close

తాజా వార్తలు

Updated : 02/04/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రామ  రెండక్షరాలు  శక్తి శరాలు!

నేడు శ్రీరామనవమి

రా... మ...

విడివిడిగా అవి రెండక్షరాలే...

కానీ కలివిడిగా పలికితే అది మహాశక్తిమంతం...తారక మంత్రం...

రాముడి బాణమెంత ప్రచండమో, ఆయన నామమంత ప్రసన్నమైందంటారు.

అందుకే రఘురామచంద్రుడే కాదు...

ఆయన పేరు కూడా పూజనీయమైంది, నిత్యస్మరణీయమైంది...

లేఖ రాసినా ముందుగా ‘శ్రీరామ’ నామాన్ని రాసి, ఆ తర్వాత మిగిలిన విషయాలు రాయడం భారతీయుల సంప్రదాయం. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు ‘రామ రామ’ అంటూ చెవులు మూసుకోవటం కూడా చూస్తుంటాం. ఆకలి వేస్తే ‘అన్నమో రామచంద్రా’ అంటారని తెలుగువారి నానుడి. ఏదైనా భయం ఆవహించినా, ఎవరికైనా అభయం ఇచ్చినా ‘శ్రీరామ రక్ష’ అనడం అలవాటు.

‘నాథా! కలియుగంలో మానవులు చాలా అల్పమైన శక్తి కలిగిఉంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా పూర్తిగా పారాయణ చెయ్యలేని అశక్తత వారిది. అలాంటప్పుడు ప్రజలు తరించే మార్గం ఉండదా? మొత్తం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన ఫలితాన్ని పొందే సూక్ష్మమైన మార్గం లేదా? అంటూ ఓ రోజున పార్వతీదేవి పరమేశ్వరుడిని ప్రశ్నించింది.’

దానికి శివుడు... లేకేం పార్వతీ...

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

‘శ్రీరామ రామ రామ’ అనే ఒక్క నామాన్ని పారాయణ చేస్తే మొత్తం విష్ణు సహస్రనామాలను పారాయణ చేసిన ఫలితం వస్తుందని ఉపదేశించాడు పరమేశ్వరుడు.

‘రామ’ అనే పదాన్ని పలకడంతోనే పాపాలన్నీ తొలగిపోతాయని ‘శ్రీరామ కర్ణామృతం’ ప్రకటిస్తోంది. ‘రా’ అనే అక్షరాన్ని పలికేటప్పుడు మన పెదవులు తెరుచుకుంటాయి. దీనివల్ల మనలో ఉండే ప్రతికూల శక్తులు బయటకు పోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని పలికేటప్పుడు పెదవులు మూసుకుంటాయి. దీంతో తిరిగి అవి మనలో చేరకుండా నిరోధానికి గురవుతాయి. అందుకే ఈ మంత్రం అత్యంత శక్తిమంతమైందని చెబుతారు. ఉమా సంహిత కూడా ఇదే విషయాన్ని వివరిస్తుంది.

‘రా శబ్దోచ్చారణే జాతే వక్త్రాత్పాపం విగచ్ఛతి

మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి’

‘రా’ అనే శబ్దం ఉచ్చరించగానే ముఖం నుంచి మనలోని పాపాలు బహిర్గతమవుతాయి. ‘మ’ అనే అక్షరం వినబడగానే అవన్నీ భస్మమవుతాయని చెబుతోంది. ఇదే భావాన్ని భక్త రామదాసు తన దాశరథీ శతకంలో ప్రకటించారు.

‘రామ’ నామం హరి, హరులిద్దరూ ఒక్కటేనన్న సత్యాన్ని విస్పష్టంగా ప్రకటిస్తూ, అద్వైతభావనకు ప్రతీకగా నిలుస్తుంది. ‘రా’ అనే అక్షరం నారాయణ అష్టాక్షరీ మంత్రమైన ‘ఓం నమో నారాయణాయ’లోని ఐదో అక్షరం. అలాగే, ‘మ’ శివపంచాక్షరీ మంత్రమైన ‘ఓం నమశ్శివాయ’ మూడో అక్షరం. ఈ రెండక్షరాల సంయోగమే ‘రామ’ నామం. కాబట్టి, ‘రామ’ నామం శివకేశవ అభేదభావాన్ని ప్రకటిస్తుంది.

