close

తాజా వార్తలు

Updated : 10/03/2020 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిండో  రక్షతి  రక్షితః!

ఎల్లుండి ప్రపంచ కిడ్నీ దినం

కిడ్నీలు ఉద్ధండ పిండాలు. ఉండేది పిడికెడంతే అయినా చేసే పనులు మహా గొప్పవి. ఇవి బాగుంటేనే మనం బాగుంటాం. ఎందుకంటే ఒకసారి ఇవి చేతులెత్తేస్తే తిరిగి కోలుకోవటం అసాధ్యం. మరింత దెబ్బతినకుండా కాపాడుకోవటం తప్పించి చేయగలిగిందేమీ లేదు. అప్పటికీ అశ్రద్ధ చేస్తే కిడ్నీ వైఫల్యం తలెత్తొచ్ఛు అందుకే ‘కిడ్నీలను కాపాడుకోవటం, కిడ్నీ జబ్బుల బారినపడకుండా చూసుకోవటం, కిడ్నీలు దెబ్బతింటుంటే ముందుగానే గుర్తించటం, అందరికీ తగు చికిత్సలు అందుబాటులో ఉంచటం’ మనందరి విధి అని ప్రపంచ కిడ్నీ దినం నినదిస్తోంది. మూత్రపిండాలను కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయని అన్యాపదేశంగా సూచిస్తోంది.

మూత్రపిండాల ముఖ్యమైన పని రక్తాన్ని శుద్ధి చేయటం. మన కిడ్నీలు రోజుకు సుమారు 400 సార్లు రక్తాన్ని వడపోస్తూ.. వ్యర్థాలను, విషతుల్యాలను వేరుచేస్తూ మూత్రం ద్వారా బయటకు పంపించేస్తుంటాయి. ఇందుకోసం కిడ్నీల్లో అద్భుతమైన వ్యవస్థ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఒకో మూత్రపిండంలో దాదాపు 10 లక్షల వడపోత విభాగాలు (నెఫ్రాన్లు) ఉంటాయి. ఇవి రోజుకు సుమారు 150 లీటర్ల రక్తాన్ని వడపోస్తూ దాదాపు 2 లీటర్ల మూత్రాన్ని తయారుచేస్తాయి. కిడ్నీలు ఒక్క రక్తాన్ని శుద్ధి చేయటమే కాదు.. విటమిన్‌ డిని ప్రేరేపించి ఎముకపుష్టికీ తోడ్పడతాయి. ఎరిత్రోపాయిటిన్‌ను ఉత్పత్తి చేస్తూ హిమోగ్లోబిన్‌, రక్తకణాల తయారీలో పాలు పంచుకుంటాయి. ఒంట్లో ద్రవాలను.. రక్తంలో సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్ల మోతాదులను తగు స్థాయుల్లో ఉండేలా చేస్తాయి. ఇన్ని పనులు చేస్తాయి కాబట్టే కిడ్నీలు దెబ్బతింటే శరీరమే కుదేలైపోతుంది. ముఖ్యంగా వ్యర్థాలు, ద్రవాలు పేరుకుపోయి ఒళ్లంతా ‘చెత్త కుప్ప’లా తయారవుతుంటుంది. ఇంత జరుగుతున్నా పైకేమీ తెలియకపోవటం గమనార్హం. కిడ్నీలు దెబ్బతింటున్నప్పటికీ తొలిదశలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. దెబ్బతిన్న నెఫ్రాన్లు చేసే పనిని ఆరోగ్యంగా ఉన్న నెఫ్రాన్లు తీసుకోవటం వల్ల అంతా బాగానే అనిపిస్తుంటుంది. రోజురోజుకీ వీటి మీద భారం పెరిగి ఇవీ చేతులెత్తేస్తుంటాయి. అప్పటికీ మేలుకోకపోతే పరిస్థితి ఇంకాస్త క్షీణిస్తుంది. ఇదిలాగే కొనసాగితే చివరికి కిడ్నీలు పూర్తిగా విఫలమై ప్రాణాల మీదికే రావొచ్ఛు కాబట్టి కిడ్నీల ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచటం ఎంతైనా అవసరం.

ముఖ్యమైన పరీక్షలివి..

కిడ్నీ పనితీరు, కిడ్నీ సమస్యలేవైనా తలెత్తుతున్నాయా? అనేవి తెలుసుకోవటానికి కొన్ని పరీక్షలు ఉపయోగపడతాయి. మధుమేహం, హైబీపీ, ఊబకాయం, పొగ అలవాటు వంటి దీర్ఘకాల కిడ్నీ జబ్బు ముప్పులు గలవారు ఏడాదికి ఒకసారైనా వీటిని చేయించుకోవటం మంచిది. 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ, కుటుంబంలో ఎవరైనా కిడ్నీ జబ్బు బాధితులు గలవారు తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోవాలి.

