close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 06/04/2020 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అన్నీ ఆగినా.. ఆన్‌లైన్‌ ఉందిగా!

లాక్‌డౌన్‌ సమయం నేర్చుకునే తరుణం

పరిజ్ఞానానికి పదును.. ఇదే అదును

రోజూ వెళ్లి నేర్చుకుంటున్న కోర్సులు మధ్యలోనే ఆగిపోయాయి..

పరీక్షల వాయిదాతో ప్రిపరేషన్‌ జోరు తగ్గింది..

ఫోన్‌లో చాటింగులే కానీ.. మిత్రులతో మీటింగుల్లేవు...  ఎక్కడివారు అక్కడే!

మరి ఈ విరామ సమయాన్ని విద్యార్థులూ.. ఉద్యోగార్థులూ మెరుగ్గా, ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దామా!?

కొవిడ్‌-19 విపత్తు కారణంగా విద్యాసంస్థలన్నీ తాత్కాలికంగా మూతబడ్డాయి. జాతీయస్థాయి ప్రవేశపరీక్షలనూ వాయిదా వేశారు. ఉద్యోగులేమో కొందరు ఇంటి నుంచే పనిచేస్తుండగా మరికొందరికి సంస్థలే సెలవులు ప్రకటించాయి. అనుకోకుండా వచ్చిన ఈ విరామ సమయంలో విద్యార్థులూ ఉద్యోగార్థులూ పుస్తకాలనూ, అభ్యాసాన్నీ పూర్తిగా పక్కనపెట్టేస్తే నష్టమే. ఎందుకంటే దేన్నైనా అలవాటు చేసుకోవడానికైనా, మరచిపోవడానికైనా 21 రోజుల సమయం సరిపోతుందని పరిశోధనలు చెప్తున్నాయి. అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్ని కెరియర్‌ ఆలోచనలకూ, భవిష్యత్‌ ప్రణాళికలకూ వినియోగించుకోవాలి. ఆసక్తీ, అభిరుచులకు సంబంధించిన, కెరియర్‌కు పనికొచ్చే నైపుణ్యాలను నేర్పే ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరొచ్ఛు

విదేశీ విద్యాభ్యాసానికి అవసరమైన ప్రీ రిక్విజిట్‌ టెస్టులు.. టోఫెల్‌, జీఆర్‌ఈ. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో అభ్యర్థులు ఇంటినుంచే ఆన్‌లైన్లో ఈ పరీక్షలు రాయటానికి ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) ఏర్పాట్లు చేస్తోంది. కృత్రిమమేధ, లైవ్‌ మానిటరింగ్‌ సాంకేతికతలను ఇందుకు ఉపయోగించుకోబోతోంది.

ఆగకుండా..ఆపకుండా..

మిగతావారితో పోలిస్తే.. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల పరిస్థితి కొంత నయం. వారి వార్షిక పరీక్షలు పూర్తయ్యాయి. పదో తరగతి సహా ఉన్నతవిద్య చదివేవారు తమ సన్నద్ధతను కొనసాగించాల్సిందే. ఇందుకు గతంలో తాము చేసుకున్న పునశ్చరణ ప్రణాళికనే కొనసాగించడం మేలు.

‘ఎలాగూ సిలబస్‌ పూర్తిచేశాం. పరీక్ష తేదీలు ప్రకటించాక మళ్లీ చూసుకోవచ్చులే’ అనే ధోరణి సరైంది కాదు. అప్పటికే చదివినవే అయినా పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని కొంత సందేహం ఉన్నవాటిని మళ్లీ నేర్చుకోవడం. అప్పటికే బాగా వచ్చినవాటిని అప్పుడప్పుడూ మననం చేసుకోవటం, లేదంటే చూడకుండా రాయడం వంటివి సాధన చేయొచ్ఛు

టాపిక్‌లవారీగా ఎన్నో వెబ్‌సైట్‌లు వీడియో పాఠాలను అందుబాటులో ఉంచాయి. స్కాలస్టిక్‌ ఇండియా, ఎడ్యుబుల్‌, టాపర్‌, దటాప్‌టెన్స్‌, లర్న్‌ నెక్స్‌ట్‌ వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు.

