close

తాజా వార్తలు

Published : 25/02/2020 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆయనే నాకు తొలి హిట్‌ ఇచ్చారు

శ్రేయాఘోషాల్‌... పరిచయం అక్కర్లేని గాయని. దాదాపు పదకొండు భాషల్లో వివిధ సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన ఈ ప్రతిభావని.. తన విజయం వెనుక ఉన్న ఐదుగురు సంగీత దర్శకుల గురించి చెబుతోందిలా...

మణిశర్మ... నాకు తొలి హిట్‌ ఇచ్చారు

తెలుగులో కొన్ని వందల పాటల పాడి ఉంటా కానీ... నా మొదటి హిట్‌ మాత్రం ఒక్కడులోని ‘నువ్వేం మాయ చేశావో గానీ...’. ఈ రోజుకీ ఆ పాటను పాడమని తెలుగు అభిమానులు అడుగుతున్నారంటే దానికి కారణం ఆ సంగీత దర్శకుడు మణిశర్మే. ఆ తరువాత ఆయనతో కలిసి ఠాగూర్‌, అతడు, బాలు... ఇలా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో యాభైకి పైగానే సినిమాలు చేసిఉంటా. నాకు భాష రాకపోయినా ఏ పాట ఎలా పాడాలో, భావాలు ఎలా పలకాలో ఓపిగ్గా చెబుతూ తెలుగుభాషపైన ఉన్న భయాన్ని పోగొట్టారు. ఆ సూచనలు నాకు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. ఎప్పుడు రికార్డింగుకు వెళ్లినా మణిశర్మ తన ఇంటినుంచి భోజనం తెప్పించేవారు. పదార్థాల పేర్లు గుర్తులేవు కానీ... ఆ భోజనాన్ని తలచుకుంటే ఇప్పటికీ నోరూరుతుంది.


రాజా సర్‌ అంటే... పాట బట్టీ పట్టాల్సిందే

ఇళయరాజా ఎదురుగా నిల్చుని పాడే ఛాన్స్‌ ఒక్కసారి వస్తే బాగుండని ఎంతోమంది గాయకులు ఎదురు చూస్తే... నాకు మాత్రం ఎన్నో పాటలు ఆయన దగ్గర పాడే అవకాశం వచ్చింది. తమిళంలో ఆయన దగ్గరే ఫస్ట్‌ పాట పాడాను. రాజాసర్‌ రికార్డింగ్‌ రూంలోకి వచ్చేసరికి గాయకులు ఆ పాటను బట్టీ పట్టేయాలి. ఒక్కసారి రికార్డింగ్‌ మొదలుపెట్టాక... ఒక్క పదం కానీ, స్వరం కానీ తప్పు వచ్చినా సహించరు. అలా ఏకాగ్రతతో, ఏ పొరపాటూ చేయకుండా ఎలా పాడాలో ఆయన దగ్గరే నేర్చుకున్నా. అనుమానాస్పదం, శ్రీరామరాజ్యం, రుద్రమదేవి... ఇలా చాలా సినిమాలు ఆయనతో కలిసి చేసినందుకు గర్వంగా అనిపిస్తుంది.


తమన్‌... రాజీ పడడు

ఒకప్పుడు నేను మెలొడీ పాటలే పాడగలనని పేరుండేది. అలాంటిది నాచేత ఎన్నో ప్రయోగాలు చేయించి, నాకంటూ ఓ గుర్తింపు తీసుకొచ్చాడు.  అభిమానులూ ఆశ్చపోయేలా చేశాడు. మందారా మందారా తరహా మెలొడీ మాత్రమే కాదు, ఏయ్‌ రాజా, బ్లాక్‌బస్టర్‌, హే నాయక్‌, బూచాడే బూచాడే లాంటి క్రేజీ, మాస్‌ పాటలూ పాడగలిగానంటే దానికి కారణం తమనే.   ఏదయినా మాస్‌పాట చెప్పినప్పుడు... ‘నా వల్ల కాదేమో’ అంటే.. ‘మీరు పాడగలరు ట్రై చేయండి’ అని ప్రోత్సహిస్తూ, నా ఆలోచనా విధానాన్నే మార్చేశాడు. అందుకే అతనితో పనిచేయడానికి నేనెప్పుడూ ఇష్టపడతా.


సంజయ్‌లీలా భన్సాలీ... భావాలు పలకాలి

పేరుకు సినిమా దర్శకుడైనా... తన సినిమాల్లో చాలావాటికి సంజయ్‌నే స్వరాలు సమకూర్చారు. ఏ పాటకైనా నేను న్యాయం చేయగలనని నమ్మి తన ప్రతి సినిమాలో ఇప్పటికీ నాకంటూ ఓ పాట కచ్చితంగా ఉండేలా చూస్తున్నారు. పాట ఏదైనా... దానికి తగినట్లుగా రకరకాల భావాలూ, ఉద్వేగాలూ పలికించడం ఆయన్నుంచే నేర్చుకున్నా. దేవదాస్‌ నుంచి రామ్‌లీలా, బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌... ఇలా అన్నింట్లో ఎన్నో హిట్స్‌ పాడాను. తనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాక నా పాటతీరూ మారింది. పాట భావాన్ని పూర్తిగా అర్థంచేసుకుని పాడటం... తన నుంచే నేర్చుకున్నా. ఈ మెలకువలు ఇతర పాటలు పాడేందుకూ ఉపయోగపడ్డాయి.


ఎ.ఆర్‌. రెహమాన్‌... ఓ మ్యాజిక్‌

పాడకపోయినా ఫరవాలేదు కానీ... రెహమాన్‌ ఏదయినా పాటకు స్వరం సమకూరుస్తున్నప్పుడు చూసినా చాలనేది నా అభిప్రాయం. నిజానికి రెహమాన్‌ పాటకు ఓ ఫార్ములా అంటూ ఉండదు. సినిమా విడుదలయ్యేదాకా ఆ పాట ఎలా వస్తుందనేదీ తెలియదు. పాట పూర్తయ్యేలోగా ఎన్నో స్వరాలు మార్చి మార్చి పాడిస్తారు. దాంతో ఏ స్వరమైనా పాడగలమనే నమ్మకం, ఆత్మవిశ్వాసం మాకు వచ్చేస్తుంది. అదిరింది, మామ్‌, ఐ, 99 సాంగ్స్‌ సినిమాల్లోని పాటలే కాదు...  ప్రేమించే ప్రేమవా, బర్సోరే మేఘా... వంటివీ ఆయన నుంచి వచ్చినవే. ఒక సందర్భానికి కుదిరేట్టుగా ఎన్నో స్వరాలు మార్చడం కష్టమైనా అన్నింటినీ సమన్వయం చేసి ఓ మంచి పాట తీసుకురావడం ఆయనకే చెల్లుతుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.