close

తాజా వార్తలు

Published : 15/03/2020 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుజరాత్‌లో కాంగ్రెస్‌కు షాక్‌!

నలుగురు ఎమ్మెల్యేల రాజీనామా

అహ్మదాబాద్‌: మధ్యప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారిన వేళ గుజరాత్‌లో సైతం కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. రాజ్యసభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఓ వైపు అధికార భాజపా వలకు చిక్కకుండా తమ ఎమ్మెల్యేలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం గమనార్హం.

గుజరాత్‌లో ఈ నెల 26న నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. 73 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ రెండు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. స్వతంత్ర అభ్యర్థి జిగ్నేష్‌ మేవానీ ఇప్పటికే కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. దీంతో రెండు స్థానాలు గెలుచుకోవడం నల్లేరుపై నడక కానుంది. అదే సమయంలో 103 మంది ఎమ్మెల్యేలు కలిగిన భాజపా ముగ్గురిని బరిలో నిలిపింది. 111 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మూడో స్థానం గెలిచేందుకు ఆ పార్టీకి వీలవుతుంది.

దీంతో భాజపా.. తమ ఎమ్మెల్యేలను ఆ వైపు తిప్పుకొనే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు తరలించింది. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారు. వారిలో జేవీ కక్డియా, సోంబాయ్‌ పటేల్ ఉన్నారు. మరో ఎమ్మెల్యే వర్జీభాయ్‌ తుమ్మర్‌ సైతం రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఆ పార్టీ ఖండిస్తోంది. ఆయన తమతోనే టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు స్పీకర్‌ రాజేంద్ర త్రివేది స్పష్టం చేయడం గమనార్హం. శనివారమే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, వారి రాజీనామాలు ఆమోదించానని పేర్కొన్నారు. ఎవరెవరు రాజీనామా చేశారనేది సోమవారం సభలో వెల్లడిస్తానని తెలిపారు. దీంతో 182 సభ్యులున్న గుజరాత్‌ శాసనసభలో కాంగ్రెస్‌ బలం 69కి తగ్గనుంది. పైగా రెండో రాజ్యసభ అభ్యర్థి గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.