఈ రెండు జనకుల మధ్య సంకరణం జరిపినప్పుడు ఉత్పత్తయ్యే ఒక సంకర మొక్కలోని ఈ రెండింటి జన్యు లక్షణాలు కలిసి ఉండే అవకాశం ఉంది. ఇది చాలా సమయంతో పాటు శ్రమతో కూడిన ప్రక్రియ. ఎందుకంటే వాంఛనీయమైన పురుష జనకునిగా ఎంచుకున్న మొక్క నుంచి పుప్పొడి రేణువులను సేకరించి స్త్రీ మొక్కగా ఎంచుకున్న మొక్కలోని పుష్పంలోని కీలాగ్రంపై ఉంచాలి. సంకరం (hybrid)లో వాంఛనీయ లక్షణాలు కలిసి ఉండాలని లేదు. సాధారణంగా కొన్ని వందల నుంచి వేల సంకరణలు జరిపితే ఒకదానిలో మాత్రమే వాంఛనీయమైన లక్షణాల కలయిక కనిపిస్తుంది.

వరణం, మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం: ఈ దశలో ఏర్పడిన సంతతి సంకర మొక్కల్లో, వాంఛనీయ లక్షణాలు కలిసి ఉన్న మొక్కలను ఎంచుకుంటారు. ఈ వరణ ప్రక్రియ అనేది ప్రజనన లక్ష్యాన్ని సాధించడంలో కఠినతరమైంది. సంతతి మొక్కల శాస్త్రీయ విశ్లేషణలో చాలా జాగ్రత్త అవసరం. ఈ దశ మొక్కలు రెండు జనకుల కంటే మేలైనవిగా ఏర్పడతాయి (సాధారణంగా ఒకటికంటే ఎక్కువ మేలైన సంతతి మొక్కలు పొందగలిగే అవకాశం ఉంది). వీటిని అనేక తరాలు ఆత్మపరాగ సంపర్కంతో, అవి సమానత్వ స్థాయికి (సమయుగ్మజత) చేరుకునే వరకు జరిపి, తద్వారా సంతాన మొక్కల్లో లక్షణాల పృథక్కరణ జరగకుండా చూస్తారు.

పరీక్షించడం, విడుదల, కొత్త సాగు రకాల వ్యాపారీకరణ: వరణం ద్వారా ఎంపిక చేసిన కొత్త క్రమాలను, అధిక దిగుబడి, ఇతర సాగుబడి చేసే వ్యవసాయ లక్షణాలైన నాణ్యత, వ్యాధి నిరోధకత లాంటి వాటి కోసం విశ్లేషిస్తారు. ఈ విశ్లేషణ వీటిని పరిశోధన క్షేత్రాల్లో సాగుచేయడం ద్వారా జరుగుతుంది. ఆదర్శమైన ఎరువు వాడకం, నీటిపారుదల, ఇతర సస్య నిర్వహణ పద్ధతుల ద్వారా వీటి నిర్వహణ సమర్థతను భద్రపరుస్తారు. పరిశోధనా క్షేత్రాల్లో విశ్లేషణ తర్వాత ఈ పదార్థాలను రైతుల పొలంలో కనీసం మూడు సాగుబడి చేసే రుతువుల్లో వివిధ ప్రదేశాలు సూచిస్తున్న, అంటే ఈ సస్యం సాధారణంగా పెరిగే వాతావరణ మండలాల్లో పరీక్షిస్తారు. ఈ పదార్థాలను సాగుబడి చేసే ఉత్తమమైన స్థానిక సస్యంతో - ఒక గుర్తు లేదా సూచనగా పోల్చి చూసి విశ్లేషిస్తారు.