నారాయణ అష్టాక్షరీ మంత్రంలో ‘రా’, శివపంచాక్షరీ మంత్రంలో ‘మ’ అనే అక్షరాలు ఆయా మంత్రాలకు జీవాక్షరాలు. ఆ రెండు అక్షరాల సంయోగంతో ఏర్పడిన మహోన్నత మంత్రం ‘రామ’ నామం. ఈ కారణం వల్లనే రామనామం అన్ని మంత్రాల కన్నా పరమోన్నతమైన పవిత్రతను, శక్తిని పొందింది.

కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి చెప్పిన కథ ఇది.

ఓ అడవిలోకి ప్రవేశించిన కొందరు దొంగలు తాము చేయాలనుకున్న పనుల గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు.

వనేచరామః వసుచాహరామః

నదీన్తరామః నభయం స్మరామః

వనే చ రామః (అడవిలో సంచరిద్దాం), వసు చా హరామః (ఈ దారిలో వెళ్ళే ప్రయాణికుల సంపదను దొంగలిద్దాం), నదీం స్తరామః (దొంగిలించాక నదిని దాటేద్దాం), నభయం స్మరామః (భయం గురించిన ఆలోచన కూడా చెయ్యొద్దు) అని అనుకున్నారు.

ఇతీరయంతో విపినే కిరాతా ముక్తింగతాః

రామపదానుషంగాత్‌

దొంగలైనా తమ ఆలోచనలో ‘రామ’ నామాన్ని స్మరించడం వల్ల మరణించాక వారికి మోక్షం కలిగిందట. ఇదీ రామ నామ మహిమ అని చెప్పారాయన.

మహా మంత్రం

* ప్రాచీన సంప్రదాయంలో అంకెను అక్షరాలతో పోల్చి చెబుతారు. ఈ క్రమంలో ‘ర’ అనే అక్షరం 2కు సంకేతం. ‘మ’ 5కు సంకేతం. రామ... అంటే 2x5=10 అవుతుంది. ఒకసారి ‘రామ’ అంటే 10 ఫలితం వస్తుంది. వరుసగా మూడు సార్లు ‘రామ రామ రామ’ అంటే 10x10x10 =1000 అవుతుంది. అంటే ఒక్కసారి ‘శ్రీరామ రామ రామ’ అనే నామాన్ని పలికితే 1000 విష్ణు నామాల్ని పారాయణ చేసిన ఫలితం వస్తుందని భావన.

‘రామ’ అనే శబ్దమే ప్రణవంతో సమానం కాబట్టి ఇతర మంత్రాల మాదిరిగా ఈ మంత్రానికి ముందు ఓంకారం కలిపి జపించాల్సిన అవసరం లేదు.

మన మంత్రశాస్త్రంలో సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి. వీటన్నిటిలో కేవలం రామ మంత్రాన్ని మాత్రమే ‘రామ తారక మంత్రం’ అంటారు. ‘తారకం’ అంటే తరింపజేసేదని భావం. ‘వివేకాన్ని మేలుకొలపడాన్నే తారకం’ అంటారని పతంజలి యోగశాస్త్రం చెబుతోంది. రామ మంత్రం మనిషిలో వివేక వైరాగ్యాలను కలిగించి మనిషిని తరింపజేస్తుంది కాబట్టే ఇది సర్వోన్నతమైందిగా, మంత్రచూడామణిగా వెలుగొందుతోంది.

‘రా’ అంటే పరబ్రహ్మ. ‘మ’ అంటే జీవుడు. కాబట్టి ‘రామ’ అనే నామం పరమాత్మలో లీనమైన జీవాత్మను ప్రకటిస్తుంది. శరీరమనే క్షేత్రంలో జీవాత్మరూపంలో దాగి ఉన్న పరమాత్మను దర్శించమనే సందేశాన్నిస్తుంది. 

