close

తాజా వార్తలు

Updated : 19/03/2020 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వంటింట్లో  ఇంటింటి  వేదం

సెలవులతో ఇంటి పట్టునున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇంటిల్లిపాది బాగోగులూ దృష్టిలో ఉంచుకోవాలి. అనువుగాని వేళ.. ఆహారంలో ప్రయోగాలు కాకుండా.. ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలి. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు...

ఇంజిన్‌, క్లచ్‌, గేర్‌, చైన్‌.. అన్నీ సక్రమంగా పనిచేస్తేనే బండి ముందుకు సాఫీగా వెళ్తుంది. మానవ శరీరమూ అంతే! శరీరంలోని అవయవాలు, దోషాలు, ధాతువులు, మలాలు సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అన్నీ పక్కాగా పనిచేయాలంటే సరైన పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. సమయపాలన తప్పనిసరి. ఒకసారి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమవ్వాలి. అలా జీర్ణం కాకముందే మళ్లీ ఏదైనా తింటే.. అనారోగ్య కారకమైన ‘ఆమం’ తయారవుతుంది. దీంతో ఎసిడిటీ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే..

జఠరాగ్ని (జీర్ణశక్తి) బాగుండేలా చూసుకోవాలి. ఇది సరైన రీతిలో పనిచేయాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. శారీరక అవసరాలకు అనుగుణంగా నడక, ఇతర కసరత్తులు చేయాలి. దీనివల్ల శారీరకంగా ఉల్లాసంగా ఉండటంతో పాటు, మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఇది రక్షణ కవచంగా మారి.. ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొంటుంది. పిల్లలకు ఉదయపు నడక అలవాటు చేయండి. దీంతో ఆకలి బాగా అవుతుంది. సమయానికి భోజనం చేస్తారు.

వేళాపాళ లేకుండా తినడం, చిరుతిళ్లు లాగించడం వల్ల కడుపులో సమస్యలు మొదలవుతాయి. ఒంట్లో బాగోకపోతే.. బయట నుంచి వచ్చే వైరస్‌లు శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తాయి. హానికారకాలు వేగంగా బలం పుంజుకుంటాయి. ఎలాగూ అందరూ ఇంట్లోనే ఉంటున్నాం కదాని.. సమయ పాలన అటకెక్కించకండి. స్నాక్స్‌ పేరిట చిరుతిళ్లకు దాసోహం అవ్వకండి.

ఉసిరి ఉత్తమం...

రోగనిరోధకశక్తిని పెంచే పదార్థాలను ఆహారంలో భాగం చేయాలి. వాటిలో ఉసిరి చాలా ముఖ్యమైంది. రోజూ కనీసం మూడు నాలుగు ఉసరికాయలను తినాలి. కాయలు అందుబాటులో లేకపోతే నాలుగు గ్రాముల ఉసిరి చూర్ణాన్ని తేనెలో కలిపి రోజూ తీసుకోవాలి. 30 మి.లీ. పరిమాణంలో ఉసిరి రసానికి కాస్త తేనెను కలిపి పరగడపున తీసుకుంటే మంచిది.

మూడు గ్రాముల పిప్పళ్ల చూర్ణానికి కొద్దిగా నెయ్యి కలిపి నిత్యం తీసుకున్నా రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

మూడు గ్రాముల అశ్వగంధ చూర్ణానికి కప్పు గోరువెచ్చని పాలను కలిపి రోజూ తాగాలి.

ముందు జాగ్రత్తతో..

సాధారణంగా ఒక వ్యక్తి శరీరంలో దోష ధాతు మలాలలో తేడాలవల్ల ఆ వ్యక్తికి మాత్రమే అనారోగ్యాలు వస్తుంటాయి. కానీ గాలి, నీరు, భూమి.. వీటిలో వ్యాధికారకాలు చేరినప్పుడు ఆ ప్రాంతంలోనే ఎక్కువమందికి ఒకేసారి అనారోగ్యాలు రావడాన్ని వేలాది సంవత్సరాల నుంచి గుర్తిస్తున్నారు. దీన్నే ‘జనపదోధ్వంసం’ (ఎపిడమిక్స్‌) అని పిలుస్తారు. ఇటువంటి సమయంలో కూడా రోగనిరోధకశక్తి ఉన్నవారు, ముందు నుంచి జాగ్రత్తలు తీసుకునేవారు, సరైన ఔషధాలు వాడినవారు ఈ సమస్యల నుంచి తేలిగ్గా బయటపడొచ్చు.

జ్వరాలు రాకుండా...

వైరస్‌లు విజృంభిస్తున్న వేళ.. ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్ధు మన పరిసరాల్లో జ్వరపీడితులు ఉన్నప్పుడు.. ముందు జాగ్రత్తలు తప్పనిసరి. చిన్న చిన్న చిట్కాలతో జ్వరం బారినపడకుండా కాపాడుకోవచ్ఛు

మరిగించిన కప్పు నీటిలో గుప్పెడు శుభ్రం చేసిన తులసి ఆకులు, రెండు లవంగాలు వేసి మూతపెట్టాలి. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం తేనె కలిపి రెండు పూటలూ తీసుకోవాలి.

శుభ్రంగా కడిగిన అల్లాన్ని దంచి రసం తీయాలి. పెద్ద చెంచా అల్లం రసానికి.. చెంచా తేనె కలిపి తీసుకోవాలి. ఇలా రెండు పూటలు చేస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

తిప్పతీగ, నేలవేము, కటుక రోహిణి, శొంఠి.. ఈ నాలుగు చూర్ణాలను సమంగా కలిపి ఉంచుకోవాలి. కప్పు నీటిలో చెంచా చూర్ణం వేసి సగం ఇగిరే వరకు మరిగించి వడబోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

శొంఠి, తిప్పతీగ, నేలవేము, ఎర్రచందనం చూర్ణాలను సమానంగా కలపాలి. పెద్దగ్లాసు నీటిలో ఈ పొడిని చెంచాడు వేసి నాలుగో వంతు మిగిలేవరకు మరిగించి వడబోయాలి. 30-40 మి.గ్రా. పరిమాణంలో రెండు పూటలా తాగితే మంచిది.

మరుగుతున్న పెద్దగ్లాసు నీటిలో పెద్దచెంచా మెంతులు వేసి సగం నీరు ఇగిరేవరకు ఉంచాలి. దీన్ని వడబోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు రోజుకి ఒకసారి తాగాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.