close

తాజా వార్తలు

Published : 30/03/2020 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాయిదా పరీక్షకే.. సన్నద్ధతకు కాదు!

బైపీసీ విద్యార్థులూ.. పారాహుషార్‌
నీట్‌, ఎంసెట్‌ మెలకువలు

వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న జరగాల్సిన ‘నీట్‌’ వాయిదా పడింది. ఇతర పరీక్షలదీ అదే బాట. స్వదేశంలోనే కాదు, విదేశాల్లో వైద్య విద్యలో చేరాలనుకునే భారతీయ విద్యార్థులు కూడా నీట్‌ ద్వారానే ప్రవేశార్హత పొందాలి.  దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా అనివార్యంగా జరిగిన జాప్యం గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకూడదు. వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన, మత్స్య సంబంధిత ఉన్నత విద్యా ప్రవేశానికీ, బీ ఫార్మసీకీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంసెట్‌ ద్వారానే ప్రవేశం! అందుకే  బైపీసీ విద్యార్థులు ఈ రెండు పరీక్షలకు తగిన ప్రణాళిక వేసుకోవాలి. ప్రధాన అంశాల పునశ్చరణపై, మననంపై దృష్టిపెట్టాలి!

రీక్ష తేదీ వాయిదా పడినా... సన్నద్ధత విషయంలో అలసత్వం పనికి రాదు. నీట్‌, ఎంసెట్‌ లాంటి పోటీపరీక్షల విషయానికీ ఇది వర్తిస్తుంది. రిలాక్స్‌ అవుదామని, ఇప్పుడు పుస్తకాలు పక్కనపెట్టేస్తే, మళ్లీ ప్రిపరేషన్‌ పట్టాలమీదకు రావటానికి చాలా సమయం వ్యర్థమవుతుందని విద్యార్థులు గ్రహించాలి. సన్నద్ధతను పటిష్ఠం చేసుకోవటానికి ప్రయత్నించాలి.

నీట్‌, ఎంసెట్‌..రెండు పరీక్షలకూ బహుళైచ్ఛిక ప్రశ్నలున్న ప్రశ్నపత్రాలే ఉంటాయి. నీట్‌లో ప్రతి తప్పు సమాధానానికీ -1 మార్కు కోత ఉంటుంది. ఎంసెట్‌లో నెగెటివ్‌ మార్కులు లేవు. తప్పుగా సమాధానం గుర్తించినా ప్రత్యేకించి జరిగే నష్టం లేదు.

పరీక్ష సిలబస్‌, పుస్తకాలు
నీట్‌ గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ఒకటి లేదా రెండు ప్రశ్నలను సిలబస్‌ పరిధి దాటి అడిగినట్లు అర్థమవుతుంది. అభ్యర్థులు అత్యుత్సాహంతో సిలబస్‌ పరిధి దాటి అదనపు విషయాలపై మరీ ఎక్కువగా తయారవటం అంత అభిలషణీయం కాదు. నీట్‌ పరీక్షకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఎంసెట్‌కు తెలుగు అకాడమీ పుస్తకాల్లోని అంశాలు, అధ్యాయాలను పరిగణనలోనికి తీసుకుంటారు. ఈ రెండు సిలబస్‌లకు ఉన్న సారూప్యతలను దృష్టిలో ఉంచుకుంటే ఎన్‌సీఈఆర్‌టీ, తెలుగు అకాడమీ పుస్తకాలను చదువుకోవడం అత్యుత్తమం. మార్కెట్‌లో లభ్యమవుతున్న రకరకాల మెటీరియల్స్‌, గైడ్లతో పోల్చుకుంటే పైన పేర్కొన్న పుస్తకాలతో రెండు పరీక్షలకు సన్నద్ధమవడం చాలా తేలిక.

ఇలా చదివితే మేలు..
* సబ్జెక్టును చదువుతున్నపుడే దానిలో ప్రతి అధ్యాయానికీ సంబంధించిన వివిధ కాన్సెప్టులు, అంశాలపై షార్ట్‌నోట్సు తయారుచేసుకోవాలి. దీన్ని పునశ్చరణకు ఉపయోగించుకుంటే నీట్‌కూ, ఎంసెట్‌కూ ఉపయుక్తం.
* సబ్జె్జెక్టుల వారీగా ముఖ్యమైన సమాచారాన్ని పట్టికలు, బొమ్మలు లేదా షార్ట్‌కట్‌ పద్ధతుల ద్వారా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. సమయం ఆదా అవ్వడంతోపాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.
* సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నల్ని సాధన చేయడానికి తగిన సమయాన్ని కేటాయించుకోవాలి.
* వీలైనన్ని మాక్‌ టెస్టులు ప్రాక్టీస్‌ చెయ్యాలి. ముఖ్యంగా ఎంసెట్‌కి ప్రిపేర్‌ అయ్యేటపుడు కంప్యూటర్‌పై సాధన చెయ్యాలి. ప్రతి ప్రాక్టీస్‌ టెస్ట్‌ తర్వాత ఏ టాపిక్‌లలో సరైన సమాధానం గుర్తించలేదో గమనించి ఆ టాపిక్‌లను రివైజ్‌ చేసుకుంటూ ఉండాలి.
* ప్రాక్టీస్‌ టెస్టులు రాస్తున్నపుడే ఎంత సమయం పడుతోందో వాచీ ద్వారా అంచనా వేయాలి. తగిన వేగం, కచ్చితత్వాన్ని పెంపొందించుకోవాలి. ఇలా సమయపాలనపై పూర్తి పట్టు సాధించాలి.


