close

తాజా వార్తలు

Updated : 21/03/2020 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నగరానికి తాళం వేసి కరోనాపై కసితీరా గెలిచి

వుహాన్‌ నగర నిర్బంధం సాగిన తీరిది

భయం, బాధ, కన్నీళ్లు, కష్టం, తెగువ.. చివరికి విజయం

మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం మొదలవుతుంది. 15 రోజులు ఈ వేడుకలు కొనసాగుతాయి. దేశమంతా సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తుంది. నింగిలోని చుక్కలన్నీ ఆ వీధుల్లోని తీగలకు వేలాడుతున్నాయా అనిపిస్తుంది. పిల్లలు, పెద్దలు కొత్త బట్టలు తీసుకుంటారు.

మార్కెట్లన్నీ కొనుగోళ్లతో కళకళలాడుతుంటాయి. సంబరాలు అంబరాన్నంటుతాయి. వంద కోట్లకు పైగా ప్రజలు కొనుగోళ్లు చేయడంతో వేల కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఎక్కడ చూసినా సందడే సందడి. కానీ ఒక్క సూక్ష్మ క్రిమి ‘కరోనా’తో అన్నీ భగ్నమయ్యాయి. మనుషులు బయటకు వెళ్లాలంటేనే భయపడే స్థితి. ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో?ఎవరితో చేయి కలిపితే ఏం అంటుకుంటుందో?

మొదట వందల్లో కనిపించిన కేసులు అమాంతం వేలల్లోకి మారాయి. పదుల సంఖ్యలోని మరణాలు వందల్లోకి పెరిగాయి. ముందు వ్యాపార సముదాయాలు తర్వాత రవాణా సాధనాలు బంద్‌. ఆపై ఒక్కో తయారీ సంస్థ మూత పడింది. కరోనా కరాళ నృత్యానికి మనుషులు బయటికొచ్చేందుకు పాక్షిక ఆంక్షలు మొదలయ్యాయి. ఆపై కఠిన ఆంక్షలు అమలయ్యాయి. ఒకవైపు ఆస్ప్రతులు రోగులతో నిండుతున్నాయి. మరోవైపు ప్రజలు ఇంటిగడప దాటకుండా వణికిపోతున్నారు. ఎందుకంటే 2020, జనవరి 23న వుహాన్‌ నగరానికి తాళం పడింది!?

వుహాన్‌లో పురుడు పోసుకొన్న కరోనా

చైనాలోని వుబెయ్‌ ఫ్రావిన్స్‌ ప్రధాన నగరం వుహాన్‌. దేశంలోని అత్యంత కీలక నగరాల్లో ఇదొకటి. దాదాపు కోటిమంది జనాభా. భారీ మార్కెట్లకు నిలయం. ప్రపంచంలోనే అతిపెద్ద మాంసాహార విపణి ఇక్కడుంది. అదిగో అక్కడి సముద్ర ఆహారం దొరికే చోటే గతేడాది చివర్లో కరోనా పురుగు పుట్టింది. మెల్లమెల్లగా అందరికీ పాకింది. మొదట దీని బారిన పడ్డవారంతా జ్వరం, దగ్గు, జలుబుతో ఆస్ప్రత్రుల్లో చేరారు. వైద్యులంతా ఇదో ఫ్లూ అనుకున్నారు. పరిస్థితి విషమించడంతో కొవిడ్‌-19 అని తెలుసుకున్నారు. అనుకున్నదే తడవుగా వుహాన్‌ మార్కెట్‌ను మూసేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ కొత్త వైరస్‌ను కనుగొన్నానని చెప్పిన నేత్ర వైద్యుడిని అపోహలు సృష్టిస్తున్నాడంటూ స్థానిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ఆ తర్వాత విడుదల చేసినా ఆయన కరోనా రోగులకు సేవ చేస్తూ అదే రోగంతో కన్నుమూశారు. ఆ వైరస్‌ సంగతేంటో తెలుసుకుందామని విపణికి వెళ్లిన జావ్‌ ఝాంగ్‌ ఆస్పత్రి వైద్యుడు జావ్‌ జెయింగ్‌కీ కొవిడ్‌ సోకింది. ఆయనతో పనిచేసిన సిబ్బందికీ సోకింది. దాంతో ఆయన 15 రోజులు క్వారంటైన్‌కు వెళ్లారు. పరిస్థితి తీవ్రతకు అద్దంపట్టే విషయమిది.

