close

తాజా వార్తలు

Updated : 17/03/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా మన చేతుల్లో!

ఎప్పుడు భయపడకూడదో కాదు, ఎప్పుడు భయపడాలో కూడా తెలియాలి. కరోనా ఇన్‌ఫెక్షన్‌ (కొవిడ్‌-19) విషయంలో ఇప్పుడిలాంటి భయమే కావాలి. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా వైరస్‌ మనదేశంలో అంత తీవ్రంగా ప్రబలటం లేదు. అంత ప్రమాదకరంగా పరిణమించటం లేదు. కొందరికి ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగానూ నయమయ్యింది. ఇవన్నీ కరోనాకు అంతగా భయపడాల్సిన పనిలేదనే ధైర్యాన్ని ఇస్తుండొచ్ఛు అంతమాత్రాన ‘కరోనా నాకెందుకొస్తుందిలే’ అన్న ధీమా గానీ ‘వస్తే ఏం చేస్తుందిలే’ అన్న అతి విశ్వాసం గానీ పనికిరావు. ‘నాకూ వస్తుందేమోనన్న’ భయమే కావాలి. ఎందుకంటే రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒకట్రెండు మరణాలూ సంభవించాయి. ఇవన్నీ భయపడాలనే చెబుతున్నాయి. కాస్త శ్రద్ధ పెడితే దీన్ని అడ్డుకోవటం అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే కరోనా వైరస్‌ ఎక్కడో లేదు. ఒకరకంగా అది మన చేతుల్లోనే ఉంది! చాలావరకు మన చేతులు, చేతల ద్వారానే మనకూ ఇతరులకూ వ్యాపిస్తోంది.

కరోనా వైరస్‌. ఈ శతాబ్దపు మహమ్మారి! నిజానికిది చాలామందిని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్ఛు నూటికి 80 మందిలో మామూలు లక్షణాలతోనే ఆగిపోవచ్ఛు అలాగని గుండె మీద చేయి వేసుకొని నిశ్చింతగా ఉండటానికి వీల్లేదు. తక్కువగా అంచనా వేశామా పెను ప్రమాదాన్నే మోసుకొస్తుంది. చైనాలో చిన్నగా మొదలై, శరవేగంగా అన్ని దేశాలను చుట్టబెడుతూ, చివరికి మహమ్మారిగా మారిపోవటమే దీనికి నిదర్శనం. ఒకే సమయంలో పెద్దఎత్తున, పలు దేశాలకు విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటించక తప్పలేదు. ఒకరి నుంచి ఒకరికి తేలికగా విస్తరిస్తూ అందరినీ కలవరపెడుతున్న ఇది మనదేశంలోనూ కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతానికి మనదగ్గర ఇతర దేశాల నుంచి వచ్చినవారికి, వారి సన్నిహితులకే పరిమితమవుతున్నప్పటికీ జడలు విప్పకుండా చూసుకోవటం మనందరి విధి. లక్షణాల గురించి తెలుసుకొని ఉండటం, చేతుల శుభ్రత, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించటం, జన సమ్మర్థ ప్రాంతాలకు వెళ్లకపోవటం వంటి వాటితో దీన్ని చాలావరకు కట్టడి చేయొచ్ఛు ఇలాంటి అప్రమత్తత కొరవడటం వల్లనే చాలాదేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. మనకు అలాంటి పరిస్థితి దాపురించకుండా ఉండాలంటే ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండటం ఎంతైనా అవసరం. ఇందుకు ప్రభుత్వ చర్యలే సరిపోవు. పౌరులుగా మన బాధ్యతే ఎక్కువ.

ఎందుకింత భయపడాలి?

జలుబు, ఫ్లూ వంటి సమస్యలను ఎలా అడ్డుకోవాలో మన శరీరానికి తెలుసు. వీటిని ఎదుర్కోవటానికి అవసరమైన యాంటీబాడీలను తయారుచేసి పెట్టుకొని ఉంటుంది. కరోనా వైరస్‌ అలాంటిది కాదు. పూర్తిగా కొత్తది. మనలో ఎవరిలోనూ దీన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు లేవు. అందువల్ల ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరికైనా తేలికగా వ్యాపించొచ్ఛు తీవ్రమైతే విపత్కర పరిస్థితుల్లోకీ నెట్టేయొచ్ఛు ప్రస్తుతానికి దీనికి కచ్చితమైన, ప్రామాణికమైన చికిత్స అంటూ ఏదీ లేదు. టీకాలూ లేవు. అందుకే ఇంతగా భయపడాల్సి వస్తోంది.

అధిక ముప్పు గలవారిని కాపాడుకుంటే..