సెమిస్టర్‌ మధ్యలో ఆగి లేదా సిలబస్‌ పూర్తవనివారికీ ఆన్‌లైన్‌ అధ్యయన అవకాశముంది. యూజీసీ ఆదేశాల మేరకు.. ప్రముఖ కళాశాలలు తమ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌ ద్వారా చదువుకోవాలనుకునేవారికి అందుబాటులోనున్న వెబ్‌సైట్ల వివరాలను ఉంచుతున్నాయి. వాటినీ ఉపయోగించుకోవచ్చు.

మూడు నెలలపాటు ఉచితంగా సీఎస్‌ఈ, ఐటీ, మెకానికల్‌, సివిల్‌, ఈఈఈ, ఈసీఈ బ్రాంచిలకు సంబంధించిన ఇంజినీరింగ్‌ ఆన్‌లైన్‌ పాఠాలనూ, ప్రయోగాలనూ మణిపాల్‌ గ్రూప్‌ కోఎమ్ట్‌ ఎడ్యుటెక్‌ అందిస్తోంది. www.edulib.in

ప్రవేశ పరీక్షలకు తయారీ..

అస్తమానూ కోర్సు సిలబస్‌నే చదవడం అనాసక్తిగా అనిపిస్తే.. భవిష్యత్తులో రాయాలనుకునే ప్రవేశ పరీక్షలకు సిద్ధమవొచ్ఛు చివరి సంవత్సరంలో ఉన్నవారు వీటిపై దృష్టి పెట్టడం మాత్రం తప్పనిసరి. పాలీసెట్‌, నీట్‌, జేఈఈ సహా అన్ని ప్రవేశపరీక్షలూ వాయిదా పడ్డాయి. వీటిని రాయబోయేవారూ ఈ విరామాన్ని పూర్తిగా కాలక్షేపానికో, విశ్రాంతి తీసుకోడానికో పరిమితం కాకూడదు. స్వల్ప విరామాలు తీసుకోవచ్చు గానీ సన్నద్ధతకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.

జేఈఈకి సన్నద్ధమవుతున్నవారికి ఐఐటీ ఖరగ్‌పూర్‌ కొన్ని పాఠాలను సిద్ధం చేసింది. కొన్ని మాడ్యూళ్లతోపాటు నోట్స్‌నూ అందుబాటులో ఉంచింది. ఎన్‌డీఎల్‌ఐ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా వీటిని పొందొచ్చు.

ఇంకా ఎన్నో విద్యాధారిత వెబ్‌సైట్లు విద్యార్థుల కోసం మాక్‌ టెస్టులను అందుబాటులో ఉంచాయి.

యూఎన్‌ అకాడమీ యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌ వారికి ఛాంపియన్‌షిప్‌ టెస్ట్‌ను నిర్వహిస్తోంది.

ఖాన్‌ అకాడమీ మేథ్స్‌, సైన్స్‌, ప్రోగ్రామింగ్‌లను ఉచితంగా అందిస్తోంది. ఆసక్తి ఉండాలేగానీ విద్యార్థులకు అందుబాటులో ఎన్నో అవకాశాలున్నాయి. ●

యుడెమి, కోడ్‌ అకాడమీ, లర్న్‌టూకోడ్‌, కోడ్‌ అవెంజర్స్‌, ఖాన్‌ అకాడమీ మొదలైనవి ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ల్లో బేసిక్‌ కోర్సులను ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజుతో అందిస్తున్నాయి.

ఉద్యోగుల సంగతి..?

