close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 21/02/2020 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ మార్ఫు..మంచిదేం కాదు!

మాడిఫికేషన్‌-బీమా భారం

అమీర్‌పేట చౌరస్తా...

రయ్‌మని దూసుకొచ్చిన కుర్రాడు ఎరుపు సిగ్నల్‌ పడగానే సడెన్‌ బ్రేక్‌తో ఆగిపోయాడు...

బండికున్న పొడవైన పొగగొట్టం తెగ రొద పెడుతోంది!

ఇంకాస్త ముందుకెళ్తే... అగ్గిపెట్టెంత కారు అలాయ్‌ చక్రాలు బిగించుకొని వాయువేగంతో వెళ్తోంది!!

మాడిఫైతో ముస్తాబై రోడ్లపై చక్కర్లు కొట్టే ఇలాంటి వాహనాలు అడుగడుగునా కనిపిస్తాయ్‌...

కానీ ఈ మార్పుచేర్పులు వాహనం బీమా ప్రీమియం భారీగా పెంచేస్తాయనే విషయం మీకు తెలుసా?

‘లక్షలు పోసి కొన్న బండికి ఇంకొన్ని వేలు పెట్టి నాకు నచ్చినట్టుగా మార్పు చేయించుకుంటే తప్పేంటట?’ అనుకునేవాళ్లు ఎందరో. మార్పు మంచిదే అయినా అది చట్టం పరిధికి లోబడి ఉండాలనేది నియమం. లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. దాంతోపాటు మనకు ప్రమాదాల్లో రక్షణగా ఉంటుందని భావించే బీమా ప్రీమియం సైతం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ మార్పుచేర్పుల కథ పూర్తిగా తెలుసుకోవాల్సిందే.

భారమెందుకు?

కొన్ని మాడిఫికేషన్లు వాహనం ఆకారాన్నే కాదు, పనితీరునూ మార్చేస్తాయి. ఉదాహరణకు ఇంజిన్‌, బ్రేకులు, పొగగొట్టాలు, చిన్నకార్లకు లగ్జరీ ఫీచర్లు చేర్చడంలాంటివి. ఇలా చేయడం వల్ల వెహికిల్‌ దొంగతనానికి గురయ్యే అవకాశాలెక్కువ. భద్రత విషయంలోనూ రాజీ పడాల్సి ఉంటుంది. ప్రమాదాలెక్కువ జరుగుతాయి. దాంతో బీమా కంపెనీ అత్యధిక ప్రీమియం చెల్లించమని వాహనదారుడికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకే పాలసీ కొనుగోలు చేసే సమయంలో ద్విచక్రవాహనం, కారు, ఇతర వాహనం ఏదైనా మాడిఫికేషన్స్‌ చేయించినట్లైతే పూర్తి వివరాలు చెప్పాలి. వీటిని దాస్తే ప్రమాదం జరిగినప్పుడు క్లెయింలను తిరస్కరించే అవకాశం ఉంటుంది.

వీటితో మోత

ఇంజిన్‌ మాడిఫికేషన్లు: ఇంజిన్‌కి చేసే మార్పులు దాని సామర్థ్యాన్ని పెంచుతాయి. అంటే వేగం పెరిగి తద్వారా ప్రమాదం జరిగే అవకాశాలుంటాయి. దాంతో ప్రీమియం అమాంతం పెంచేస్తాయి బీమా కంపెనీలు.

బ్రేకుల్లో మార్పులు: బైకులు, కార్లలో బ్రేకింగ్‌ వ్యవస్థ సమర్థంగా పని చేయడానికి అత్యాధునిక, కొత్త బ్రేకులు అమర్చుతుంటారు కొందరు. ఇవి భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంటే బీమా కంపెనీ తప్పకుండా ప్రీమియం పెంచుతుంది.

ఇంటీరియర్‌లో మార్పులు: కారు లోపల ఏవైనా కొత్తవి బిగించినా, ఉన్నవాటిని తొలగించినా ఫర్వాలేదుగానీ అవి డ్రైవింగ్‌ సేఫ్టీ, వాహనం సామర్థ్యంపై ప్రభావం చూపిస్తే ప్రీమియంలో తేడా వస్తుంది.

వీటితో తప్పదు: ఎక్కువమంది స్పాయిలర్లు, ఎగ్జాస్ట్‌ సిస్టమ్‌, వీల్‌ రిమ్‌ మార్చుతుంటారు. వీటితో వాహనం పనితీరులో తప్పకుండా మార్పు వస్తుంది. పాలసీదారు అదనంగా ప్రీమియం చెల్లించాల్సిందే.