వైద్యం కాదు యుద్ధం చేశారు

రోనాను ఓడించేందుకు వుహాన్‌లోని వైద్యబృందం పెద్ద యుద్ధమే చేసిందని చెప్పాలి. లాక్‌డౌన్‌ ప్రకటించగానే 38వేల మంది వైద్యసిబ్బంది పనిలోకి దిగారు. ఏ ఒక్కరూ తమ మొబైల్‌ ఫోన్‌ వాడలేదు. ఆస్ప్రతుల్లో మునుపెన్నడూ చూడనటువంటి జనం పోగయ్యారు. మొదట స్థానిక ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. అందరినీ పరీక్షించేందుకు కిట్లు లేవు. దిక్కుతోచని పరిస్థితి. తీవ్ర లక్షణాలు కనిపించిన వారినే ఆస్పత్రిలో చేర్చుకున్నారు. వైద్య బృందం ఎంత కఠినంగా శ్రమించిందంటే అక్కడికొచ్చిన వారు అడుగు బయటపెట్టలేదు. పెట్టుకున్న మాస్క్‌ల అచ్చులు పడి గాయపడ్డారు. వాటిని దూదితో కప్పేసి మళ్లీ మాస్క్‌లు ధరించి సేవలందించారు. సిబ్బందిలో చాలా మంది తమ జీవిత భాగస్వాములు, చిన్న పిల్లలను వదిలేసి వచ్చారు. వారితో కనీసం మాట్లాడేందుకూ కుదరనంత పని. అయినా మొక్కవోని దీక్షను కనబరిచారు. మహిళలకు ఎక్కువ బలం అవసరమని పురుష సిబ్బంది తక్కువ తిని ఎక్కువగా వారికే ఆహారం మిగిల్చారు. 6 గంటల విధుల్లో మంచినీరు తాగలేదు. తిండి తినలేదు. కనీసం మరుగుదొడ్డికి వెళ్లలేదు. కొందరు ముఖాలకు దద్దుర్లు వచ్చినా అవి దురద పెడతాయన్న సంగతే మరిచిపోయారు. ఒక్కరు పడుకొనే పడకపై ఇద్దరు విశ్రమించారు. కంటి నిండా నిద్రన్నదే ఎరగలేదు. సేవలందించే క్రమంలో సిబ్బందిలో 3000 మందికి కొవిడ్‌ సోకగా 12 మంది మృతిచెందడం బాధాకరం.

వేల సంఖ్యలో వుహాన్‌కు తరలిన వైద్య సిబ్బంది

లాక్‌డౌన్‌ ప్రకటించిన కొన్ని రోజులకు వుహాన్‌లో కరోనా రోగులు ఒక రోజుకు పదివేలకు పెరిగారు. అదృష్టవశాత్తూ హుబెయ్‌ కాకుండా మిగిలిన అన్ని ప్రావిన్సుల్లో కేసులు పదుల సంఖ్యలోనే ఉండటంతో 10వేల మంది వైద్యసిబ్బంది ఇక్కడికి వచ్చారు. మరో రోజు 30వేల మంది వచ్చారు. రోగుల సంఖ్య పెరగడం, తీవ్రత తక్కువున్న వారు ఉండటం, అనుమానితులు రావడంతో నగరంలో కేటాయించిన పది ఆస్ప్రత్రులు సరిపోలేదు. దీంతో 1000 పడకల ఆస్పత్రిని పది రోజుల్లో పూర్తి చేశారు. ఇక్కడంతా ఐసీయూ సేవలే అందించారు. క్వారంటైన్‌ కోసం స్టేడియాలు, హోటళ్లు, ప్రదర్శన శాలలు అద్దెకు తీసుకున్నారు. పరీక్షలను ఆలస్యంగా చేస్తే లాభం లేదని సిటీస్కాన్‌ చేయించారు. ఎంత చేస్తున్నా వైద్య సిబ్బంది సరిపోవడం లేదు. మూడో వారంలో ఒకేసారి 10వేల కేసులను ధ్రువీకరించారు. వుహాన్‌లో ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన జిన్‌పింగ్‌ 10వేల మందితో కూడిన ఆర్మీ వైద్య బృందాన్ని విమానంలో అక్కడికి పంపించారు. ఔషధాలను తరలించారు. వారి కష్టానికి తగిన ఫలితం మెల్లమెల్లగా లభించసాగింది. ఆ తర్వాత అక్కడి తయారీ సంస్థలు రోజుకు 3 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు పంపించసాగాయి.

రవాణా లేక భయానకం

క వైపు వైద్యసేవలు జోరుగా సాగుతోంటే బయట భయానక పరిస్థితులు దర్శనమిచ్చాయి. నగరాన్ని లాక్‌డౌన్‌ చేశారు గానీ రవాణా సంగతే పట్టించుకోలేదు. దీంతో ఔషధాల సరఫరా, రోగుల్ని ఆస్పత్రులకు తీసుకురావడం, సిబ్బందిని తరలించడం కష్టమైంది. అప్పుడు వేలమంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకొచ్చారు. మొదట ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడంతో కొందరికి ఆన్‌లైన్‌లో చికిత్స చేశారు. అలాంటి వారికి ఔషధాలు పంపించాలన్నా రవాణా లేదు. అప్పుడు క్యాబుల్లో ఇళ్లకు వెళ్లి మందులు అందించారు. అందించే ప్రతిసారీ శానిటైజర్‌ రాసుకోవడం తప్పనిసరే. సేవ చేస్తున్న వాలంటీర్లను కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. వారికీ వైరస్‌ సోకుతుందేమోనన్న భయమే ఇందుకు కారణం. మరికొందరు నిండు మనసుతోనే ప్రోత్సహించారు. ఔషధాలు సరఫరా చేసేందుకు వెళ్లినప్పుడు చాలా వీధుల్లో గేట్లు మూసేయడంతో ఇబ్బంది అనిపించేది. అనుమానితులు, కరోనా లక్షణాలు తీవ్రత తక్కువున్న వారిని స్టేడియాలు, హోటళ్లు, ప్రత్యేక భవనాల్లో ఉంచారు కదా. అక్కడి వారికి ప్రభుత్వమే ఉచితంగా ఆహారం అందజేసింది. కొన్ని వసతులు లేనప్పటికీ ప్రజలు సహనంతో భరించారు. ఒకచోట కేవలం పదుల సంఖ్యలోనే మరుగుదొడ్లు ఉండటంతో చాలాసేపు వేచి చూశారు. కరోనాపై విజయంలో వాలంటీర్ల పాత్ర ఎంతైనా ఉంది.