మూత్రంలో సుద్ద: మూత్రంలో సుద్ద (అల్బుమిన్‌) ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోతుందనే అర్థం. అందువల్ల ఏటా ఈ పరీక్ష చేయించుకోవటం మంచిది. దీంతో కిడ్నీ జబ్బును ముందుగానే పసిగట్టొచ్ఛు

రక్తంలో క్రియాటినైన్‌: కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి ఈ పరీక్ష చాలా కీలకం. దీని ఆధారంగానే వడపోత సామర్థ్యాన్ని లెక్కిస్తారు. దీన్నే ఎస్టిమేటెడ్‌ గ్లోమెరూలార్‌ ఫిల్టరేషన్‌ రేట్‌ (ఈజీఎఫ్‌ఆర్‌) అంటారు. ఇది సాధారణంగా 110 మి.లీ. వరకూ ఉంటుంది. ఒకవేళ 60 మి.లీ. కన్నా తగ్గితే కిడ్నీ జబ్బులు తలెత్తే అవకాశం పెరిగినట్టే. చాలామంది రక్తంలో క్రియాటినైన్‌ పరీక్ష ఒక్కటే సరిపోతుందని భావిస్తుంటారు గానీ కిడ్నీలు 50% దెబ్బతినేవరకూ క్రియాటినైన్‌ స్థాయులు పెరగకపోవచ్ఛు అందువల్ల ఈజీఎఫ్‌ఆర్‌ అనేది చాలా ముఖ్యం. రక్తంలో క్రియాటినైన్‌ స్థాయులతో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి ప్రమాణాలను బట్టి ఈజీఎఫ్‌ఆర్‌ను లెక్క వేస్తారు.

అల్ట్రాసౌండ్‌ పరీక్ష: కిడ్నీల తీరుతెన్నులు, సైజు వంటివి తెలుసుకోవటానికిది ఉపయోగపడుతుంది. కిడ్నీల్లో ఏవైనా అడ్డంకులున్నాయా? రాళ్ల వంటివి పుట్టుకొస్తున్నాయా? తిత్తులేవైనా ఉన్నాయా? అనేవి ఇందులో బయటపడతాయి.

సమస్య పెద్దదే

ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 కోట్ల మంది కిడ్నీజబ్బుతో బాధపడుతున్నారని అంచనా. మనదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు దీర్ఘకాల కిడ్నీ జబ్బు (క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌) బారినపడుతున్నారు. చాలామందికి దీనిపై అవగాహన లేకపోవటం వల్ల చివరిదశకు చేరుకునేంతవరకూ సమస్యను గుర్తించలేకపోతున్నారు. ఇది చివరికి కిడ్నీ వైఫల్యానికీ దారితీస్తోంది. దీంతో గత్యంతరం లేక ఎంతోమంది డయాలసిస్‌ చేయించుకోవాల్సి వస్తోంది. లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు. పరిస్థితి అంతవరకూ రాకుండా ముందు నుంచే అవగాహన పెంచుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవటం అత్యవసరం.

లక్షణాలేంటి?

కిడ్నీ జబ్బు నిశ్శబ్ద హంతకి. పైకేమీ తెలియకుండా చాప కింద నీరులా దొంగదెబ్బ తీస్తుంది. తొలిదశలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్ఛు సమస్య తీవ్రమవుతున్న కొద్దీ కాళ్ల వాపు, ముఖం ఉబ్బుతుండటం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుండటం వంటి లక్షణాలు మొదలవుతాయి. అందరిలో అన్నీ ఉండాలనేమీ లేదు. కొన్ని లక్షణాలే కనిపించొచ్ఛు ఇలాంటివి కనిపిస్తున్నాయంటే అప్పటికే కిడ్నీ వైఫల్యం ఆరంభమైందనే అనుకోవాలి. ఇక కిడ్నీలు విఫలమైతే.. కాళ్లవాపులతో పాటు ఆకలి మందగించటం, వికారం, వాంతులు, ఆయాసం, ఒళ్లంతా దురదల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మగత, ఫిట్స్‌ సైతం ఉండొచ్ఛు ఇవి ఎక్కువగా వేధిస్తుంటే డయాలిసిస్‌ అవసరముందనే అర్థం.

ముప్పు కారకాలు తెలుసుకోండి

కిడ్నీజబ్బుకు రకరకాల కారణాలు దోహదం చేస్తుండొచ్ఛు వీటిల్లో ప్రధానమైనవి..

మధుమేహం: రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగితే మూత్ర పిండాల్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదముంది. చక్కెర ఎక్కువగా ఉన్న మూత్రాన్ని వడపోసే క్రమంలో వీటిలోని పొరలు మందగా తయారవుతాయి. దీంతో కిడ్నీల వడపోత సామర్థ్యం సన్నగిల్లుతుంది. క్రమేపీ కిడ్నీలు విఫలం కావొచ్ఛు మధుమేహులకు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. ఇవి కిడ్నీలకు పాకే అవకాశమూ ఎక్కువగానే ఉంటుంది. ఇవీ కిడ్నీలను దెబ్బతినొచ్ఛు●

