close
Array ( ) 1

తాజా వార్తలు

ధూం..ధాం... కనకవ్వ!

మొన్నటి వరకు ‘అంగూర్లు.. అరటి పండ్లు..’ అంటూ నోరుపోయేలా అరిచినా ఎవరూ వినేవారే లేరు.. ఇప్పుడు ఆమె గొంతెత్తి పాడితే చెవులు రిక్కించి విననివారుండరు! 64 ఏళ్ల కనకవ్వ పాడిన మేడారం జాతర పాటకు 65 లక్షలమంది అభిమానులు ఉండటం విశేషం....  
కనకవ్వ చిన్నప్పటి నుంచే తల్లితో కలిసి నాటు వేసేందుకు, కలుపు తీసేందుకు వెళ్లేది. అమ్మ ముందుండి పాడితే వెనుక మునుము పట్టినవాళ్లందరూ ఆమెతో రాగమెత్తేవారు. అప్పటి నుంచే ఆమెకు పాటపై మమకారం పెరిగింది. ఉయ్యాల పాటలు, గౌరమ్మ పాటలు, బావామరదళ్లు, భార్యాభర్తలు, కాముడు పాటలు... ఇలా ఆమె పాడే పల్లెపదాలెన్నో! అక్షరం ముక్క రాని కనకవ్వ అయిదు వందలకు పైగా జానపదాలను అలవోకగా పాడేయగలదు.
టిక్‌టాక్‌ చూసి...
జొన్నచేన్లకు పోయినా, పత్తేరడానికి వెళ్లినా ఆమె పాటతోనే పనిచేసేది. సాయంత్రం ఇంటికి వచ్చి చెల్లెళ్లతో కలిసి విశ్రాంతి కోసం గొంతెత్తేది. అప్పుడే టిక్‌టాక్‌, యూట్యూబ్‌లో పిల్లలు వినే ఎన్నో పల్లెపాటల్ని విని ‘అవన్నీ మనకు తెలిసినవే కదా... మనమెందుకు పాడకూడద’ని అనుకునేదామె. అప్పుడే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ వాళ్లు పాటల పోటీలు నిర్వహిస్తున్నారని ప్రకటన ఇచ్చారు. తన మనవళ్ల ద్వారా విషయం తెలుసుకుందామె. తనకు వచ్చిన పాటలు పాడి వారికి పంపించింది. మొత్తం మూడు వేల మంది పోటీపడినా... కణకణలాడే కనకవ్వ గొంతే నిర్వాహకులకు నచ్చింది. అప్పటి నుంచే ఆమె దశ మారిపోయింది. పాడినవి ఆరు పాటలే అయినా లక్షల్లో వీక్షకులు. ఈ సంక్రాంతికి పాడిన గొబ్బియ్యల్లో... గొబ్బియ్యల్లో పాట, మేడారం జాతర పాటను తక్కువ కాలంలోనే 65 లక్షల మంది విన్నారు. ఇప్పుడా గొంతు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నవే అవ్వ’ అంటూ కామెంట్లు పోటెత్తుతున్నాయి.
కనకవ్వ సొంతూరు హుస్నాబాద్‌ దగ్గర బొడిగేపల్లి. రెండేళ్ల క్రితం వరకు సొంతూర్లో వ్యవసాయం చేసుకునేది. తరువాత రామగుండానికి వచ్చింది. ఇక్కడే పొట్టకూటి కోసం అంగూర్లు, అరటి పండ్లు, సీతాఫలాలు అమ్ముకునేది. ‘కాలాలు సక్కగ లెవ్వు. బాయిలు ఎండిపోయినయ్‌. నాటేస్తే వరి ఎండిపోతోంది. పెట్టుబడి పైసలు రాలేదు. తిండికి తిప్పలయ్యేది. అందుకే రామగుండానికి వచ్చిన. ఇప్పుడెక్కడికి పోయినా నన్ను గుర్తిస్తుండ్రు. ఇంటికి వచ్చి నాతో సెల్ఫీలు దిగుతుండ్రు. ఆ పాట పాడింది నువ్వే కదనే అమ్మమ్మ అంటూ పలకరిస్తుండ్రు’ అని ఆనందంగా చెబుతోంది కనకవ్వ. ఇప్పుడామెకు సినిమా అవకాశాలు సైతం వస్తున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.