close

తాజా వార్తలు

Published : 13/04/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ సైన్యంలో ఆమె..

కనిపించని మహమ్మారిపైనే ఇప్పుడు మన పోరు...కరోనా వైరసే మానవాళికి ఉమ్మడి శత్రువు...ఈ యుద్ధంలో గెలవడానికి ప్రపంచమంతా ఏకమవుతోంది...ఆ ప్రయత్నంలో కొన్ని ప్రఖ్యాత సంస్థలు ఒక కన్సార్టియంగా ఏర్పడ్డాయి...కొవిడ్‌-19ని సమర్థంగా ఎదుర్కోవడానికి సూచనలు కోరాయి...ఆ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో వరంగల్‌ ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ సౌమ్య లిప్సరత్‌కి చోటు దక్కింది... ఆమెతో వసుంధర మాట కలిపింది.
కొవిడ్‌-19 ప్రపంచాన్ని కర్కశంగా కబళిస్తోంది. ఎంతోమందిని అమానుషంగా పొట్టన పెట్టుకుంటోంది. దీనికి మందు కనిపెట్టడానికి, టీకా అభివృద్ధి చేయడానికి, వ్యాప్తిని అరికట్టడానికి.. శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ప్రభుత్వాధినేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ నియంత్రణలో వేగవంతమైన పురోగతి సాధించడానికి అమెరికా ప్రభుత్వం, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, నాసా, వైద్య నిపుణులతో కలిసి ‘ది కొవిడ్‌-19 హై పర్‌ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ కన్సార్టియం’ ఏర్పడింది. కరోనా కట్టడికి చేయాల్సిన పరిశోధనలు, విధానాలు, వ్యూహాలు, సూచనలు చెప్పమంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, నిపుణులను కోరింది. పరిశోధనల కోణంలో ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానించింది. ఎంపికైన వారు ఈ కన్సార్టియానికి సంబంధించిన అత్యంత శక్తిమంతమైన సూపర్‌ కంప్యూటర్లను ఉపయోగించుకొని పరిశోధనలు చేసే అవకాశం ఇస్తారు. వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్‌ఐటీ)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న సౌమ్య ‘మాలిక్యులర్‌ డైనమిక్స్‌ సిమ్యులేషన్స్‌’ పద్ధతి ద్వారా ఈ వైరస్‌ నిర్మాణంపై సైద్ధాంతిక పరిశోధన చేసే విధానాన్ని ప్రతిపాదించగా ఆ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో అవకాశం దక్కింది.
కన్సార్టియంలో భాగస్వామి కావడంతో ఇప్పట్నుంచే సౌమ్య పరిశోధన ప్రారంభం అవుతుంది. సమగ్ర నివేదిక ఇవ్వడానికి ఏడాది సమయం ఉంటుంది. ఈలోపు వైరస్‌పై విస్తృతమైన అధ్యయనం చేస్తుంది సౌమ్య. దీనిపై తనకి ఇప్పటికే ఒక అవగాహన ఉంది. ఆమె మాటల్లో చెప్పాలంటే ‘వైరస్‌లు ప్రబలడం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలోనూ ఎన్నో మహమ్మారులు వచ్చాయి. వాటికి టీకాలు కనిపెట్టేలోపే మాయమయ్యాయి. ఈ కొద్ది సమయంలోనే అపారమైన ప్రాణ, ఆర్థిక నష్టం కలిగించాయి. వీటిపై ఎప్పట్నుంచో అధ్యయనం చేపట్టా. ఏయే కాలాల్లో, ఏయే ప్రాంతాల్లో ఈ తరహా వైరస్‌లు వ్యాపిస్తున్నాయో, ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో గుర్తించా. ఈ విశ్లేషణ నా కొత్త పరిశోధనకు ఉపయోగపడుతుంది. వీటితోపాటు కొవిడ్‌-19కు ఉండే లక్షణాలు, భౌగోళిక పరమైన ప్రభావాల వివరాలన్నీ నివేదికలో చేర్చుతాను’ అంటోంది సౌమ్య.
సౌమ్య ఒడిశా అమ్మాయి. బీటెక్‌ బయోటెక్నాలజీ పూర్తయ్యాక ఐఐటీ మద్రాసులో కంప్యూటేషనల్‌ బయోఫి‡జిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసింది. అనంతరం పరమాణువు తీరు, డ్రగ్‌ డిజైనింగ్‌, ప్రొటీన్‌ నిర్మాణంపై అధ్యయనం చేసింది. మాలిక్యులర్‌ డైనమిక్స్‌ సిమ్యులేషన్స్‌లో పరిశోధనలు చేసింది. జపాన్‌లోని నగోయా విశ్వవిద్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా, పోస్ట్‌ డాక్టోరల్‌ రిసెర్చ్‌ ఫెలోగా పని చేసింది. గతేడాది వరంగల్‌ ఎన్‌ఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.