లాక్‌డౌన్‌ విద్యార్థులపైనే కాదు.. ఉద్యోగులపైనా ఎంతో ప్రభావాన్ని చూపుతోంది. చాలావరకూ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే వీలు కల్పించినా.. ఇంకెన్నో సంస్థలు పూర్తిగా సెలవులను ప్రకటించేశాయి. దీన్ని విశ్రాంతి తీసుకునే సెలవులుగానే భావిస్తే వీరూ నష్టపోవచ్ఛు ఈ వ్యవధి తర్వాత ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు.

కాబట్టి, పనికి సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, బృందంతో తరచూ మాట్లాడుతుండటం వంటివి చేస్తుండాలి. తమ పరిశ్రమకు సంబంధించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న శిక్షణ ప్రోగ్రాములనూ చేయొచ్ఛు వీటిలో నైపుణ్యాలతోపాటు మార్కెటింగ్‌, ఇంకా అన్ని విభాగాల కోర్సులూ అందుబాటులో ఉంటున్నాయి.

ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ 

స్టెమ్‌రోబో టెక్నాలజీస్‌ /www.stemrobo.com

ఇంటర్మీడియట్‌ స్థాయి విద్యార్థుల వరకు స్టెమ్‌ ఎడ్యుకేషన్‌పై ఈ సంస్థ పని చేస్తోంది. 4వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఆన్‌లైన్‌లో వర్చువల్‌ క్లౌడ్‌ బేస్‌డ్‌ లర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ మోడల్‌ను టింక్‌ లర్నింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా గేమ్‌ డిజైనింగ్‌, పైథాన్‌, జీయూఐ, రోబోటిక్స్‌, డీఐవై కోడింగ్‌ వంటివి నేర్చుకోవచ్చు.


కోడింగ్‌ నింజాస్‌ /www.codingninjas.com

21 రోజుల కోడింగ్‌ చాలెంజ్‌ను ఈ సంస్థ ప్రవేశపెట్టింది. ఇది పెయిడ్‌ కోర్సు. రెండు నెలల కాలవ్యవధి. జావా, సీ++, పైథాన్‌, ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌, మెషిన్‌ లర్నింగ్‌లను అందిస్తోంది. 21 రోజుల్లో పూర్తిచేసినవారికి 50% నగదు రిఫండ్‌ చేయనున్నారు.


www.greatlearning.in, www.upgrad.com

గ్రేట్‌ లర్నింగ్‌, అప్‌గ్రాడ్‌: ఈ సంస్థలు డేటాసైన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌లలో షార్ట్‌టర్మ్‌ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అప్‌గ్రాడ్‌ వీటితోపాటు బ్లాక్‌ చెయిన్‌, జావా, జావాస్క్రిప్ట్‌, డేటాసైన్స్‌, పైథాన్‌ మొదలైనవాటిల్లో 15 షార్ట్‌టర్మ్‌ కోర్సులను అందిస్తోంది.


www.masaischool.com

మసాయ్‌ స్కూల్‌: ఫుల్‌ స్టాక్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌, ఫౌండేషన్‌ ఆఫ్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌, బ్యాకెండ్‌ డెవలప్‌మెంట్‌ల్లో ఈ సంస్థ ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తోంది.

ఆన్‌లైన్‌ వేదికలెన్నో..

మనదేశంలో జాతీయస్థాయి మూక్‌ (మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్స్‌) వేదిక.. ‘స్వయమ్‌’. 9వ తరగతి నుంచి పీజీ వరకూ దీనిలో అందించే ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులు బాగా ప్రాచుర్యం పొందాయి. నైపుణ్యాధారిత వెబ్‌ కోర్సులు దీని ప్రత్యేకత. ఇంజినీరింగ్‌, డేటాసైన్స్‌, ప్రోగ్రామింగ్‌, సైన్స్‌, బిజినెస్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌సైన్సెస్‌, ఎకనామిక్స్‌, సైకాలజీ, ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ మొదలైన విభాగాల్లో రెండు వేలకు పైగా కోర్సులు లభిస్తున్నాయి. https://swayam.gov.in/

