close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 08/04/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మా అని పిలిచినా.. ఆలకించలేక!

రెండేళ్ల పిల్లాడు అమ్మా! అని పిలిచాడు.. దగ్గరకు తీసుకోలేదా తల్లి అమ్మ పెడితేనే అన్నం తింటా అని మారాం చేశాడు.. అయినా ఆ అమ్మ మనసు కరగలేదు. కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న ఓ కలెక్టర్‌ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. పేగు కదిలేలా కన్నకొడుకు పిలుస్తున్నా.. సామాజిక బాధ్యతను విస్మరించడంలేదామె. ఈ మహమ్మారిని జయించాలంటే ముందుజాగ్రత్తే మేలైన మందని భావించింది. అమ్మగా ఇంట్లో.. అధికారిణిగా బయట పక్కాగా నిబంధనలు అమలు చేస్తున్నారు అసోంలోని జోర్హాట్‌ జిల్లా కలెక్టర్‌ కోరాటి రోషిణి అపరంజి.

విశాఖలో పుట్టిపెరిగిన రోషిణి అపరంజి.. ఇప్పుడు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా కల్లోలం మొదలవ్వడంతో ఆమె అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. కఠిన నిబంధలను అమలు చేస్తూ.. జోర్హాట్‌వాసులను కాపాడుతున్నారు. లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలుచేస్తున్నారు. జిల్లా అంతా కలియతిరుగుతున్నారు. ప్రజల బాగోగుల్లో తలమునకలై ఉన్న రోషిణి.. ఇంటికి వెళ్లాక చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. బయట తిరిగి వస్తున్న తన వల్ల కుటుంబసభ్యులకు ఎలాంటి ఇబ్బందీ కలగొద్దని కఠినంగా ఉంటున్నారు.

గుండె రాయి చేసుకొని..

రోషిణికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడికి నాలుగేళ్లు. చిన్నోడికి రెండేళ్లు. 65 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులూ ఆమెతోపాటే ఉంటారు. వీరందరి కోసం ఈ అమ్మ ఇంట్లోనూ కలెక్టరమ్మలా ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు, పెద్దలు ఇంట్లో కిందివాటాలో ఉంటే.. ఆమె ఒక్కతే పైఅంతస్తులో ఉంటున్నారు. చిన్నపిల్లాడు అమ్మ కోసం ఏడ్చినా... ఆ ఏడుపు తన చెవిన పడినా.. గుండెను రాయి చేసుకొని... మెట్టు దిగి రావడం లేదు. ‘రోజంతా బయటే ఉంటున్నాను. ఇప్పటికీ జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసూ నమోదు కాలేదు. అనుమానితులు ఉన్నారు. వారిని పర్యవేక్షించడానికి ఐసోలేషన్‌ సెంటర్లకు వెళ్తున్నా. క్వారంటైన్‌ సెంటర్‌కి వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత బాధ్యతగా ఉండాలి. నావల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ రావొద్ధు పైగా చిన్న పిల్లలు, వయసు పైబడిన పెద్దలు. అందుకే ఇంటికొచ్చాక వేరుగా ఉంటున్నాను. నా కోసం చిన్నోడు గుక్కపట్టి ఏడుస్తున్నా.. గుండె రాయి చేసుకుంటున్నాన’ని చెప్పుకొచ్చారు రోషిణి.

ఇల్లాలి బాధ్యతే..

కరోనాపై పోరులో మహిళలు కీలక పాత్ర పోషించాలని చెబుతారు రోషిణి. నిత్యావసరాల కోసం, ఉద్యోగం కోసం బయటకు వెళ్లిన వాళ్లు.. ఇంటికి రాగానే ఏం ముట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే అంటారామె. ‘అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్ధు తప్పనిసరైతే రోజుకు ఒకేసారి బయటకు వెళ్లేలా చూసుకోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చినవారిని ముందుగా వేడినీళ్లతో తలస్నానం చేయమనాలి. బయటకు వెళ్లొచ్చిన వ్యక్తులు.. ఏ జాగ్రత్తలూ పాటించకుండా ఇంట్లో ఇష్టారాజ్యంగా తిరుగుతానంటే అస్సలు ఒప్పుకోవద్ద’ని సూచిస్తున్నారు రోషిణి. కూరగాయలు, పాలు తదితర నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు రావాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రజల ఇళ్ల దగ్గరికే అన్నీ వెళ్లేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అకారణంగా ఎవరైనా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తున్నారు. రోషిణి తీసుకుంటున్న చర్యలు ప్రజలను ఇంటిపట్టునే ఉండేలా చేస్తున్నాయి. కరోనా కట్టడికి చేయూతనిస్తున్నాయి.

- బి.ఎస్‌.రామకృష్ణ, ఈనాడు, విశాఖపట్నం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.