close

తాజా వార్తలు

Updated : 07/03/2020 06:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హోలీ జరుపుకోవద్దా?.. యెస్‌ బ్యాంక్‌పై మీమ్స్‌

 

దిల్లీ: నిన్నమొన్నటి దాకా కరోనా వైరస్‌పై మీమ్స్‌తో సామాజిక మాధ్యమాలు నిండగా.. ఇపుడు తాజాగా యెస్‌ బ్యాంకు సంక్షోభం కూడా చేరింది. గురువారం రాత్రి నుంచే అవి మొదలయ్యాయి. అందులో కొన్ని

* మన బ్యాంకుల పనితీరు చూస్తుంటే.. 3 ట్రిలియన్‌ లక్ష్యం దిశగా పయనిస్తున్నట్లుంది. అయితే అవి 3 లక్షల కోట్ల డాలర్లు కాదు. 3 లక్షల కోట్ల పైసలు.
* రిపోర్టర్‌: ఆర్థిక మంత్రి గారూ, యెస్‌ బ్యాంక్‌ పరిస్థితి బాగోలేదు కదా? మరి ఫర్వాలేదా?
మంత్రి: ఇబ్బందేమీ లేదు. నా ఖాతా ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉంది.
* గతేడాది పీఎమ్‌సీ బ్యాంకును దీపావళికి 10 రోజుల ముందు మూసేశారు. నా సేవింగ్స్‌ అన్నీ పోయాయి. దీపావళి జరుపుకోలేకపోయా. తర్వాత నా ఖాతాను యెస్‌ బ్యాంకులో తెరచా. ఇపుడు హోలీకి 5 రోజుల ముందు ఇది జరిగింది. మళ్లీ నా డబ్బులు పోతున్నాయి. మోదీజీ మేం పండగలు జరుపుకోవాలా వద్దా?
* ఒక ఆనిమేనెట్‌ పిక్చర్‌పై యెస్‌ బ్యాంకు జారీ చేసిన రూ.5 కోట్ల చెక్‌ ఉంటుంది. దానిపై ‘పనికిరాని చెక్‌’ అని ఉంటుంది.
* యెస్‌ బ్యాంక్‌ మాజీ ఛైర్మన్‌ రాణా కపూర్‌ ఫొటో పెట్టి.. ఆయన చెప్పిన వ్యాఖ్యలను (‘వజ్రాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. నా ప్రమోటరు (యెస్‌ బ్యాంకు) షేర్లు కూడా అంతే’) జోడించిన మీమ్‌ మరోటి.


నెలలోపే పునరుజ్జీవం: ప్రశాంత్‌ కుమార్‌

దిల్లీ: ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌ఓ ప్రశాంత్‌ కుమార్‌ శుక్రవారం బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు యెస్‌ బ్యాంకు తెలిపింది. బ్యాంకు బోర్డును రద్దు చేస్తూ ఆయనను పాలనాధికారిగా నియమిస్తూ గురువారం రాత్రి ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్‌బీఐ విధించిన 30 రోజుల మారటోరియం గడువు ముగిసేలోపే బ్యాంకును పునరుజ్జీవం చేసేలా పరిష్కారంపై కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడానికి ఆర్‌బీఐ మారటోరియం విధించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.


ఫోన్‌పేపై ప్రభావం

ముంబయి: మారటోరియం విధించడంతో యెస్‌ బ్యాంక్‌ డిజిటల్‌ భాగస్వామి అయిన ఫోన్‌పేపై ప్రభావం పడింది. గురువారం సాయంత్రం నుంచి బ్యాంకు నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాలు పనిచేయని సంగతి తెలిసిందే. ఇక యెస్‌ బ్యాంక్‌ లావాదేవీలపై ఆధారపడ్డ ఇతర ఫిన్‌టెల్‌ ఆపరేటర్లు కూడా లావాదేవీలను నిర్వహించలేకపోయారు. అయితే సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి రాత్రింబవళ్లు కృషి చేస్తున్నట్లు.. కొన్ని గంటల్లోనే ఆ పని జరుగుతుందని ఫోన్‌పే సీఈఓ సమీర్‌ నిగమ్‌ శుక్రవారం ఉదయం ట్వీట్‌ చేశారు.


