close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 23/04/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పదండి.. మీలోకి మీరు!

ఇదే సమయం...
ఇదో అవకాశం...
ఒంటరిగా ఉన్నామని కుంగిపోవద్దు...
ఏకాంతంలో మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి.
స్తబ్దంగా మారకండి...
నిశ్చలంగా ఉంటూ మీ భవిష్యత్తును పునర్లిఖించుకోండి...

‘మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు. ఏళ్ల తరబడి ఒకే చోట... కర్మను నిర్వర్తించడం మానవ ధర్మం అంటారు. మరి మీరేం చేయట్లేదు కదా.’
ప్రఖ్యాత బ్రిటన్‌ పాత్రికేయుడు పాల్‌బ్రంటన్‌ రమణ మహర్షిని ప్రశ్నించారు.
‘నిరంతరం లౌకికమైన వ్యవహారాల్లో పరుగులు తీసే మీకు ఇది విడ్డూరంగానే అనిపిస్తుంది. ఇక్కడ కర్మ జరగడం లేదని మీరు ఎందుకనుకుంటున్నారు? తిరిగే చక్రానికి ఇరుసే ఆధారం అలాగే నిశ్చలంగా ఉండడం కూడా కర్మకు ప్రేరణే’
సమాధానమిచ్చారు మహర్షి.
అకర్మలో కర్మకు ఇదో గొప్ప నిర్వచనం.

మనిషి తన జీవిత కాలంలో ఎన్నో ధర్మాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. వాటిని ఏ స్థితిలో ఉండి చేస్తున్నాడన్న దానిపైనే వాటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.  సనాతన వేదాంత పరిభాషలో ప్రవృత్తి, నివృత్తి అనే పదాలకు చాలా ప్రాధాన్యముంది. ఇందులో ప్రవృత్తి అంటే మనస్సును బాహ్య ప్రపంచంవైపు మరల్చడం. బహిర్ముఖులమై వివిధ కర్మలను చేయడం.  జీవితంలో ఒకానొక దశ వరకు, మనిషిని ప్రవృత్తి అభ్యుదయం వైపు తీసుకెళుతుంది. ఇది అమ్ముల పొదిలోని బాణాలను వెలికి తీసి యుద్ధం చేయడం లాంటిది. రెండోది నివృత్తి. ఇది మనిషి అంతర్గత ప్రయాణం. ఏకాంతంలో అతని అంతరాంతరాళాల్లో జరిగే శోధన. తనని తాను సమీక్షించుకుంటూ, అంతర్గత శక్తులను కూడగట్టుకుంటూ బాహ్యంగా జరిగే కార్యకలాపాలకు సిద్ధం చేసుకోవడం. ఇది బాణాలన్నిటినీ అమ్ములపొదిలోకి తెచ్చుకుని వాటిని సానబెట్టడం లాంటిది. ఈ రెండు ధర్మాలను అర్థం చేసుకుని, సమన్వయం చేసుకున్న మనిషి విజేత అవుతాడు. ఇక్కడ ప్రవృత్తి ధర్మానికి నివృత్తి ధర్మం ఆలంబన అయినట్లే ఏకాంతం, నిశ్చలత్వం మనిషి భౌతిక కార్యకలాపాలకు ఊతం అవుతాయి. బాగా తిప్పి వదిలిన బొంగరం ఒకచోటే శరవేగంతో తిరుగుతుంటుంది. అందులో తీవ్రమైన భమ్రణం ఉంది. మనిషి కన్ను దాన్ని పసిగట్టలేదు. అలాగే జ్ఞాని నిర్వర్తించే కర్మలు కంటికి కనిపించవు... అంటారు రమణులు. అలాగే ఉత్కృష్టమైన సంకల్పాలను సాకారం చేసేవారు పైకి గంభీరంగా, నిశ్చలంగా ఉంటారు. కానీ వారిలో తీవ్రమైన కర్మపరాయణత్వం ఉంటుంది. వీరు దీర్ఘకాలం నిలిచిపోయే ఫలితాలకు కారణమవుతారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్థితప్రజ్ఞత, నిశ్చలత్వాలు కార్యక్షేత్రాల్లో అత్యున్నమైన గుణాలుగా వివరించారు. ఆయన స్వయంగా  వాటిని ఆచరించి చూపారు.


నిశ్చలత్వం, స్తబ్దత బయటకు ఒకేలా కనిపిస్తాయి. కానీ నిశ్చలత్వం నిలకడగా పారే సెలయేరులాంటిది. అది మనిషిలోని చైతన్యాన్ని జాగృతం చేస్తుంది. స్తబ్దత కాలుష్య కాసారంలాంటిది. ఇది మనిషిని అథఃపాతాళానికి తొక్కేస్తుంది. అజ్ఞానిగా మార్చేస్తుంది.


తమకు తాము ఉన్నామనుకుని, తమనే తాము తోడు చేసుకుని జీవితాన్ని గడపడం ఏకాంతం. తమకు ఎవరూ లేరని కుమిలిపోతూ నిరాశకు లోను కావడం ఒంటరితనం.

-సైదులు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.