close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/02/2020 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉత్తుంగ శిఖరాల్లో..ఆనంద నాదాలు

ట్రెక్కింగ్‌ అంటే ఇష్టమా..?

హిమాలయాలంటే ప్రాణమా..?

భక్తి భావన మెండుగా ఉందా..!

ఈ మూడింటి కలబోత..

మరెన్నో సాహసాల చిరునామా.. తుంగనాథ్‌.

ఉత్తరాఖండ్‌లోని ఈ పుణ్యధామం

విశేషాలు చదివేయండి.

త్తయిన పర్వతాలు.. అంతుచిక్కని లోయలు.. మధ్యలో ఉంటుంది తుంగనాథ్‌. కొండవాలులో పచ్చని గడ్డి మైదానాలు, సుగంధాలను వెదజల్లే పూల మొక్కలు ఉంటాయి. చుట్టూ దట్టమైన వృక్షాలు మంచు తెరలను చుట్టుకొని మసక మసకగా కనిపిస్తాయి. ఓ లోయలో ఎవరిపైనో అలకపూని ఎటో ఉరకలేస్తున్న అలకనంద కనిపిస్తుంది. మరో లోయ అంచున.. మంద్రంగా సాగిపోయే మందాకిని దర్శనమిస్తుంది. ఈ ప్రశాంత వాతావరణం పర్యాటక ప్రియులకు అంతులేని ఉత్తేజాన్నిస్తుంది. ఇక్కడి శివాలయం భక్తులకు కొంగు బంగారమై కనిపిస్తుంది. తాపసులకు సాధనాశ్రమంగా ఆశ్రయమిస్తుంది.

పాండవులు కట్టింది..

ఉత్తరాఖండ్‌ రుద్రప్రయాగ్‌ జిల్లా కేంద్రానికి 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తుంగనాథ్‌. మినీ స్విట్జర్లాండ్‌గా పేరున్న చోప్టా నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్ఛు పంచ కేదారాల్లో ఒకటిగా పేరొందిన తుంగనాథ్‌.. సముద్ర మట్టానికి సుమారు 12,073 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశాల్లో కొలువైన శివాలయాల్లో ఇదీ ఒకటి. పరమశివుడు స్వయంభువుగా పాండవులకు ఇక్కడ దర్శనమిచ్చాడని స్థల పురాణం. చోప్టా నుంచి కాలినడకన తుంగనాథ్‌ ఆలయానికి చేరుకోవాలి. నడక మార్గం కఠినంగా ఉండదు. పైగా రాతిబండలు పరచిన మార్గం చూడముచ్చటగా ఉంటుంది. అడుగడుగునా కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం మదిని పులకింపజేస్తుంది. పంచ కేదారాల్లో సులభమైన పర్వతారోహణ కలిగి ఉన్న ప్రదేశమూ ఇదే. అందుకే.. ట్రెక్కింగ్‌ ప్రియులు తుంగనాథ్‌కు క్యూ కడతారు. మొదటిసారి పర్వతారోహణకు వెళ్లదలచిన వాళ్లు దీనికి తొలి ప్రాధాన్యం ఇస్తారు.

శిఖరాగ్ర దర్శనం

తుంగనాథ్‌ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చంద్రశిల. రామాయణంలో ఈ ప్రాంతాన్ని ధ్యాన ప్రదేశంగా ప్రస్తావించడం విశేషం. చంద్రశిలకు చేరుకోవాలంటే మరింత పైకి వెళ్లాలి. ఇది సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుంచి నందాదేవి, పంచ్‌చులి, బందర్‌పూంచ్‌, కేదార్‌నాథ్‌, నీలకంఠ పర్వతాగ్రాలు కనువిందు చేస్తాయి. సూర్యోదయ సమయంలో.. అరుణ కాంతులీనే పర్వత శిఖరాలను చూసేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరుస్తారు. తుంగనాథ్‌ సమీపంలో కేదార్‌నాథ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంటుంది. ఇక్కడ మస్క్‌ జింకలు ప్రత్యేకం.

సాహసం శాయరా..

ఇన్ని అద్భుతాలున్న తుంగనాథ్‌ ఆలయాన్ని ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే దర్శించుకోగలం. శీతకాలంలో ఈ ప్రాంతమంతా మంచుతో నిండిపోతుంది. దీపావళి తర్వాత తుంగనాథ్‌ ఆలయాన్ని మూసివేస్తారు. ఉత్సవ విగ్రహాలను సమీపంలోని ఉకీమఠ్‌కు తరలిస్తారు. నవంబరు నుంచి చలిగాలుల తీవ్రత పెరుగుతుంది. మార్చిలో మంచు కరిగి కడిగిన ముత్యంలా మళ్లీ దర్శనమిస్తుంది తుంగనాథ్‌. సాహస యాత్రికులు మాత్రం దట్టంగా మంచు ఉన్నప్పటికీ.. ఇక్కడికి వస్తుంటారు. దిల్లీవాలాలు వారాంతపు విహారానికి దీనిని ఎంచుకుంటారు. ట్రెక్కింగ్‌, నైట్‌క్యాంప్‌ ఈవెంట్లలో పాల్గొంటారు. మార్చి మాసాంతం నుంచి మళ్లీ పర్యాటక కళ మొదలవుతుంది. వేసవిలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

కేదార్‌నాథ్‌, తుంగనాథ్‌, రుద్రనాథ్‌, మధ్య మహేశ్వర్‌, కపిలేశ్వర్‌.. వీటిని పంచ కేదార క్షేత్రాలుగా పిలుస్తారు. ఇవి రుషీకేశ్‌కు 250 కి.మీ. పరిధిలో ఉంటాయి. ఈ క్షేత్రాలను పాండవులు నిర్మించారని చెబుతారు.

చేరుకునేదిలా: దిల్లీ, హరిద్వార్‌, రుషీకేశ్‌, డెహ్రాడూన్‌ నుంచి తుంగనాథ్‌ వెళ్లడానికి అద్దెకు వాహనాలు లభిస్తాయి. చోప్టా వరకు వెళ్లి.. అక్కడి నుంచి ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. చోప్టాలో బస సదుపాయం ఉంది.

- నిమ్మల ప్రకాశ్‌రెడ్డి, నిజామాబాద్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.