ఏ సబ్జెక్టు ఎలా?
కెమిస్ట్రీ

నీట్‌, ఎంసెట్‌ రెండిటిలోనూ 90 శాతం పైగా ప్రశ్నలు తేలికగానే ఉంటున్నాయి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో లెక్కలు ఇచ్చే అవకాశం ఎక్కువ. ఈ విభాగంలో ప్రాథమిక భావనలనూ, తగిన ఫార్ములానూ వాడే విధానాన్ని అభ్యాసం చేయాలి. ఈ విభాగంలో దృష్టి సారించాల్సిన ముఖ్య అధ్యాయాలు- సొల్యూషన్స్‌, కెమికల్‌ ఈక్విలిబ్రియం, కెమికల్‌ కైనెటిక్స్‌, స్ట్టేట్స్‌ ఆఫ్‌ మేటర్‌, థర్మోడైనమిక్స్‌. ఇనార్గానిక్‌  కెమిస్ట్రీ నుంచి థియరీ ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ. మూలకాలకు సంబంధించిన విభిన్న గ్రూపుల వివరాలు నోట్సులా రాసుకుని వీలైనన్నిసార్లు చదువుకోవాలి. మూలకాల విభిన్న ధర్మాలు, వాటి సారూప్యతలు, అసమానతలు వంటి వాటిని పట్టిక రూపంలో రాసుకుని పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. మూలకాలు, సమ్మేళనాల భౌతిక, రసాయనిక ధర్మాలు, తయారీ విధానాలను గుర్తుపెట్టుకోవాలి. సిలబస్‌లో ఇచ్చిన గ్రూపులకు సంబంధించిన ఆక్సైడులు, హాలైడులు, కార్బొనేట్లు గురించి అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీ ఇన్‌ ఎవిరిడే లైఫ్‌, బయోమాలిక్యూల్స్‌, పాలిమర్స్‌, సర్ఫేస్‌ కెమిస్ట్రీ లాంటి అధ్యాయాలను  ఎన్‌సీఈఆర్‌టీ, అకాడమీ పుస్తకాల్లో ఇచ్చిన వివరణలు చదివితే చాలు.ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కూడా అత్యంత కీలక విభాగం. దీనిని చదివేటప్పుడు సహనం, నేర్పు రెండూ అవసరం. ఈ విభాగంలో నేమ్‌డ్‌ రియాక్షన్స్‌, ఐసోమెరిజం, రియాక్షన్‌ మెకానిజమ్స్‌ ముఖ్యమైనవి. వీటితోపాటు మిగిలిన అంశాలను విస్మరించకుండా చదవాలి. 


బయాలజీ

నీట్‌, ఎంసెట్‌ రెండు ప్రశ్నపత్రాల్లో 50 శాతం మార్కులు ఈ విభాగం నుంచే ఉంటాయి. అంతేకాకుండా ఈ సబ్జెక్టులో అడిగే ప్రశ్నలు చాలావరకూ చదవగానే సమాధానం గుర్తించే స్థాయిలోనే ఉంటాయి. అందుకే మొదటగా ఈ సబ్జెక్టుతోనే పరీక్ష ఆరంభించడం శ్రేయస్కరం. ఎన్‌సీఈఆర్‌టీ, తెలుగు అకాడమీ పుస్తకాలను పూర్తిగా అధ్యయనం చేస్తే అధికంగా మార్కులు తెచ్చుకోవచ్చు.

