close

తాజా వార్తలు

Updated : 09/03/2020 17:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్కెట్లలో బ్లడ్‌బాత్‌..!

 సూచీలకు బ్లాక్‌ మండే

  చమురు, యెస్‌బ్యాంక్‌, కరోనా కారణాలు

  భారీగా విలువ కోల్పోయిన రిలయన్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: కాలం కలిసిరాకపోతే.. కరోనావైరస్‌కు అన్ని కలిసొస్తాయన్నట్లుంది మార్కెట్ల పరిస్థితి. ఇప్పటికే కరోనావైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీని ప్రభావం ఇప్పుడు మార్కెట్లపై ప్రతికూలంగా పడుతోంది. దీనికితోడు ఇప్పుడు సౌదీ, రష్యా మధ్య తలెత్తిన చమురు పోరు మరింత ఆజ్యం పోసింది. ఇవన్నీ చాలవన్నట్లు యెస్‌బ్యాంక్‌లో అవకతవకల పుట్ట పగిలి లోపాలు బయటకు వచ్చి బ్యాంకింగ్‌ షేర్ల విలువను స్వాహా చేస్తున్నాయి. వెరసి మార్కెట్లలో మదుపరుల లక్షల కోట్ల సంపద కర్పూరంలా కరిగిపోతోంది. 

దేశీయ స్టాక్‌ మార్కెట్లకు సోమవారం బ్లాక్‌ మండేగా మిగిలిపోయింది. సూచీలు పోటీపడి పతనమయ్యాయనటం అతిశయోక్తి కాదేమో. సెన్సెక్స్‌ 1,941.67 పాయింట్లు నష్టపోయి 35,634.95 వద్ద నిఫ్టీ 538 పాయింట్లు పతనమై 10,451.50 వద్ద స్థిరపడ్డాయి. నేడు ఒక దశలో సెన్సెక్స్‌ 2,400 పాయింట్లు పతనమైంది. ఈ సూచీల పతనాన్ని చూసి మదుపరుల గుండెలు బేజారెత్తిపోయాయి. ప్రపంచ మార్కెట్ల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఇక ఎన్‌ఎస్‌ఈలో ఓఎన్‌జీసీ, వేదాంతా, రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. 

చమురు దిగ్గజాల మధ్య పోరు..

ప్రపంచంలో అత్యధిక చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా, సౌదీ అరేబియాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య అవగాహన దెబ్బతిని ధరల యుద్ధానికి దారి తీసింది. దీంతో ఒపెక్‌ దేశాలు రష్యాను దెబ్బతీయడానికి చమురు ఉత్పత్తి పెంచాలని నిర్ణయించాయి. ఫలితంగా చమురుధరలు 30శాతం కుంగాయి. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడినా.. స్టాక్‌ మార్కెట్లను మాత్రం దెబ్బతీశాయి. చమురు ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న రిలయన్స్‌, ఓఎన్‌జీసీ వంటి దేశీయ సంస్థల షేర్లు 15శాతం వరకు పడిపోయాయి. ఈ రెండు సంస్థలు సూచీలను భారీగా ప్రభావితం చేసేంత పెద్దవి కావడం గమనార్హం. దీంతో మార్కెట్లు కుప్పకూలాయి. 

ఈ పతనంతో టాటా గ్రూప్‌నకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. చమురు ధరలు పడిపోవం రిలయన్స్‌ షేర్‌కు శరాఘాతంగా మారింది. 

కొవిడ్‌-19 ప్రభావంతో..

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో చాలా సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇదంతా ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఒక్క ఇటలీలోనే 16మిలియన్ల మంది నిర్బంధంలో ఉన్నారు. ఇక చైనాలో 50కోట్ల మంది వరకు క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే బాధితుల సంఖ్య 1,07,000 దాటిపోవడంతో పాటు చైనా బయట కూడా మృతుల సంఖ్య వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు 2.4 ట్రిలియన్‌ డాలర్లు నష్టపోతుందని నిపుణులు చెప్పడం మార్కెట్లను భయపెడుతోంది. ఒక్క ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే 211 బిలియన్‌ డాలర్లు సంపద హరించుకుపోతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ పేర్కొనడం ఈ భయాలను పెంచేసింది. 

దేశ ఆర్థిక స్థిరతపై సందేహాలు..

యెస్‌బ్యాంక్‌ సంక్షోభంలో కూరుకుపోవడం విదేశీ పెట్టుబడిదారుల్లో దేశ ఆర్థిక సుస్థిరతపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ సంస్థ కేవలం  కార్పొరేట్‌ రుణ వ్యాపారం చేసి దెబ్బతినడంతో.. దేశ కార్పొరేట్‌ రంగంపై సందేహాలు ముసురుతున్నాయి. యెస్‌బ్యాంక్‌ బాండ్లను రేటింగ్‌ సంస్థలు డౌన్‌గ్రేడ్‌ చేయడం కూడా మరో కారణంగా నిలిచింది. ఈ సంస్థకు రూ.52,612 కోట్లు విలువైన బాండ్లు ఉన్నాయి. ఈ సంస్థ ఇప్పటికే బేసిల్‌ 2 టైర్‌1 బాండ్లకు కూపన్‌ పేమెంట్‌ను చెల్లించలేదు. భవిష్యత్తులో డీఫాల్ట్‌గా మారుతుందనే భయాలు సర్వత్రా నెలకొన్నాయి.  మరోపక్క డిపాజిటర్ల భయాలు పోగొట్టేందుకు ఆర్‌బీఐ స్వయంగా రంగంలోకి దిగింది. బ్యాంక్‌ల పనితీరును దగ్గరగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఈ క్రమంలో డిపాజిటర్లు అనవసర భయాలకు లోనుకావద్దని.. వారి డిపాజిట్లు క్షేమంగా ఉన్నాయని పేర్కొంది. 