కరోనా వైరస్‌ చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరికైనా రావొచ్ఛు కాకపోతే పిల్లలు, యువతీ యువకుల కన్నా వయసు మీద పడ్డవారిలో ముఖ్యంగా.. 65 ఏళ్లు పైబడ్డవారిలో ఉద్ధృతి ఎక్కువ. ఇక 80 ఏళ్ల పైబడ్డవారికైతే మరింత ప్రమాదకరం. వీరిలో మరణాల సంఖ్యా ఎక్కువగానే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం వృద్ధుల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం. అప్పటికే గుండెజబ్బుల వంటి సమస్యలతో బాధపడుతుండటం. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండి గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడేవారికి కరోనాతో వాటిల్లే ప్రమాదం చాలా ఎక్కువ. క్యాన్సర్‌ చికిత్సలు తీసుకుంటున్నవారికి, ఇతర జబ్బులకు స్టీరాయిడ్లు వాడుకునేవారికి సైతం ముప్పు ఎక్కువే. చైనా అనుభవాలు ఈ విషయాన్నే చెబుతున్నాయి. అక్కడ 80% మందికి కరోనా మామూలు లక్షణాలతోనే ఆగిపోయింది. సుమారు 14% మందికి తీవ్రంగా మారింది. అంటే ఆయాసం, రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గటం వంటి సమస్యలకు దారితీసింది. ఓ 5% మందిలో మరీ తీవ్రంగా పరిణమించింది. వీరిలో శ్వాస వ్యవస్థ కుప్పకూలటం, షాక్‌లోకి వెళ్లటం, అవయవాలు విఫలం కావటం వంటి వాటికి దారితీసింది. కరోనా ఇన్‌ఫెక్షన్‌తో మరణాల రేటు 3-4 శాతంగా ఉన్నట్టు అంచనా. గతంలో చైనాలో విజృంభించిన సార్స్‌తో పోలిస్తే (10%) ఇది తక్కువే అయినా మామూలు ఫ్లూతో పోలిస్తే (0.1%) చాలా ఎక్కువ. కలవర పెడుతున్న విషయం ఏంటంటే- వయసు పెరుగుతున్నకొద్దీ మరణాల సంఖ్యా పెరుగుతుండటం. 50 ఏళ్ల కన్నా తక్కువ వయసుగలవారిలో మరణాల రేటు 0.5% కాగా.. 80 ఏళ్లు పైబడినవారిలో ఇది 15% వరకూ ఉంటోంది. ఇతరత్రా సమస్యలు సైతం ఇందుకు దోహదం చేస్తుండటం గమనార్హం. గుండెజబ్బులు గలవారిలో 10.5%, మధుమేహుల్లో 7.3%, దీర్ఘకాల శ్వాసకోశ జబ్బుగలవారిలో 6.3% మంది మృత్యువాత పడినట్టు చైనా లెక్కలు చెబుతున్నాయి. కరోనా ప్రాణాంతకంగా పరిణమించే ముప్పు ఎక్కువగా గలవారిని దీని బారినపడకుండా కాపాడుకుంటే చాలావరకు మరణాలను తగ్గించుకోవచ్చనే సంగతినివి నొక్కి చెబుతున్నాయి.

విజృంభించే అవకాశమే ఎక్కువ..

ప్రస్తుతం మనదేశంలో కరోనా ప్రబలిన ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో, ఇలాంటివారికి సన్నిహితంగా మెలిగిన వారిలోనే ఇన్‌ఫెక్షన్‌ బయటపడుతోంది. పది లక్షల మందిలో ఒకరి కన్నా తక్కువ మందిలోనే నిర్ధారణ అవుతోంది. అందువల్ల సమస్య చాలా చిన్నదిగానే కనిపించొచ్ఛు కానీ మనదేశ పరిస్థితులు వేరు. ప్రజల అలవాట్లు, సంప్రదాయాలు, సంస్కృతులు వేరు. జనసాంద్రత ఎక్కువ. అందరినీ గిరి గీసి కట్టడి చేయటం అంత తేలికైన పనికాదు. పైగా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహనా అంతంతే. దీనికి తోడు క్షయ, ఆస్థమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు ఎందరో. మనదేశం మధుమేహానికి రాజధానిగానూ మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహిస్తే కరోనా ఏ క్షణంలోనైనా ఉద్ధృతంగా, ప్రమాదకరంగా మారే అవకాశమే ఎక్కువ. సమాజంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించటం ఆరంభిస్తే కట్టడి చేయటం చాలా చాలా కష్టం. అందువల్ల ఎక్కువమంది గుమిగూడి ఉండే చోట్లకు వెళ్లకపోవటం మంచిది. ఒకరి నుంచి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగినా వేలాది మందిని దీని బారినపడకుండా చూసుకోవచ్ఛు ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఒకరికి ఒకరికి మధ్య 2 మీటర్ల (6 అడుగులు) దూరం ఉండేలా చూసుకోవాలి.