బోటనీలో మొక్కల వర్గీకరణ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. మొక్కలకు సంబంధించిన అనేక ముఖ్యాంశాలను మార్ఫాలజీలో గమనించవచ్చు. ఈ రెండు అధ్యాయాల్లో సిలబస్‌ పరంగా కొన్ని సందర్భాల్లో అసంపూర్ణ వివరణలతో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలున్నాయి. కాబట్టి అధ్యాపకుల సూచనలను పొందితే మేలు. ప్లాంట్‌ ఫిజియాలజీ అధ్యాయంలో వాటర్‌ రిలేషన్స్‌, మినరల్‌ న్యూట్రిషన్స్‌ వంటి అంశాల్లో పరిజ్ఞానపరంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సెక్సువల్‌ రీప్రొడక్షన్‌ ఇన్‌ ఫ్లవరింగ్‌ ప్లాంట్స్‌, మాలిక్యులర్‌ బేసిస్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటెన్స్‌, హిస్టాలజీ అండ్‌ ఎనాటమీ ఆఫ్‌ ఫ్లవరింగ్‌ ప్లాంట్స్‌లో ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు ఇవ్వవచ్చు. బయోటెక్నాలజీ, అప్లైడ్‌ బయాలజీల్లో టిష్యూకల్చర్‌, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అంశాలను గుర్తుంచుకోవాలి. మార్ఫాలజీ చదివాక రీప్రొడక్షన్‌ ఇన్‌ ఆంజియోస్పర్మ్స్‌ అండ్‌ ప్లాంట్స్‌ చదివితే మంచిది.

జువాలజీలో హ్యూమన్‌ ఫిజియాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి. యానిమల్‌ కింగ్‌డమ్‌ అధ్యాయంలో ప్రతి విభాగానికీ సంబంధించిన ప్రత్యేక, విశిష్ట లక్షణాలను జాగ్రత్తగా చదవాలి. ఎకాలజి అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ నుంచి బయోడైవర్సిటీ, పొల్యూషన్‌, ఓజోన్‌ డిప్లి్లషన్‌ సంబంధిత ప్రశ్నలు అడగవచ్చు. సెల్‌ బయాలజీ అధ్యాయాన్ని పూర్తిచేసి జెనెటిక్స్‌ చదవడం చాలా ఉపయోగకరం. బొమ్మలను ఆధారంగా చేసుకుని ఐదారు ప్రశ్నలు అడగొచ్చు. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ లేదా అకాడమీ పుస్తకాల్లోని ముఖ్యమైన బొమ్మలను గుర్తుంచుకోవడానికి బదులుగా స్వయంగా గీసుకుని వాటిలో విడి భాగాలలను గుర్తిస్తూ అభ్యాసం చేయాలి.


ఫిజిక్స్‌

చాలామంది బయాలజీ విద్యార్థులు దీన్ని కష్టమైనదిగా భావిస్తారు. ఇది అపోహ మాత్రమే. ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే మేథమేటికల్‌ అప్రోచ్‌ అవసరమే అయినా విద్యార్థులు కంగారు పడవలసిన అవసరం లేదు. గత నీట్‌, ఎంసెట్‌ ప్రశ్నపత్రాల సరళిని గమనిస్తే గణిత    పరంగా గట్టి పునాదులు లేకపోయినా 50 నుంచి 60 శాతం మార్కులు తెచ్చుకోవడం సులభతరమే అని తెలుస్తుంది.

గ్రావిటేషన్‌, ఎలక్ట్రోస్టాటిక్స్‌, మాగ్నటిజం వంటి అధ్యాయాల్లో ఎక్కువ అంశాలు, ఫార్ములాలు, ధర్మాలు చాలావరకు సారూప్యతతో ఉంటాయి. ఈ మూడు అధ్యాయాలనూ విడివిడిగా చదివినా వాటిలో సారూప్యతలను గమనిస్తే ప్రిపరేషన్‌ సమయం కలిసివస్తుంది. మెకానిక్స్‌ సంబంధిత లెక్కలు చేసేటప్పుడు కన్సర్వేషన్‌ ఆఫ్‌ మొమెంటమ్‌, ఎనర్జీ, యాంగులర్‌ మొమెంటమ్‌ వంటి సూత్రాల అనువర్తనాలను ఉపయోగించడంపై అవగాహన అవసరం. కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నటిజం లాంటి అధ్యాయాల్లో వలయాల ఆధారిత లెక్కలు జాగ్రత్తగా సాధన చెయ్యాలి. వలయాల్లో కెపాసిటర్స్‌, రెసిస్టర్స్‌ ఉన్నప్పుడు సంతులిత వీట్‌స్టన్‌ బ్రిడ్జిగా మారుతుందేమో గమనించాలి. అటామిక్స్‌, నూక్లియర్‌ ఫిజిక్స్‌ చాలా తేలికయినవి. వీటిపై పట్టు సాధిస్తే కెమిస్ట్ర్టీకి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. బయాలజీ, కెమిస్ట్రీల మాదిరిగా ఎక్కువ సమయం కేటాయిస్తూ ఎక్కువసార్లు ఫిజిక్స్‌ చదవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. చాలాసార్లు చదివే బదులు సాధనకే ప్రాధాన్యమిస్తే ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. 