ఫిబ్రవరి 17న పూర్తిగా లాక్‌డౌన్‌

ప్రజలు లాక్‌డౌన్‌ను వెంటనే అంగీకరించినా రానురానూ అసహనం వ్యక్తం చేశారు. ఏవి కావాలన్న ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేయాల్సి వచ్చేది. సరుకులు గేటువద్ద వదిలేస్తే తీసుకొనేవారు. పోలీసులు ఎంతో కష్టపడ్డారు. మొదట్లో ప్రజలు బయట తిరిగేవారు. వారికి నచ్చజెప్పి ఇంటికి పంపించడం కష్టమయ్యేది. చాలా కుటుంబాలు ఆందోళనలోనే కనిపించేవి. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడేవారు. వారిని ఆస్పత్రులకు పంపించాలంటే అక్కడ ఖాళీ ఉండేదికాదు. ఇంట్లో ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. సొంత మనుషుల మధ్యే బందీలు అయ్యేవారు. లేదంటే వైరస్‌ అందరికీ సోకుతుంది. పసిపిల్లలను చూసుకోలేక ఎంతో ఆవేదన. బతుకుతామో లేదోనన్న బెంగతో నడి యవస్కులు ఏడ్చేవారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17న వుహాన్‌ 100 శాతం నిర్బంధంలోకి వెళ్లిపోయింది. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి వారి శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించేవారు. ఇలా కొన్ని రోజులు చేయాల్సి వచ్చింది. ఉష్ణోగ్రతలో ఏ మాత్రం తేడా ఉన్నా మధుమేహం, రక్తపోటు ఉన్నాయా అని పరిశీలించేవారు. అనుమానం వస్తే వారి రిపోర్టులన్నీ ఆస్పత్రికి పంపేవారు. అవసరమైతే వారిని తీసుకెళ్లి సీటీస్కాన్‌ తీసి పరీక్షించేవారు. ఇక మరికొందరమే తమ ఉద్యోగాలు ఏమైపోతాయోనని బెంగపడేవారు. ఇంటికొచ్చిన సిబ్బందిపై ఇంకెన్నాళ్లు లాక్‌డౌన్‌ అంటూ అరిచేవారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ లేనివారు, సొంత వ్యాపారస్థులు తమ ఆదాయ మార్గాలు పోతున్నాయని వారితో చెప్పుకొనేవారు.

సంఘ జీవనానికి దూరమైతేనే

దైతేనేం..! వుహాన్‌ నగరానికి తాళం వేయడంతో కరోనా వైరస్‌ గొలుసు తెగిపోయింది. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం ఆగిపోయింది. క్రమంగా కేసులు రావడం తక్కువయ్యాయి. ప్రస్తుతం ప్రపంచమంతా వణికిపోతోంటే అక్కడ కొత్త కరోనా కేసులేవీ నమోదు కాకపోవడం ఊరట కలిగించింది. దాదాపు నెల రోజులు ఇంట్లోనే ఉండిపోయిన ప్రజలు బయటకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇంటి నుంచి మరీ దూరం వెళ్లొద్దని తెలిపింది. మెల్లమెల్లగా అక్కడ ఆంక్షలు తొలగిపోతున్నాయి. త్వరలోనే అక్కడ జనజీవనం మునుపటి స్థితికి చేరుకోగలదు. వుహాన్‌ లాక్‌డౌన్‌ ద్వారా తెలిసిందేమిటంటే శానిటైజర్లు, సబ్బుతో చేతులు కడుక్కోవడం, ముఖాన్ని తాకకపోవడం ఎంత ముఖ్యమో.. సంఘ జీవనానికి (సోషల్‌ డిస్టెన్స్‌) దూరమవ్వడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం. మనుషులు ఇంటికి పరిమితం అవ్వడం వల్లే వైరస్‌ను కట్టడి చేయగలిగారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు ఇప్పుడే మనం సోషల్‌ డిస్టెన్స్‌ ఎంత నిక్కచ్చిగా పాటిస్తే అంత మేలు. ఆదివారం జరిగే ‘జనతా కర్ఫ్యూ’ను విజయవంతం చేయాలి. అప్పుడే వుహాన్‌లాంటి పరిస్థితులు మరే దేశానికి ఎదురుకాకుండా ఉంటాయి.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.