లక్షణాలుంటే మాస్కులు..

ప్రస్తుతం కరోనా మన సమాజంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న దాఖలాలు లేవు. అందువల్ల పోలోమని అంతా మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించటం మంచిది. దీంతో ఇతరులకు వారి నుంచి వైరస్‌ వ్యాపించకుండా చూసుకోవచ్ఛు డాక్టర్లు, నర్సులు, ఆయాలు, నిర్ధరణ పరీక్షలు చేసేవారికి, జబ్బుతో బాధపడేవారికి సపర్యలు చేసేవారికి ప్రత్యేకమైన ఎన్‌95 మాస్కులు అవసరం. ఇవి ఖరీదైనవి. అందరికీ అవసరం లేదు. మిగతావాళ్లు అవసరమైతే మూడు పొరలతో కూడిన మామూలు మాస్కులు ధరిస్తే చాలు. ఎన్‌95 మాస్కులు అందరూ ధరించటం మొదలెడితే కొరత ఏర్పడొచ్ఛు అప్పుడు నిజంగా అవసరమున్నవారికి ఇవి అందుబాటులో లేకుండా పోవచ్ఛు ●

ఒకే మాస్కును నాలుగైదు రోజులు వాడుకోవటం తగదు. తరచూ మార్చుకోవాలి. కనీసం రోజుకు ఒకటి మార్చుకోవాల్సి ఉంటుంది. మాస్కు ధరించే ముందు, తీసిన తర్వాతా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మాస్కును చేతులతో తాకరాదు. దీన్ని తీసేసే సమయంలోనూ ముందు భాగాన్ని తాక కూడదు. వెనక వైపు నుంచి తీసి, జాగ్రత్తగా మూత ఉన్న చెత్త బుట్టలో వేయాలి.

పరీక్షలు ఎవరికి?

జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఆయాసం వంటి కరోనా అనుమానిత లక్షణాలు గలవారికి

కరోనా వ్యాప్తిలో ఉన్న చైనా, హాంకాంగ్‌, దక్షిణ కొరియా, జపాన్‌, ఇరాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ, యూఏఈ వంటి దేశాల నుంచి వచ్చినవారికి

కరోనా ఇన్‌ఫెక్షన్‌ బాధితులకు సన్నిహితంగా ఉన్నవారికి.

అవసరమైతే స్వీయ నిర్బంధం తప్పదు

వైరస్‌ వ్యాప్తిని అరికట్టటం మనందరి విధి. కరోనా అనుమానిత లక్షణాలు గలవారు అవసరమైతే స్వీయ నిర్బంధం విధించుకోవాలి. ముఖ్యంగా కరోనా వ్యాప్తిలో ఉన్న దేశాల నుంచి ఇటీవలే వచ్చినవారు, ఇలాంటివారికి సన్నిహితంగా మెలిగినవారు తమకు తామే బయటకు రాకుండా ‘కట్టడి’ చేసుకోవటం మంచిది. దీంతో చాలావరకు వైరస్‌ ఇతరులకు సోకకుండా చూసుకోవచ్ఛు ఇలా స్వీయ నిర్బంధం పాటించటానికీ కొన్ని పద్ధతులు ఉన్నాయని తెలుసుకోవాలి.

స్వీయ నిర్బంధం పాటిస్తున్నవారికి కరోనా నిర్ధారణ అయితే వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కూడా 14 రోజుల వరకు విడిగా ఉండాలి. అనంతరం మరో 14 రోజుల వరకు గానీ కరోనా లేనట్టు పరీక్షల్లో తేలినంత వరకు గానీ విడిగానే ఉండాలి.

గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదిలో విడిగా, ప్రత్యేకంగా ఉండాలి. గదికి బాత్రూమ్‌ సౌకర్యం ఉంటే ఇంకా మంచిది.

అదే గదిలోనే మరో వ్యక్తి సైతం ఉండాల్సి వస్తే ఇద్దరి మధ్యా కనీసం మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి.

