close

తాజా వార్తలు

Published : 01/04/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేర్చుకుంటూ చదువు నేరుగా కొలువు

టెన్త్‌ తర్వాత? పాలిటెక్నిక్‌ కోర్సులు

పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరే అవకాశాన్ని పాలీసెట్‌ కల్పిస్తోంది. ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి  ఇది చక్కని దారి. ర్యాంకు సాధించి పాలిటెక్నిక్‌ కోర్సులో చేరితే చదువుకుంటూనే ప్రాక్టికల్‌గా నేర్చుకోవచ్చు. ఈ డిప్లొమా అందుకున్న వెంటనే కొన్ని రకాల కొలువుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది. ప్రవేశ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఎంట్రన్స్‌ల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే  మెరుగైన కళాశాలలో సీటు పొంది, సాంకేతిక  కెరియర్‌కు మేలైన బాట వేసుకోవచ్చు!

హైస్కూలు స్థాయి నుంచే నేటితరానికి కెరియర్‌పై కచ్చితమైన ప్రణాళికలు ఉంటున్నాయి. టెక్నాలజీలపై పట్టు పెంచుకోవడం, వేగంగా స్థిరపడటం లక్ష్యంగా సాగుతున్నారు. అందుకే కొత్త రంగాల ఆవిర్భావం, వాటికి సంబంధించి వస్తున్న స్పెషలైజేషన్లు, అందుబాటులోకి వస్తున్న కొత్త కోర్సులపై దృష్టిసారిస్తున్నారు. మూస ధోరణిలో కాకుండా కొత్త దారుల్లో కెరియర్‌ను మలచుకోవాలనుకుంటున్నవారూ ఉన్నారు. వాళ్లు తాము ఎంచుకున్న రంగంలో ముందుకు సాగడానికి అదనపు అనుభవం సంపాదించుకోవడం, ముందస్తు పరిజ్ఞానాన్ని పెంపొదించుకోవడంపై దృషి పెడుతున్నారు. అలాంటి వారికి అనుకూలమైనవి పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు.

పదో తరగతి విద్యార్హతతో ఎన్నో డిప్లొమా/ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.  పది తర్వాత అప్లైడ్‌ సైన్స్‌/ టెక్నికల్‌ సబ్జెక్టులను అభ్యసించాలనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు. ఇవి ఉద్యోగాధారిత కోర్సులు. పూర్తిచేయగానే సంబంధిత పరిశ్రమల్లో ఉద్యోగం సాధించుకునే విధంగా సిలబస్‌ ఉంటుంది. టెక్నికల్‌ డిప్లొమా ప్రోగ్రాముల్లో ఇంజినీరింగ్‌ అంశాలుంటాయి. అందుకే వీటిని డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. కొన్నింటికి మూడున్నరేళ్లు. సెమిస్టర్‌ విధానంలో నిర్వహిస్తారు. కోర్సుల కాలవ్యవధిని బట్టి  ఆరు నెలల వరకు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది.

కోర్సులు.. ప్రవేశం
మనదేశంలో పాలిటెక్నిక్‌ కోర్సులకు పరిధి, గిరాకీ ఎక్కువ. ఎన్నో ఉత్తమ కళాశాలలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌) ద్వారా వీటిల్లోకి ప్రవేశాన్ని పొందవచ్చు. రెండు రాష్ట్రాల్లోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ సంస్థలు ఈ ప్రవేశపరీక్షను విడివిడిగా నిర్వహిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందినవారికి మాత్రమే అడ్మిషన్‌ లభిస్తుంది. పదో తరగతి లేదా బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ గుర్తింపు పొందిన తత్సమాన కోర్సు (సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఎన్‌ఐఓఎస్‌, టీఓఎస్‌ఎస్‌, ఏపీఓఎస్‌ఎస్‌ వంటివి) పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం
టీఎస్‌ పాలీసెట్‌: పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మొత్తం మార్కులు 150. మేథమేటిక్స్‌ నుంచి 60, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఒక్కోదాని నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలన్నీ పదో తరగతి సిలబస్‌ నుంచే వస్తాయి.
పీజేటీఎస్‌ఏయూ పరిధిలోని అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కావాలనుకునేవారు బయాలజీతోపాటు మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ విభాగాల ప్రశ్నలనూ రాయాలి. ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులవారికి బయాలజీ ఆప్షనల్‌. ప్రతి విద్యార్థికీ ప్రవేశం కోసం రెండు వేర్వేరు ర్యాంకులు (పాలిటెక్నిక్‌, అగ్రికల్చర్‌ డిప్లొమా) ఇస్తారు.
ఏపీ పాలీసెట్‌: వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. మేథమేటిక్స్‌ నుంచి 60, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ప్రతి విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు.