పసిబిడ్డల్ని ఉయ్యాలలో వేసి ‘రామా లాలీ మేఘశ్యామ లాలీ’ అంటూ జోకొట్టడం ఆత్మీయతకు ప్రతిరూపం. తుది శ్వాస విడిచిన తర్వాత రుద్రభూమికి పార్ధివదేహాన్ని తీసుకెళుతూ ‘రామ్‌ నామ్‌ సచ్‌ హై’ అంటూ ఉచ్చరించే ఆచారం ఉత్తరాదిలో ఉంది. ఇలా తొలి, తుది శ్వాసల్లో మనిషి తోడుగా ఉండేది కేవలం రామ నామం మాత్రమే.

రామనామ్‌ మణిదీప్‌ ధయ జోహ్‌ రే హరంద్వార్‌

తుసి భీతర్‌ ఛాహే రహు జాం బహం ఉజ ఆర్‌’

మీకు లోపల, బయట వెలుగు కావాలన్న కోరిక ఉంటే జిహ్వ అనే ద్వారం దగ్గర రామ నామం అనే దీపాన్ని వెలిగించండి అంటాడు తులసీదాసు.

భక్త రామదాసు ‘శ్రీరామ నీ నామమెంతో రుచిరా’ అంటూ, ‘పిబరే రామ రసం రసనే పిబరే రామరసం’ అంటూ సదాశివ బ్రహ్మేంద్రుడు, ఇంకా ఎందరో ఎందరెందరో వాగ్గేయకారులు రామ నామంలోని ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని పొగడుతూ, విశ్లేషిస్తూ, వివరిస్తూ వందలాది కృతులు రచించారు.

-కప్పగంతు రామకృష్ఱ

తీర్చిదిద్దుకోండి...

విశ్వామిత్రుడి యాగ రక్షణ కోసం లక్ష్మణుడితో సహా బయల్దేరిన శ్రీరామచంద్రమూర్తి ఆ యాత్రలో మొత్తం ముగ్గురు స్త్రీలను కలుసుకుంటాడు. వారు తాటక, అహల్య, సీతాదేవి.

తాటక తమోగుణానికి సంకేతం అందుకే గురూపదేశం ప్రకారం ఆమెను సంహరించాడు. అహల్య రజోగుణానికి ప్రతీక. చురుకుదనం, క్రియాశీలత ఆమెను తప్పుదోవ పట్టించాయి. అందుకే రామయ్య రాతిగా పడిఉన్న అహల్యను తిరిగి స్త్రీగా మార్చి సంస్కరించాడు. చివరిగా కలుసుకున్న స్త్రీమూర్తి సీతాదేవి. ఆమె సత్త్వగుణానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే స్వయంవరంలో ఆమెను గెలుచుకున్నాడు. ఈ మూడు ఇతివృత్తాల్లో రామచంద్రుడు లోకానికి ఉత్తమ సందేశం ఇచ్చాడు. ఏ వ్యక్తి అయినా సత్త్వరజస్తమో గుణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తనలోని తమో గుణాన్ని నశింపజేసుకోవాలి. రజో గుణాన్ని సంస్కరించుకుని, సత్కార్యాలపై దృష్టి పెట్టాలి. సత్త్వ గుణాన్ని పెంపొందించుకుంటూ, చివరకు గుణాతీత స్థితికి చేరుకోవాలి.

