close

తాజా వార్తలు

Published : 21/03/2020 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్యా కరోనా?

జరసోచో!

యువతలో సరికొత్త యాంగ్జైటీ

నిద్ర లేవగానే ఫోన్‌ అందుకుంది గీత..

వాట్సాప్‌ మొదలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా అన్నింటిలోనూ కరోనా అలర్ట్‌లే..

ఫోన్‌ పక్కన పెట్టి హాలులోకి వచ్చింది. అక్కడ టీవీలోనూ అవే అప్‌డేట్స్‌..

సోఫాలో కూర్చుంటే కుటుంబ సభ్యులూ దాని గురించే చర్ఛ. బయటికి వస్తే.. అందరూ మాస్క్‌లతో.. ఆఫీస్‌లోనూ అంతే.. దీంతో ఎప్పుడూ చలాకీగా ఉండే గీత మనసులో చిన్న కలత మొదలయ్యింది. ఆ రోజు మొదలు.. వారం తిరిగేలోపు తనకేమైందో అర్థంకాని స్థితికి వచ్చేసింది. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేస్తున్నా.. ఒకటే ఆందోళన.. అది కరోనా గురించే.. నాకూ వస్తుందా? నేనూ సిక్‌ అవుతానా?.. ఇలా ఏవేవో పిచ్చి ఆలోచనలు.. ఈ స్థితిని ఏమనాలి? సైకాలజీ నిపుణులు దీన్నే ‘కరోనా యాంగ్జైటీ’ అంటున్నారు. యువతలో ముఖ్యంగా టీనేజర్లలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు..

..వీళ్లే కాదు. ప్రస్తుతం ఇలాంటి మానసిక స్థితితో బాధపడుతున్న టీనేజర్లు ఎందరో.. యువతలో చాలామంది ఏదైనా సమస్య ఎదురవగానే ఆందోళనకు గురవుతారు. ఉదాహరణకు ఎగ్జామ్‌ ముందు రోజు చదివిందే చదువుతుంటారు. అన్ని ప్రశ్నలకూ నేను సమాధానం ఇవ్వగలనో లేదో అని.. ఎగ్జామ్‌ హాలుకు టైమ్‌కి చేరలేనేమోనని భయపడతారు.. వెళ్లే దార్లో బండి పంక్చర్‌ అవుతుందేమోనని.. ఇలా ఆందోళనతో ఏవేవో ఆలోచిస్తారు. ఇలాంటి మానసిక స్థితితో ఆలోచించేవారికి ఏదైనా భయమే. వేదికపై మాట్లాడాలంటే భయం.. కలలు వస్తే భయం.. చీకటి అంటే భయం.. చదువు అంటే భయం.. ఇలా చాలా రకాల భయాలు మానసికంగా మొదలై శారీరక సమస్యలుగా మారతాయి. సరిగ్గా నిద్రపోరు, తినరు, మితిమీరి ప్రవర్తిస్తారు.

వాస్తవ సంఘటన..

నా పేరు సంధ్య. బీటెక్‌ చదువుతున్నా. అందరితో ఇట్టే కలిసిపోతా. ఇంట్లో నేను లేకపోతే ఇల్లంతా గ్రంథాలయంలా సైలెంటే. అంతలా చలాకీగా ఉండే నాలో ఏదో తెలియని ఆందోళన. ఒంటరిగా నా గదిలోనే ఉండిపోతున్నా. చుట్టూ అందరూ ఉన్నా ఏదో తెలియని భయం. ఎవరిని చూసినా భయం. బయటికి వెళ్లొచ్చిన నాన్నని చూసినా భయమేస్తోంది. ఎవరైనా ఏదైనా తెచ్చి తినమన్నా భయంతో ముట్టడం లేదు. త్వరలో నాకు పెళ్లి. నన్ను చేసుకోబోయే వ్యక్తికి నేనంటే చాలా ఇష్టం. తను నాతో చాలా సన్నిహితంగా ఉంటాడు. నేనూ అంతే. కానీ, ఈ మధ్య తను నన్ను ముట్టుకుంటే చాలు.. గుండె దడగా అనిపిస్తోంది. తను చెయ్యి అందిస్తే చూడనట్టుగా ప్రవర్తిస్తున్నా. ఒక్కోసారి ఎవ్వరూ లేని చోటికి పారిపోవాలి అనిపిస్తోంది. సరిగ్గా నిద్రపట్టడం లేదు. దేనిపైనా ఏకాగ్రత కుదరడం లేదు. నా వస్తువులు, దుస్తులు, నా గది, చేతులూ.. మళ్లీ మళ్లీ శుభ్రం చేసుకోవాలి అనిపిస్తోంది. ఎవరైనా తుమ్మినా.. దగ్గినా.. జ్వరంతో ఉన్నా.. మాస్క్‌ లేకుండా బయటకు వచ్చినా.. నా పాలిట యమభటుల్లా కనిపిస్తున్నారు. కరోనా నాకు సోకుతుందేమో? నేను సిక్‌ అయిపోతానేమో?.. అని ఒకటే ఆందోళన. నేను ఉన్న స్థితిని చూసి పేరెంట్స్‌ భయపడుతున్నారు. ఫ్రెండ్స్‌ అయితే నన్నో మెంటల్‌ అంటున్నారు. నేను ఏం చేయాలి? నా ఆందోళనని ఎలా దూరం చేసుకోవాలి?