ప్రత్యేకత ఏమిటి?
* పాలిటెక్నిక్‌లో ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’పై ప్రధాన దృష్టి ఉంటుంది. అందులో భాగంగానే సాంకేతికాంశాలను థియరీ విధానంలో బోధించడంతోపాటు ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికీ సమ ప్రాధాన్యం ఇస్తారు.
* విద్యాపరమైన పరిజ్ఞానంతోపాటు భావవ్యక్తీకరణ, ప్రసంగ నైపుణ్యాలు, విధి నిర్వహణలో పాటించే సూత్రాలు, క్రమశిక్షణ, ప్రెజెంటేషన్లపై పట్టు ఏర్పడుతుంది.
* ప్రయోగపూర్వక బోధన కారణంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ అలవడుతుంది. దీంతో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగానికి సంసిద్ధులవుతారు.

ఎలా సన్నద్ధమవ్వాలి?
ప్రవేశపరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ దాదాపుగా 9, 10 తరగతుల నుంచే వస్తాయి. ముఖ్యంగా  ప్రశ్నలన్నీ మేథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులకు చెందినవే. పదో తరగతి తుది పరీక్షల తర్వాతే ఈ పరీక్ష ఉంటుంది. విద్యార్థులు అప్పటికే సిలబస్‌ పూర్తి చేసి ఉంటారు. కాబట్టి, ముందుగా ప్రవేశపరీక్ష సిలబస్‌ను సేకరించి పెట్టుకోవాలి. దాని ఆధారంగా సన్నద్ధత ప్రారంభించాలి.
అకడమిక్‌ పరీక్షల తరహాలో కష్టపడితే చాలదు. తెలివిగా చదవడంపైనా దృష్టిపెట్టాలి. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయని కేవలం ఆ తరహా  మెటీరియల్‌పైనే ఆధారపడకూడదు.  ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం మేలు. కాన్సెప్టులు నేర్చుకుంటే ప్రశ్న ఏవిధంగా వచ్చినా జవాబు గుర్తించడం సులువవుతుంది. కాబట్టి, సిలబస్‌లోని ప్రతి టాపిక్‌లో ప్రాథమికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి చదవాలి. ఆపై మాదిరి   ప్రశ్నపత్రాలను సాధించడంపై దృష్టిపెట్టాలి. ఎంత ఎక్కువ సాధనచేస్తే అంతమంచిది. గత  ప్రశ్నపత్రాలు పాలీసెట్‌ అధికారిక వెబ్‌సైట్లలో ఉంటాయి.


తెలంగాణలో అగ్రి డిప్లొమాలకూ పాలీసెట్‌

తెలంగాణలో కొత్తగా పాలీసెట్‌ ఆధారంగానే అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లోకి ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ), దాని అనుబంధ కళాశాలల్లోని సీట్లను ఇకనుంచి పాలీసెట్‌ ప్రాతిపదికగా కేటాయిస్తారు. ఈమేరకు పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పాత పద్ధతినే పాటిస్తోంది. పాలిటెక్నిక్‌ ర్యాంకును అనుసరించి యథావిధిగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అన్‌-ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్లు ఇస్తారు. అగ్రికల్చర్‌ డిప్లొమా సీట్లను మాత్రం విడిగా మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తారు.


ముఖ్యమైన తేదీలు

తెలంగాణ: ఆన్‌లైన్‌లో (www.polycetts.nic.in) లేదా తమకు దగ్గర్లోని టీఎస్‌ ఆన్‌లైన్‌/ హెల్ప్‌లైన్‌ సెంటర్లలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.400, ఎస్‌సీ, ఎస్‌టీ వారికి రూ.250. అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 17, 2020
పరీక్ష తేదీ: ప్రకటించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌: ఆన్‌లైన్‌లో  (https://polycetap.nic.in) లేదా ఆన్‌లైన్‌/ హెల్ప్‌లైన్‌ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.400.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 21, 2020.
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 28, 2020 (ఉదయం 11గం. నుంచి మధ్యాహ్నం 01:00 గం. వరకు)


పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరడం వల్ల కలిగే వివిధ  రకాల ప్రయోజనాల గురించి తెలుసుకోడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.