రంగంలోకి ఫండ్‌ సంస్థలు

ముంబయి: ప్రత్యామ్నాయ ఖాతా నంబర్లను ఇవ్వాల్సిందిగా యెస్‌ బ్యాంకు ఖాతాలున్న క్లయింట్లను మ్యూచువల్‌ ఫండ్‌లు కోరుతున్నాయి. తద్వారా బాండ్లు లేదా ఫండ్‌లకు సంబంధించిన రెడెమ్షన్లు(చెల్లింపులు)కు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రయత్నిస్తున్నట్లు కోటక్‌మహీంద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. యెస్‌ బ్యాంక్‌ ఖాతాలకు చెల్లింపులు జరగకుండా చూస్తున్నట్లు ఎడెల్‌వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. క్లయింట్లను ప్రత్యామ్నాయ ఖాతాలను పంపాలని కోరింది. జెరోధా కూడా యెస్‌ బ్యాంకుకు వెళ్లాల్సిన చెల్లింపులను రద్దు చేసింది.


అదనపు టైర్‌-1 బాండ్‌దార్లకు రూ.10,800 కోట్ల నష్టం

ముంబయి: యెస్‌ బ్యాంకుకు ఆర్‌బీఐ ప్రకటించిన పునర్నిర్మాణ పథకం అమల్లోకి వస్తే అందరికంటే ఎక్కువ నష్టపోయేది అదనపు టైర్‌-1 బాండ్‌దార్లేనని విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా ఈ బాండ్‌హోల్డర్లుగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, బ్యాంకు ట్రెజరీలు ఉంటాయి. బాసెల్‌-2 కింద యెస్‌ బ్యాంక్‌ జారీ చేసిన ఈ బాండ్లు పునర్నిర్మాణ పథకం కింద రద్దు అవుతాయి. అదే జరిగితే ఈ బాండుదార్లకు రూ.10,800 కోట్ల నష్టం వాటిల్లుతుంది.


ఈ ఫండ్‌ల పెట్టుబడులు.. అంతేనా?

ముంబయి: యెస్‌ బ్యాంకు షేర్లు, బాండ్లలో మ్యూచువల్‌ ఫండ్‌లు రూ.3,345.48 కోట్ల నిధులు పెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 31, 2020 నాటికిట దాదాపు 24 ఫండ్‌ సంస్థలకు యెస్‌ బ్యాంకు షేర్లలో రూ.526.42 కోట్ల పెట్టుబడులు; 11 ఫండ్‌ సంస్థలకు బ్యాంకు బాండ్లలో రూ.2,819.06 కోట్ల మేర పెట్టుబడులు ఉన్నట్లు మార్నింగ్‌ స్టార్‌ గణాంకాల ద్వారా తెలుస్తోంది

* అత్యధికంగా ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌కు రూ.152.83 కోట్ల పెట్టుబడులున్నాయి.
* ఆ తర్వాతి స్థానంలో రూ.142.02 కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ ఎమ్‌ఎఫ్‌ ఉంది.
* కోటక్‌ ఎమ్‌ఎఫ్‌(రూ.62.60 కోట్లు), నిప్పన్‌ ఇండియా ఎమ్‌ఎఫ్‌(రూ.61.21 కోట్లు), యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌(రూ.33.18 కోట్లు) చొప్పున యెస్‌ బ్యాంకు షేర్లలో పెట్టుబడులు పెట్టాయి.
* ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, యూటీఐ ఎమ్‌ఎఫ్‌, కోటక్‌ ఎమ్‌ఎఫ్‌లు వరుసగా రూ.475.72 కోట్లు; రూ.336.67 కోట్లు, రూ.93.83 కోట్లు చొప్పున బాండ్లలో పెట్టుబడులు పెట్టాయి.


రాణా కపూర్‌ నివాసంలో ఈడీ సోదాలు

ముంబయి: యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. మనీ లాండ్‌రింగ్‌ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ముంబయిలోని రాణా కపూర్‌కు చెందిన సముద్రా మహల్‌ రెసిడెన్స్‌లో సోదాలు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఓ కార్పొరేట్‌ సంస్థకు రుణం మంజూరు విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇవేకాకుండా ఆయన చేసినట్లుగా ఆరోపణలు వచ్చిన మరికొన్ని అక్రమాలపై కూడా ఈడీ దర్యాప్తు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే సాక్ష్యాల సేకరణకు సోదాలు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.