చెరకు: శఖారమ్‌ బార్‌బెర్రీని ప్రాథమికంగా ఉత్తర భారతదేశంలో సాగుచేసేవారు. కానీ దీనిలో తక్కువ చక్కెర శాతం, తక్కువ దిగుబడి ఉండేది. దక్షిణ భారతదేశంలో సాగుచేసే ఉష్ణమండల మొక్కలైన శఖారమ్‌ అఫిసినారమ్‌ కాండాలు మందంగా ఎక్కువ చక్కెర భాగంతో ఉన్నా ఇవి ఉత్తర భారతదేశంలో సరిగ్గా పెరగవు. ఈ రెండు జాతులను జయప్రదంగా ‘సంకరణం’ చేసి అధిక దిగుబడి, మందమైన కాండాలు ఎక్కువ చక్కెర ఉత్తర భారతదేశంలోని చెరకు పండించే ప్రదేశాల్లో పెరిగే సామర్థ్యాన్ని కలిగినటువంటి అన్ని వాంఛనీయ లక్షణాలు ఉన్న చెరకు రకాలను పొందారు.

చిరు ధాన్యాలు: భారతదేశంలో మొక్కజొన్న, జొన్న, సజ్జల సంకరాలను జయప్రదంగా అభివృద్ధి చేశారు. సంకర ప్రజననం నీటి ప్రతిబలానికి నిరోధకత కలిగిన అనేక అధిక దిగుబడి రకాలను అభివృద్ధి చేయడానికి దారితీసింది.

2. పునఃసంయోజక డీఎన్‌ఏ సాంకేతిక విధానంలో వాడే సాధనాలను వివరించండి.

జ: పునఃసంయోజక డీఎన్‌ఏ సాంకేతిక పద్ధతిలో రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌లు, లైగేజ్‌లు, వాహకాలు, ఆతిథేయి అనే సాధనాలను ఉపయోగిస్తారు.

రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌లు: 1963లో ఈ.కొలైలోని బ్యాక్టీరియోఫాజ్‌ వృద్ధిని నిరోధించే రెండు ఎంజైమ్‌లను వేరుచేశారు. వీటిలో ఒకటి మిథైల్‌ సమూహాలను డీఎన్‌ఏకు జతపరిస్తే రెండోది డీఎన్‌ఏను ఛేదిస్తుంది. రెండో దాన్ని రెస్ట్రిక్షన్‌ ఎండోన్యూక్లియేజ్‌ అంటారు. విశిష్ట డీఎన్‌ఏ న్యూక్టియోటైడ్‌ వరుస క్రమం క్రియాశీలతపై ఆధారపడిన Hind-II అనే మొదటి రెస్ట్రిక్షన్‌ ఎండో న్యూక్లియేజ్‌ను వేరుపరిచారు. Hind-II, డీఎన్‌ఏ అణువులను ఆరు నత్రజని క్షారాల జతలు కలిగిన నిర్దిష్ట క్రమాన్ని గుర్తించి ఛేదిస్తాయని కనుక్కున్నారు. దీన్ని Hind-II గుర్తింపు అనుక్రమం అంటారు. Hind-II తోపాటు ప్రస్తుతం 900కు పైగా రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌లను 230కి పైగా బ్యాక్టీరియమ్‌ల రకాల నుంచి వేరుచేశారు. Eco RI అనే రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌లో E అనేది బ్యాక్టీరియమ్‌ ప్రజాతిని (ఈశ్చరీషియా), co అనేది దాని జాతి నామం, R అనే అక్షరం ఆ రకపు నామం, తర్వాత వచ్చే రోమన్‌ సంఖ్య I ఆ రకపు బ్యాక్టీరియా నుంచి వేరుచేసిన ఎంజైమ్‌ల వరుస క్రమాన్ని తెలియజేస్తాయి.

రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌లు న్యూక్లియేజ్‌లు అనే పెద్ద తరగతికి చెందినవి. ఇవి రెండు రకాలు.

1)ఎక్సోన్యూక్లియేజ్‌లు: డీఎన్‌ఏ కొనల నుంచి న్యూక్లియోటైడ్‌లను తొలగిస్తాయి.

2)ఎండోన్యూక్లియేజ్‌లు: డీఎన్‌ఏ లోపల నిర్దిష్ట ప్రదేశాల్లో ఛేదింపులు జరుపుతాయి. ప్రతి రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌ డీఎన్‌ఏలోని విశిష్టమైన పాలిన్‌డ్రోమిక్‌ న్యూక్లియోటైడ్‌ వరుస క్రమాలను గుర్తించి కత్తిరిస్తుంది. ఉదా: Eco RI

క్లోనింగ్‌ వాహకాలు: ఒక విజాతీయ డీఎన్‌ఏ ఖండితాన్ని తగిన ఆతిథేయిలోకి బదిలీ చేయడానికి ఉపయోగించే డీఎన్‌ఏను వాహకం అంటారు.

