close

తాజా వార్తలు

Published : 30/03/2020 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

24 గంటల్లో 63వేల మందికి కరోనా..!

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో వైరస్‌ బారినపడ్డవారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. వీరిలో ముప్ఫై వేలకు పైగా మంది వైరస్‌తో పోరాడుతూ మృతిచెందారు. మరో లక్షా 50 వేల మంది వైరస్‌ను జయించి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 63,159 మంది  కొత్తవారిలోకి ఈ వైరస్‌ ప్రవేశించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆదివారం ఉదయం ప్రకటించింది. మరో 3,646 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఐరోపా దేశాల్లో ఈ మహమ్మారి భారీ ప్రకంపనలే సృష్టిస్తోంది. ఇటలీలో పరిస్థితి అత్యంత దారుణ స్థితికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా పూర్తిగా స్తంభించిపోయిన ఆ దేశంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కార్యకలాపాలన్నీ ఆగిపోవడంతో ఆదాయం లేక ప్రజలు అవస్తలు పడుతున్నారు. 

> ఇటలీలో 24 గంటల్లో 838 మందిని కరోనా వైరస్‌ బలిగొందని ఆదివారం సాయంత్రం అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడ మృతుల సంఖ్య 10,779కి పెరిగింది. మరో 3,186 మంది కొత్తవారు ఈ వైరస్‌ బారినపడడంతో బాధితుల సంఖ్య 97,689కి చేరింది. 

> వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న స్పెయిన్‌లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. మందులు నిండుకోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఆదివారం కొత్తగా మరో 6500 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 80 వేలు దాటింది. వీరిలో 14,709 మంది కోలుకున్నారు. రోజురోజుకీ కరోనా విజృంభణ తీవ్రమవుతున్న దృష్ట్యా అక్కడి ప్రభుత్వం ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. ప్రజల్ని నియంత్రించే బాధ్యత పూర్తిగా సైన్యానికి అప్పగించింది. ఈ క్రమంలో వారికి అత్యవసర అధికారాల్ని కట్టబెట్టింది. 

> ఫ్రాన్స్‌లో మృతుల సంఖ్య ఆదివారం ఒక్కరోజే 13శాతం పెరిగింది. నిన్న 292 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోవడంతో అక్కడి మృతుల సంఖ్య 2,606కు పెరిగింది. ఇప్పటి వరకు అక్కడి ప్రభుత్వం ఆస్పత్రుల్లో మరణించిన వారి సంఖ్యను మాత్రమే లెక్కగడుతోంది. రిటైర్‌మెంట్‌ హోంలలో సంభవిస్తున్న మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 40,174 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వీరిలో 7,202 మంది కోలుకున్నారు.

> చైనాలో విదేశాల నుంచి వస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ దేశం చర్యలకు ఉపక్రమించింది. ఆ దేశంలోకి విదేశీయుల రాకపై ఆంక్షలు విధించింది. దీంతో కొత్తగా వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య ఆదివారం కాస్త తగ్గింది. నిన్న 31 మందిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 81,470కి పెరిగింది. 

> దక్షిణ కొరియాలో మరో 78 మందిలో వైరస్‌ను గుర్తించారు. దీంతో బాధితుల సంఖ్య 9,661కి పెరిగింది. వీరిలో సగానికి పైగా మంది కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. ఇక ఆదివారం మరో ఆరుగురు మరణించడంతో మృతుల సంఖ్య 158కి పెరిగింది.

> కరోనా వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అదుపులోకి తేవాలంటే మరో ఆరునెలల పాటు ఆంక్షలు తప్పవని బ్రిటన్‌ డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జెన్నీ హ్యారీస్‌ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే దేశంలో కొత్తగా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతి నాలుగు గంటలకు రెట్టింపవుతోందని కేబినెట్‌ మంత్రి మైకేల్‌ గోవ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌ని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 1,228 మంది మృతిచెందగా.. 19,522 మంది వైరస్‌ బారిన పడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకినవారి సంఖ్య : 7,22,088
కోలుకున్నవారి సంఖ్య : 1,51,766
మృతుల సంఖ్య : 33,976

(సోమవారం ఉదయం 9.10గంటల సమయానికి)

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.