close
Array ( ) 1

తాజా వార్తలు

సిసింద్రీ చింపాంజీ !

అనగనగా ఓ అందమైన అడవి. ఆకాశమే కనిపించనంత చిక్కగా పందిరిలా అల్లేసిన పెద్ద పెద్ద వృక్షాలు. పక్షుల కిలకిల రావాలు... కోతుల కిచకిచలు... చింపాంజీల చిందులతో కనులవిందుగా ఉండేది ఆ అడవి. వాటికి తిన్నంత ఆహారం.. తీసుకున్నంత విశ్రాంతి. ఆడింది ఆట.. పాడింది పాట. పైగా.. ఆ చుట్టుపక్కల ఎలాంటి శత్రువుల బెడద లేదు. ఇలా రోజులు ఆనందంగా గడుస్తున్నాయి.

‘నేను ఈ అడవిలో ఉండను గాక ఉండను. కనీసం ఎండ కూడా నా ఒంటి మీద పడటం లేదు. నాకు విసుగొస్తోంది. ఈ చెట్లన్నీ గొడుగులా అల్లుకున్నాయి. నాకు బయటి ప్రపంచం అంటే ఏంటో తెలియడం లేదు. నాకు ఏదో బావిలో కప్పలా బతుకున్నట్లు ఉంది. నేను మీలా చాతకానివాడిలా బతకలేను. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను గాక.. ఉండను’ అని సిసింద్రీ అనే పిల్ల చింపాంజీ ఓ రోజు వాళ్ల అమ్మానాన్నతో తగవు పడింది.

‘అది కాదు సిసింద్రీ. ఈ అడవే మనకు రక్ష. ఈ చెట్లు లేకుంటే.. మనం బతకలేం. నా మాట విను’ అని సిసింద్రీ తల్లిదండ్రులు ఎంతో నచ్చచెప్పే ప్రయత్నం చేశాయి. అయినా సిసింద్రీ వినలేదు. ‘ఇక నేను మీ మాట వినదల్చుకోలేదు. నా బంగారం లాంటి జీవితాన్ని ఈ అడవికి అంకితం చేయలేను. నేను అసలు చెట్టు అనేదే లేని ప్రాంతంలో బతుకుతాను.’ అని వెళ్లబోయింది. అప్పుడే అటుగా వచ్చిన కోతులూ నచ్చచెప్పాలని చూశాయి. కానీ సిసింద్రీ ఎవ్వరి మాటా వినలేదు.

ఆవేశంగా నడక ప్రారంభించింది. ఓ రెండు గంటలు గడిచిన తర్వాత అడవి పల్చబడటం ప్రారంభమైంది. మరో గంట తర్వాత పెద్ద పెద్ద చెట్లు లేని ప్రాంతం వచ్చింది. ‘అబ్భ. ఎంత అందంగా ఉందో కదా.. ఈ ప్రాంతం. ఇక్కడ చక్కగా ఎండ తగులుతోంది. గాలీ బాగా వస్తోంది. ఈ గడ్డి ఎంత మెత్తగా ఉందో’ అనుకుంటూ.. సిసింద్రీ అటూ.. ఇటూ దొర్లుకుంటూ ఆడుకుంది. కాసేపటికి దానికి ఆకలేసింది. ఎక్కడా ఏమీ దొరకలేదు. ఆ గడ్డే కాస్త తింది. తినలేకపోయినా.. ఆకలికి తాళలేక ఎలాగో కాస్త నమిలి మింగింది. మళ్లీ అడవికి వెళ్లిపోదామనిపించింది. కానీ అహం అడ్డు వచ్చింది. సరైన ఆహారం లేకపోవడం వల్ల సాయంత్రానికి నీరసించి పోయింది. అలాగే సొమ్మసిల్లి నిద్రలోకి జారుకుంది.

కాసేపటికి ‘గుర్ర్‌..ర్ర్‌..ర్ర్‌.. గుర్ర్‌..ర్ర్‌..ర్ర్‌..’ అని ఏవో శబ్దాలు వచ్చాయి. సిసింద్రీకి మెలకువ వచ్చింది. ఏంటీ చప్పుడు? అని మెల్లిగా కళ్లు తెరిచి చూసింది. తన చుట్టూ అయిదు సింహాలు. సిసింద్రీ గుండె ఝల్లుమంది. అవన్నీ మంచి ఆకలి మీద ఉన్నట్లున్నాయి. తననే గుర్రుగా చూస్తూ ముందుకు వస్తున్నాయి.

సింహాలన్నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. సిసింద్రీకి ఒళ్లంతా చెమటలు పట్టాయి. అమ్మా, నాన్నా.. అని గట్టిగా అరిచింది. ఆఖరి నిమిషంలో సిసింద్రీ ఒక్క గెంతు గెంతింది. కొద్దిలో సింహాల పంజా దెబ్బ తప్పింది. దాంతో వాటికి మరింత కోపం వచ్చి సిసింద్రీని వెంటాడాయి. వాటికి చిక్కకుండా ఎంత వేగంగా పరుగెత్తినా దాని వల్ల కావడం లేదు. పైకి ఎక్కుదాం అంటే... ఒక్క చెట్టూ కనిపించడం లేదు. అసలే ఆకలి వల్ల నీరసించి ఉంది. దీనికి తోడు ఈ పాడు సింహాలు!.. శక్తినంతా కూడదీసుకుని బుజ్జి చింపాంజీ చావో.. రేవో.. అన్నట్లుగా పరుగెత్తింది.

అదృష్టవశాత్తు ఓ పెద్ద చెట్టు కనబడింది. హమ్మయ్య! బతుకు జీవుడా అనుకుంటూ చెట్టెక్కి ప్రాణం దక్కించుకుంది. అప్పటికీ ఆ సింహాలు చెట్టు చుట్టూనే తిరుగుతున్నాయి. ఇంతలోనే సిసింద్రీ అమ్మా, నాన్న, మిగతా చింపాంజీలు పెద్ద గుంపుగా వచ్చాయి. వాటికి విషయం అర్థమైంది. సింహాలను తరిమి కొట్టాయి. తర్వాత సిసింద్రీని తీసుకుని వెళ్లాయి.

‘నేను తప్పు చేశాను. అజ్ఞానంతో మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ ఈ అడవిని వదిలి వెళ్లను. మీరు చెప్పినట్లే వింటాను’ అని సిసింద్రీ బోరుమంది. ‘ఊరుకోరా బుజ్జికన్నా.. ఇప్పుడు ఏమైందని. ఊరికే బాధ పడకు’ అని అమ్మానాన్నా.. బుజ్జి చింపాంజీని దగ్గరకు తీసుకుని లాలించాయి. ఇక అప్పటి నుంచి మన సిసింద్రీ బుద్ధిగా ఉన్నాడు. అమ్మానాన్న చెప్పినట్లే విన్నాడు. ఇప్పుడు ఏకంగా చింపాంజీల సమూహానికి రాజయ్యాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.