విజాతీయ డీఎన్‌ఏ క్రమాల వృద్ధికి ఉపయోగపడే వాహకాలను క్లోనింగ్‌ వాహకాలు అంటారు. సాధారణంగా ప్లాస్మిడ్లు, బ్యాక్టీరియోఫాజ్‌లు, కాస్మిడ్లు , కృత్రిమ క్రోమోజోమ్‌లను క్లోనింగ్‌ వాహకాలుగా వాడతారు. ప్లాస్మిడ్లు అన్ని బ్యాక్టీరియమ్‌లలో ఉండే వలయాకార డీఎన్‌ఏ అణువులు. వీటిని సులభంగా వేరుచేసి మళ్లీ ఆతిథేయిలోకి ప్రవేశపెట్టవచ్ఛు


వాహకంలో క్లోనింగ్‌ జరపడానికి ఉపయోగపడే లక్షణాలు

i)ప్రతికృతి అవిర్భావం: ఏ డీఎన్‌ఏ ఖండమైనా ప్రతికృతి వరుసక్రమంలో సంలగ్నమైనప్పుడు ఆతిథేయి కణాల్లో ప్రతికృతి, డీఎన్‌ఏ నకళ్లు సంఖ్యను నియంత్రించే పని చేస్తుంది.

ii) వరణం చేయదగిన మార్కర్‌ జన్యువులు: ఆరంభ ప్రతికృతి స్థానంతో పాటు ఒక వాహకానికి పరివర్తన చూపనివాటిని గుర్తించి తొలగించే విధంగా, పరివర్తన చూపే వాటి వృద్ధిని అనుమతించే విధంగా వరణం చేయదగిన మార్కర్‌ ఉండాలి. సాధారణంగా ఆంపిసిలిన్‌, క్లోరం ఫెనికాల్‌, టెట్రాసైక్లిన్‌, కానామైసిన్‌ లాంటి యాంటీబయాటిక్‌ నిరోధకత కలిగిన జన్యువులను ఈ కోలై బ్యాక్టీరియమ్‌కు చాలా ఉపయోగకరమైన వరణం చేయదగిన మార్కర్‌లుగా పేర్కొంటారు.

iii) క్లోనింగ్‌ ప్రదేశాలు: వాంఛనీయ డీఎన్‌ఏను జతపరచడానికి సాధారణంగా ఒక రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌కు అతి తక్కువ లేదా ఒకే గుర్తింపు స్థానం గల వాహకాన్ని వాడతారు.

iv) అణుభారం: క్లోనింగ్‌ వాహకం తక్కువ అణుభారం కలిగి ఉండాలి.

v) మొక్కలు, జంతువుల్లో జన్యు క్లోనింగ్‌ జరిపే వాహకాలు: వ్రణాలను ప్రేరేపించే ఆగ్రో బ్యాక్టీరియమ్‌ ట్యూమిఫేసియన్స్‌ Ti ప్లాస్మిడ్‌, జన్యు క్లోనింగ్‌ వాహకంగా రూపొందించబడింది. ఇది వ్యాధికారిగా కాకుండా వివిధ మొక్కల్లో వాంఛనీయ జన్యువులను ప్రవేశపెట్టి క్రియా విధానాన్ని కలిగి ఉంటుంది. రిట్రోవైరస్‌లను బలహీనపరిచి జంతు కణాల్లో వాంఛనీయ జన్యువులను ప్రవేశపెట్టడానికి ఉపయోగిస్తున్నారు.

పోటీపడే ఆతిథేయి: బ్యాక్టీరియమ్‌ల కణత్వచంలోని రంధ్రాల ద్వారా డీఎన్‌ఏ ప్రవేశించడానికి వీలుగా బ్యాక్టీరియమ్‌ కణాల సామర్థ్యాన్ని పెంచే విధంగా విశిష్టమైన గాఢత గల కాల్షియం లాంటి ద్విసంయోజక కాటయాన్‌లను వాడతారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.