close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 20/02/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ పోరాటం ఇంటి నుంచే మొదలైంది!

వసుంధరతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ అంజలి బిషత్‌

...అక్కడ వాళ్లు పనికిరారు.. అన్నవాళ్లకు వాళ్లో సమాధానమయ్యారు. ఇంటినే కాదు, దేశాన్నీ మేం రక్షిస్తామంటూ ముందుకువచ్చారు. ‘అలా కుదరదు’ అన్న అభిప్రాయంపై పెను పోరాటమే చేశారు.

ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో వారు అనుకున్నది సాధించారు. రక్షణరంగంలో పురుషులతో సమానంగా హక్కులు సాధించుకున్నారు.

ఇంతటి గెలుపు వెనుక 13 మంది ఆర్మీ మహిళాధికారుల ఆశయం ఉంది. పదహారేళ్ల పోరాటం ఉంది. వారిలో ఒకరైన లెఫ్టినెంట్‌ కల్నల్‌ అంజలి బిషత్‌ తన అనుభవాలను ‘వసుంధర’తో
పంచుకున్నారు... 

మాది ఉత్తరాఖండ్‌లో ఓ కుగ్రామం. సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాన్న ప్రభుత్వోద్యోగి, అమ్మ ఉపాధ్యాయిని. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఒక తమ్ముడు. ఇంటర్‌ తరువాత కంప్యూటర్‌ కోర్సు చేయాలనుకున్న నా దిశను నాన్నే మార్చేశారు. మా ప్రాంతంలో అబ్బాయిలందరూ ఆర్మీలో చేరేవారు. మాకది సర్వసాధారణం. కానీ అమ్మాయిలు అటువైపు వెళ్లేవారు కాదు. అయితే నాన్న మాత్రం అలా అనుకోలేదు. ఆడపిల్లలమైనా మమ్మల్ని కూడా దేశసేవలో భాగస్వాములు కావాలని అనేవారు. అలా నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. డెహ్రాడూన్‌లో డిగ్రీ చదివా. తరువాత లఖ్‌నవూలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజిమెంటు కోర్సు చేశా. అదే ప్రాంతానికి సమీపంలో మిలటరీ శిక్షణ ఇచ్చేవారు. ఆ శిక్షణ నన్ను భలే ఆకర్షించేది. ప్రతిరోజూ ఆ శిక్షణ చూస్తూ...కాలేజీకి వెళ్లేదాన్ని. ఓ పక్క నాన్న మాటలు, మరో పక్క ఆర్మీ శిక్షణ ఇవన్నీ నేను ఆర్మీలో చేరడానికి కావాల్సిన స్ఫూర్తినిచ్చాయి.

ఆ మాటే వినలేదు...
అమ్మానాన్నలు ఇంట్లో మా నలుగురిని ఒకేలా పెంచారు. అందుకే లింగవివక్ష అనే మాట గురించి కూడా నాకు అప్పట్లో తెలీదు. అమ్మాయిలను గౌరవించే సంప్రదాయంలో పెరిగా కదా! ఇరువురిలోనూ సమాన సామర్థ్యాలుంటాయి, అందరం మనుషులమే అనేవారు నాన్న. అటువంటి చోట పెరిగిన నేను.. ఆర్మీ ట్రైనింగ్‌ ముగించుకుని విధుల్లో చేరా. ఉత్తరాఖండ్‌ నుంచి బాధ్యతలు తీసుకున్న తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్‌ని నేను. దాంతో ఊర్లో నన్ను ప్రత్యేకంగా చూసేవారు. ‘అనుకున్న లక్ష్యాన్ని సాధించావు. బాధ్యతలను నిర్వర్తించడంలో అంకితభావంతో ఉండు’ అంటూ అమ్మ నన్ను ఆశీర్వదించి విధుల్లోకి పంపించింది.