నవ సూత్రాలు!

1. రెండు పరీక్షలకూ ప్రిపరేషన్‌లో ప్రత్యేకంగా తేడా లేకున్నా 3 గంటల సమయంలోనే ఈ రెండింటిలో ప్రశ్నలసంఖ్య వేరనేది గుర్తుంచుకోండి. నీట్‌ కోసం 3 గంటల్లో 180 ప్రశ్నల్ని పూర్తి చేయగల నేర్పును సాధిస్తే ఎంసెట్‌లో 160 ప్రశ్నల్ని ఇచ్చిన సమయంలోనే పూర్తి చేయవచ్చు.


2. పరీక్ష ఒకటి ఆన్‌లైన్‌, రెండోది ఆఫ్‌లైన్‌ అన్న విషయం మర్చిపోవద్దు. నీట్‌లో నెగిటివ్‌ మార్కులున్నాయి. ఎంసెట్‌లో లేవు. దానికి అనుగుణంగా సన్నద్ధత వ్యూహం, పరీక్ష రాసేటప్పుడు మానసిక స్థితి మార్చుకోవాలి.


3. నీట్‌ కన్నా ఎంసెట్‌ తేలికన్నది అపోహ మాత్రమే. ఈ రెండిటిలో సాపేక్షంగా ఏది కష్టంగా ఉంటుందో ఊహించలేము. గతంలో కొన్నిసార్లు నీట్‌ కన్నా ఎంసెట్‌ పేపర్‌ క్లిష్టంగా ఉన్న సందర్భాలున్నాయి.


4. బయాలజీ తేలికయిన సబ్జెక్ట్‌ కాబట్టి తుది పరీక్షలో సగం సమయాన్ని కాకుండా వీలయినంతవరకు అంతకంటే తక్కువ సమయాన్ని ఉపయోగించుకుంటే, ఫిజిక్స్‌, కెమిస్ట్ర్టీలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రెండు సబ్జెక్టుల్లో లెక్కలుంటాయి. కాబట్టి కొంత సమయం అధికంగా కేటాయించటం అవసరం.


5. పరీక్షలో బయాలజీతో ఆరంభిస్తే మేలు. సబ్జెక్టుల వారీగా ప్రశ్నల్ని సాధించి ఆన్సర్లు గుర్తించడం మంచిదే అయినా డ్రాప్‌ అండ్‌ డ్రాగ్‌ పద్ధతి ఉత్తమం. ఈ పద్ధతిలో బాగా తెలిసిన ప్రశ్నలకు ఆన్సర్లు గుర్తిస్తూ ప్రశ్నల్లో కష్టమైనవీ, అనుమానంగా ఉన్నవీ, ఎక్కువ సమయం కేటాయించవలసినవీ గమనించి, వాటికి రెండో రౌండ్‌లో ఆన్సర్‌ చేయడం మంచిది. లేనిపక్షంలో సమయం చాలదు. 


6. ప్రతిప్రశ్నకూ ఇచ్చిన నాలుగు ఆప్షన్లూ జాగ్రత్తగా చదివిన తర్వాతే సరైన సమాధానాన్ని గుర్తించాలి.


7. ప్రశ్నకు సరైన సమాధానం తెలియకపోతే లాటరీ పద్ధతిలో ఆన్సర్‌ గుర్తించడం మంచిది కాదు. ఎంసెట్‌లో ఈ పద్ధతి వల్ల ఎటువంటి ఇబ్బంది లేకున్నా నీట్‌కు ఇది ప్రమాదకరం. సరైన సమాధానం తెలియకపోతే నీట్‌లో ఆ ప్రశ్నను వదిలెయ్యడం మేలు.


8. పరీక్షకు సన్నద్ధమయ్యేటప్పుడూ, పరీక్షకు ముందు రోజులూ సరైన వేళకు తగినంత నిద్ర, సంతులిత పోషకాహారం చాలా అవసరం. ప్రతిరోజూ తŸగినంత మంచినీరు సేవించాలి. యోగా, ధ్యానం వంటివి ఆచరిస్తే ప్రిపరేషన్‌ సందర్భంగా ఒత్తిడి తగ్గుతుంది. శ్వాస సంబంధిత ఎక్సర్‌సైజులు చేస్తే మెదడు తగినంత ఆక్సిజన్‌ గ్రహించి చురుకుగా ఆలోచించగలుగుతారు.


9. ప్రిపరేషన్‌ సమయంలో పరీక్షకు ముందూ, తర్వాతా చుట్టూ ఉన్న ఇతర విద్యార్థులతో, స్నేహితులతో పరీక్ష, సబ్జెక్టుల గురించి అనవసరపు చర్చలు నివారించండి. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.