close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/04/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వసతి.. విద్య.. అన్నీ ఉచితం!

నాణ్యమైన ఇంటర్‌ విద్యకు గురుకులాలు
ప్రవేశపరీక్షలో ర్యాంకు సాధిస్తే సీట్లు
తెలుగు రాష్ట్రాల్లో వెలువడిన నోటిఫికేషన్లు

ప్రతిభకు పేదరికం ప్రతిబంధకం కాదని నిరూపిస్తున్నాయి గురుకుల కళాశాలలు. ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను బోధిస్తున్నాయి. పోటీ పరీక్షల్లోనూ తమ విద్యార్థులు సత్తా చాటేలా తీర్చిదిద్దుతున్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో  ప్రవేశాలుంటాయి.

ప్రతిభావంతులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించి,  తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా చేయడానికి గురుకులాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తారు. ఇంటర్‌తో సమాంతరంగా జేఈఈ, నీట్‌, ఎంసెట్‌, సీఏ-సీపీటీ శిక్షణ అందిస్తారు. విద్యార్థుల దినచర్య ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై రాత్రి పది గంటలకు ముగుస్తుంది. చదువుతోపాటు ఆటపాటలకూ ప్రాధాన్యముంటుంది. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది.
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఇంటర్‌ విద్యను అందిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. చదువుతోపాటు వసతి, భోజనం అన్నీ ఉచితమే. ట్యూషన్‌ ఫీజు ఉండదు. విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి లోకో పేరెంట్‌ విధానం ఉంటుంది. అంటే ప్రతి 15-20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మెంటర్‌గా వ్యవహరిస్తారు. చదువులో వెనుకబడిన వారిని  ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుతారు. మెరిట్‌ విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం మరింత మెరుగైన తర్ఫీదునిస్తారు. ఈ రెండు  కారణాల వల్లే గురుకులాల్లో దాదాపు 96 శాతం ఇంటర్‌ ఉత్తీర్ణత నమోదవుతోంది. ఈ సంస్థల్లో చదువుకున్నవారు ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారు. జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ల్లో మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.

ఎవరు అర్హులు?
2020లో పదో తరగతి పరీక్షలు మొదటి ప్రయత్నంలో రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినవారు అనర్హులు. సొంత రాష్ట్రంలో చదువుతున్నవారు మాత్రమే అర్హులు. జనరల్‌ విద్యార్థులు 6 జీపీఏ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 5 జీపీఏ సాధించాలి. ఇంగ్లిష్‌లో  జీపీఏ 4 తప్పనిసరి.

పరీక్ష విధానం
గురుకులాల్లో ఎంపీసీ గ్రూపు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. బైపీసీ వారికి ఇంగ్లిష్‌, బయలాజికల్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. సీఈసీ, ఎంఈసీ గ్రూపు కోరుకున్నవారికి ఇంగ్లిష్‌, సోషల్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఏపీలో ఈఈటీ, సీజీటీ ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయి. ఈఈటీకి ఎంపీసీ, సీజీటీకి బైపీసీకి నిర్వహించే పరీక్షలు రాయాలి.
ఏపీ, టీఎస్‌ రెండు రాష్ట్రాల్లోని పరీక్షల వ్యవధీ రెండున్నర గంటలే. ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రతి సబ్జెక్టుకూ 50 మార్కులను కేటాయించారు. ఆ సబ్జెక్టుల్లో సంబంధిత (ఏపీ లేదా తెలంగాణ) రాష్ట్రానికి చెందిన పదో తరగతి సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌ విభాగంలో జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఏ గ్రూపు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంగ్లిష్‌ తప్పనిసరి. ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. పరీక్షలను అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహిస్తారు.