వాస్తవ దృక్పథం ఉండాలి..

సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. మీరు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచానికో పెను సమస్యలా మారిన కరోనా వైరస్‌నే తీసుకోండి. ఇది అందరి సమస్య. నలుగురిలోకి వెళ్లాలనుకునే ప్రతి ఒక్కర్నీ ఆందోళనకు గురిచేసే సమస్య. దీన్ని అధిగమించాలంటే.. మన దృష్టి కోణాన్ని వాస్తవ పరిణామాల వైపు మళ్లేలా చేయాలి. వైరస్‌ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? మనకి సోకకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. ఇలా వ్యక్తిగా మనం అవగాహన పెంచుకోవాలి. లైఫ్‌లో ఎదురయ్యే ప్రతి విషయానికి వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది. చూసిన దాన్ని, విన్న దాన్ని మనం ఊహించుకోవడం వేరు. అర్థం చేసుకుని వాస్తవాన్ని గ్రహించడం వేరు. అయితే.. సోషల్‌ మీడియాకు ప్రభావితం కావడం.. సమాజంలో ఈ అంశాలపై అవగాహన లేని వారి మాటలు పట్టించుకోవడం.. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవ్వడంతో జీవితం తల్లకిందులు అవుతుంది. ‘కరోనా యాంగ్జైటీ’తో బాధ పడుతున్న సంధ్యనే తీసుకోండి.. ఎప్పుడూ చలాకీగా ఉండే అమ్మాయి ఆందోళనతో వాస్తవికతకి దూరమై నెగిటివ్‌గా ఆలోచించడం మొదలు పెట్టింది. దీంతో తనలోని తెలివితేటలు.. తనకి వ్యతిరేకంగా మారాయి. అవి తనలోని స్థిమితత్వాన్ని పూర్తిగా నాశనం చేసి.. సమస్యని మరింత జటిలం చేశాయి. ఇలాంటి సమయంలోనే కౌన్సెలింగ్‌ అవసరం. ధైర్యంగా మీరు ఎదుర్కొనే సమస్య గురించి మాట్లాడండి. అప్‌డేట్‌ అవ్వండి. అవగాహన పెంచుకోండి. చర్చల్లో భాగస్వాములవ్వండి. సమస్య మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకుంటే.. మీరే మరికొందరికి అవగాహన కల్పించొచ్ఛు

నిపుణులైన వైద్యుల సలహాలు, సూచనలు మాత్రమే వినండి. సోషల్‌ మీడియా మరేవైనా ఇతర మాధ్యమాల్లో అనధికారికంగా వస్తున్న సమాచారంపై దృష్టి పెట్టొద్ధు వైరస్‌ నాకు కూడా వచ్చేస్తుందేమో, వచ్చేసిందేమో అని ఊహించుకోవద్ధు చేతులు శుభ్రం చేసుకోవడం.. పరిసరాల్ని క్లీన్‌గా ఉంచుకోవడం మనం ఎప్పుడూ చేసేదే. ఇప్పుడూ అదే చేస్తున్నాం. ఎప్పుడైనా ఒక్కటే గుర్తుంచుకోండి.. ‘‘సమస్త శక్తి నీలో ఉంది. శరీరానికి ఒక ధర్మం ఉంది. అది అర్థం చేసుకొంటే.. దేన్నయినా మానసికబలంతో ఎదుర్కోవచ్చు’’.

- డాక్టర్‌ టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని