close

తాజా వార్తలు

Updated : 24/03/2020 13:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్రిటన్‌లోనూ లాక్‌డౌన్‌

ప్రపంచవ్యాప్తంగా 16వేలు దాటిన మరణాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కేసుల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో కోలుకున్నవారి సంఖ్య లక్ష దాటడం కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రపంచ దేశాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న వేళ ఈ కబురు కాస్త ఉపశనం కలిగిస్తోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య దాదాపు నాలుగు లక్షలకు చేరువైంది. వీరిలో 1,02,429 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక మరణాల సంఖ్య 16,500 దాటింది. ఇప్పటి వరకు 182 దేశాలకు పైగా విస్తరించింది. ఇప్పటి వరకు వైరస్‌ తీవ్రత కాస్త తక్కువగా ఉందనుకుంటున్న ఆఫ్రికా దేశాల్లోనూ మహమ్మారి విజృంభిస్తోంది.

వుహాన్‌లో వారం తర్వాత తొలి కేసు..

చైనాలో వైరస్‌కు కేంద్రంగా ఉన్న వుహాన్‌ నగరంలో దాదాపు వారం రోజుల తర్వాత తొలి కేసు నమోదైంది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 74 మందికి వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాలు చైనాలో వైరస్ మళ్లీ విజృంభిస్తుందేమోనన్న ఆందోళన కలిగిస్తోంది. ఇక సోమవారం కొత్తగా 78 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 3,277కు చేరింది. చైనా మాత్రం తమ దేశంలో వైరస్ పూర్తిగా తగ్గిపోయిందని, వుహాన్‌లో ఉన్న ఆంక్షల్ని క్రమంగా సడలిస్తామని ప్రకటించడం గమనార్హం.  

వాణిజ్య ఆంక్షల్ని తొలగించండి.. ఇరాన్‌

వైరస్‌తో సతమతమవుతున్న తమపై ఆర్థిక, వాణిజ్యపరమైన ఆంక్షల్ని ఎత్తివేయాలని అమెరికాను ఇరాన్‌ కోరింది. అటు అమెరికాలోనూ ఇవే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆంక్షలు కొనసాగించడం ఏమాత్రం సమంజసం కాదని డెమొక్రటిక్ పార్టీ సహా ఇతర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక సోమవారం ఇరాన్‌లో 127 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1,812కు పెరిగింది. అలాగే కొత్తగా 1,411 మంది వైరస్‌ బారినపడ్డట్లు గుర్తించారు. దీంతో బాధితుల సంఖ్య 23,049కు పెరిగింది. ఉత్తర, మధ్య ఇరాన్‌ ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది.

రిటైర్మెంట్‌ హోమ్‌లలో శవాలుగా తేలిన వృద్ధులు...

స్పెయిన్‌లో సోమవారం హృదయవిదారక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. వైరస్ బారిన పడ్డ వృద్ధులను రిటైర్మెంట్‌ హోమ్‌లలో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో అనేక మంది పడకలపైనే జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు. మరికొంతమంది ఎప్పుడు చనిపోయారో కూడా తెలియని దయనీయ పరిస్థితి. దీంతో అక్కడ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. మహమ్మారి నుంచి కోలుకోవడంలో సహకరించాలని కోరింది. ఈ దుస్థితికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని స్పస్టం చేసింది. స్పెయిన్‌లో 24 గంటల్లో 462 మంది మృతిచెందడంతో మరణాల సంఖ్య సోమవారానికి 2,182కు చేరింది.

దక్షిణ కొరియాలో 120కి చేరిన మృతులు...

దక్షిణ కొరియాలో సోమవారం కొత్తగా 76 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. మరో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. దీంతో వైరస్ బారిన పడ్డవారి సంఖ్య 9,037కు పెరిగింది. విదేశాల నుంచి వైరస్‌ లోపలికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సరిహద్దుల్లో పూర్తి స్థాయి ఆంక్షలు విధించారు. దేశవ్యాప్తంగా ఉన్న కేసుల్లో ఎక్కువశాతం దైగు పట్టణంలోనే ఉన్నాయి. 

బ్రిటన్‌లో ఆంక్షలు మరింత కఠినం..

వైరస్‌ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలకు ఉపక్రమించింది. మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని బోరిన్‌ జాన్సన్‌ ప్రకటించారు. తప్పని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని.. ప్రజలు అత్యసవరమైతే తప్ప గడప దాటి బయటకు రావొద్దని ఆదేశించారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే మహమ్మారిని ఓడించగలమని పిలుపునిచ్చారు. బ్రిటన్‌లో మృతుల సంఖ్య 335కు పెరిగింది. మరో 6,650 మంది వైరస్‌ బారిన పడ్డారు.

ఫ్రాన్స్‌లో వ్యాయామాలపైనా నిషేధం..

ఫ్రాన్స్‌లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం బహిరంగ వ్యాయామాలపైనా నిషేధం విధించింది. ఓపెన్‌ మార్కెట్లనూ పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. అయినా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సంచరిస్తుండడం పట్ల అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలో సోమవారం 186 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 860కి చేరింది. మరో 19,856 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు.

ఇటలీలో వరుసగా రెండో రోజూ తగ్గుముఖం..

ఇటలీలో వరుసగా రెండో రోజూ మరణాల సంఖ్య తగ్గడం కాస్త ఊరట కలిగించింది. సోమవారం 601 మరణాలు సంభవించాయి. అలాగే కొత్తగా సోకిన వారి సంఖ్య సైతం తగ్గుముఖం పట్టింది. మిలన్‌ నగర చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ దాదాపు వారం రోజుల తర్వాత టీవీల్లో కాస్త నవ్వుతూ కనిపించడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. పరస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని.. అయితే కట్టడి చేయగలుగుతన్నామన్న భరోసా అయితే ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఇటలీలో 6,077 మంది మరణించారు. మరో 63,927 మంది వైరస్ బారిన పడ్డారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.