వృద్ధులకు, గర్భిణులకు పిల్లలకు, గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యలు గలవారితో సన్నిహితంగా ఉండొద్ధు ఎక్కువ మంది గుమిగూడి ఉండే చోట్లకు వెళ్లరాదు. పెళ్లిళ్లు, విందు వినోదాలు, సమావేశాల వంటి వాటికి అసలే వెళ్లొద్ధు

తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి. లేదా ఆల్కహాల్‌ ఆధారిత శుభ్రకాల(సానిటైజర్స్‌)ను చేతులకు రుద్దుకోవాలి. గిన్నెలు, కంచాలు, గ్లాసులు, కప్పుల వంటివి వేరేవాళ్లు వాడకుండా చూసుకోవాలి.

ఎల్లవేళలా ముక్కుకు, నోటికి మాస్క్‌ ధరించాలి. వాడిన మాస్కులను బ్లీచింగ్‌ ద్రావణంలో (5%) లేదా సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణం(1%)తో శుభ్రం చేశాక కాల్చేయాలి. నేలలోనైనా పాతి పెట్టొచ్ఛు

జ్వరం, దగ్గు లేదా ఆయాసం వంటి కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే సమీప ఆరోగ్యకేంద్రాన్ని సంప్రదించాలి.

చేతులతోనే మట్టి కరిపించొచ్చు

కరోనా వైరస్‌ చూడటానికి కిరీటంలా ఉంటుంది. దీని చుట్టూరా పైకి పొడుచుకొని వచ్చే భాగాలుంటాయి. వీటి మధ్య పరచుకొని ఉండే ప్రోటీన్‌ (కొవ్వు) పొర వైరస్‌కు రక్షణగా నిలుస్తుంది. సబ్బుతో చేయిని కడుక్కుంటే ఈ పొర కరిగిపోయి వైరస్‌ త్వరగా నిర్వీర్యమవుతుంది, చనిపోతుంది. అందువల్ల కరోనా ఇన్‌ఫెక్షన్‌ నివారణకు చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవటం అన్నింటికన్నా ఉత్తమమైన పని. అలాగని పైపైన కడుక్కుంటామంటే కుదరదు. కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులను బాగా రుద్దుకొని శుభ్రంగా కడుక్కోవాలి.

బయటి నుంచి ఇంట్లోకి వచ్చిన ప్రతిసారీ చేతులను కడుక్కోవాలి.

భోజనం చేయటానికి ముందు, మల విసర్జన అనంతరం తప్పకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

దగ్గినా, తుమ్మినా జాగ్రత్త

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు సాధారణంగా మీటరు దూరం వరకు విస్తరిస్తాయి. కాబట్టి దగ్గేవారికి, తుమ్మేవారికి కనీసం మీటరు దూరంలో ఉండేలా చూసుకోవాలి. మనదేశంలో చాలామంది పిడికిలినో, దోసిలినో అడ్డం పెట్టుకుని దగ్గుతుంటారు. అదే చేత్తో ఇతరులకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వచ్ఛు వస్తువులను అందించొచ్ఛు ఇది వైరస్‌ వ్యాపించటానికి దోహదం చేస్తుంది. పిడికిలికి బదులు నోటికి, ముక్కుకు దళసరి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. వీలుంటే టిష్యూ పేపరును అడ్డుపెట్టుకోవచ్ఛు చేతి రుమాలును రోజూ ఉతుక్కోవాలి. టిష్యూ పేపరును ఎప్పటికప్పుడు మూత ఉన్న చెత్తబుట్టలోనే వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరుబయట పడేయొద్ధు రుమాలు, పేపరు వంటివి అందుబాటులో లేకపోతే మణికట్టు మధ్యన ముక్కు, నోరు ఆనించి దగ్గటం, తుమ్మటం చేయాలి. ఎదుట ఎవరైనా ఉంటే తల పక్కకు తిప్పి దగ్గటం మంచిది.

కరోనా వైరస్‌ కాస్త బరువుగా ఉండటం వల్ల వెంటనే కింద పడిపోతుంది. తుంపర్ల ద్వారా వెలువడిన ఇది చుట్టుపక్కల టేబుళ్లు, కుర్చీలు, సోఫాల వంటి వాటిపై పడి, అక్కడే అంటుకోవచ్ఛు ఇది సుమారు 3 రోజుల వరకు జీవించి ఉంటుందని పరీక్షలు తెలియజేస్తున్నాయి. ఆయా వస్తువులను ముట్టుకుంటే అది మన చేతులకూ అంటుకుంటుంది. అదే చేత్తో ముక్కు, నోరు, కళ్లను తాకితే వైరస్‌ మనలోకీ ప్రవేశిస్తుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు చేతులతో ముఖాన్ని తాకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఆయా వస్తువులను ఆల్కహాల్‌ ఆధారిత శుభ్రకాలతో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.