
తాజా వార్తలు
పసిడి బాండ్ల కొనుగోలుకు 24 వరకు అవకాశం
ధర గ్రాముకు రూ.4,639
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత సార్వభౌమ పసిడి బాండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 24 వరకు వీటిని కొనుగోలు చేసేందుకు వీలుంది. కనీసం ఒక గ్రాము నుంచి ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఈసారి బాండ్ యూనిట్ ధర (గ్రాము ధర) రూ.4,639గా నిర్ణయించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసి, డిజిటల్ చెల్లింపులు చేసేవారికి రూ.50 తగ్గింపుతో రూ.4,589కి లభించనుంది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు గరిష్ఠంగా 4 కిలోల వరకూ కొనుగోలు చేయొచ్చు. కనీసం 8 ఏళ్లపాటు కొనసాగాలి. అవసరమైతే ఐదేళ్ల తర్వాత పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. పెట్టుబడిపై 2.50శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. వాణిజ్య బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అనుమతించిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, గుర్తింపు పొందిన ఏజెంట్ల నుంచి పసిడి బాండ్లను కొనుగోలు చేయొచ్చు.