సన్నద్ధత ఎలా?
ఇంగ్లిష్‌: ఈ విభాగంలో పాఠ్యపుస్తకాల నుంచి ఎలాంటి ప్రశ్నలూ అడగరు. అభ్యర్థి ఆంగ్లభాషపై ఎంతవరకు పట్టు సాధించారో తెలుసుకుంటారు. ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. ఇందులో భాగంగా ఇచ్చిన పదానికి అర్థం గుర్తించమనడం, వాక్యాన్ని ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతిలోకి మార్చమనడం, ఖాళీని పూరించడం, రెండు వాక్యాలను కలిపి రాయడం, ఉన్నవాటిలో సరైన వాక్యాన్ని గుర్తించడం, వాక్యానికి అర్థాన్ని కనిపెట్టడం, సరైన పదాన్ని గుర్తించడం, ప్యాసేజీ ప్రశ్నలు...మొదలైనవి ఉంటాయి. ఈ విభాగంలో ఎక్కువ మార్కుల కోసం వ్యాకరణంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. లెటర్‌ రైటింగ్‌ తదితరాలు తెలుసుకోవాలి. భాషా భాగాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసి, వాటి ప్రకారం సన్నద్ధతను కొనసాగించాలి.
భౌతిక రసాయన శాస్త్రాలు: పదోతరగతిలోని అన్ని పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల అన్ని అంశాలనూ సమ ప్రాధాన్యంతో చదవాలి. ముఖ్యమైన కాన్సెప్టులను నోట్స్‌గా రాసుకోవాలి. అనువర్తన, పరిశీలనాత్మక ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రయోగాంశాలు, సమస్యలపైనా ప్రశ్నలు వస్తున్నాయి. సూత్రాలను గుర్తుంచుకుని, వాటిని ఉపయోగించే విధానం తెలుసుకోవాలి.
గణిత శాస్త్రం: వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. అధ్యాయాల వారీ అధ్యయనం సాగించాలి. ముఖ్యమైన సూత్రాలను రాసుకోవాలి. ఇచ్చిన ప్రశ్నకు ఏ సూత్రం అనువర్తించాలో తెలుసుకోవాలి. ఇందుకు ముందస్తు సాధన కీలకం. గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. తక్కువ వ్యవధిలో సమాధానాలు గుర్తించడానికి వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధన తప్పనిసరి..

జీవశాస్త్రం: ఈ విభాగానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలన్నీ నేరుగానే అడుగుతున్నారు. ప్రాథమికాంశాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల వాటిని శ్రద్ధతో చదివి, మననం చేసుకుంటే జీవశాస్త్రంలో ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు. పటాలకు సంబంధించిన ప్రశ్నలకూ అవకాశం ఉంది.
సాంఘిక శాస్త్రం: పాఠ్యపుస్తకంలోని అన్ని విభాగాలకూ పరీక్షలో సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. పుస్తకం మొత్తం క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి. కంఠస్థం చేయకుండా ప్రతి పాఠ్యాంశాన్నీ వీలైనన్ని ఎక్కువసార్లు చదవాలి. ప్రతి వాక్యాన్నీ ప్రశ్నరూపంలోకి అన్వయించుకుని చదివితే అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తించవచ్చు.


ముఖ్యమైన తేదీలు
తెలంగాణలో...

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఏప్రిల్‌ 15, 2020 వరకు స్వీకరిస్తారు
పరీక్ష తేదీ:  మే 10, 2020
వెబ్‌సైట్‌: https://tsrjdc.cgg.gov.in


ఆంధ్రప్రదేశ్‌లో...

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 22, 2020
పరీక్ష తేదీ: మే 14, 2020
వెబ్‌సైట్‌: https://aprjdc.apcfss.in/


తెలంగాణలో

మొత్తం కళాశాలలు - 35
బాలురు - 15
బాలికలు - 20
మొత్తం సీట్లు - 3,000


ఆంధ్రప్రదేశ్‌లో

మొత్తం కళాశాలలు - 10
జనరల్‌ బాలురు - 4
జనరల్‌ బాలికలు - 2
జనరల్‌ కో-ఎడ్యుకేషన్‌ - 1
మైనారిటీ (బాలురు)  - 2
మైనారిటీ (బాలికలు) - 1
మొత్తం సీట్లు - 1,110


ఏయే గ్రూప్‌లు?

ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ
* తెలంగాణలో ఈఈటీ, సీజీటీ గ్రూప్‌లు లేవు.


* మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్‌ బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలు 14 ఉన్నాయి. వాటిల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు పరీక్ష ఇటీవల ముగిసింది.
వెబ్‌సైట్‌: https://jnanabhumi.ap.gov.in/


టెన్త్‌ తర్వాత?ఆర్‌జేసీ సెట్‌లు
వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకం

తెలంగాణలోని 19 మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఇందులో బాలికలకు 7, బాలురకు 12 కాలేజీలు ఉన్నాయి. వీటికి విడిగా దరఖాస్తు చేసుకోవాలి.
* జేఈఈ, నీట్‌, ఎంసెట్‌, సీఏ/సీపీటీ, క్లాట్‌ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
గ్రూప్‌లు - ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ.వీటిని ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు.
మొత్తం సీట్లు - 3040. ఏప్రిల్‌ 7లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌: https://mjpabcwreis.cgg.gov.in


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.