దేశీయంగానే కాకుండా హార్వర్డ్‌, ప్రిన్స్‌టన్‌, స్టాన్‌ఫర్డ్‌, ఎంఐటీ... ఇంకా ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాలూ ఎన్నో ప్రోగ్రాములపై ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో వీటిని నేర్చుకునే వీలునూ కల్పిస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌, బిజినెస్‌, డేటాసైన్స్‌, హ్యుమానిటీస్‌ మొదలైనవాటిల్లో వెయ్యికి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

కోర్స్‌ఎరా, ఎడ్‌ఎక్స్‌, ఉడాసిటీ మొదలైనవాటి వేదికల ద్వారా ఇవి అందుబాటులో ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల నుంచి వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ వరకు వీటిని ఉపయోగించుకునే వీలును కల్పిస్తున్నారు.

www.coursera.org, www.edx.org, www.udacity.com

వేరేగా ప్రయత్నించాలనుకుంటే?

భాషా కోర్సులు: ఉన్నతవిద్య నుంచి ఉద్యోగం వరకు ఆంగ్లభాషా ప్రావీణ్యం తప్పనిసరి. భవిష్యత్తులో రాణించాలనుకునేవారు ఈ సమయాన్ని ఆంగ్లభాషను నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్ఛు దీనికి సంబంధించి ఎన్నో ఉచిత వెబ్‌సైట్లు, యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకటికి మించి విదేశీ భాషలపై పట్టు ఉన్నవారికి అవకాశాలు ఎక్కువే. కాబట్టి వివిధ విదేశీ భాషలను ఆసక్తిని బట్టి నేర్చుకోవచ్చు.

కళలకు ప్రాధాన్యం: పెయింటింగ్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌.. స్కూలు స్థాయి నుంచి అడుగు అలా బయటపెట్టగానే కళలకు గుడ్‌బై చెప్పేవారే ఎక్కువ. అలా కాకుండా కళల్లో పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్ఛు ఎందరో ప్రముఖులు ఆన్‌లైన్‌ వేదికగా తమ ప్రతిభను పంచుకుంటూ ఆసక్తి ఉన్నవారికి ప్రేరణగా నిలుస్తున్నారు.

పుస్తక పఠనం: ఏదైనా సందేహం రాగానే వెనువెంటనే సమాచారమందించే ఇంటర్నెట్‌పై ఆధారపడేవారే ఎక్కువ. అలా అప్పటికప్పుడు తెలుసుకోవడం, వదిలేయడం విద్యార్థుల్లో చాలామందికి అలవాటే. అయితే- అంతర్జాలంలో దొరికే ప్రతిదీ విశ్వసనీయమైనది కాదు. కనపడే ప్రతి వెబ్‌సైటులోని సమాచారమూ ప్రామాణికం కాకపోవచ్ఛు అందుకే ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్రచురించే పుస్తకాలకు విలువ. పుస్తకాలు చదవడానికి కొత్తతరం ప్రాధాన్యం అంతగా ఇవ్వటం లేదు. పైగా గ్యాడ్జెట్లు కళ్లపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. ఈ విరామ సమయంలో సరదాగానో, పరిజ్ఞానం కోసమో పుస్తకాలను చదవడంపై దృష్టిపెట్టొచ్చు.

ఫొటోగ్రఫీ: చేతిలో సెల్‌ఫోన్‌ ఉన్న ఎవరైనా ఇప్పుడు ఫొటోగ్రాఫరే. చిన్న చిన్న ట్రిక్కులతో ఆకట్టుకునే ఫొటోలను తీసేవారున్నారు. ఆసక్తి ఉంటే.. దీన్ని ప్రయత్నించొచ్ఛు ఆన్‌లైన్‌లో వీటికి సంబంధించీ కోర్సులున్నాయి. షాట్‌ లొకేషన్లను ఎంచుకోవడం, ఫొటో టైమింగ్స్‌.. వంటివి తెలుసుకోవచ్ఛు నచ్చిన ఫొటోలను అందంగా ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయొచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.