భారీ మూల్యం: క్రోమ్‌ బంపర్లు, ఫాగ్‌ లైట్లు, రేసింగ్‌ టైర్లు, క్రోమ్‌ చక్రాలు, హుడ్‌ ఆర్నమెంట్స్‌, కారు అడుగుభాగంలో యాక్సెంట్‌ లైట్లు, భారీ స్టీరియో మ్యూజిక్‌ సిస్టమ్‌.. వీటిపై ప్రీమియం పెంపు ఎక్కువగా ఉంటుంది.

మనమే తెలుసుకోవాలి

అధిక వేగం, వాహనాలను ఓవర్‌టేక్‌ చేయడం రోడ్డుప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణాలు. అందుకే వేగం పెంచే ఎలాంటి మార్పునైనా బీమా కంపెనీలు హర్షించవు. బ్రేకులు, సస్పెన్షన్‌ అప్‌గ్రేడ్‌ చేసే మాడిఫికేషన్స్‌పై సైతం ప్రీమియం పెంచుతాయి. డీలర్‌ లేదా తయారీదారు నుంచి వాహనం కొనుగోలు చేసినప్పుడు ఉన్న స్థితి, విధానం, సామర్థ్యం, ప్రదర్శనలో ఏమాత్రం తేడా వచ్చినా అది అదనపు మార్పు చేర్పులుగా పరిగణిస్తారు. బండి కొంటున్నప్పుడు డీలర్‌ ఇవ్వజూపే ఉచిత వస్తువులు సైతం ఈ జాబితాలో ఉంటాయనే విషయం గమనించాలి. బీమా విషయానికొస్తే చోరీకి గురయ్యే అవకాశం, ప్రమాదం జరిగే రిస్క్‌ ఉన్న మాడిఫికేషన్స్‌పై ప్రీమియం అధికం చేస్తారు. ఇంజిన్‌, బాడీ కిట్స్‌, స్పాయిలర్లు, స్పోర్ట్స్‌ సీట్లలాంటి వాటిని బీమా సంస్థలు ప్రధాన మార్పులుగా పరిగణిస్తాయి. స్టీరింగ్‌, పెడల్స్‌, సౌండ్‌ సిస్టం, మొత్తం రంగు మార్చడం, ఆర్‌సీ రికార్డులలో చేర్చేవి సైతం ప్రీమియంలో తేడా తీసుకొస్తాయి. ఇలాంటి ప్రతి మార్పుచేర్పులు బీమా కంపెనీకి తెలియజేయాలి. వీటితోపాటు సీఎన్‌జీ, ఎల్‌పీజీ కిట్‌ బిగించినప్పుడు బీమా కంపెనీకి రిక్వెస్ట్‌ లెటర్‌, రిజిస్ట్రేషన్‌ పత్రం, ఎల్‌పీజీ/సీఎన్‌జీ కిట్‌ బిల్‌, వాహన తనిఖీ పత్రం.. సమర్పించాలి. విద్యుత్తు పరికరాలు బిగించినా, విప్పదీసినా.. తెలియజేయాలి. వాటి బిల్లులు, సామర్థ్యం వివరాలు సమర్పించాలి. తెలిసో, తెలియకో ఈ మార్పుచేర్పులను బీమా సంస్థకు తెలియజేయకపోయినా బీమా క్లెయిం తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

- సజ్జా ప్రవీణ్‌చౌదరి, పాలసీబజార్‌

ఇవైతే ఫర్వాలేదు

పెయింట్‌ వర్క్‌: బాడీ పెయింట్‌తో బండి పనితీరుపై ఎలాంటి ప్రభావం పడదు. ప్రమాదకరమూ కాదు. వాహనం రంగు మార్చినా, వెలిసిపోయిన రంగుపై అదే రంగు వేసినా ఇబ్బందేం లేదు.

స్టిక్కరింగ్‌: అందం కోసం.. నచ్చిన వ్యక్తుల చిత్రాలు.. ఇష్టమైన నినాదాలు.. ఇలా కొందరు వాహనాలపై రకరకాల స్టిక్కర్లు అతికిస్తుంటారు. వీటితో పనితీరులో మార్పేమీ ఉండదు. ప్రీమియంలో తేడాలుండవు.

అదనమైనా: ఏసీ, సౌండ్‌ సిస్టమ్‌, కొత్త సీట్లు.. ఇలాంటివి అదనంగా చేర్చినంత మాత్రాన వచ్చిన ముప్పేం లేదు. పెద్దగా రిస్క్‌ ఉండదు. యాక్సిడెంట్‌ అయ్యే అవకాశం లేదు. మనకు నిశ్చింతే.

రాయితీలూ: వాహనాలు చోరీ కాకుండా కాపాడే యాంటీ థఫె్ట్‌ పరికరాలను బిగించుకుంటే బీమా కంపెనీలు ప్రీమియం మొత్తంలో రాయితీలు ఇస్తాయి. వాటికి ఆటోమోటివ్‌ రిసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (అరాయ్‌) ఆమోదం ఉంటే మరీ మంచిది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.