ప్రకృతి ప్రణమిల్లుతుంది

రావణుని చేతికి చిక్కిన సీతమ్మను వెదుక్కుంటూ శ్రీరాముడు అరణ్యంలోని కొండలు, గుట్టలు అన్నీ వెదికాడు. కనిపించిన ప్రతి వారినీ ఆమె జాడ గురించి అడిగాడు. రామయ్య దీనస్థితిని చూసిన లేళ్లు యథాశక్తి ప్రయత్నించి, సీతమ్మను రావణుడు అపహరించి, దక్షిణ దిశగా తీసుకెళ్లాడని సైగలతో చెబుతాయి. ‘సపంథానంతు గచ్ఛంతం తిర్యంచోపి సహాయతే కుపథానంతు గచ్ఛంతం సోదరోపి విముంచతి’... మంచి మార్గంలో ప్రయత్నించే వారికి ప్రకృతి సాయం కూడా అందుతుందని ఈ ఉదంతం చాటింది.

కన్నతల్లి, కర్మభూమి

రామ, రావణ యుద్ధం ముగిసింది. విభీషణుడు లంకాధిపతి అయ్యాడు. తనకు ఇంతటి ఘనత తెచ్చిన రామయ్యను లంకలో ఉండి, పది రోజులు తమ ఆతిధ్యాన్ని స్వీకరించమని విభీషణుడు ప్రార్థించాడు. అందుకు రామయ్య

ఆపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ!

‘విభీషణా! లంక, అందులోని భోగాలపై నాకు దృష్టిలేదు. మాతృమూర్తి, మాతృభూమి ఈ రెంటికీ మించింది ఈ లోకంలో లేదు. పద్నాలుగేళ్లుగా వీటికి దూరంగా ఉన్న నా మనసు వెంటనే వారిని చూడాలని ఆరాట పడుతోంది’ అన్నాడు.


ప్రతి ఇల్లూ రామాలయమే!

శ్రీరామ నవమి వచ్చింది...

భద్రాద్రి లేదు...

ఒంటిమిట్టా లేదు...

ఊర్లో రామాలయం లేదు...

చివరికి వీధిలో చలువ పందిరీ లేదు...

మరెలా...

ఇంటినే దేవాలయంలా, మనసే మందిరంలా మార్చేదిలా...

నం ఇంట్లోనే సీతారాములను దర్శించి, అర్చించి, దీవెనలందుకోవాల్సిన సమయమిది. పురోహితులు రాకుండా ఇంట్లో ఆగమ సంప్రదాయం ప్రకారం కల్యాణం జరపడం ఆచరణ సాధ్యం కాదు కాబట్టి అర్చనతో సంతృప్తి చెందాలి. మన ఇంటిలో పూజామందిరంలోనే సీతారాములను కల్యాణ దంపతులుగా అలంకరించి, షోడశోపచారాలతో పూజించుకోవచ్చు.

ఈ సందర్భంగా పూజావేదికపై కలశాన్ని ఏర్పాటు చేసుకొని సంకల్పం చెప్పాలి. ‘స్వస్తిశ్రీ వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శార్వరినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరుతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం బృహస్పతివాసరే పునర్వసు శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ, అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం సీతా లక్ష్మణ భరత శతృఘ్న హనుమత్‌ సమేత శ్రీరామచంద్రదేవతాం ఉద్దిశ్య శ్రీరామచంద్రదేవతా ప్రీత్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూర్వక పూజాం కరిష్యే. శ్రీరామచంద్ర అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే...’ అని సంకల్పం చెబుతూ అష్టోత్తర శతనామావళి జపించాలి. అవకాశం లేకుంటే రామనామం జపించినా సరిపోతుంది.

వడపప్పు, పానకము, పండ్లు, కొబ్బరి, వాటితోపాటు మనం ఇంటిలో చేసుకున్న వంటకాలనూ నివేదన చేసి నీరాజనం ఇవ్వాలి. పూజానంతరం ఈ శ్లోకాలను చదువుకోవచ్ఛు●

వేడుక కంటేె భక్తిశ్రద్ధలు ముఖ్యం. అందుకే ఎవరింటిలో వారు నిశ్చల భక్తితో నిరాడంబరంగా కల్యాణ మూర్తులైన సీతారాములను అర్చించుకొని ఆశీస్సులు అందుకోవాలి.

ఆపదా మపహర్తారం

దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణ


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.