చిన్నప్పటి నుంచి క్రీడల్లో ప్రవేశం ఉన్న నేను, విధుల్లో చేరిన తరువాత కూడా ఆర్మీ తరఫున టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నా. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ, ఆర్మీ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఇన్‌స్ట్రక్టరుగా పనిచేశా. వృత్తి రీత్యా ఎన్నో ప్రశంసలు అందుకున్నా. టెక్నికల్‌ విభాగంలో సిగ్నల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నా. అయితే ఎన్నేళ్లు పనిచేసినా మా కన్నా జూనియర్‌గా ఉండే మగవాళ్లకు పదోన్నతి లభించేది. మా పరిస్థితి మాత్రం ఎన్ని సాధించినా... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండేది. అలాగని పదోన్నతి కోసం పనిచేయడం కాదు, అదొక ప్రోత్సాహాన్నిస్తుంది. మనసుకు తృప్తి కలుగుతుంది. అందుకే ఈ అసమానత్వాన్ని ప్రశ్నించాలనిపించేది.
అలా 16 ఏళ్లక్రితం నా భావాలతో ఏకీభవించిన మరో 12 మంది మహిళా ఆఫీసర్లు నాతో చేయి కలిపారు. మొత్తం 13మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం. ఆర్మీ మహిళా ఆఫీసర్లకు శాశ్వత కమిషన్‌ అవకాశాన్ని కల్పించాలంటూ కోరాం. కానీ అక్కడ మాకు అనువుగా తీర్పు రాలేదు. దాంతో పదేళ్లక్రితం సుప్రీం కోర్టులో మా అభ్యర్థనను విన్నవించాం. మా లక్ష్యం... మా తరువాతి తరానికి ఉపయోగపడాలి అనుకున్నాం. ఇప్పుడు మా ఆశయం నెరవేరుతుందనే నమ్మకం వచ్చింది. నా వయసు ఇప్పుడు 45 ఏళ్లు. ఇంకా తొమ్మిదేళ్ల సర్వీసుంది. ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇంకెంతోమంది ఈ రంగంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొందరికి ఈ రంగంలోకి రావాలని ఉన్నా, శాశ్వత కమిషన్‌ సౌకర్యం లేకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. అటువంటి వారందరికీ ఈ తీర్పు మరింత మార్గనిర్దేశకత్వమే కాదు, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఎంతో ఉపయోగకరమవుతుంది. నాలా ఇప్పటివరకు విధులు నిర్వహిస్తూ... ఉన్నతస్థానాన్ని పొందే అర్హత ఉండి కూడా అదే స్థానాల్లో ఉండేవారికీ అవకాశాలు వస్తాయి.   

మావారే సహకరించారు...
మావారు కూడా ఆర్మీలో పనిచేస్తారు. అత్తగారింట్లో భార్యాభర్తలిద్దరూ ఆర్మీలో ఉండకూడదనేవారు. మావారు నాకు మద్దతిచ్చేవారు. కోర్టులో కేసు దాఖలు చేసేటప్పుడు కూడా మావారి సహకారం చాలా ఉంది.  మాకిద్దరు పిల్లలు. మా సర్వీస్‌లో మేమిద్దరం చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. ఇద్దరం మారుమూల ప్రాంతాల్లో పనిచేయాల్సి వచ్చేది. అయిదేళ్ల లోపు పిల్లలను అమ్మకు అప్పగించి విధులకు వెళ్లేవాళ్లం. నేను అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉంటే, మావారు కశ్మీరులో పనిచేసేవారు. పిల్లలు ఉత్తరాఖండ్‌లో ఉండేవారు. మావారికి లేని నియమాలు,  మహిళను కావడంతో వృత్తిలో నాకు ఉండేవి. వీటన్నిటికీ త్వరలో చెెక్‌ పెట్టే సమయం ఆసన్నమైంది.


నేను చేరిన చోట పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ మహిళలంటే చిన్నచూపు ఉండేది. మహిళా అధికారులు పురుషులతో సమానంగా విధులు నిర్వహించలేరనే భావంతో చూసేవారు. దాన్ని నేను జీర్ణించుకోలేకపోయేదాన్ని. ఆర్మీ అంటే ఎంతో ఉన్నతమైన విభాగం. ఇటువంటి చోట కూడా మహిళల్ని వేరుగా చూడటం నాకు నచ్చేది కాదు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.