మార్కెట్‌ను వీడుతున్న ఎఫ్‌ఐఐలు..

గత 15 ట్రేడింగ్‌ సెషన్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు వరుసగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ సమయంలో దాదాపు రూ.21,937కోట్లను వీరు ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకొన్నారు. ఫిబ్రవరి 24నుంచి ఎఫ్‌ఐఐ కౌంటర్లలో సెల్లింగ్‌ కొనసాగుతోంది. ఈ ఫలితం రూపాయి మీద కూడా పడింది. డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో రూపాయి కూడా విలువ క్షీణిస్తోంది. 

ప్రపంచ మార్కెట్ల ప్రభావం..

ప్రపంచంలోని కీలకమైన మార్కెట్లు కరోనావైరస్‌ ప్రభావంతో కుంగడం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. జపాన్‌కు చెందిన నిక్కీ 5.2శాతం, ఆస్ట్రేలియాకు చెందిన కమోడిటీ హెవీ మార్కెట్‌ 6.4శాతం విలువ కోల్పోయాయి. సింగపూర్‌కు చెందిన బ్లూచిప్‌ షేర్‌ సూచీ కూడా 2.8శాతం పతనమైంది. దీనికి తోడు అమెరికా ఫెడ్‌ నిర్ణయాలు కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. 

ఒక దశలో రూ.7.72 లక్షల కోట్ల సంపద మాయం..

నేడు మార్కెట్లలో సంపద ఒక దశలో రూ.7లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది. సెన్సక్స్‌ 2,359 పాయింట్లు, నిఫ్టీ 656 పాయింట్లు విలువ కోల్పోయినప్పుడు ఈ పరిస్థితి నెలకొంది. దీంతో బీఎస్‌ఈలో  సంస్థల విలువ రూ.144.31 లక్షల కోట్ల (శుక్రవారం ట్రేడింగ్‌ చివర్లో) నుంచి రూ.136.59 లక్షల కోట్లకు పడిపోయింది. రూపాయి కూడా ఏడాదిలో అత్యల్ప స్థాయికి చేరింది. 

బీఎస్‌ఈ సెన్సెక్స్ చరిత్రలో భారీ పతనాల వివరాలు ఇలా..

* ఆగస్టు 24, 2015, బీఎస్‌ఈ సెన్సెక్స్‌  1,624.51 పాయింట్లు నష్టపోయింది.

కారణం: ప్రపంచ మార్కెట్ల పతనం.. రూపాయి బలహీనత.

* ఫిబ్రవరి 28, 2020, బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 1,400 పాయింట్లు నష్టపోయింది.  

కారణం:  కరోనా వైరస్‌ వ్యాప్తి భయాల కారణంగా ప్రపంచ మార్కెట్ల పతనం.

* జనవరి 21, 2008,  బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 1,408.35 పాయింట్లు నష్టపోయింది. 

జనవరి 22, 2008 - 875 41 పాయింట్లు

మార్చి 03, 2008 -  900 84 పాయింట్లు

మార్చి 17, 2008 - 951.03 పాయింట్లు

అక్టోబర్‌ 24, 2008 -  1070.63 పాయింట్లు

కారణం: అంతర్జాతీయంగా భయాందోళనలు. ఆర్థిక మందగమనం. 

* ఫిబ్రవరి 01, 2020, బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 987.96 పాయింట్లు నష్టపోయింది.  

కారణం:  మార్కెట్‌ వర్గాలు ఆశించినంత స్థాయిలో 2020-21 బడ్జెట్‌ లేకపోవడం.

ఫిబ్రవరి 02, 2018,  బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 839.91 పాయింట్లు నష్టపోయింది.

కారణం:  స్టాక్ పెట్టుబడులకు కఠినమైన పన్ను నియమాలు విధించడం,  కేంద్ర బడ్జెట్‌లో ద్రవ్య లోటు తగ్గుదల 

* ఫిబ్రవరి 11, 2016, బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌  807.07 పాయింట్లు నష్టపోయింది.

కారణం: ఆర్థిక మందగమనం.

* జులై 08, 2019,  బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌   792.82 పాయింట్లు నష్టపోయింది.

కారణం: అస్థిరత,  వడ్డీ రేట్ల పెరుగుదల 

ఆగస్టు  16, 2013, బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌  769.41 పాయింట్లు నష్టపోయింది.

కారణం: అమెరికా ఉద్దీపన ఉపసంహరణ,  యూఎస్‌డీకి వ్యతిరేకంగా రూపాయి 62 కనిష్ఠ స్థాయికి పడిపోవడం, తదితర ఆందోళనలు 

సెప్టెంబరు 22, 2011,  బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 704.00 పాయింట్లు నష్టపోయింది.

కారణం: అమెరికాలో స్టాక్‌ మార్కెట్‌ మందగమనం  

ఆగస్టు 13, 2019, బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 623.75 పాయింట్లు నష్టపోయింది

కారణం:  ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి

* ఫిబ్రవరి 6, 2020, సెన్సెక్స్‌ 894 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్లు పతనమయ్యాయి. 

కారణం: కరోనావైరస్ వ్యాప్తి భయాలు, యెస్‌బ్యాంక్‌ సంక్షోభంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు విలువ కోల్పోవడం.   


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.