పొగ అలవాటు: సిగరెట్లు, బీడీల వంటివి గుండె వేగం, రక్తపోటు పెరిగేలా చేస్తాయి. ఇవి కిడ్నీలపై విపరీత ప్రభావం చూపుతాయి. పొగ తాగేవారికి రక్తం గడ్డలు, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువ. దీంతో కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది. పొగ అలవాటుతో అధిక రక్తపోటు మందుల సామర్థ్యమూ తగ్గుతుంది. దీంతో కిడ్నీ జబ్బు ముప్పూ పెరుగుతుంది. ●

అధిక రక్తపోటు: అధిక రక్తపోటు మూలంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది. మరోవైపు అధిక రక్తపోటుతో కిడ్నీల్లోని నెఫ్రాన్లు దెబ్బతింటాయి. దీంతో వడపోత సామర్థ్యం తగ్గుతుంది. ఒంట్లో ద్రవాల మోతాదులు పెరుగుతాయి. ఇది రక్తపోటు మరింత పెరగటానికీ దారితీస్తుంది. ఇదో విష వలయంలా తయారై కిడ్నీలు మరింతగానూ దెబ్బతింటాయి.●

ఊబకాయం: ఊబకాయులకు అధిక రక్తపోటు, మధుమేహం ముప్పు ఎక్కువ. ఇవి రెండూ కిడ్నీల పనితీరును దెబ్బతీసేవే. రక్తపోటు, మధుమేహం లేకపోయినా ఊబకాయులకు కిడ్నీలు దెబ్బతినే ముప్పు ఎక్కువ.●

కిడ్నీలో రాళ్లు: కిడ్నీలో రాళ్ల మూలంగా తరచూ ఇన్‌ఫెక్షన్లు తలెత్తొచ్ఛు అంతేకాదు, రాళ్లు మూత్ర ప్రవాహానికీ అడ్డుపడొచ్చు ఇది కిడ్నీల మీద భారం పడేలా చేయొచ్ఛు ఫలితంగా వడపోత సామర్థ్యం దెబ్బతినొచ్చు.

మద్యం: అతిగా మద్యం తాగేవారిలో నెఫ్రాన్లకు అనుసంధానంగా ఉండే సన్నటి గొట్టాలు దెబ్బతినే ప్రమాదముంది. అలాగే మూత్రాన్ని సరిగా తయారుచేసే సామర్థ్యమూ తగ్గుతుంది. క్రమంగా వడపోత సామర్థ్యం దెబ్బతింటుంది. మద్యం మూలంగా ఒంట్లో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతా అస్తవ్యస్తమవుతుంది. ఇవన్నీ కిడ్నీల మీద విపరీత ప్రభావం చూపేవే.●

కిడ్నీల్లో నీటి తిత్తులు: కొందరికి జన్యుపరంగా పుట్టుకతోనే కిడ్నీల్లో నీటి తిత్తులుంటాయి. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. క్రమంగా కిడ్నీలూ దెబ్బతినొచ్చు.

ఇలా కాపాడుకోవచ్చు

కిడ్నీ జబ్బు వచ్చాక బాధపడేకన్నా ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం మేలు. ఇవి కిడ్నీలు ఆరోగ్యంగా తోడ్పడతాయి. అలాగే కిడ్నీ జబ్బు మరింత ముదరకుండా కాపాడతాయి.

మధుమేహులు గ్లూకోజును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మూడు నెలల గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ ఫలితం 7 కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

రక్తపోటు 130/80 కన్నా మించకుండా చూసుకోవాలి. 140/90, అంతకన్నా ఎక్కువుంటే విధిగా మందులు వేసుకోవాలి.

ఉప్పు రోజుకు 5-6 గ్రాములు (ఒక చెంచా) మించకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు ఇంటి తిండే తినాలి. బయట తినాల్సి వస్తే ఉప్పు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. జంక్‌ ఫుడ్‌, మార్కెట్లో దొరికే ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

క్రమం తప్పకుండా నడక, జాగింగ్‌ వంటి వ్యాయామాలు చేయాలి. రోజుకు కనీసం 10వేల అడుగులైనా నడవటం ముఖ్యం. దీంతో బరువు, రక్తపోటు అదుపులో ఉంటాయి. శరీరం ఫిట్‌గా ఉంటుంది. ఫలితంగా కిడ్నీలూ ఆరోగ్యంగా ఉంటాయి.

నొప్పి నివారణ మాత్రలను అవసరమైతేనే వేసుకోవాలి. చీటికీ మాటికీ దీర్ఘకాలం వేసుకుంటే కిడ్నీలు దెబ్బతినొచ్చు.

తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. ఇది కిడ్నీల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సాధారణ ఆరోగ్యవంతులు రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి. వాతావరణ పరిస్థితులు, చేసే పనులు, వ్యాయామం, జబ్బులు, గర్భధారణ, బిడ్డకు పాలివ్వటం వంటి వాటిని బట్టి నీటి అవసరం మారిపోతుండొచ్చు.

సిగరెట్ల జోలికి వెళ్లొద్ధు పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. పొగ తాగితే కిడ్నీలు దెబ్బతినటమే కాదు, కిడ్నీ క్యాన్సర్‌ ముప్పూ పెరుగుతుంది.

రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి

రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.